Saturday, August 6, 2022

దూరంగా ఉందాం.... దగ్గరవుదాం... !!

 "అమ్మా,  ఏంటమ్మా... ఎందుకలా మాట్లాడుతున్నావు? నాన్నా, ఏమిటీ, మీరు మౌనంగా ఉన్నారు?.. "
 ఊహించని తల్లి మాటలకు విస్తుబోతూ  అడిగాడు శరత్. అతనికి నెల క్రితం పెళ్లయింది. సిటీ లోనే ఓ బ్యాంకులో క్లర్కుగా పని చేస్తున్నాడు. భార్య సుధ కూడా అక్కడే మరో ఆఫీస్ లో చేస్తోంది. పెద్దలు కుదిర్చిన వివాహమే. సెలవు పూర్తయి  ఇద్దరూ డ్యూటీలో జాయిన్ అయ్యే సమయం దగ్గర పడింది. అంతలోనే ఇలా తల్లి ప్రతిపాదన విని షాక్ అయ్యాడు శరత్.
" మీ అమ్మ సరిగానే  ఆలోచించింది శరత్. మొదట నీలాగే నేనూ 'ఏమిటిది' అనుకున్నా. ఆలోచిస్తే సమంజసంగానే తోచింది...."
 భార్య శారదకు వత్తాసు పలికాడు కృష్ణమూర్తి.
" నా బ్యాంకు మన ఇంటికి దగ్గరే. సుధ ఆఫీస్ నేవెళ్లే దారిలోనే. తనని డ్రాప్ చేసి నేను వెళ్తాను... మరి మేము వేరే ఇల్లు తీసుకొని ఉండాల్సిన అవసరమేముంది?... "
 కాస్త దగ్గరగా జరిగి, 
"... సుధ గానీ అనుచితంగా ప్రవర్తించిందా అమ్మా... "
 గొంతు తగ్గించి అడిగాడు.
" ఛ ఛ ! మంచి మర్యాద తెలిసిన అమ్మాయి. అనవసరంగా ఆ పిల్లను అనుమానించకు..."
" మరి !?... మీ మీద ఇష్టం, గౌరవం కూడా ఉన్నాయమ్మా తనకి..."
"... ఆ  ఇష్టం, గౌరవం ఎప్పటికీ అలాగే ఉండాలనే మా తాపత్రయం. అందుకే ఈ నిర్ణయం..."
 కృష్ణమూర్తి, శారద ఇద్దరూ ఒకేసారి అన్నారు. తలెత్తి వాళ్ళ మొహాల్లోకి ఆశ్చర్యంగా చూశాడు శరత్.
" అవున్రా... పెళ్లయాక  కొత్త దంపతుల్ని కొంతకాలం వాళ్ళ మానాన వాళ్లని వదిలేయాలి. అప్పుడే వాళ్లు కోరుకున్న స్వేచ్ఛ, కలలు గన్న జీవితం వాళ్లు అనుభవించడానికి అవకాశం లభిస్తుంది. దూరంగా ఉండటం మూలాన వాళ్ళకు  తల్లిదండ్రుల విలువ, అత్తమామల అవసరం కూడా తెలిసొస్తుంది. వాళ్ల మీద గౌరవమూ పెరుగుతుంది. లేకుంటే పరిస్థితి మరోలా ఉంటుంది. ఎన్నో కుటుంబాల్ని చూస్తున్నాము... "
 అన్నాడు కృష్ణమూర్తి. 
" అవును శరత్, ఇప్పుడు మాకొచ్చిన  ఇబ్బంది ఏమీ లేదు. మీ అక్కయ్య పెళ్లి చేశాము. మీ నాన్నకు వచ్చే పెన్షన్ మాకు చాలు... మీరు మరోలా భావించక మేము చెప్పినట్లు చెయ్యండి... "
స్థిరంగా అంది  శారద. లోపల గదిలో ఉన్న సుధకు  వాళ్ళ మాటలన్నీ వినిపిస్తున్నాయి. 
" అత్తమామలు ఎంత దూరదృష్టితో ఆలోచిస్తున్నారు! కొడుకు మా వాడు... వాడి మీద సర్వహక్కులూ మావే అంటూ... పెళ్లి చేసినా.. తల్లి కనుసన్నల్లోనే ఉంచుకునే అత్తల్ని  చూసింది ఇంతవరకూ.. కానీ... వీళ్ళు ఎంత విశాలంగా ఆలోచిస్తున్నారు !!
  ఆమెకు తన వదిన తలపుకొచ్చింది. అమ్మకూ, ఆమెకూ ఎప్పుడూ కీచులాటలే! అపార్థాలే ! పదేళ్లుగా అంతా కలిసే  ఉంటున్నారు. అన్నయ్యకు ధైర్యం, తెగింపు లేవు. వదిన మొహంలో సంతోషమన్నది తను ఏ రోజూ  చూడలేదు. అన్నావదినలకు 'ప్రైవసీ'అన్నది ఆఇంట్లో అసలుండదు. అమ్మానాన్న అర్థం చేసుకోరు. జరుగుబాటున్నా, ఆర్థికంగా ఏ లోటూ లేకున్నా కొడుకును మాత్రం వదలరు ! అతనికో కుటుంబం ఉందనీ,  భార్య పిల్లలు ఉన్నారనీ.... వాడికీ ప్రత్యేకించి ఓ జీవితం ఉంటుందన్న ఆలోచన ఏ కోశానా వాళ్ళకి రాదు. అంత స్వార్థపూరిత మనస్తత్వాలు ! వాళ్ల మధ్య వదిన బలి! ఫలితంగా ఆమె నవ్వడమే మరిచిపోయింది.
   అదంతా మదిలో మెదిలి... తన అత్తమామల ఔదార్యాన్నీ, పెద్దమనసునీ మెచ్చుకోకుండా ఉండలేక పోయింది సుధ. మెల్లిగా లేచి హాల్లోకి  వచ్చింది. శరత్ ను ఇద్దరూ కన్విన్స్ చేస్తున్నారు
" ఇందులో మీరు బాధపడాల్సినదేమీ లేదురా... చేతకాని కాలం వచ్చినప్పుడు ఎలాగూ  మీ అండ  మాకు తప్పదు. మీకూ  మా బాధ్యతలు తప్పవు. అంతదాకా.. మీరు మీ కొత్త జీవితాన్ని హాయిగా గడిపేయండి..."
నవ్వుతూ సుధను  కూడా కూర్చోమని కంటిన్యూ చేశాడు. 
"... అలాగని మిమ్మల్ని పూర్తిగా వద్దనుకున్నామనుకునేరు ! మీ అవసరాలకెప్పుడూ అందుబాటులోనే ఉంటాము. స్వేచ్ఛగా వదిలేశామని అసలే అనుకోకండి. మాకేమొచ్చినా మీరే దిక్కు అని మాత్రం మర్చిపోకండి...
"..అవునర్రా.. దూరమవుతున్నామని అనుకోవద్దు. దూరంగా ఉంటూ దగ్గరవ్వాలనే మా ఈ నిర్ణయం..."
 శారద కోడలి చేయి తన చేతిలోకి తీసుకుంటూ ఆప్యాయంగా అంది. శరత్ తల పంకించాడు.
"అమ్మానాన్న ఎంతో జీవితం చూశారు. అనుభవజ్ఞులు. అన్నీ ఆలోచించే మాట్లాడుతుంటారు. ఊహ తెలిసినప్పటినుంచీ చూస్తున్నాడిద్దర్నీ. టౌన్ లో ఉన్నందువల్ల అవసరార్థం వచ్చే చుట్టాల తాకిడి ఎక్కువగా ఉండేది అప్పట్లో. అందరితో సఖ్యతగా ఉండడం వల్ల తెలిసిన వాళ్లు కూడా అడపాదడపా వచ్చేవాళ్ళు. అమ్మకి ఎప్పుడూ  వండి వార్చడం, ఇంటి పనులు! క్షణం తీరిక ఉండేది కాదు. నాన్నకేమో  ఉద్యోగం, బయటి పనులు! ఎన్నడూ ఇద్దరూ కలిసి ఓ సినిమాకైనా వెళ్లడం కూడా చూసి ఎరగడు తను ! అందరిలాగే వాళ్లకూ ఎన్నో కోరికలు,  ఆశలూ ఉండే ఉంటాయి కదా!"
 అలా ఆలోచిస్తున్న శరత్ మైండ్ లో ఠక్కున 'ఫ్లాష్'వెలిగింది. 
" నాన్నా, అమ్మా! మీ ఇద్దరికీ పెళ్లి కాకముందు, అయ్యాక...ఏఏ కోరికలుండేవో ఓసారి గుర్తు తెచ్చుకోండి. చూడాలనుకున్న కొత్త ప్రదేశాలు కూడా ఉండే ఉంటాయి.. సుధా, ఆ నోట్ బుక్, పెన్నూ పట్రా.."
"అరే ! ఇప్పుడవన్నీ ఎందుకురా?... "
" ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నాన్నా.. మేం మీ మాట వింటున్నాం.. మీరూ మామాట వినాల్సిందే..అమ్మా, చెప్పు... "
ఇద్దరూ  నవ్వుకుంటూ చెరో నాలుగైదు  ప్లేసెస్ చెప్పారు
" ఓకే. మీ ఇద్దరూ రెడీగా ఉండండి. రెండ్రోజుల్లో వీటిల్లో ప్రస్తుతం ఏవి అందుబాటులోఉంటే వాటికి టికెట్స్ బుక్ చేస్తాను. సుధా, పద, పని ఇప్పుడే మొదలెడదాం..."
" రేయ్ రేయ్ ఆగరా.. లేడికి లేచిందే పరుగని ఏమిట్రా నీ హడావుడి !"
" లేదత్తయ్యా, ఆయన కరెక్ట్.. మీరు అప్పట్లో ఏమేం అనుకున్నారో అవన్నీ ఇప్పుడు తీరేలా మేం చూస్తాం.." 
అంటూ లేచింది. లోపల మాత్రం, 
" కొత్త దంపతులకే కాదు మలివయసులో మీకూ ఉండాలత్తయ్యా 'ప్రైవసీ' !" అనుకుంటూ...భర్త ననుసరించింది.  
"ఏంటమ్మా నువ్వు కూడా.... "
వారించబోయారిద్దరూ.. కానీ, వింటేగా !
" మంచి కోడలే దొరికింది... "
అనుకొని నవ్వుకున్నారిద్దరూ.  
*****************************************

4 comments:

  1. చాలా … చాలా … మంచి ఆలోచన, సలహా 👌.

    మా స్నేహితుడొకాయన తన కొడుకు పెళ్ళి ఇటీవలే చేశాడు. కోడలు కాపరానికి వచ్చిన తరువాత వెంటనే కొడుకు చేత వేరే కాపరం పెట్టించాడు. తెలివైనవాడు 🙂.

    అయితే దీనివల్ల జరిగే అవకాశాలున్న ఒక పరిణామం ఏమిటంటే - ఆ కోడలు కూడా ఉద్యోగస్తురాలు అయ్యుంటే (ఇప్పుడు చాలా మంది చేస్తున్నారుగా), ఆవిడ తల్లితండ్రుల ఇల్లు కూడా అదే ఊళ్ళో ఉంటే (హైదరాబాదులో అటువంటి ఉదాహరణలు కొల్లలు) - కోడలు వెళ్ళి తన తల్లితండ్రుల ఇంటి పక్కనేనో దగ్గరగానో తన కొత్తకాపరానికి ఇల్లు అద్దెకు తీసుకుంటుంది 🙂. తను కూడా ఉద్యోగం చేస్తోంది కాబట్టి తనకు సహాయంగా ఉంటారు అని అంటుంది. కానీ అదే లాజిక్ తో అత్తవారింటికి దగ్గరలో ఇల్లు తీసుకునే కోడళ్ళు తక్కువ 🙂.
    (పైన చెప్పిన నా ఫ్రెండు కోడలు అలా చేసే వీలు లేదు లెండి, ఆవిడ పుట్టిల్లు వేరే ఊరు 🙂.)

    మొత్తం మీద మంచి కథ వ్రాశారు.

    ReplyDelete
    Replies
    1. విజ్ఞత గలిగిన కొందరు అలా తెలివిగా ప్రవర్తిస్తారు." కని, పెంచి, విద్యాబుద్ధులు చెప్పించి, ఓ ఇంటివాడిని చేశాం. ఇక మా భారమంతా నీదే"అన్న ధోరణిలో మరికొందరుంటారు. అలాంటి వాళ్ళు కేవలం తమ సౌకర్యం మాత్రమే చూసుకోకుండా పిల్లల సుఖసంతోషాల గురించి కూడా ఆలోచించాలి. మీ స్పందనకు చాలా సంతోషం. 🙏🙏🙏

      Delete
  2. నా ఉద్దేశంలో పెళ్ళయిన తర్వాత ఎలా ఉండాలి అనేది వాళ్ళు చిన్నప్పుడు పెరిగినవిధానం బట్టి ఉంటుంది అని. పదిమందితో పెరిగిన నాకు తెలిసిన వాళ్ళందరూ కోరుకునేది పది మందితో ఉందామనే . అటువంటిది కుదరకపోతే పదిమంది స్నేహితులని (?) పోగు చేసుకుంటారు గడపటానికి. ఇవి విద్యతో వచ్చిన బుద్ధులు కాదు స్నేహితుల మూలాన వచ్చే బుద్ధులు

    ReplyDelete