Tuesday, May 31, 2022

జనరేషన్ గ్యాపండీ బాబూ... !

   " జగతీ టీచర్, మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు ", 
అంటూ వచ్చింది అటెండర్ భాగ్యమ్మ. 
"హు !ఎందుకో ఏమిటో... "
ఒకలా మొహం పెట్టి లేచి వెళ్ళింది జగతి. 
ఓ అయిదు నిమిషాల తర్వాత వచ్చి, 
" భలే పనులు చెప్తారు... చేసే వాళ్ళుంటే.... "
అంటూ కూర్చుంది. పక్కనే ఉన్న జగదీశ్వరి, 
"  ఏమిటి జగతీ "అనడిగింది. 
" చూడండి మేడం, ఏదో మెటీరియల్ రఫ్ కాపీ ఇచ్చి, దాన్ని ఫెయిర్ కాపీ రాసిమ్మంటోంది... నా హ్యాండ్ రైటింగ్ బాగా ఉంటుందట.. స్కూల్ వర్క్ చేయడానికే టైం ఉండటం లేదు, ఈ అదనపు వర్క్ చేయమంటే ఎలా చెప్పండి?... అందుకే సింపుల్ గా నో చెప్పి వచ్చాను, నా రైటింగ్ పెద్దగా బాగుండదు మేడం అంటూ... ఇలా ఒకసారి చేశామనుకోండి మొహమాటానికి పోయి.... ఇక అదే అదనుగా చేసుకుని మళ్లీ మళ్లీ అప్పగించేస్తారు...."
 ఆశ్చర్యపోవడం జగదీశ్వరి వంతయింది. ఆమె ఆలోచనలు పాతికేళ్లు వెనక్కి వెళ్ళాయి. అప్పుడో ప్రైవేటు స్కూల్లో చేసేది తను. ఏ రిటన్  వర్క్ ఉన్నా తనని పిలిచి అప్పగించేది ప్రిన్సిపాల్ మేడం.
" మీ రైటింగ్ చాలా చక్కగా, తప్పుల్లేకుండా ఉంటుందమ్మా జగదీశ్వరీ, ఇది కాస్త నీట్ గా రాసి తీసుకురా.."
అనేది. అదో కాంప్లిమెంట్ లా భావించేది తను. స్టాఫ్ అందరిలోనూ తనని ప్రత్యేకంగా చూస్తున్నట్లు అనిపించేది తనకు. రాత్రి పనులన్నీ అయ్యాక కూర్చుని రాసి, మరుసటి రోజుకంతా  అప్పగించేది. అంతే గానీ అదో అదనపు 'బర్డెన్' గా తలచేదే  కాదు.
   జగతి జాబ్ లో చేరి ఆరు నెలలు కూడా కాలేదు. నిజంగానే తన రైటింగ్ చాలా బాగుంటుంది.ఒకటి రెండు సార్లు తను కూడా మెచ్చుకుంది.  తననే కాదు, ఇంకా చాలా మంది యంగ్ స్టర్స్ ను చూస్తోంది ఇలా.  వర్క్ అంటే భారం గా భావించడం, ఎలా తగ్గించుకుందామా అని ఆలోచిస్తూ ప్లాన్స్ వేయడం, అతి సులభంగా అబద్ధాలాడేయడం!అతి తెలివిగా మాట్లాడడం   ! చూడబోతే అంతా కొత్తగా జాబ్స్ లో చేరిన వాళ్లే !
New broom sweeps well అంటారు. ఈ వయసులో ఎంత ఉత్సాహంగా ఉండాలి !ఇంకా ఇంకా పని చేయాలన్న తపన వాళ్లలో లేకపోగా ఎప్పుడెప్పుడు స్కూల్ టైం అవుతుందా, ఎంత త్వరగా ఇల్లు చేరతామా అన్నట్లు ఉంటోంది వాళ్ళ ధోరణి ! ఇలా జగదీశ్వరి ఆలోచనల్లో ఉండగా, బెల్ మోగింది. వర్తమానంలోకి వచ్చి పడింది తను.
    సుజాత టీచర్ క్లాస్ నుండి వచ్చింది. తన సీట్లో కూర్చుంటూ, 
" ఏంటి జగతీ, ఈరోజు షాపింగ్ కి రెడీయేనా? "
అనడిగింది జగతి వేపు కళ్ళెగరేస్తూ 
" ఓయస్, లాస్ట్ పీరియడ్ అవగానే ఇట్నుంచిటే  వెళ్దాం.. "
 అంటూ లేచి క్లాసుకు  బయలుదేరింది. ప్రతినెలా ఒకటో తారీకు జీతాలు అందుకోవడం,  రెండో తేదీన షాపింగ్ కి వెళ్లడం, ఒకటో రెండో చీరలు, వాటితో పాటు నచ్చిన వస్తువులు కొనుక్కోవడం, రోజుకో రకం చీర కట్టడం... ఎలా సాధ్యమవుతోంది వీళ్ళకి !!
" సుజాతా, మీరిద్దరూ అత్తగారింట్లో కలిసే ఉంటున్నారుకదా, మీ శాలరీస్ గురించి వాళ్లేమీ అడగరా? "
ఉండబట్టలేక ఎన్నాళ్ల నుంచో అడగాలనుకుంటున్న ప్రశ్న సుజాతనడిగేసింది జగదీశ్వరి.
" ఎందుకడుగుతారు మేడం? మా హస్బెండ్స్  శాలరీ ఎలాగూ  వాళ్ళకు ఇస్తారాయె. అయినా లేదనకుండా అప్పుడప్పుడూ  ఏదో కాస్త ఇస్తూనే ఉంటాం లెండి. నెలంతా ఇంత కష్టపడి సంపాదించిందంతా వాళ్ల చేతిల్లో  పెడితే మనకెవరు ఇస్తారండీ ! మనకూ అవసరాలంటూ  ఉంటాయి కదా. వాటికోసం మళ్లీ వాళ్లను దేబిరించాలంటారా... ఏమంటారు? "
 అని తిరిగి తననే ప్రశ్నించింది సుజాత. ఆ చురుకైన చూపులు చూసి నోరెళ్ళ బెట్టింది జగదీశ్వరి. తన వయసులో సగం కూడా లేని ఆ  అమ్మాయి మాటలు ఎక్కడో చురుక్కుమనిపించి, తొలిసారి... అదీ చాలా... చాలా ఆలస్యంగా జ్ఞానోదయమైన ఓ అజ్ఞానిలా తెల్లబోయి  చూసింది క్షణ కాలం ! మరుక్షణమే 'నిజమే సుమీ' అనుకోకుండా ఉండలేకపోయింది. 
     అప్పట్లో పెళ్లయ్యాక అత్తమామలు, ఆడబిడ్డలు, మరదులు...ఇలా అందరి తోటి కలిసే  ఉండేది తాను. వచ్చిన జీతమంతా తీసుకెళ్లి భర్త చేతిలో పెట్టడం, ఆయన గారేమో మరుక్షణమే అది కాస్తా పట్టుకెళ్ళి తల్లి చేతిలో పెట్టేయడం ! ఓ పది రూపాయలు అయినా తనకోసం  ఉంచుకోవాలని తాననుకోక పోవడం ! కనీసం భర్త క్కూడా తన చేతిలో ఇంత పెట్టాలి అన్న ఆలోచన రాకపోవడం ! అయినా తను పల్లెత్తు మాట నోరు తెరిచి'ఇదేమిటి'అని అడక్కపోవడం ! ఏదైనా అవసరమైతే తిరిగి  వాళ్లని అడగాల్సి రావడం! ఎంత అమాయకంగా ఉండేది ఆ రోజుల్లో! అయినా గుర్తింపు శూన్యం. ఒక్క ప్రశంసా వాక్యానికి కూడా నోచుకునేది కాదు. అదేదో కోడలి సంపాదన తమ జన్మహక్కుగా భావించే వాళ్లంతా. పైగా, 
" ఇది నీ బాధ్యత. అందరూ చేసేదేగా, "
 అంటూ నీవేమీ ప్రత్యేకం కాదు అన్నట్లు మాట్లాడడం!తన సహనాన్నీ, మంచితనాన్నీ ఇంటాబయటా అంతా బాగా వాడుకున్నవాళ్లే. ఇప్పుడు వీళ్ళందర్నీ చూస్తుంటే, 
"ఈ తెలివి నాకెందుకు లేకపోయింది? "
అన్న బాధ ఆమెను తొలిచి వేస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ తరం వాళ్ళను చూస్తుంటే ఒకింత ఈర్ష్య గానూ లోలోపల ఫీలవుతూ ఉంటుంది. 
    ఇదే విషయం తన ఈడుదే  అయిన సోషల్ స్టడీస్ టీచర్ లలితాంబ తో ప్రస్తావించింది ఓసారి. 
" లలితా, వీళ్ళు ఇలా ఉంటున్నారే ! మనం వాళ్ళలా  ఎందుకు లేకపోయామంటారూ? "
తనూ ఇంచుమించు తన లాంటి బాధితురాలే ! ఆమె వెంటనే, 
" అయ్యో,  జగదీశ్వరీ, జనరేషన్ గ్యాపండీ బాబూ ! అప్పటి తరం వాళ్ళం అన్నింటికీ తలలూపుతూ, ప్రతిదానికీ  తలదించుకుంటూ, ఎవర్ని ఏమంటే ఏం ముంచుకొస్తుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ నోరు మూసుకుని కాలం వెళ్లదీశాము. ఇప్పటి వాళ్ళు మనకు పూర్తిగా వ్యతిరేకం. ఇంట్లో పెద్ద వాళ్లే వాళ్లకు అణిగిమణిగి ఉండాల్సి వస్తోంది..."
"... అయినా,  జగదీశ్వరీ.. మనం పిచ్చివాళ్ళం గానీ, మన కాలంలో మాత్రం తెలివిగా, గడుసుగా ఉన్న వాళ్ళు లేరంటారా ! ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి... పని  తప్పించుకుని తిరిగే వాళ్ళు ఇప్పుడే కాదు అప్పుడూ ఉన్నారు. ఔనా, కాదా? అలాగే సిన్సియర్ గా  చేసేవాళ్ళు ఇప్పుడూ అక్కడక్కడా  కనిపిస్తూనే ఉంటారు.కాదంటారా?... "
 దాంతో జగదీశ్వరి కి చప్పున  స్ఫురించింది.  అప్పట్లో తనతోపాటు పని చేసేవాళ్ళలో  కొందరి హ్యాండ్ రైటింగ్ బాగానే ఉండేది. కానీ తనకు మాత్రమే రిటన్ వర్క్ అప్పజెప్పేది ప్రిన్సిపల్. దానికి కారణం తను వేరేగా ఊహించుకుని  సంబరపడింది. కానీ నిదానంగా అసలు విషయం బోధపడింది.ఆసరికి పుణ్యకాలం కాస్తా గడిచేపోయింది. అది గుర్తొచ్చి....
"  నిజమే సుమీ !" అనుకుంది. వెంటనే ఏదోతట్టి, 
" అయినా, లలితా, జనరేషన్ గ్యాప్ అన్నది వాస్తవమే. కానీ కాలంతో సంబంధం లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా.. వారి వారి నైజాల్ని బట్టి కూడా మనిషి ప్రవర్తన ఉంటూ ఉంటుందని నాకనిపిస్తుంది..."
 సాలోచనగా అంది.
" అవునవును.. అదీ నిజమే..... "
 ఏకీభవించింది లలితాంబ.. 
                 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷








No comments:

Post a Comment