Tuesday, May 3, 2022

ఎంత మార్పు ! ఎంత మార్పు... !

      అరవింద, అమర్ నాథ్ ల పెళ్లయి మూడు నెలలయింది. ఇద్దరూ చెరో  ప్రైవేటు కంపెనీల్లో చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కొత్త సంసారం... ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. ఉదయం వెళ్లడం, సాయంత్రం తిరిగి రావడం... హాయిగా కబుర్లాడుకుంటూ పనులు చేసుకోవడం... కలిసి భోంచేయడం..ఇదీ వాళ్ళ దినచర్య ! ప్రతి ఆదివారం ఖచ్చితంగా ఏదో ఒక సినిమా కు వెళ్ళిపోవడం వాళ్ళ హాబీ. ఇంకా.. సెలవులు, పండగలప్పుడు ఆటవిడుపుగా ఎక్కడికైనా వెళ్లి సరదాగా గడిపి రావడం.. చీకూ చింతా లేకుండా సాగిపోతోంది వాళ్ళ వైవాహిక జీవితం. అన్నింట్లోనూ వాళ్లకు బాగా నచ్చే విషయం ఏంటంటే..ప్రతీ  ఆదివారం వెళ్లే సినిమా ప్రోగ్రాం. ఇద్దరి అభిరుచి అదే కావడం ఇద్దరికీ నచ్చిన మరో అంశం. ఆ రోజుకోసం మరీ మరీ ఎదురుచూస్తుంటారు ఇద్దరూను... థియేటర్ దగ్గరే అయితే హాయిగా నడిచిపోయి నడిచి రావడం.. దూరమైతే రిక్షా ఎక్కడం. వస్తూ  వస్తూ  ఏ హోటల్లోనో ఇష్టమైన టిఫిన్ లాగించి రావడం ! అలా అలా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతున్నాయి రోజులు... 
 🌺  పది  సంవత్సరాల తర్వాత ---
 ఇద్దరు పిల్లలు... ఇద్దరూ ఆడపిల్లలే.. ఉదయాన్నే వాళ్ళను తయారు చేయడం, టిఫిన్లు,  భోజనాలు క్యారియర్లు.. సర్దేయడం.. ఇంకా... తామిద్దరూ తయారవడం.. అబ్బబ్బ ! బేజారయిపోతోంది ఇద్దరికీ. అరవింద అయితే మరీ అలసిపోతోంది. చేతకాక విసుగూ  ఎక్కువైంది పని ఒత్తిడితో. వారానికోసారి వెళ్లే సినిమా ప్రోగ్రాం నెలకోసారి కూడా గగనమైపోయింది. అప్పుడైనా ఓపిక ఉండడంలేదు. ఆదివారం వస్తే చాలు.. పనులు ఇంకా అధికమై పోతుంటాయి. ఇక సినిమా ప్రోగ్రామ్ పెట్టుకున్నారంటే  సాయంత్రం త్వరగా తెమిలి వంటావార్పు చూసుకుని... పిల్లలతో సహా బయట పడేసరికి నీరసం ముంచుకొస్తుంది.  ఇక సినిమా 'ఎంజాయ్' చేసే ఓపికేది? అదయ్యాక తిరిగి ఇల్లు చేరి తినడాలు పూర్తయి, పక్క చేరేసరికి ఏ పదకొండో.. ! తెల్లారి మళ్ళీ హడావుడి.... ! 
" వద్దురా బాబూ ఈ సినిమా.. !"
 అనుకోవడం.. కానీ మరీ ఓ అచ్చటా ముచ్చట.. సరదా,  షికారు... లేకుంటే ఎలా? పిల్లల కోసమైనా తప్పదు కదా.. పైగా మన మధ్యతరగతి జీవితాలకు ఎనలేని సంతోషాన్ని, వినోదాన్నీ ఇచ్చే ఏకైక ఔషధం ఈ సినిమా అన్నదే కదా... ! దాన్నీ  వద్దనుకుంటే ఇక బ్రతుకు నిస్సారమే  కదా! అనిపిస్తుంది ఇద్దరికీ. పోనీ.. ఆ రోజుకు  వంట మానేసి, బయట కానిద్దామా అంటే బడ్జెట్ ససేమిరా ఒప్పుకోనంటే ఒప్పుకోదే.. !అందుకే.. లేని ఓపిక, హుషారు కొనితెచ్చుకోవడం అలవాటు చేసుకున్నారిద్దరూ... 
🌺 -- మరో ఇరవై సంవత్సరాల తర్వాత ---
 ఉద్యోగాల్లో  స్థిరత్వం వచ్చింది. పిల్లల చదువులు పూర్తయి, పెళ్లిళ్లు జరిగిపోయాయి. ఇద్దరే మిగిలారు. మునుపటి హడావుడి లేకపోయినా, ఏదో వెలితి ! తీరిక బాగానే ఉంది... మునుపటి ఉత్సాహమే లోపించింది. సినిమా అంటే ఇష్టం తగ్గలేదు గానీ, మూడు గంటలపాటు కుర్చీల్లో బందీలై కూర్చుని చూడాలంటేనే ఒకింత ఆలోచించాల్సి వస్తోంది. ఎంతైనా వయసు మహిమ !
🌺 మరో పది సంవత్సరాల తర్వాత ---
 చూస్తూ చూస్తుండగానే అరవింద అమర్ నాథ్ ల జీవనయానంలో మరో పది సంవత్సరాలు ఇట్టే దొర్లి పోయాయి. ఇద్దరూ రిటైర్ అయిపోయారు. పిల్లలు వాళ్ల వాళ్ల సంసారాల్తో బిజీ బిజీ.. ఇక వృద్ధ దంపతులు..! అవసరాలకు మించి వచ్చే పెన్షన్ డబ్బులు ! ఒకప్పుడు ప్రతి రూపాయికీ వెతుక్కోవడమే.. ప్రతి పైసా ప్రాణంతో సమానమే..! ఇప్పుడో.. ! చేతినిండా నోట్లే ! కానీ అనుభవించే వయసే  దాటి పోయింది ఇద్దరికీ ! ఎదురెదురుగా కూర్చుని కబుర్లాడుకుంటూ గతాన్ని నెమరేసుకుంటూ ఉండడం  బాగా అలవాటైపోయింది ఆజంటకి ! 
  'కరోనా ' జనజీవనాల్లోకి ప్రవేశించక ముందు ఏ మూణ్ణెల్లకో  ఇద్దరూ బయటపడి ఆటో ఎక్కి,  ఇష్టమైన, చూడాలనుకున్న సినిమా చూసేసి వచ్చేవాళ్లు. కరోనా పుణ్యమాని... అది కాస్తా మూలనపడి పోయింది. అయినా చిత్రంగా..... వాళ్ళు ఆ విషయంలో ఏమాత్రం బాధ పడడం లేదు ! ఎందుకంటే.... నిరంతరం కాలక్షేపాన్ని అందించే టీవీ ఇంట్లోనే ఎదురుగా పుట్టుకొచ్చిందికదా ! 
    అయినా.. క్యూలో కాళ్లు లాగుతున్నా నిలబడి టికెట్స్ కొని ఈ వయసులో మూడు గంటలు ఏకధాటిగా సినిమా చూడాల్సిన బాధ మనకెందుకండీ? పైసా ఖర్చు లేకుండా, బ్రేకు బ్రేకుకీ లేస్తూ ఎంచక్కా  అటూ  ఇటూ తిరుగుతూ... మధ్య మధ్యలో అవీ  ఇవీ  తింటూ... తాగుతూ... హాయిగా కొత్త కొత్త సినిమాలు ఇంట్లోనే చూసే భాగ్యం వచ్చేసిందిగా మనకు..! 
   ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే....
" ఔరా! ఎంత మారిపోయింది కాలం ! అప్పట్లో రిలీజ్ అయిన సినిమా చూడాలంటే ఎంత శ్రమ  పడేవాళ్ళం!ఇప్పుడో ! వారం వారం ఏమిటి,ఓపిక, కంటి చూపు బాగుండాలే గానీ... ప్రతీ రోజు కొత్త సినిమానే కదా! అదీ  ఇంట్లో తాపీగా  కూర్చుని ! ఎంత మార్పు ! చిన్న మార్పు కాదిది ! పెను మార్పు! "
  అరవింద అమర్ నాథ్ ల  చర్చల్లో ఎప్పుడూ ప్రముఖంగా దొర్లేదీ ఈ అంశమే !
" అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు! ఎంత మార్పు!"
అని !
  ఓరోజు అమర్ నాథ్  సాలోచనగా అరవింద నే చూస్తూ, 
" అయినా, ఈ మార్పు అన్నది ఒక్క  సినిమా విషయంలోనే అంటావా అరవిందా.. ఎన్నింటి లో లేదంటావు చెప్పు..? చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది... కాదంటావా!"
అన్నాడు. 
" అవును సుమండీ! మన పెళ్లయిన కొత్తలో అందరూ మనల్ని చూసి  ముచ్చటైన జంట అనుకునే వాళ్ళు కదా! ఓ పదేళ్లు గడిచాక కొందరు నన్ను 'అక్కా అక్కా'అని పిలిచేవాళ్ళు. నలభై దాటాక ఇద్దర్నీ ఆంటీ, అంకుల్ అనడం  మొదలెట్టారు...ఇదీ  మార్పే  కదా.. "
 నవ్వుకున్నారిద్దరూ. 
" ఇప్పుడు అరవై  దాటాయా ఇద్దరికీ.. బయట నా తెల్ల జుట్టు  చూసి కొందరేమో 'తాతా ' అంటున్నారు తెలుసా..."
అందుకున్నాడు అమర్ నాథ్. 
"... నన్ను కూడా నండోయ్... కూరగాయలమ్మే వాడు మొన్న నన్ను, అవ్వా రెండు రూపాయలు చిల్లర ఉంటే ఇవ్వు...అన్నాడు తెలుసా... "
భారంగా మారిన శరీరాన్నీ, తలపై మెరుస్తూన్న వెండి తీగల్ని తడుముకుంటూ, బుగ్గలు నొక్కుకుంటూ అంది అరవింద. కిసుక్కున నవ్వాడతను. 
" కాలం తో పాటు ఎన్నెన్నో మారాయి అనుకుంటాం గానీ మన శరీరాల్లో కూడా ఎన్నో మార్పులొస్తూనే ఉంటాయి.... కాకపోతే గమనించుకోము.. అంతే..  "
ముసి ముసిగా నవ్వుతూ అన్నాడు అమర్ నాథ్. 
" నిజమే కదా !"
అంటూ లేచింది అరవింద. 
                     😊😊😊😊😊😊😊




No comments:

Post a Comment