Wednesday, April 12, 2023

అమ్మమ్మ..పూలజడ(కథ)చివరి భాగం

" అమ్మమ్మా, లే అమ్మమ్మా, టైం అవుతోంది. రా... నాకు జడ వేద్దువుగాని.. "
బంగారు జడ కుచ్చులు చేత్తో పట్టుకుని వచ్చిన అరవింద టీపాయ్ ముందు కుర్చీలో  కూర్చుని ఉన్న శ్రీదేవమ్మను భుజాలు పట్టి కుదుపుతూ పిలిచింది. అలా కూర్చుని ఉన్న శ్రీదేవమ్మ కుర్చీలోనే ఓ పక్కకు ఒరిగిపోయింది. 
" అమ్మమ్మా !"
కంగారుగా అరిచింది అరవింద. ఆ పక్కనే ఉన్న శ్రావణి ఒక్క ఉదుటున వచ్చేసింది. చుట్టూ ఉన్న ఆడవాళ్ళంతా గబగబా  లేచి వచ్చారు. ఒకావిడ వెంటనే గ్లాసుతో  నీళ్లు తెచ్చి మొహాన చిలకరించి, తుడిచింది
   సందడిగా ఉన్న అక్కడి వాతావరణమంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. మరు  నిమిషం అలజడి చోటు చేసుకుంది. ఓ నిమిషం తర్వాత మెల్లిగా కళ్ళు తెరిచింది శ్రీదేవమ్మ. కాస్త స్థిమితపడ్డ అరవింద, 
" ఏంటి అమ్మమ్మా ! ఏమైంది?.. "
అంది. పరిస్థితి గమనించిన శ్రీదేవమ్మ భయం భయంగా చూస్తూ అడుగుతున్న  మనవరాలితో, 
" ఏం లేదు చిట్టితల్లీ... కాస్త కళ్ళు తిరిగాయి.. అంతే.. పద పద.. లేటవుతుంది.. "
అంటూ లేచి,శ్రావణి, అరవింద  వారిస్తున్నా  వినక ముందుకు కదిలింది. అరవిందను  డ్రెస్సింగ్ టేబుల్ వద్ద కూర్చోబెట్టి, లేని ఓపిక, శక్తి కూడదీసుకుని, మల్లెలు,  కనకాంబరాలతో జడ వేసింది. అక్కడక్కడ గులాబీలు గుచ్చి, అందంగా అలంకరించింది. చంద్రబింబంలాంటి  మోమును ముద్దాడి, కళ్యాణతిలకం దిద్దింది. చుట్టూ ఉన్న కొందరు గుసగుసలాడుకున్నారు. కొందరు మూతి తిప్పుకున్నారు. మరి కొందరు వింతగా, ఒకింత సంతోషంగానూ చూశారు. అద్దంలో అందరినీ గమనిస్తున్న అరవింద కళ్లెగరేస్తూ పట్టించు కోవద్దన్నట్లు సైగ చేసింది. శ్రావణి ఓవైపు నిలబడి తల్లికన్నీ అందిస్తూఉంది. కుందనపు బొమ్మలాగున్న మనవరాలుని తనివి తీరా చూసుకుంటున్న తల్లి కళ్ళలో కాంతుల్ని చూసిన శ్రావణి.. తల్లికి తాను ఇవ్వలేకపోయిన ఆనందాన్ని తన కూతురైనా ఇస్తున్నందుకు సంతోషంతో ఆమె కళ్ళు చెమర్చాయి. పదేళ్ల వయసులో తాను కన్న ఓ కల.... ఈరోజు ఆరు పదుల వయసు దాటాక అరవింద రూపంలో తీరుతున్నందుకు శ్రీదేవమ్మ పులకించిపోయింది.
   అలా చూస్తున్న ఆమెలో సన్నగా గుండెల్లో ఏదో నొప్పి మొదలైంది. శరీరమంతా ఏదో అసౌకర్యంగా అనిపిస్తూ, తల తేలిపోతున్నట్లు అనిపించసాగింది. ఏదో శంకించిన ఆమె... శ్రావణిని పిలిచి, మెల్లిగా, 
" అరవిందను తీసుకుని నువ్వు,  చంద్రం బయలుదేరండి పెళ్లి మండపానికి... నేను వీళ్ళతో కలిసి వస్తాను..."
అంది. 
" అదేంటమ్మా, నువ్వూ  మాతోనే రావచ్చు కదా.."
అంటున్న శ్రావణికి, అరవిందకూ నచ్చజెప్పి, కిందికి పంపించేసింది. తర్వాత మెల్లిగా  లేచి, పక్క గదిలో నున్న మంచం మీదకి ఎలాగోలా చేరుకుంది. 
                   **              **         **
    కల్యాణమంటపమంతా కళకళలాడుతూ ఉంది. ఇరు కుటుంబాలవారూ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. బంధువులంతా ఒకచోట కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు.అదంతా చూస్తున్న చంద్రశేఖర్ కు, 
  " కూతురి పెళ్లి చేస్తే ఇంత ఆనందంగా ఉంటుందా!"అనిపించింది. ఆ సందడి అంతా చూస్తూ ఉంటే చంద్రశేఖర్ కు ఓవైపు సంతోషం, మరో మూల తీవ్ర అసంతృప్తి !! లోలోపల తొలి చేయ సాగింది... అతనికి తన పెళ్లి జరిగిన వైనం గుర్తొచ్చింది ఆ క్షణంలో....! ఆరోజు శ్రావణిని ఆమె తండ్రి కొడుతూ ఉంటే. ఏమిటితను ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు...! అనుకున్నాడు. కానీ ఇప్పుడు అర్థమవుతోంది ఆయన బాధ,ఆవేదన!
ప్రతి తండ్రీ తన కూతురి పెళ్లి గురించి ఎన్ని కలలు కంటాడో  కదా! అవన్నీ అడియాశలు చేస్తూ ఒక్కసారిగా ఆ  కూతురు అలా ప్రత్యక్షమైతే... ఏ తండ్రి తట్టుకోగలడు! అరవిందే  గనుక అలా చేసి ఉంటే.. అంతకన్నా ఉగ్రుడైపోయిఉండేవాడు తను ! 
   అరవింద కూడా ప్రేమించింది. కానీ తమలా చేయలేదు. శ్రీనాథ్ తనకన్నా రెండేళ్లు సీనియర్.ఓరోజు
ఇంటికి వచ్చి, 
" అంకుల్, నేను,  అరవింద ఒకరినొకరం ఇష్టపడుతున్నాము. మా ఇంట్లో అంతా ఓకే అంకుల్. మీరు కూడా ఒప్పుకుంటే... మా పెళ్లి జరుగుతుంది. లేదా మీరు సరే అనేదాకా వెయిట్ చేస్తాము. అలా జరగకుంటే... ఇద్దరం మౌనంగా విడిపోతాం..."
అని చెప్పాడు సూటిగా... తనతో,  శ్రావణి తో.
   ఆ సంస్కారానికి, అతని మాట తీరుకీ ముగ్ధులై పోయారిద్దరూ ! ముఖ్యంగా చివరి మాట...
" అలా జరగకుంటే మౌనంగా విడిపోతాం! "
అన్నది నేరుగా వచ్చి చంద్రశేఖర్ గుండెల్ని తాకింది. ఈ విచక్షణ, తెలివి అప్పట్లో తమకు లేకపోయింది. ఎంతసేపూ చెబితే ఇంట్లో ఒప్పుకోరు.. ఒప్పుకోరు.. అనే అనుకున్నారు గానీ, చెప్పి చూద్దాం, ఏమవుతుందో అన్న ఆలోచన మాత్రం రాలేదిద్దరికీ !తమ ప్రేమ, ఇష్టం గురించే గానీ.. దాని పర్యవసానం గురించిన ఆలోచన లేకపోయింది. ఫలితంగా... ఇరు కుటుంబాలకూ, బంధు వర్గానికీ శాశ్వతంగా దూరమైపోయారు...! తమవరకూ హ్యాపీగానే ఉన్నా లోలోపల ఏదో తీరని వెలితి !!
అలా  కాసేపు గతంలోకి వెళ్లి వ్యాకులపడుతున్న అతని వద్దకు శ్రావణి  వచ్చి, మెల్లిగా ఏదో చెప్పింది. ఆమె మొహంలో ఏదో ఆందోళన!
             **             **      **
    " ఏమిటి అరవిందా, ఎంతో అవగాహన ఉన్న నువ్వు కూడా ఇలా చేస్తున్నావు ! అవతల పెళ్లి పెట్టుకుని నువ్విలా  మొండికేస్తే ఎలా? అమ్మమ్మకు ఏమీ కాలేదు.. నా మాట విను."
ఏడుస్తూ కూర్చున్న అరవిందకు నచ్చజెప్ప ప్రయత్నించాడు చంద్రశేఖర్.
" అసలేమైంది డాడీ అమ్మమ్మకు.,, "
 ఏడుపు దిగమింగుకుంటూ అడిగింది.
" నిన్ను,  మీ అమ్మను ఇక్కడికి పంపించాక, అమ్మమ్మ మాట పలుకు లేకుండా అయిపోయింది. ప్రసాద్ బాబాయ్,  నేను, మరి కొందరు కలిసి వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లాము..."
"..........."
" మైల్డ్  హార్ట్ ఎటాక్ అట ! ప్రాణాపాయం  ఏమీ లేదు... రెండ్రోజుల్లో నార్మల్ అయిపోతుందని చెప్పారు డాక్టర్లు... ఇక్కడ పెళ్లి కార్యక్రమం ఆగకూడదని ప్రసాద్ బాబాయ్ వాళ్లు నాకు నచ్చజెప్పి పంపించారు. అక్కడ వాళ్లంతా ఉన్నారు, మరేమీ పర్వాలేదు.."
" అయ్యో, డాడీ ! ఏంటిది ! అమ్మమ్మ గురించి అమ్మ చెబితే వినడమే గానీ, ఇన్నేళ్లకు చూశాను. అదే పనిగా వెళ్లి తీసుకొచ్చాను.. తను లేకుండా నాకు పెళ్లేమిటి! "
" అరవిందా, మనకొక్కరికే చెందినది కాదిది. అవతల మగపెళ్లి  వాళ్ళ సంగతేమిటి! అసలు... అసలు.. శ్రీనాథ్ గురించి ఆలోచించవా..!"
 శ్రావణి కల్పించుకుంది."
"..............."
"... అదంతా సరే, ఇలా పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోతే ఎన్ని సమస్యలు ! అదేమైనా ఆలోచిస్తున్నావా..? "
కాస్త కోపంగానే మందలించింది. 
ఈలోగా చంద్రశేఖర్ కు ఏదో తట్టింది.
" శ్రావణీ, ఒక క్షణం..."
 అంటూ అవతలికెళ్ళాడు. 
                   **              **            **
  అంతదాకా పెళ్లి సందట్లో లోకాభిరామాయణంలో మునిగిన జనాల దృష్టి ఒక్కసారిగా మరలింది. ఓ విషయం... పదిమంది చెవుల్లో దూరి, పలు రకాలుగా విస్తరించి, చిలువలు పలువలై... చివరికది కొత్త రూపు సంతరించుకుని, సరికొత్తగా మారిపోవడం లోక సహజమేమో!! అదిగో తోక అంటే ఇదిగో పులి ! అన్న చందాన క్షణాల్లో ఆపందిట్లో ఆ వార్త గుప్పుమంది.
" పెళ్లికూతురుకి ఈ పెళ్లి ఇష్టం లేదట ! చేసుకోనంటూ ఏడుస్తోందట !!"
అందరి నోళ్ళలో నానుతూ, క్షణాల్లో ఫంక్షన్ హాలంతా వ్యాపించిపోయిందామాట. అందరూ చెవులు కొరుక్కోవడం మొదలైంది. అలా అలా పాకి, మంటపంలో ఏర్పాట్లు చూసుకుంటున్న పెళ్ళికొడుకు తండ్రి చెవిని  పడనే పడింది. పక్కనే ఉన్న భార్య, ఇతర బంధువులు మ్రాన్పడిపోయారు. 
      ముస్తాబు పూర్తి చేసుకుని, పీటల మీదకి రావడానికి సిద్ధమవుతున్న శ్రీనాథ్ వద్దకు అక్క వరుసయ్యే ఒకామె పరుగున వచ్చి  విషయం కాస్తా చేరవేసింది. మతి పోయినంతపనైందతనికి. 
" అక్కా,  ఊరుకో! విషయం తెలియకుండా మాట్లాడొద్దు.."
" నిజమేనంటరా, బయట అంతా  అదే చర్చ.!"
మరో ఇద్దరు  ముందుకొచ్చారు.ఇంకేముంది ! బిలబిలమంటూ అంతా అతని చుట్టూ మూగారు.
" ఆపండి!"
ఆ అరుపుకి ఓక్షణం  వెనక్కి తగ్గారంతా. 
అసలేమిటి! ఏమైంది అరవిందకు ! ఎందుకు ఏడుస్తోంది ! ఏం జరిగింది!
మెదడంతా మొద్దుబారిపోయిందతనికి  కాసేపు. అందర్నీ పక్కకు జరగమని చెప్పి, 
" నేను వెళ్లి కనుక్కుంటాను. అందాక ఎవరూ  నోరు విప్పొద్దు.సైలెట్ గా ఉండండి..."
అని హెచ్చరించి, లేచి గబగబా బయటికి నడిచాడు. సరిగ్గా అప్పుడే లోనికి వస్తూ తండ్రీ, తల్లీ వెనక బంధువులు ఎదురయ్యారు !!
                 **          **             **
శ్రావణిని వారించి, అవతలికెళ్ళిన చంద్రశేఖర్, రెండు నిమిషాల్లో తిరిగొచ్చి, 
" ప్రసాద్ బాబాయ్ తో మాట్లాడాను... ఇదిగో, అమ్మమ్మ మాట్లాడుతోంది చూడు.."
అంటూ సెల్ అరవింద చేతికిచ్చాడు. గబుక్కున సెల్ అందుకుని, దుఃఖం తో గొంతు పూడుకుపోతుండగా, 
" అమ్మమ్మా "
అంది. అవతల శ్రీదేవమ్మ గొంతు నీరసంగా పలికింది. 
" ఏంట్రా చిట్టితల్లీ... ! పెళ్లి వద్దంటున్నావట ! నాకేమైందని! రేపీపాటికి లేచి కూర్చోనూ... ! అప్పుడు నీ మెడలో తాళి కనిపించకపోతే నాప్రాణం నిలుస్తుందా !.."
' అమ్మమ్మా... '
" ఇన్నేళ్లకి మీ అందరినీ  చూసేసరికి సంతోషం పట్టలేక ఈ ముసలి గుండె తట్టుకోలేకపోయిందనుకుంటా..! నాతో పాటు మిమ్మల్నీ ఇబ్బంది పెడుతోంది..."
"................."
"... నువ్విలా బెంగపెట్టుకుంటే ఎలా? నీ  పెళ్ళికి నేను ఆటంకం కాకూడదురా చిట్టితల్లీ... అమ్మ నాన్నల్ని  ఇబ్బంది పెట్టకు. అవతల వాళ్లనూ బాధ పెట్టినదానవవుతావు. లే.. లేచి, వెళ్లి పెళ్లి పీటల మీద కూర్చో. రేపు మీ ఆయనతో కలిసి నా దగ్గరికి రావాలి. సరేనా! అమ్మమ్మ మాట వింటావు కదూ !... "
అమ్మమ్మ మాటలు మంత్రంలా  పనిచేశాయేమో అరవింద పై. దిగ్గున  లేచింది. కళ్ళు తుడుచుకుంటూ, 
" అమ్మా.. పదండి "
అంటూ ముందుకు కదిలింది. నాలుగు అడుగులు వేయగానే లోనికి వస్తూ శ్రీనాథ్ ! వెనక అతని తల్లిదండ్రులు, దగ్గర బంధువులు !! విషయం బోధపడ్డ అరవింద వెంటనే, 
" ఏంటి అంకుల్, ఇలా వచ్చారు? ముహూర్తానికి టైం అవుతోంది కదా ! పదండి..."
అనేసి, శ్రీనాథ్ చేయి పట్టుకుని, 
" పద, శ్రీ...వెళ్దాం.. అర్జెంటుగా అమ్మమ్మ గురించి నీకో విషయం చెప్పాలి"
అంటూ ముందుకు నడిచింది. ఏదో అడగబోయిన అందరి నోళ్లూ ఠక్కున మూతబడిపోయాయి. అయోమయంగా ఒకరి మొహాలొకరు చూసుకుంటూ, ముందు వెళ్తున్న ఆ ఇద్దర్నీ అనుసరించారు. ఆ వెనకే.. స్థిమితపడ్డ మనసుల్తో శ్రావణీ, చంద్రశేఖర్ లూనూ !!
                      **             **             **
  మూడు రోజుల తర్వాత... నూతన దంపతులు వచ్చి, శ్రీదేవమ్మ కాళ్లకు మొక్కారు. చిలకాగోరింకల్లా ఉన్న ఆ జంటను చూస్తూ, ఉప్పొంగిపోయింది శ్రీదేవమ్మ మనసు. అరవింద పెదాల మీద వెల్లివిరుస్తున్న చిరునవ్వులు చూస్తూ, తన పెళ్లి జరిగిన రోజు గుర్తొచ్చి, 
" ఏమిటో! చిన్నతనంలోపూలూ, పూలజడలంటూ తెలిసీ  తెలియక ఏవేవో పిచ్చి కలలు ఊహించుకుంది తను.. కానీ... పెళ్లి ఎంత ఘనంగా జరిగినా... దండలు మార్చుకుని సింపుల్ గా తాళి కట్టేసినా... సంతకాలు పెట్టి రిజిస్టర్ మ్యారేజి చేసుకున్నా... ఆతర్వాత ఆఇద్దరూ ఎంత సంతోషంగా, ఎంత అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారూ అన్నదే ముఖ్యం !! "
అనిపించిందామెకు . ఆ విషయం శ్రావణీచంద్రశేఖర్ లను చూసిన క్షణమే గ్రహింపుకొచ్చింది శ్రీదేవమ్మకు. ఇప్పుడు ఈ ఇద్దరినీ చూస్తుంటే అది ఇంకా బలపడిపోగా,  అక్షింతలు చల్లుతూ మనసారా ఆశీర్వదించింది. తల్లి ముఖంలో ప్రశాంతతను గమనిస్తూ, చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంది శ్రావణి. అమ్మనూ, అమ్మమ్మనూ చూస్తున్న అరవింద  వదనం ఆనందంతో విరిసిన అరవిందమే అయింది.
                           💐  శుభం 💐
 













No comments:

Post a Comment