🌷
విశాలంగా ఉన్న ఆ గది సువాసనలతో ఇంకా పట్టుచీరల గరగరలతో, అమ్మలక్కల ముచ్చట్లతో సందడిసందడిగా ఉంది. గది మధ్యలో టీపాయ్ మీదున్న ట్రేలల్లో గుండుమల్లెలు, సన్నజాజులు, గులాబీలు, కనకాంబరాలు రాశులుగా పోసిఉన్నాయి. వాటికెదురుగా కూర్చుని తదేకంగా వాటివేపు చూస్తున్న శ్రీదేవమ్మలో ఏవేవో జ్ఞాపకాలు గతంలో నుండి మెల్లిగా తొంగిచూడసాగాయి. ఆమె ఆలోచనలు దాదాపు యాభై ఏళ్ళు వెనక్కి వెళ్లి, తన బాల్యాన్ని స్పృశించాయి.
** ** **
" అమ్మా, కనకాంబరాలు, గుండుమల్లెలు... రంగయ్య తాత దగ్గర కొనుక్కొచ్చా... ఎంత బాగున్నాయో చూడు.... "
పరికిణీలో పోయించుకొచ్చిన తాజా పూలని తల్లికి చూపిస్తూ సంబరపడిపోతూ చెప్పింది శ్రీదేవి.
" అయ్యో అయ్యో! డబ్బులెక్కడివే నీకు ఇన్ని పూలు కొనడానికి? ".
గయ్యిమంటూ లేచింది శివమ్మ.
"... అప్పుడప్పుడూ నువ్వు ఇస్తుంటావే.. పావలా, అర్ధ రూపాయి.,, అవి దాచుకున్నా.. వాటితోనే కొనుక్కున్నా .. "
అంటూ, కాస్త దగ్గరగా జరిగి,
" అమ్మా,.. వీటితో నాకు పూలజడ వేయవా..."
భయం భయంగా తల్లిని చూస్తూ సందేహిస్తూనే మెల్లిగా కోరిక బయట పెట్టింది శ్రీదేవి.
" చాల్లే సంబడం... బాగానే ఉంది. తినడానికి గతి లేదు గానీ పూలజడంట.. పూలజడ! పద పద. వెళ్లి అంట్లు తోమి పడేయ్.. పనులు చాలా ఉన్నాయి నాకు.."
విసుక్కుంటూ విసవిసా పక్కకెళ్ళిపోయింది శివమ్మ.
శ్రీదేవి పదేళ్ల పిల్ల. ఆ పల్లెటూర్లో దిగువ మధ్య తరగతికి చెందిన కుటుంబంలో తల్లిదండ్రులతో పాటు ఉంటుంది. తండ్రి ఎప్పుడు ఇంట్లో ఉంటాడో తెలియని పరిస్థితి ! అసలేంచేస్తాడోకూడా తెలియదాపిల్లకి ! ఏ నెలకో ఓసారి ఇంటికి చుట్టంలా రావడం, భార్య ఏదో ఇంత పెడితే తినడం, మళ్లీ వెళ్ళిపోవడం ! తండ్రి తనతో ఆప్యాయంగా రెండు మాటలు మాట్లాడడమే ఎరుగదాపిల్ల ! ఇక తల్లి ! బాధ్యత లేని మగని ఇంట్లో ఇల్లాలికి సుఖశాంతులన్నవి ఎలా ఉంటాయి? ఇల్లు గడవడానికి ఏవో చిన్నచిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండే తల్లికి బిడ్డ అచ్చట్లు ముచ్చట్లు ఏం పడతాయి ! పట్టినా తీర్చే దారేది? కడుపులోకి నాలుగు మెతుకులుంటే చాలు అనుకునే పరిస్థితామెది మరి !
శ్రీదేవి కడిగిన ముత్యంలాగుంటుంది. చెంగుచెంగున దూకుతూ ఆడుకునే వయసు. చుట్టుపక్కల ఆడపిల్లల్ని చూస్తూ తానూ అలాగుండాలని ఆశపడేది. కానీ... ఇంట్లో పరిస్థితులు కళ్లెం వేస్తుంటే డీలా పడిపోయేది. చేసేదేమీలేక పట్టించుకోవడం మానేసింది. ఏమున్నా లేకపోయినా ఆపిల్లకీమధ్య ఓ కోరిక పుట్టుకొచ్చింది. పోయినేడు సంక్రాతి పండక్కి చుట్టుపక్కల అమ్మాయిలంతా ఎంచక్కా కొత్త పరికిణీ, జాకెట్టు వేసుకుని, ఊరంతా తిరుగుతూ తెగ ముచ్చట్లాడుకున్నారు. వాళ్ళను చూశాక శ్రీదేవికి,
" అబ్బ ! ఎంత బాగుందో కదా పూలజడ !నేనూ వేయించుకుంటా మా అమ్మ నడిగి "
అనుకుంది. అలాఅలా మొదలైన ఆ కోరిక మళ్ళీ సంక్రాతి వచ్చిపోయినా తీరలేదు. ఒకరోజు పక్కవీధిలో ఉంటున్న రాజ్యం అక్కతో తన కోరిక చెప్పుకుంది. రాజ్యం రెండేళ్లక్రితం పెళ్లి చేసుకుని పక్క ఊరి నుండి ఈ ఊరికొచ్చింది. ఆమెకోబాబు. ఆడపిల్లలకు రకరకాల జడలు వేయడం, అలంకరించడం ఆమెకు సరదా. అందుకే శ్రీదేవికి రాజ్యం అక్క అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం తోనే ఒకరోజు అడిగేసింది,
" అదేం భాగ్యమే శ్రీదేవీ...పూలు తీసుకొనిరా.. వేసేస్తాను.. "
అని వెంటనే హామీ ఇచ్చేసింది రాజ్యం . శ్రీదేవి ఆనందం అవధులు దాటింది.
" నిజమా అక్కా ! వేస్తావా.. తప్పకుండా తెస్తా పూలు.. "
అని తెగ సంబరపడిపోయింది. ఆ రోజు నుండీ మొదలు... తల్లికి తనమీద ఎప్పుడైనా ప్రేమ పుట్టి, ఇచ్చే అర్ధ రూపాయి, రూపాయి తినడానికి కాకుండా కూడబెట్టుకుంది. ఊరి తిరుణాలలో జడ కుప్పెలు కొనుక్కుని పెట్టెలో దాచుకుంది. ఇంకాస్త పోగు పడ్డాక.. ఇదిగో, ఈరోజిలా... పట్నం నుండి రకరకాల పూలు తెచ్చి ఊళ్లో అమ్ముకునే రంగయ్య తాత దగ్గరికి వెళ్లి తాజా పూలుకొని, అట్నుంచటే రాజ్యం అక్క ఇంటికి దారి తీసింది ఆలస్యం చేయకుండా. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఇంటికి తాళం కప్ప వేలాడుతూ కనిపించింది.ఆ పిల్ల ఆశ నీరుగారిపోయిందొక్కసారిగా!
"అక్కఎక్కడికెళ్ళిందబ్బా?ఛ ! నేను ముందు చూసుకుని వెళ్లి ఉండాల్సింది.."
అనుకుంటూ చేసేదేమీ లేక కాళ్ళీడ్చుకుంటూ ఇంటి ముఖం పట్టింది. దారిలో మళ్లీ ఏదో ఆశ ! సరే, అమ్మని అడిగి చూస్తా.. పూలున్నాయిగా... అందుకోసమైనా ఒప్పుకొని వేస్తుంది పూలజడ..!"
ఆ ఆలోచన రాగానే, నడక వేగం పెంచి రెండు నిమిషాల్లో ఇంటి ముందు వాలిపోయింది. వంటింట్లో పొయ్యి సరిగా మండక సతమతమవుతున్న తల్లిని చూడగానే నీరసం ముంచుకొచ్చినా, తప్పనిసరై మెల్లిగా వెనకజేరి అడిగేసింది. ఫలితమే...! ఈ తిట్లు!!"
ఇప్పుడేమి చేయాలి? పూలన్నీ వాడిపోతున్నాయి. వాటికేసి దిగాలుగా చూస్తున్న శ్రీదేవి బుర్రలో తళుక్కున ఏదో మెరిసింది.
"రాజ్యం అక్క ఏదైనా పనిమీద బయటికి వెళ్లిందేమో! ఈ పాటికి వచ్చేసి ఉంటుందేమో !! వెళ్లి చూస్తే..! "
వెంటనే పూలన్నీ ప్లాస్టిక్ కవర్లో పోసేసుకుని బయటపడింది. అంతలో ఏదో గుర్తొచ్చి, గిర్రున వెనక్కొచ్చి, పెట్టెలో దాచిన జడ కుప్పెలు పట్టుకొని రివ్వుమని పరిగెత్తింది రాజ్యం ఇంటివైపు. ఆశ్చర్యం!ఆనందం !! ఆపిల్లలో ! ఆ ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. సంతోషంతో ఉప్పొంగిపోతూ, లోపల అడుగుపెట్టిన శ్రీదేవికి అయిదారుగురు ఆడవాళ్లు కూర్చుని కబుర్లాడుకుంటున్న దృశ్యం కంటపడింది. ఆ పక్కనే ఓవైపు రాజ్యం కూర్చుని పిల్లాడికి పాలిస్తూ ఉంది. శ్రీదేవిని చూడగానే,
" ఏంటే, ఇలా వచ్చావు? "
అంది.
" అక్కా, పూలు తెచ్చాను.. పూలజడ కోసం..."
పక్కనున్న వాళ్లను బిడియంగా చూస్తూ, పూల కవర్ చూపిస్తూ చెప్పింది.
" ఇప్పుడా ! ఏంటి శ్రీదేవీ... చూడూ... చుట్టాలొచ్చారు. వంట కూడా చేయాలి.. ఎలా కుదురుతుంది చెప్పు...? "అక్కా, పూలు... "
చేతులు చాచి, పూలు, జడ కుప్పెలు చూపించింది.
" ముందు నన్నడక్కుండా ఇలా తెస్తే ఎలాగే ? సరే, ఓ పని చెయ్.. ఇంటికి వెళ్లి, వీటన్నింటినీ మాల కట్టి, సాయంత్రం తీసుకుని రా. జడకు చుట్టేస్తాను.."
అని, పిల్లాణ్ణి ఎత్తుకొని వంటింట్లోకి నడిచింది...ఇప్పుడు ఏమాత్రం కుదరదని తేల్చేస్తూ..
శ్రీదేవి మోహంలో చీకటి అలుముకుంది. బిక్క మొహం వేసుకుని తిరుగు ముఖం పట్టింది. ఆ పిల్లకు ఇప్పుడు మరో సమస్య ! తనకు పూలు మాల కట్టడం రాదు. అమ్మ సంగతి సరే సరి ! ఇక ఎవరిని బ్రతిమాలు కోవాలి ? నీరసం ఆవహించి, ఇల్లు చేరి, ఓ మూల కూలబడింది. చూస్తుండగానే సాయంత్రం దాటింది. కవరు తెరిచి చూస్తే.. సగం వాడిన పూలు ఆ పిల్లకేసి దీనంగా చూశాయి. విసురుగా వాటినో మూలకు విసిరేసి చేతుల్లో ముఖం దాచుకుంది.
ఆడపిల్లలకు పూలజడ అన్నది అతి సామాన్యమైన కోరిక.. కానీ, శ్రీదేవి లాంటి కొందరికి అది కూడా గొంతెమ్మ కోరికే !!
** ** **
[ రెండవ భాగం తర్వాత పోస్టులో ]
No comments:
Post a Comment