Monday, April 3, 2023

అమ్మమ్మ...పూలజడ..(రెండవ భాగం)

    పదేళ్లు ఇట్టే గడిచిపోయాయి. శ్రీదేవికి పెళ్లి కుదిరింది. పక్క ఊరే. తెలిసిన వాళ్ళే. కాస్తో కూస్తో స్థితిమంతులు. ఏదో పిల్ల సుఖపడుతుందిలే అనుకున్న శివమ్మ మరేమీ  ఆలోచించక సంబంధం ఖాయం చేసేసింది. కాకపోతే పెళ్ళికొడుకు వెంకటరమణ కాస్త ముదురు. 
    అదేమీ అంతగా పట్టించుకోలేదు శ్రీదేవి. పెళ్లిరోజు పెళ్లికూతురుకి పూలజడ తప్పనిసరి. తన స్నేహితురాళ్లకు జరిగిన పెళ్లిళ్లలో అందరూ పూల జడలు వేసుకున్నారు. ఇంతవరకూ  సరే... పెళ్లిరోజు అయినా తప్పదు కదా ! అమ్మ కాకపోయినా, స్నేహితురాళ్లు, బంధువులైనా వేసే తీరుతారు. అలా పూల జడలో తనను తాను ఊహించుకుంటూ కలల్లో తేలిపోసాగిందాపిల్ల.. !
    అంతా అనుకున్నట్లే  జరిగితే ఇక మనిషికి లోటేముంటుంది! ముహూర్తం వారంలోపే ! అదీ దూరంగా ఏదో చిన్న ఊర్లో ఉన్న ఏ వసతులూ  లేని చిన్న గుడిలో ! వచ్చిందే ఓ పదిమంది ఆడవాళ్లు! స్నేహితురాళ్ళ ఊసే లేదు.తెల్లారుజాము ముహూర్తం.
హడావుడిగా స్నానాలు అవీ పూర్తి చేయించి, గబగబా ఆరీఆరని  జుట్టుని బరబరా తుడిచేసి, జడలా అల్లి, ఓ పూలదండ తురిమి టైం అవుతోందంటూ పీటల మీద కూర్చోబెట్టేశారు.  తల్లికి తెలుసు కూతురి కోరిక. కానీ, ఏం లాభం! కూతుర్ని అలంకరించి పెళ్లి కూతురిగా కళ్లారా చూసుకోవాలన్న తపన, కోరిక లేని తల్లి కడుపున పుట్టిందాయే ! మొదటిసారిగా తల్లి  మీద చెప్పలేనంత కోపం, ద్వేషం కలిగాయి శ్రీదేవికి. ఏం చేయగలదు ! సిగ్గు విడిచి, నోరు తెరిచి అడగలేదెవ్వరినీ. గుడ్లనీరు కుక్కుకుంటూ తలవంచుకుని, శిలలా కూర్చుండి పోయింది. మెడలో తాళి పడింది.  
    పెళ్లి నాలుగు రోజులు ఉందనగా వచ్చిన తండ్రి తతంగమంతా పూర్తయ్యేదాకా ఉండి బాధ్యత తీరిందనుకుని వెళ్లిపోయాడు మళ్ళీ. శ్రీదేవి అత్తగారింటికి తరలి వెళ్లిపోయింది. తల్లి ఒంటరిగా మిగిలింది. 
                 **              **             **
   కాలం ఎవరికోసం ఆగదుగా... మరో పదేళ్లు పరుగులు తీశాయి. శ్రీదేవి ఓ బిడ్డ తల్లయి, శ్రీదేవమ్మ అయింది. శ్రావణ మాసంలో పుట్టిందని శ్రావణి అని పేరు పెట్టుకుంది. పూల మీద ఇష్టం పోగొట్టుకోలేక ఇంటి చుట్టూ రకరకాల పూల మొక్కలు వేసింది. అవి కాసే పూలతో  చక్కగా మాల కట్టడం నేర్చుకుంది. రోజూ విరబూసే మందారాలు, మల్లెలు, గులాబీలు అణగారిన కోరికను రేపుతున్నా పెరిగిన వయసు అంగీకరించక  పూలజడ  ముచ్చట కూతురు శ్రావణి ద్వారానైనా తీర్చుకోవాలని పరితపించేది. కానీ విచిత్రం ! తల్లికి పూర్తి విరుద్ధం ఆ పిల్ల ! పూలు అంటే ఆమడ దూరం జరిగేది. జడలో  ఓ గులాబీ పెడితే చాలు.. వెంటనే తీసి విసిరి పారేసేది. శ్రీదేవమ్మకు అర్థం అయ్యేది కాదా పిల్ల మనస్తత్వం ! స్వతహాగా ఆడపిల్లలు పూలంటే ఇష్టపడతారు. కానీ ఇదేమిటి? వయసొస్తే మారుతుందిలే అనుకుందిగానీ కాలేజీ చదువుకి వెళ్ళినా ... అదే పరిస్థితి !!
" పోమ్మా, ఇలా పూలూ, పూలదండలతో వెళ్తే మా ఫ్రెండ్స్ అంతా పల్లెటూరి గబ్బిలాయిలా చూస్తారు... నవ్వుతారు తెలుసా... "
 అంటూ వెళ్ళిపోయేది. 
" సరేలే, ఇప్పుడలా అంటోంది... రేపు పెళ్లి కుదిరాక అప్పుడైనా తప్పదు కదా.. ! ఎలా వద్దంటుందో చూస్తా... !"
 అనుకునేది శ్రీదేవమ్మ. కానీ విధి  రాత ! డిగ్రీ ఆఖరి సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. ఆరోజు చివరి పరీక్ష. రోజూ పరీక్షవంగానే మూడింటికంతా  ఇల్లు చేరే శ్రావణి.... ఐదైనా రాలేదు. చీకటి పడింది. జాడలేదు...! ఏమైందోనని కంగారుపడుతూ పొలం నుండి వచ్చిన భర్తతో చెప్పింది. అక్కడక్కడా వాకబు చేశాడాయన. ఫలితం లేదు. ! పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే... నలుగురికీ తెలిస్తే బాగోదని ఆగిపోయారు. మరుసటి  రోజు మధ్యాహ్నం దాకా చూసి, ఇక తప్పదని బయలుదేరుతుండగా... ఇంటి ముందు ఆటో ఆగింది. అందులో నుండి శ్రావణి దిగింది.. ఒంటరిగా కాదు... జంటగా... పక్కన మరొకతనితో.. మెడలో తాళితో !!
    ఉగ్రుడై పోయాడు వెంకటరమణ. శ్రీదేవమ్మ తల్లడిల్లిపోయింది. గడప దాటి లోనికి రాబోతున్న కూతుర్ని పట్టుకుని రెండు చెంపలూ చెడామడా వాయించాడు. అడ్డుకోబోయిన అతన్ని పక్కకు తోసేశాడు. చుట్టుపక్కలంతా పోగై చోద్యం చూడసాగారు. గడపలో కాలు పెడితే ఛస్తానంటూ తలుపులు వేసేసి, భార్యను లోపలికి తోసేశాడు. చేసేదేమీ లేక తల దించుకుని వచ్చిన ఆటోలోనే తిరుగు ముఖం పట్టింది శ్రావణి భర్తతో. 
    ఊహించని ఉత్పాతానికి కన్నీరు మున్నీరై పోయింది శ్రీదేవమ్మ. భర్త తత్వం తనకు బాగా తెలుసు. పరువు మర్యాదలకు ప్రాణం పెట్టే రకం. కూతురు ఇలా చెప్పా  పెట్టకుండా, ఎవరో ముక్కు ముఖం తెలియని వాణ్ణి పెళ్ళాడి ఉన్నట్టుండి ప్రత్యక్షమైతే... తట్టుకోగలడా !
    తనకు దక్కని అదృష్టం కూతురిలో వెతుక్కోవాలనుకుంది. ! పెళ్లికూతురుగా ముస్తాబు చేసి, కల్యాణతిలకం దిద్ది తనివితీరా కూతుర్ని చూసుకోవాలనుకున్న ఆమె ఆశ మరోసారి అడియాశే అయింది. అదంతా పక్కన బెడితే... ప్రస్తుతం వచ్చి పడ్డ ఉపద్రవం ఆమెను అతలాకుతలం చేసేసింది. 
                   **             **            **
   ఆనోటా ఈనోటా కూతురి గురించి వివరాలు చెవిని పడుతూనే ఉన్నాయి వారికి. అతనిది తమ కులం కాదనీ, తెలిస్తే తండ్రి ఒప్పుకోడనీ, మరోదారి లేదనుకుని శ్రావణి ఇంతపనికి ఒడిగట్టిందని గ్రహించింది విషయం తెలిసిన శ్రీదేవమ్మ. కులమింటి కోతి అయినా సరే.. సమ్మతమని భావించే భర్తకు తను ఎదురు  చెప్పలేక, కూతురితో బంధాన్ని తెంచుకోలేక లోలోన కుమిలిపోయిందా తల్లి  !
                  **              **                **
           [ మూడవ భాగం తదుపరి పోస్ట్ లో  ]

No comments:

Post a Comment