Sunday, August 14, 2022

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే... 10... జెండా పండగ.. ఓ జ్ఞాపకం.. !

 🌺

    స్వాతంత్ర్యదినం, రిపబ్లిక్ దినోత్సవం... ఈ రెండు జాతీయ పండగల రోజుల్లో... ఇప్పుడైతే ఫ్రీగా ఉన్నా గాబట్టి, ఇంటిపట్టునే ఉంటున్నా. కానీ పనిచేస్తున్న రోజుల్లో అయితే ఆ సందడే వేరు !!
      జెండా పండగొస్తోందంటే వారం ముందు నుండే మొదలవుతుంది స్కూల్లో హడావుడి ! హంగామా ! ఎప్పుడూ  పాఠాలు,  చదువుతో సీరియస్ గా  నడిచిపోయే బడి... ఆ కొద్ది రోజులు సరదాగా గడిచిపోవడం... పిల్లలకు అదో ఆనందం !
        నేను స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నప్పుడు దాదాపు పదకొండు సంవత్సరాలు ప్రధానోపాధ్యాయినిగా చేయడం జరిగింది. పేరుకు చిన్న బడులేగానీ.... H.M అంటే రకరకాల బాధ్యతలు తలమీద ఉంటూ ఉండేవి. వాటిల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం కూడా ఒకటి. పాఠశాలలో జాతీయ పండుగల సందర్భంగా జెండా ఎగరవేయడం తప్పనిసరి. 
       స్వతహాగా నాకున్న ఆసక్తి తో పిల్లలకు బాలల గీతాలు, అభినయ గీతాలతో పాటు జెండా పాటలు కూడా నేర్పించేదాన్ని. యు పి. స్కూల్ లో  చేస్తున్న రోజుల్లో 6, 7 తరగతుల విద్యార్థులకు అలా  నేర్పించిన పాటలు వాళ్లు పాడుతుంటే 3, 4, 5 తరగతుల  పిల్లలు  కూడా వింటూ,  వాళ్లూ.... పెద్ద పిల్లలతో కలిసి పాడేవాళ్ళు. అలా  అందరికీ అలవాటై ఆ పాటలన్నీ చిన్న తరగతుల పిల్లలకూ కంఠతా వచ్చేశాయి. భావం తెలీకపోయినా, ఉచ్ఛారణ  దోషాలతోనే అయినా పెద్ద పిల్లలతో కలిసి పెదాలు కదుపుతూ ఉండేవాళ్ళు !
      స్వాతంత్ర దినం రోజు అందర్నీ ఉదయం ఏడింటికల్లా స్కూల్ వద్దకు రావాలని ఆదేశించే వాళ్ళం.. వారం రోజుల నుండీ  తయారుచేసిన రంగు కాగితాల తోరణాల్ని ముందురోజే బడి ఆవరణ అంతా కట్టించి ఉంచేవాళ్ళం. ఉదయం చిన్న చిన్న జాతీయ పతాకాలు పిల్లలందరూ పట్టుకుని, లీడర్స్ ముందు నడుస్తుంటే... వాళ్ళ వెనక మిగతా పిల్లలు వరుసల్లో నడుస్తూ... నేర్చుకున్న పాటలన్నీ గుంపుగా పాడుకుంటూ ఆ పల్లెటూర్లో వీధి వీధి తిరుగుతూ పోయేవాళ్ళు. వాళ్ళ వెనక టీచర్లం మేం కూడా !! ఆ సమయంలో వాళ్ళ కోలాహలం చూసి తీరాల్సిందే !
    వీధుల్లో అలా  వాళ్ళు ఎలుగెత్తి పాడుతూ పోతుంటే... ఇంట్లో ఆడవాళ్లు పనులు ఆపేసి, బయటికి వచ్చి వింతగా  తొంగి చూసే వాళ్ళు ! పంచాయితీ ఆఫీసు అరుగులమీద, రచ్చబండ దగ్గర ఏవో పనులు చేసుకుంటూనో,  పులి - మేక, ఇంకా మరేవో ఆటలు ఆడుకుంటూనో ఉండే మగవాళ్ళు... మా ఈ  పిల్లల హంగామాకు అంతా తలలెత్తి ఓ చూపు విసిరి, మళ్లీ వాళ్ళ పనుల్లో చొరబడేవారు ! ఆ రోజు ఊర్లో జనాల చూపులన్నీ మామీదే!! 
     అలా ఊర్లో కొన్ని ప్రధానమైన వీధులు( ఇరుకు సందులైనా ) అన్నీ ఉత్సాహంగా తిరిగేసి... ఆ పిమ్మట పాఠశాల చేరుకుని అప్పుడు జెండా ఎగరేసేవాళ్ళం. ఆ రోజు ప్రత్యేకత గురించి నాలుగు మాటలు చెప్పాక, అందర్నీ వాళ్ళ తరగతి గదుల్లోకి పంపించి... సిద్ధంగా ఉంచిన బొరుగులు, పప్పులు, బెల్లం లేదా ఒక్కోసారి బిస్కెట్లు పిల్లలందరికీ ఉపాధ్యాయుల సమక్షంలో తరగతి లీడర్లు పంచేవారు. పాటలు పాడుతూ వీధులవెంట తిరుగుతున్నప్పుడూ, ఆ కాస్త తాయిలం తింటున్నప్పుడూ.... చూడాలి వాళ్ళ ఆనందం !!
      ఈ పతాకావిష్కరణ కార్యక్రమం నేను కాలేజీకి వెళ్ళాక... కాలేజీ ఆవరణకు మాత్రమే పరిమితమై మరోలా ఉండేది. కానీ సందర్భం, సంబరం మాత్రం అంతా ఒకటే ! కాకపోతే... చిన్నపిల్లలు  చిన్నపిల్లలే.. పెద్ద పిల్లలు పెద్ద పిల్లలే... అన్నట్లు ఉండేది !
      ఇప్పుడా సందడికి దూరమైనా... ఆ జ్ఞాపకాలు మాత్రం సజీవంగా ఉండి తలపుకొచ్చినప్పుడు... ఆ రోజులు, ఆ శిష్యబృందం మదిలో మెదుల్తూ... అలా కాసేపు ఆ సంతోష ఘడియల్ని నెమరేసుకుంటూ ఉంటాను.  🙂
     ఏదేమైనా... జెండా పండుగలు  మాత్రం దేశమంతా పండగలే ! ఇప్పుడు స్కూళ్లు,  కార్యాలయాలే కాదు... ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం రెపరెపలాడాలి అంటున్నారు మరి  !!

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐




No comments:

Post a Comment