Friday, April 2, 2021

విలువలు......?

 * ప్రస్తుత సమాజంలో విలువలన్నవి పూర్తిగా దిగజారిపోయాయి. 
* అందరూ విలువలతో కూడిన నడవడిక అలవరచుకోవాలి. 
* పాఠశాలల్లో విలువల గురించి నేర్పించాలి. 
---- ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తూన్న మాటలివి. అసలు' విలువలు' అంటే ఏమిటి? 
+ మూడేళ్ల పసిపాపపై కామాంధుని అత్యాచారం !
+ ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లో చొరబడి ముగ్గురు 
   యువకుల అఘాయిత్యం ! 
+ భర్తతోపాటు బైక్ మీద పోతున్న యువతిపై దాడి.
+ ఢిల్లీలో గ్యాంగ్ రేప్ కు గురైన వైద్య విద్యార్థిని చికిత్స
   పొందుతూ మృతి! 
ఇవి కొన్ని మాత్రమే. ప్రతీరోజు పేపర్లలో వస్తున్న వార్తలు వందలు, వేలల్లోనే ఉంటాయి. న్యూస్ పేపర్లకెక్కనివి మరెన్నో !

    ప్రతిరోజూ వింటున్న ఈ అమానుష సంఘటనలు తలుచుకుంటూ ఉంటే గుండె జలదరిస్తుంది. అసలు నేటి సమాజంలో ఆడవాళ్లకు గౌరవ మర్యాదలు అటుంచి కనీస రక్షణ కూడా కరువై పోవడం అత్యంత బాధాకరం. యువతలో మరీ ముఖ్యంగా యువకుల్లో విలువలన్నవి గణనీయంగా పడి పోతున్నాయనడానికి ఈ దుస్సంఘటనలే నిదర్శనం.  కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఓ దారుణం' నిర్భయ ' చట్టం ఆవిర్భావానికి నాంది పలికింది. ఇది అందరికీ విదితమే. మానవ మృగాలు అంటారు కానీ మృగాలు సైతం అంత హీనంగా ప్రవర్తించవు. తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఎంత అపురూపంగా పెంచుకొని ఉంటారు! ఆమె భవిష్యత్తు పై ఎన్ని ఆశలు పెట్టుకుని ఎన్నెన్ని కలలు కని ఉంటారు! అవన్నీ కొద్ది క్షణాల్లో సర్వనాశనం చేసేస్తున్న ఆ కిరాతకులకు ఎంతటి తీవ్రమైన శిక్ష విధించినా ఆ తల్లిదండ్రుల ఆవేదన తీరుతుందా? ఆ పిల్ల ఆత్మ శాంతిస్తుందా?  ఏదో ఒక అనర్ధం జరిగితే గానీ ఇలాంటి చట్టాలు పుట్టుకు రావేమో? చట్టాలు చేసారు సరే, అవి సక్రమంగా అమలవుతున్నాయా? దానివల్ల ఒరిగింది ఏమిటి భయపడుతున్నారా?   స్త్రీలపై దాడులు ఆగిపోయాయా? 
    అసలు ఆడపిల్లల జీవితాల్ని చిదిమేసే అధికారం వాళ్లకు ఎవరిచ్చారు? యువకుల్లో విచక్షణ అన్నది దిగజారి పోవడానికి కారణాలేమిటి? ఇంట్లో పెంపకం లోపమా? అదుపాజ్ఞలు లేకపోవడమా? పెడదోవ పట్టిస్తున్న పెరిగిపోయిన సాంకేతిక పరిజ్ఞానమా?  సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా వాడుకోలేని విపరీత పోకడలా? 
   మనం గమనిస్తూనే ఉంటాం, నేటి యువతలో కనీస సంస్కారం కూడా లేనివారు ఎక్కువ శాతం కనిపిస్తున్నారు. పెద్దల పట్ల, గురువుల పట్ల వినయ విధేయతలు లేశమాత్రంగా కూడా వాళ్లలో ఉండటంలేదు. దీనికి కారణాలన్వేషిస్తే  --- ఆడ-మగ తేడాలు ఇంటి నుండే ప్రారంభం కావడం ప్రధానంగా గోచరిస్తుంది. తల్లిదండ్రులు ఒకవైపు అమ్మాయిపై  అపారమైన ప్రేమానురాగాలు కురిపిస్తూనే వెన్వెంటనే కొడుకు మీద వాళ్ల దృష్టి ఎక్కువగా కేంద్రీకరిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో మగవాడి దే పై చేయి అన్నట్లు అబ్బాయిలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, వాళ్లు తప్పు చేసినా సరే సమర్థిస్తూ, చూసిచూడనట్లు ఉంటుంటారు. దీంతో మగవాడిననే అహం, గర్వం వాళ్లలో పెచ్చుమీరిపోయి ఆడది అంటే చులకన భావం నాటుకుని పోతోంది. ప్రతి ఇంటిలో ఇలాగే ఉంటుందని కాదు, ఎంతో సంస్కారంతో అక్క చెల్లెళ్ళని, బయట ఆడవారినీ గౌరవించే మగవాళ్లూ ఉంటున్నారు. కాకపోతే అలాంటి వారి శాతం నానాటికీ  దిగజారి పోతోంది. 
     స్త్రీలను గౌరవించడమన్నది ఇంటినుంచే మొదలవాలి. ఆడపిల్ల పట్ల ప్రేమానురాగాలు వాళ్లలో పెరిగేలా వాళ్ళను తీర్చిదిద్దితే కొంతలో కొంతైనా మంచి పౌరులు తయారవుతారు. ఇంట్లో తల్లినీ, తోడబుట్టిన వాళ్ళను గౌరవిస్తూ వాళ్లతో మర్యాదగా నడుచుకొనేలా పెద్దలు హెచ్చరించాలి. బయట అడుగుపెడితే ఎందరో స్త్రీలు కనిపిస్తుంటారు. వాళ్ల పట్ల గౌరవ భావం కలిగేలా యువకులు తమని తాము సంస్కరించుకోవాలి. ఇది ఇంటి నుంచే మొదలవ్వాలి. చాలా కుటుంబాల్లో ఈ పరిస్థితి ఉండడం లేదు.   ఫలితమే ప్రస్తుత పరిస్థితి ! అమానుష చర్యలకు పాల్పడితే అవతల అమ్మాయి జీవితం తో పాటు తమ జీవితం కూడా నాశనమౌతుందన్న నగ్నసత్యం వాళ్లు గుర్తించాలి. 
    మన సంస్కృతీ సంప్రదాయాల పట్ల అవగాహన లేక ప్రతి విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకునే మనస్తత్వం పెచ్చుమీరి పోతోంది. జీవితంలో సర్దుబాటు ధోరణి పూర్తిగా మృగ్యమై పోతోంది. ఇది వివాహ వ్యవస్థపై తీవ్ర పరిణామాల్ని సృష్టిస్తూ అలజడి రేపుతోంది. ఒకప్పుడు ఏ చిన్న తప్పు చేసినా పదిమందీ ఏమనుకుంటారోనన్న సంకోచం ప్రతి వారిలో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇదే విలువల   గురించి పట్టించుకోకపోవడానికి ముఖ్య కారణం. క్షణిక సుఖాలకు లోబడిపోయి వందేళ్ళ జీవితాన్ని బలిపెట్టడం ఎంత సబబో వాళ్లు ఆలోచించాలి. జీవితం అది స్త్రీదైనా, పురుషుడిదైనా ఎంత విలువైనదో వాళ్ళు గుర్తించి తీరాలి. ఈ విషయంలో ముందస్తుగా మేల్కొనాల్సిందీ, ఆలోచించాల్సిందీ తల్లిదండ్రులే. ఆపై నవ నాగరీకులమనుకుంటున్న యువత! 
 ఇంతకీ విలువలు అంటే  --- ఏమిటి? 
* నీతి, నిజాయితీ కలిగి ఉండడం
* ఎవరికీ హాని చేసే తలంపు లేకపోవడం
* కుటుంబ సభ్యుల పట్ల ప్రేమగా, సఖ్యతగా ఉండడం
* పెద్దల పట్ల గౌరవం, వినయ విధేయతలు కలిగి ఉండడం
* ముఖ్యంగా స్త్రీల పట్ల మర్యాదగా నడుచుకోవడం 
* సర్దుబాటు ధోరణి కలిగి ఉండడం
* సంస్కృతీ సంప్రదాయాల్ని గౌరవించడం
* దయాగుణం కలిగి ఉండడం
* ఇతరుల పట్ల న్యాయంగా ఆలోచించడం
* తమ పరువు ప్రతిష్ట లతోపాటు ఇతరుల పరువు ప్రతిష్టల గురించి ఆలోచించడం. 
---- ఈ భావనలు వ్యక్తి లో ఉంటే వాటిని పాటించగల్గినట్లయితే కచ్చితంగా ఆ వ్యక్తి విలువలు కలిగిన వ్యక్తే. పూర్వపు రోజుల్లో ఇవి ఒకరు నేర్పించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కానరావడం లేదు. ఇలాగే కొనసాగితే ఎలాంటి సమాజం తయారవుతుందో మరి  !!

**************************************
             🌺భువి భావనలు 🌺
**************************************

No comments:

Post a Comment