కొందరికి ఊతకర్ర నడకకు ఎలా ఊతమిస్తుందో మరికొందరికి ఊతపదాలూ అంతే. అది లేకుండా వారి సంభాషణ కొనసాగదు కూడా. మన తెలుగు సినిమాల్లో అలాంటి ఊతపదాలతో బాగా పాపులర్ అయిపోయిన నటీనటులు ఎందరో ఉన్నారు. అలాంటి ఊతపదాలు ఆయా నటీనటుల గురించి సరదాగా కాసేపు ముచ్చటించుకుందాం. 😊
🙂 గుమ్మడి గారు : రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన 'పెళ్లి పుస్తకం ' లో ఈయనదో తరహా. ఏదైనా విషయం ఎవరి దగ్గరైనా ప్రస్తావించదలచుకున్నప్పుడు ఆ విషయం ఏదైనా సరే ముందుగా, 'నేనూ.... ' అంటూ సాగదీసి ప్రారంభిస్తాడు.ఆ 'నేను ' కూ చెప్పబోయే విషయానికి ఏ మాత్రం సంబంధం ఉండదు. అది ఆయన ఊత పదం అంతే. ఈ సున్నితమైన హాస్యం ఇలా కూడా హాస్యం పుట్టించొచ్చన్నమాట అనుకునేలా చేస్తుంది. అది బహుశా బాపుగారి దర్శకత్వ ప్రతిభ కావచ్చు.
😊 ఆదర్శ కుటుంబం : ఇందులో నాగభూషణం గారు ఓ కన్ఫ్యూజింగ్ పర్సనాలిటీ. తాను కన్ఫ్యూస్ అవుతూ అందర్నీ కన్ఫ్యూజ్ చేసే రకం! " తమ్ముడూ, నీవు కన్ఫ్యూజ్ అవుతూ నన్ను కన్ఫ్యూజ్ చేయకు, " అంటుంటాడు. ఆయన అమాయకపు నటన ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది.
😊 మాయాబజార్ సినిమాలో దుశ్శాసన పాత్రధారి పక్కనున్న శకునితో " మామా, మన తక్షణ కర్తవ్యం..? " అంటుంటాడు ఆవేశంగా.
🙂 ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు గారి " అల్లో అల్లో అల్లో " అనే ఊతపదం ఈనాటికీ ఎవ్వరూ మరిచిపో లేదంటే అతిశయోక్తి కాదు. అలాగే" చరిత్ర అడక్కు చెప్పింది చెయ్ " కూడా అలాంటిదే.
😊 హాస్యానికి మారుపేరుగా నిలిచిన రేలంగి గారు ఓ పాత తెలుగు సినిమాలో ' జంబలకిడిపంబ ' అనే ఊతపదం వాడుతుంటాడు. తర్వాతి రోజుల్లో ఇ. వి. వి. సత్యనారాయణ గారి దర్శకత్వంలో అదే పేరుతో వచ్చిన చిత్రం జనాల్ని హాస్యపు జల్లులో ముంచెత్తివేసింది. ఓ ఊతపదం తో సినిమా రావడం ఓ విశేషమైతే అది ఘనవిజయం సాధించడం మరో విశేషం.
😊 నా రూటే సపరేటు అంటూ మోహన్ బాబు గారు సృష్టించిన ట్రెండ్ చెప్పనలవి కాదు.
😊 ఎన్న చాట-- వినిపిస్తే చాలు నవ్వులు విరబూస్తాయి. అలీ కనిపిస్తే చాలు చాట, ఎన్న చాట అంటే అలీ గుర్తుకొచ్చి తీరాల్సిందే. రాజేంద్రుడు గజేంద్రుడు.. సినిమా వచ్చిన కొత్తలో చిన్న పిల్లలు కూడా అలీ కనిపిస్తే చాలు' అదిగో చాటగాడు ' అనేవాళ్ళట ! అలీ స్వయంగా ఓ ఇంటర్వ్యూలోఎంతో సరదాగాఈ విషయం ప్రస్తావించడం చూసాను.
🙂 తొక్కలో, నీఎంకమ్మ -- ఈ పదాలు జనబాహుళ్యంలోకి ఎంతలా చొచ్చుకుపోయాయంటే -- ఆడా మగా తేడా లేకుండా అడపాదడపా ఈ పదాలు వాళ్ళ సంభాషణలో దొర్లుతున్నాయి మరి ! ఇవి బ్రహ్మానందం గారి ఊతపదాలని ప్రత్యేకించి చెప్పక్కర్లేదనుకుంటా.
😊 ఔను, వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు -- లో ' నేనొప్పుకోను... ఐతే ఓ. కే ' అంటూ మొదటి సిన్మా తోనే చక్కటి గుర్తింపు తెచ్చు కున్నాడు కొండవలస !
😊 బొబ్బిలి రాజా లో వెంకటేష్ 'అయ్యో అయ్యో అయ్యయ్యో ' అంటూ నవ్విస్తాడు.
🙂 రేసుగుర్రం లో అల్లు అర్జున్' దేవుడా ' అని పలికే తీరు సన్నివేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కంఠం మార్చి రకరకాలుగా ఆ పదం పలికే తీరు' వారెవ్వా ' అనిపించక మానదు. ఇదే మాట' క్షణక్షణం ' లో స్వర్గీయ శ్రీ దేవి ఆమె టెన్షన్లో ఉన్నప్పుడు' దేవుడా, దేవుడా, దేవుడా' అంటూ అమాయకంగా ఉచ్ఛరించే తీరు ఎంతో ఫన్నీ గా ఉంటూ నవ్విస్తుంది.
🙂 ఇటీవల వచ్చిన F2 చిత్రంలో ' అంతేగా అంతేగా' అంటూ భార్య చాటు భర్తగా ప్రదీప్ చెప్పే డైలాగ్ ఎంతగా ఆ ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోయిందో తెలిసిందే. సినిమా మొత్తం మీద ఆ రెండే పదాల డైలాగ్ ఉన్న ఆ నటుడు సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ఆ దెబ్బతో' అంతేగా అంతేగా' పిచ్చ పాపులర్! ఒక్కసారిగా ఈ "ముద్దమందారం" హీరో అందరి దృష్టిలో కొచ్చిపడ్డాడు.
🙂 కామెడీ, విలనీ బహుచక్కగా చేస్తూ అప్పట్లో ఓ వెలుగు వెలిగిన సుధాకర్ ' పిచ్చకొట్టుడు ' ఎవరూ మర్చిపోయి ఉండరనుకుంటా.
🙂 ' చంటబ్బాయ్ ' లో చిరంజీవి ఏదైనా చెప్పాలనున్నప్పుడు రెండు చేతులూపుతూ 'వెల్... ' అంటూ మొదలిడతాడు. అదాయన ఊతపదం మరి !
ఈ ఊతపదాల విషయానికి వస్తే నటీమణులు కూడా తక్కువేం తినలేదండోయ్.
🙂 అక్కా చెల్లెలు-- ఈ సినిమాలో షావుకారు జానకి అయ్యో రామా అంటూ సందడి చేయడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
🙂 శుభలగ్నం ' లో ఆమని అప్పుడప్పుడూ సందర్భానికి తగ్గట్టు' ఏమిటో ' అంటూ అదోలా ఎక్స్ప్రెషన్ ఇస్తుంటుంది.
😊 బాబూ చిట్టీ.. అనగానే నటీమణి శ్రీలక్ష్మి గుర్తుకు రాకమానదు. బాబూ చిట్టీ.. అనగానే ఓ రకమైన sad music రావడం భలే తమాషాగా ఉంటుంది. ఈనాటికీ ఆవిడ కనిపిస్తే' బాబూ చిట్టీ ' అనకుండా ఉండలేరెవ్వరూ.
🙂 ఆ తర్వాతి తరంలో వచ్చిన తారలు-- ' స్వయంకృషి'లో విజయశాంతి ' అట్టా సూడబాకయ్యా ' అంటూ అదోలా చూడ్డం -- ' స్వర్ణకమలం' లో భానుప్రియ' అర్థం చేసుకోవూ ' అంటూ కళ్ళు, తల తిప్పుతూ రకరకాలుగా పలకడం అందరికీ గుర్తుండే ఉంటుంది.
🙂 ఇటీవల వచ్చిన' సరిలేరు నీకెవ్వరు' లో నాయిక రష్మిక " నీకర్థం అవుతోందా?.. " అనే ఊతపదం జనాల్లోకి బాగా చొచ్చుకుపోయి కొందరైతే ఏదైనా విషయం చెప్పి వెంటనే ఎదుటి వాళ్ళతో నీకర్థం అవుతోందా, అని అనడం కూడా మొదలెట్టారు మరి! అలాగే F2 లో మెహరీన్ honey is the best కూడా బాగానే ఆకట్టుకుంది.
ఇకపోతే -- కొందరు నటుల డైలాగ్స్-- వాటిని ఊతపదాలు అనవచ్చో లేదో నాకు తెలియదు గానీ, జనాల్లోకి మాత్రం బాగా చొచ్చుకుని పోతుంటాయి. వాటిలో కొన్ని--
😇 రజనీకాంత్-- 'బాషా ' లో -- ఈ బాషా ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్లు.
*నాన్నా, పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది.
పై మాటలు బయట కూడా వాడుతున్నారు కదా !
* చూడూ, ఒకవైపే చూడు రెండోవైపు చూడాలనుకోకు
--బాలకృష్ణ
* అగ్గిపెట్టుందా? -- అగ్ని పర్వతం చిత్రం లో సూపర్ స్టార్ కృష్ణ.
* చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో
-- చిరంజీవి
* హ, హ.. అంటూ భుజాలు కదిలించడం
సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అంతే తేడా
-- పవన్ కళ్యాణ్
ఇలాంటివి ఇంకా చాలానే ఉంటాయి. నాకు గుర్తున్నవీ, తట్టినవి మాత్రమే రాయగలిగాను.
--- ఇంతకీ, ఈ ఊతపదాలన్నవి, అవటానికి రెండు మూడు పదాలే గానీ నటీనటులు వాటిని పలికే తీరు, ఆ పదాల విరుపు, ముఖంలో హావభావాలు వారి నటనా కౌశలానికి అద్దం పడతాయి. అవే వారిని పది కాలాల పాటు అందరూ గుర్తుంచుకోవడానికి దోహదం చేస్తున్నాయి కూడా.
--- సినిమాల్లోనే కాదండోయ్, నిత్య జీవితంలో కూడా మనకు తెలిసిన వాళ్ళు కొందరు ఊత పదాలు వాడటం చూస్తూనే ఉంటాము.
' ఊ.. ' అంటూ మొదలెడతారు కొందరు,
' అది కాదూ ' అంటూ మరికొందరు,
' అది సరే గానీ...' అంటూ ఇంకొందరు,
' నేనేమంటానంటే.. ' అంటూ, అలా అలా అన్నమాట. 😊
గమనిస్తే, ఇలాంటివి ఇంకా ఎన్నో మన దృష్టిలోకి వస్తాయి కూడా.
-- ఇంతకీ, ఈసినిమా కబుర్లేంటి-- అంటున్నారా?
ఎందుకంటే -- మనం రోజు వార్తాపత్రికల్లో, టీవీల్లో రకరకాల దారుణాలు చూస్తుంటాం, చదువుతుంటాం. కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, మారణకాండలు, రాజకీయాలు, రచ్చలు, కుమ్ములాటలు-- ఇవి చాలవన్నట్లు మానవ తప్పిదాలతో భయంకరంగా ప్రబలి పోయిన కాలుష్యం, వీటికి తోడు కొత్తగా వచ్చి చేరి విజృంభిస్తున్న అంతుపట్టని వైరస్ రోగాలు-- ఒకటేమిటి, వీటన్నింటితో వేడెక్కిపోతున్న మన బుర్రలకు కాస్త రిలాక్సేషన్ కోసం ఇలాంటి తేలికైన, సరదా అయిన సమాచారం అప్పుడప్పుడూ చాలా అవసరం. అందుకే ఇదంతా, కాదంటారా! ( ఇక్కడ తేలికైన అంటే అర్థం చేసుకోవడానికి మెదడు పెద్దగా శ్రమించ నవసరం లేని సమాచారం అని గ్రహించ మనవి 🙏 )
******************************************
🌹 భువి భావనలు 🌹
******************************************
baavundi,inkaa ilaantivi vraayandi
ReplyDeleteThank you very much.
ReplyDelete