రంగురంగుల ఎలక్ట్రిక్ బల్బుల తోరణాలతో వెలిగిపోతోంది ఫంక్షన్ హాల్. బాగా దగ్గరి బంధువులయినందున పెళ్లి ముందు రోజు కూడా రావాల్సి వచ్చింది. సరే! రొటీన్ లైఫ్ నుండి కాస్త ఆటవిడుపు... కాలక్షేపం... పనిలో పని.. అదే పనిగా ఎలాగూ వెళ్లి ఒకర్నొకరం కలవలేని బంధువర్గాన్నీ చూడొచ్చు కదా అన్న తలంపుతో కుటుంబ సమేతంగా వెళ్ళాం.
ప్రవేశ ద్వారం దగ్గరే ఇద్దరు అమ్మాయిలు నిలబడి ఉన్నారు. లోపలికి వెళ్తున్న వాళ్ళందరి చేతుల్లో మడత పెట్టిన మందపాటి కార్డు ఒకటి పెట్టేస్తున్నారు. ఇదేంటా అని తెరిచి చూస్తే... పెళ్లి ముందు రోజు, పెళ్లిరోజు ఆహూతులకు ఏర్పాటు చేయనున్న విందులో రక రకాల డిషెస్ లిస్టు ! క్యాటరింగ్ వాళ్ళ పని! ఓహో! ఇదోరకం పబ్లిసిటీ అన్నమాట ! అందులో వాళ్ల అడ్రస్, ఫోన్ నెంబర్... వగైరా.. వగైరా.. అన్నీ పొందుపరచబడి ఉన్నాయి.
స్నాక్స్, ఫ్రూట్ జ్యూస్ లు, కాఫీలు, టీలు నాల్గు రకాల టిఫిన్లు, రకరకాల బిర్యానీలు కర్రీలు...అంతటితో సరా ! ఐస్ క్రీములు, పళ్లముక్కలు, అరటిపండు..ఇన్ని ఉండి తాంబూలాలు లేకుంటే ఎలా? అవీనూ !!
మనిషన్నవాడు ఒకేసారి అన్ని ఐటమ్స్ తినగలడా!సాధ్యమా ! అంటే... ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు తినడానికే ఇవన్నీ.. అన్నారు కొందరు !
ఆ రెండు రోజులూ భోజనాల సమయంలో ఎంత వద్దనుకున్నా కంటబడ్డ దృశ్యం... ప్లేట్లలో తిన్నదెంతో గానీ... పారవేస్తున్నదే ఎక్కువగా కన్పించింది వేస్ట్ బకెట్లలో ! అక్కడక్కడా కొన్ని స్వీట్లు కూడా కన్పించాయి దీనంగా చూస్తూ !
మా ఫ్రెండ్ ఒకామె గృహప్రవేశానికని పిలిస్తే వెళ్ళాను కొద్ది రోజుల క్రితం. ఆహ్వానించినవారంతా వచ్చారు గానీ పదార్థాలు మాత్రం ఎక్కువగా ఖర్చు గాక మిగిలిపోయాయంటూ వాపోయింది. ముఖ్యంగా పప్పు, రసం, సాంబార్ ఇంకా వెజ్ కర్రీస్ లాంటివి నిండుగా అలాగే ఉండిపోయాయి. బిర్యానీలు, కుర్మాలు లాగించిన తర్వాత పప్పు, రసం జోలికెవరు వెళ్తారు చెప్పండి ! ఇక నాన్ వెజ్ ఉన్నట్లయితే,వెజ్ వైపు ఎవరో ప్యూర్ వెజిటేరియన్స్ తప్ప ఇతరులు చూసే ప్రసక్తే ఉండదు. అలాంటప్పుడు అవి మిగిలి పోయే అవకాశాలు సహజంగానే ఎక్కువ మరి ! అంతా అయ్యాక... కొందరు ఏ అనాధ శరణాలయాలకో ఫోన్లు చేయడం.. వాళ్ళు వచ్చి, వాళ్లకు కావలసినవి మాత్రం పట్టుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది.మిగతాదంతా వృథానే!
" అందరూ చేయిస్తున్నారు... మనం చేయించకపోతే ఎలా "
అన్న ఫీలింగుతో నలుగురు నడిచే దారిలోనే నడవాల్సొస్తోంది అంటున్నారు ఆహ్వానించే వారు.
అదలావుంచితే.... ఇక use and throw వాటి గురించి... తినే ప్లేట్లు, ప్లాస్టిక్ నీళ్ల గ్లాసులు, లాంటివి..
ఈమధ్య చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ కూడా పెడుతున్నారు. కొందరు నీళ్లు సగం తాగి ఆ గ్లాస్ పక్కన పడేయడం!
( ఇదోరకం వృధా ). ఇవేనా! ఐస్ క్రీమ్ కప్స్, స్వీట్ కప్స్.... వగైరాలకూ కొదవేంలేదు. ఇవన్నీ పర్యావరణానికి ఎంత చేటు తెస్తాయో వేరే ప్రస్తావించక్కర్లేదు. ఒకప్పుడు స్టీలు లేదా ఫైబర్ ప్లేట్లు వాడేవారు. కడిగే శ్రమ ఎందుకని ఈ సౌలభ్యం ! దాని పర్యవసానం కాలుష్యం! కాలుష్యం !
విమర్శించడం కాదు గానీ.. దీనికి అందరం... ప్రతి ఒక్కరం బాధ్యులమే. వీటి అవసరం గుర్తిస్తున్నామే గానీ, పర్యావరణ కాలుష్యం గురించి... మనకెందుకులే అనుకుంటున్నాము. అది మనకు సంబంధించిన వ్యవహారం కాదనుకుంటాము.
భోజన పదార్థాల వృధా, వాతావరణ కాలుష్యం..
ఈ రెండూ నివారించలేని అత్యవసరాలుగా మారిపోయాయి ప్రస్తుత రోజుల్లో !
ఓ ఫంక్షన్ లో భోజనాలయ్యాక ఆడా, మగ కొందరు ఓ చోట చేరి బాతాఖానీ మొదలెట్టారు ఇదే విషయం మీద.
" ఏమిటో, మా రోజుల్లో ఇవన్నీ ఎరగం...."
" ఆ రోజులు వేరు బావా, ఇప్పుడలా చేశామంటే ఒప్పుకోరు జనాలు..."
" ఏం ఒప్పుకోవడమో ఏమో, నన్నడిగితే ఏ రిజిస్ట్రార్ ఆఫీసులోనో దండలు మార్చుకుని.. ఓ రోజు సింపుల్ గా రిసెప్షన్..అదీ.. దగ్గరి బంధుమిత్రులకు అరేంజ్ చేసేస్తే భేషుగ్గా ఉంటుందంటాను.... "
ఒకాయన తన అభిప్రాయం అలా వెలిబుచ్చాడో లేదో..
"... చాల్లే ఊరుకో... ఇంత బతుకూ బతికి.... "
పూర్తి చేయకుండా సాగదీసి మూతి తిప్పుకున్నాడు వెంటనే పక్కనే ఉన్న మరొక పెద్దాయన.
మరి కొందరు ఆడవాళ్ళు,
" ఏ వంటకాలు బాగున్నాయి, ఏవి బాగాలేవు" అన్న చర్చలో పడ్డారు.
ఒకప్పుడు బంతి భోజనాలు.... విస్తళ్ళు వేసి మితంగా కొన్ని రకాలతో రుచికరంగా వడ్డించేవారు. ఇప్పుడా పరిస్థితి కాగడా వేసి వెతికినా కానరాదు.నిర్వాహకులకు ఖర్చుతో పాటు శ్రమ !పైగా వృథా ! తినేది రవంత, ఆర్భాటం కొండంత!అన్నట్లు !!
ఇన్నేసి రకాలు చేయిస్తారా... తృప్తిగా తినడం గానీ, కడుపు నిండిన భావన రావడం గానీ జరగదు ! చివరగాచెప్పొచ్చేదేమంటే...పెళ్లికి వెళ్లొచ్చిన'ఫీల్' అసలుండటం లేదు. అటూఇటూ మొక్కుబడి తంతు!
ఇది ఏ ఒక్కరి మాటోమాత్రం కాదు.ఎక్కువ శాతం జనాల్లో నలుగుతున్నదే ! కాకపోతే ఓ రకమైన comfort zone లో పడిపోయి దానికి పూర్తిగా అలవాటుపడిపోయాక మళ్లీ పాత పద్ధతుల్లోకి వెళ్లాలంటేనే ఇబ్బంది !! నాగరికత ప్రగతి పథంలో నడిస్తే బాగానే ఉంటుంది. ప్రతీ దాంట్లోనూ ప్లస్ లూ, మైనస్ లూ ఉంటుంటాయి.అలా ఆలోచిస్తూ... కాలానుగుణంగా సర్దుకుపోవాలి అనిపిస్తుంది ఒక్కోసారి. మార్పు మంచిదే..... కానీ....
******************************************
“నలుగురితో పాటు మనమూ” అని ఎంత అనుకున్నా కూడా జరుగుతున్న వేలంవెర్రిని చూస్తుంటే విచారం కలుగుతుంది. వ్యాపారుల మాయలోను, సోకాల్డ్ సెలెబ్రిటీల ఆరాధనలోనూ పడిపోయిన జనం (కోటలో పెళ్ళి, డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ సెలెబ్రిటీల పనులు, ఇండియాలోనే చేసినా ఆ హంగు ఆర్భాటం, వాళ్ళ వెనకాల పరుగులు పెట్టే మీడియా, గుప్పించే పబ్లిసిటీ చూసి సామాన్యజనం వాతలు పెట్టుకునే ప్రమాదం లేకపోలేదు. ఇంకా మీరు రిజిస్టర్డ్ మారేజ్ సూచిస్తారేమిటి? ఈ కాలంలో పెళ్ళికూతుళ్ళకే సింపుల్ పెళ్ళి అంటే నచ్చడం లేదు, వాళ్ళకే అన్ని హంగులూ కావాలి - భోజనాల విషయం ఒకటే కాదు, తతిమ్మా అన్నీ అంకాల్లో కూడా. ఏతావాతా వ్యాపారులు బాగు పడడం జరుగుతోంది).
ReplyDeleteసమాజాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానంలో ఉన్నటువంటి ప్రముఖులు బాగా ఆలోచించి చెయ్యాలి ఇటువంటి పనులు, సమాజానికి ఆదర్శవంతమైన సందేశం వెళ్ళేలాగా ప్రవర్తించాలి. తను ప్రధానమంత్రిగా ఉండి భారీ ఆర్భాటం చెయ్యగలిగిన స్ధాయిలో ఉన్నప్పటికీ ఇందిరా గాంధీ గారు తన చిన్నకొడుకు పెళ్ళి సింపుల్ గా రిజిస్టర్డ్ పెళ్ళిగా చేసినటువంటి ఉదంతం నాకయితే తరచూ గుర్తొస్తుంటుంది. ఆమె చూపించిన మార్గంలో వెళ్ళే బదులు రాను రాను అధ్వాన్నమైపోతోంది.
ఈ పరిస్ధితిలో మార్పు రావాలంటే ఎక్కడ మొదలవ్వాలో తెలుసాండీ - ప్రముఖుల వద్ద నుండే ఆరంభం జరగాలని నా అభిప్రాయం. అప్పుడే సామాన్య జనం కూడా మారే అవకాశం ఉంటుంది. అంత వరకు మనలాంటి వాళ్ళది కంఠశోష / బ్లాగ్ శోషే.
బాగా చెప్పారు. ఒకప్పుడు ఇరుకుటుంబాల వారూ సరే అనుకున్న తర్వాత.. సంబంధం ఖాయం చేసుకుని, ఆ రెండు కుటుంబాల వారు మాత్రమే తాంబూలాలు పుచ్చుకునేవారు. ఇక, అదే నిశ్చితార్థం. ఇప్పుడు.. నిశ్చితార్థం కూడా పెళ్లి లాగా ఘనంగా చేస్తున్నారు. అవసరమా !తమకుతాము ఖర్చు పెంచుకుంటూ పోవడం తప్ప !!
Deleteముఖ్యంగా మద్యతరగతివారు ఈవేలంవెఱ్ఱి అనే ఉచ్చులో పడ్డారు. గొప్పకోసం ఇళ్ళు గుల్లలు చేసుకుంటున్నారు. నిశ్చితార్ధాలకే లక్షలకు లక్షలు కర్చుపెట్టిన కుటుంబాలను చూస్తున్నాను. వివాహాలకు ఖర్చుకు మితి అన్నదే లేదు. ఒక సందర్బంలో ఐతే అమ్మాయి అలా తలిదండ్రులచేత ఒకటికి రెండు సార్లు మూడేసి నాలుగేసి లక్షలు నిశ్చితార్ధాలకే తగలేయించి అపైన ఏదో వంకతో కాన్సిల్ చేయించింది - ఆనక ఎవర్నో ప్రేమించానని చెప్పి తల్లిదండ్రులకు చెప్పకుండానే వివాహం చేసుకుంది. ఎన్నోచిత్రాలు ఈరోజుల్లో. లేకపోతే పెళ్ళికి వందలరకాల వంటకాలతో విందులూ ఆతిండిలో ఎనభైశాతం గోతిపాలూ ఏమిటండీ!?
Delete“ఘనం” గా కనబడాలి అనే పిచ్చి బాగా ముదిరి పోయింది సమాజంలో. ఓ సినిమాలో అమ్మాయి తండ్రి “మూర్తి” (ప్రకాష్ రాజ్ అనే నటుడు) “మూర్తిగారమ్మాయి పెళ్ళంటే మినిమమ్ పదేళ్ళు గుర్తుండిపోవాలి” అంటాడు. మనకీనాడు సినిమాలే భారతరామాయణాలు కదా. మరి అటువంటి సినిమా డైలాగుల వల్ల జనం వాతలు పెట్టుకునే పరిస్ధితి ఉంటుంది కదా?
Deleteనిశ్చితార్థం తరువాత అదే రోజు సాయంత్రం మళ్ళీ రిసెప్షన్ కూడా పెట్టాలని పట్టు బట్టిన మగపెళ్ళి వారిని చూసాను నేను.
This comment has been removed by the author.
ReplyDeleteనాలుగైదు సంవత్సరాల క్రితం కర్ణాటక లో రెండు పెళ్లిళ్లకు వెళ్ళాను. అక్కడ కూడా టేబుళ్లు, కుర్చీలు వేసి, చక్కగా వడ్డించారు. 🙂
Deleteబఫే సౌకర్యంగా ఉండదండీ. దామరాజు సుశీలగారు ఏదో పుస్తకంలో "ఆకేజీన్నరబరువు ప్లేట్లు మోసీమోసీ, ఆపచ్చి ఉల్లిపాయలు నమిలీనమిలీ నా చేతులూ నోరూ చచ్చుబడిపోయాయి" అన్నారు.
Delete“దామరాజు సుశీల” గారా లేక (డాక్టర్) సోమరాజు సుశీల గారా?
Deleteఅలాగే ఆ పుస్తకం పేరు కూడా చెప్పండి శ్యామలీయం గారు. థాంక్స్.
Sorry for the typo. సోమరాజు సుశీల గారే.
Deleteచిన్నపరిశ్రమలు - పెద్దకథలు పుస్తకంలో.
DeleteThis comment has been removed by the author.
Deleteఅమ్మాయిల తీరే ఇలా ఉంటే ఇక ఏం చెప్పగలం ! అక్కకు అంత కట్నమిచ్చి చేశారు... నాకూ అంత ఇవ్వాల్సిందే.. అని పట్టుబట్టే కూతుర్లూ ఉంటున్నారు మరి !
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదాలు సర్.
అబ్బాయితో సమానంగా అమ్మాయి చదివినా, కొన్నిసార్లు అతనికంటే ఎక్కువ సంపాదిస్తున్నా కూడా అదేమీ లెక్క లోకి తీసుకోకుండా.. విపరీతంగా కట్నాలు డిమాండ్ చేస్తున్నారు. పైగా.. మా స్థాయికి తగినట్లు ఘనంగా చేయాలని షరతులు ! వీళ్ళ స్థాయికి తగినట్లు అమ్మాయి వాళ్ళు చేయడమేమిటో... ఆ సాంప్రదాయమేమిటో అర్థం గాదు. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి తమ ఖర్చు తోనే గొప్పగా ఎందుకు చేసుకోకూడదు... అన్న ఆలోచన మగ పెళ్లి వారికి రాకపోవడం శోచనీయం. ఆ ఖర్చూ అమ్మాయి వాళ్లపైనే వేయడం తగునా! మగ పిల్లల తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయమిది !ఏ కొందరైనా అంతటి విశాల దృక్పథంతో ఉంటే వారికి నా మనఃపూర్వక వందనాలు.
ReplyDeleteThank you very much సర్.
వివాహం అనేది అన్నిచోట్లా చాలా ఖరీదైన వ్యవహారమే నండీ. మనదేశంలోనే అని కాదు. అమెరికాలో ఐతే పెళ్ళికొడుకూ పెళ్ళికూతురూ పెట్టుకోవాలి పెళ్ళిఖర్చులు అని విన్నాను. అక్కడి పెళ్ళి విందుకు ప్లేటుకు వందలడాలర్లు ఖరీదు ఉంటుంది కాబట్టి కచ్చితంగా పిలవబడిన వ్యక్తులే వెళ్ళాలి పెళ్ళికి - సకుటుంబబంధుమిత్రపరివారసమేతంగా అన్న క్లాజు ఉండనే ఉండదు. పెళ్ళిచేసుకోవటం కోసం అబ్బాయిలూ అమ్మాయిలూ డబ్బులు కూడబెట్టుకోవటం చూసానక్కడ. తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుంది కాని వాళ్ళు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టరు పెళ్ళిళ్ళు చేయటానికి. ఐనా ఈమధ్యకాలంలో అక్కడకూడా పెళ్ళిళ్ళకోసం అప్పులు చేస్తున్నారట.
ReplyDeleteఅలా ఖర్చు చెరి సగం పంచుకునే పద్ధతి ఇక్కడా వస్తే ఎంత బాగుంటుంది !
Deleteనాకు తెలిసిన ఒకతను (నా వయసు వాడే, మా ఊరి వాడే) ఆ రోజుల్లోనే రిజిష్టర్డ్ పెళ్ళి చేసుకున్నాడు.
ReplyDeleteచిన్నపట్టణం కాబట్టి రిజిస్ట్రార్ గారి ఆఫీసులో మొత్తం ఓ పదిమంది సిబ్బంది ఉండేవారు. వాళ్ళందరికీ టీ తెప్పించాడు. అప్పట్లో 30 పైసలుండేది. ఆ ఖర్చు మూడు రూపాయలు. రిజిస్ట్రేషన్ రుసుం కలిపి మొత్తం ఎనిమిది రూపాయలు. మా పెళ్ళిఖర్చు ఎనిమిది రూపాయలయ్యా అంటుంటాడు.
మరింత మంది ఆ పాటి ధైర్యం చెయ్యగలిగితే వృధాఖర్చు గణనీయంగా తగ్గుతుంది. కానీ శోచనీయమైన సంగతి ఏమిటంటే రిజిస్టర్డ్ పెళ్ళి చెయ్యండి అని పెళ్ళికొడుకు అతని వైపు వారే అడిగినా కూడా ఎగిరి గంతెయ్యక, లేదండీ నలుగురూ ఏమన్నా అనుకుంటారు అని వీటో చేసిన అమ్మాయి తల్లిదండ్రులను కూడా చూసాను.
నిజంగా ఎగిరి గంతెయ్యాల్సిన విషయమే ! మీరు చెప్తున్నదాన్ని బట్టి... మగపిల్లల తల్లిదండ్రులే గాదు.. ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా చాలా ఆలోచించాల్సిన విషయమే ఇది !!
Deleteనిజానికి పెళ్ళిని అమ్మాయి ఇంటివద్ద చేయటమూ ఆశుభకార్యానికి పదిమందినీ ఆహ్వానించటమూ వెనుక చాలా ముఖ్యమైన కారణం ఉంది. అది అమ్మాయి వివాహానికి సాక్ష్యంగా ఉండటానికి. అమ్మాయికే ఋజువులూ సాక్షులూ అవసరం కావచ్చును కాబట్టే పెళ్ళిని ఆమె స్వస్థలంలో ఆఊరిలో తెలిసినవారి సమక్షంలోనే జరపటం. ఇందులో ఆర్భాటాల ప్రసక్తి కలవారి వెఱ్ఱివేషాల కారణంగానే తయారయింది.
ReplyDelete