Saturday, June 5, 2021

'కరోనా ' సోకని కరోనా బాధితులు

      ' కరోనా ' మహమ్మారి ఈ భూతలాన్ని ఆక్రమించి మానవాళినంతా అతలాకుతలం చేసి ఎన్నడూ కనీవినీ ఎరుగని చేదు అనుభవాల్ని మిగిల్చింది. ఎందర్నో  బలి తీసుకుని ఎన్నో కుటుంబాల్ని కృంగదీసి కోలుకోలేని దెబ్బ తీసింది.ఇదో ఊహించని ఉత్పాతం! ఏమాత్రం అనుకోని అశనిపాతం. ప్రశాంతంగా ఉండే సరస్సులో ఓ రాయి విసిరితే అక్కడ అలజడి  ఎలా ఉంటుందో అలాంటి స్థితి ప్రపంచాన్ని కమ్మేసింది. సరస్సు కాసేపటికి మునుపటి స్థితి పొందుతుంది. కానీ, కరోనా కనీవినీ ఎరుగని రీతిని పాకిపోయి అందరి అంచనాలను తలకిందులు చేసేసింది. ఇక అయిపోయింది లే అనుకొని కాస్త ఊపిరి పీల్చుకుందాం అనుకున్నామో లేదో అంతలోనే హఠాత్తుగా మళ్లీ పుట్టుకొచ్చింది. ఇది సెకండ్ వేవ్ అట ! మొదటిసారి కంటే ఉధృతంగా   వచ్చేసింది. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు.  వైరస్ తో విగతజీవులుగా అవుతున్నవారి సంగతి సరే, అది  సోకని వారు కూడా దాని తాకిడికి బలై తీవ్రంగా నష్టపోతున్నారు. వీళ్లంతా కరోనా సోకకున్నా దాని తాలూకు బాధితులే. ఎవరెవరంటే ----
* వ్యాపారస్తులు :  చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు వ్యాపారస్తులూ బేరాలు లేక ఆర్థికంగా నష్టపోతున్నవాళ్లే. లాక్ డౌన్ వల్ల పరిమిత సమయమే వారి వ్యాపారానికి దక్కుతోంది. కొనే వాళ్లూ బాగా తగ్గిపోయారు, బయటకు రావడానికి, గుంపుల్లో కలవడానికీ భయపడుతూ. కూరగాయల వ్యాపారుల పరిస్థితీ అంతే. చిన్నాచితక వ్యాపారాలు చేసుకునే వాళ్ళ పరిస్థితి మరీ దయనీయమైపోయింది. 
* చిరుద్యోగులు :  ప్రైవేటు సంస్థల్లో పని చేసేవారు, ముఖ్యంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు బడులు మూతబడి జీతాలు అందక కుటుంబం జరిగే దారిలేక కూరగాయల వ్యాపారులు గా కూడా మారిన వైనాలు వార్తల్లో చదివాం, చదువుతున్నాం. ఫస్ట్ వేవ్ లో సగం జీతాలన్నా  ఇచ్చే పాఠశాల నిర్వాహకులు ఇప్పుడు అది కూడా మానేసి నట్లు ఉన్నారు. పాఠశాలలు మూతబడి, ఫీజులు లేక, ఆదాయం కరువై వాళ్లు మాత్రం ఎంతకాలమని జీతాలు ఇవ్వగలరు? మరి వీరంతా కరోనా సోకని కరోనా బాధితులే  కదా!
* విద్యార్థులు : లాక్ డౌన్ వల్ల పాఠశాలలు, కళాశాలలు మూతబడి పోయి, చదువులు  చతికిలబడి పోయాయి. ఆన్లైన్ పాఠాలు అటకెక్కేశాయి. అయినా ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలంతా స్మార్ట్ ఫోన్లు వినియోగించే స్థాయి  ఎక్కడిది మనకు? ఇదివరకు తెల్లారగానే చకచకా లేచి తయారై, ఉల్లాసంగా, ఉత్సాహంగా బడికి ఉరికే పిల్లలు ఇప్పుడు ఆ సమయం లో బద్ధకంగా, నీరసంగా డీలా పడిపోయి కనిపిస్తున్నారు. బడి లేకుంటే ఆనందమే పిల్లలకు. కానీ ప్రతీ రోజు లేకపోతే ఎలా? ఏదో కోల్పోయిన భావనవాళ్ల ముఖాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అలాగే కళాశాలలకు వెళ్లే వయసు పిల్లలకు వారి భవితవ్యం ఏమిటో అవగతం కాక మ్రాన్పడిపోతున్నారు. 
* ఉద్యోగార్థులు :  చదువుపూర్తయి ఉద్యోగాన్వేషణలో ఉన్న వాళ్ళ పరిస్థితి మరీ ఘోరంగా అయిపోయింది. వ్యవస్థలన్నీ సజావుగా నడుస్తుంటే కదా, ఉద్యోగ ప్రకటనలూ, నియామకాలు! ఇంకా, ఉద్యోగాలు ఉండీ ఊడి పోయినవాళ్లు, పనిచేసినా జీతాలు రానివాళ్లు  కుటుంబం గడవక ఇబ్బందులు పడుతున్నవాళ్ళు లెక్కకు మించే ఉంటున్నారు. ఎవరైనా ఎంతని, ఎన్నాళ్ళని సహాయపడగలరు? వీళ్లంతా మరో రకమైన కరోనా బాధితులే. 
* వలస కూలీలు: ఉన్న ఊర్లో పనులు లేక ఎక్కడో దూర ప్రాంతాలకు కుటుంబాలతో పాటు తరలి వెళ్లి జీవనోపాధి వెతుక్కుని బ్రతుకులీడుస్తున్న వీళ్లు కరోనా మహమ్మారి పుణ్యమాని లాక్ డౌన్ ల వల్ల ఉపాధి కోల్పోయి పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మనసున్న వాళ్లంతా వీళ్ల దుస్థితికి చలించి ఎన్నో సహాయ కార్యక్రమాలు కూడా చేపట్టడం గత సంవత్సరం చూశాము. పూటగడవాలంటే పని చేయాలి, పని చేద్దాం అంటే దొరకదు. అలా ఉంది ఈ వలస జీవుల ప్రస్తుత దీనావస్థ ! 
* అనాధలై పోయిన బాలలు : ఇంతటి దయనీయ స్థితి మునుపెన్నడూ చూసి ఉండము. తల్లిదండ్రులిద్దరూ కరోనా కాటుకు బలైపోయి హఠాత్తుగా మరణిస్తే, దిక్కులేక అనాధలుగా మారిన అభాగ్యులీ చిన్నారులు ! ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నా నా అన్న వారు లేని బ్రతుకు శూన్యమే కదా! పగవారికి కూడా ఈ  దుర్గతి రాకూడదు. 
ఇక -- 
* గృహిణులు  :  వీరిది మరో రకం సమస్య. ఇది కూడా సమస్యేనా అనేవాళ్ళు ఉండొచ్చు. కానీ ఇది బయటికి కనిపించని బాధ!  కరోనా భయంతో అంతా ఇంట్లోనే ఉండడంతో ఇల్లాలికి పని వత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. ఇదివరకైతే పిల్లలు, భర్త బయటకెళ్ళిపోతే పని తర్వాత ఇల్లాలికి కాస్త తీరిక సమయం చిక్కేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంట్లో పిల్లల అల్లరి భరించడం ఒక ఎత్తయితే, ఇంటిల్లిపాదికీ వండివార్చడం, వడ్డించడం, అన్నీ  కూర్చున్నచోటికే అందించడం ఒక ఎత్తు. వంటే కదా, అదీ కష్టమేనా అంటారేమో ! అలా అనేవాళ్ళని  ఓ వారం... కనీసం ఓ మూడు రోజులు మూడు పూటలా అందరికీ వంట చేసి పెట్టమనండి తెలుస్తుంది. జన్మలో మళ్ళీ ఆ మాట అనరు !గృహిణికి ఒక్క వంట పనేనా, రకరకాల పనులు ఎన్నెన్నో. రాస్తే పెద్ద లిస్టే అవుతుంది.  ఇదివరకైతే పనులయ్యాక ఇరుగూ పొరుగుతో కాసేపు కబుర్లతో మనసు తేలికపరుచుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ వెసులుబాటేదీ? బొత్తిగా ' ప్రైవసీ ' అన్నది కరువై అన్నింటికీ నోటికి తాళం వేసుకొని ఉండాల్సి వస్తోంది. ఈమధ్య దినపత్రికలన్నీ ఈ విషయమే ఘోషిస్తున్నాయి. ఇంట్లో భర్త, ఇతర కుటుంబ సభ్యుల వేధింపులు ఎక్కువై గృహహింసకు దారి తీస్తున్నాయని ! తద్వారా మానసిక ప్రశాంతత కోల్పోయి, మెదడుపై వత్తిడి పెరిగి, అందరిమీదా చీటికీ మాటికీ అరిచేస్తూ, ఎంత సహనశీలురైనా బి. పి పెంచేసుకుంటున్నారట ! నేను చెప్పొచ్చేదేమిటంటే, ఈ కరోనా బాధితుల్లో పై అందరితో పాటు గృహిణుల్ని కూడా చేర్చాల్సిఉంటుందని !
--- అందుకే అంటున్నా, వీళ్లంతా కరోనా బారిన పడకున్నా దాని ప్రభావం సోకి కరోనా బాధితులై పోయారని ! 
  ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరి జీవితాల్ని కమ్ముకున్న ఈ కరోనా మబ్బులు ఎప్పటికి తొలగిపోతాయో? ఎప్పుడు పూర్వపు స్థితి వచ్చి స్వేచ్ఛగా, ఇంటా బయటా అందరం కలిసి భయమన్నది లేకుండా తిరుగుతామో? 

****************************************
            🌺 భువి భావనలు 🌺
****************************************









No comments:

Post a Comment