Thursday, October 8, 2020

ప్రాణమా, నీవెక్కడ? వేధించే ప్రశ్నలు

   తల్లి గర్భంలో జీవం పోసుకున్న ప్రాణి జన్మించిన పిదప క్రమ క్రమంగా ఎదుగుతూ ఎన్నో సాధిస్తూ చివరకు ఏదో ఒక రోజు జీవమన్నది ( అదే ప్రాణమన్నది ) తన దేహం నుండి వేరై నిర్జీవంగా మారడం.

  ప్రాణానికి ఇంత విలువ ఉందా! అది ఉన్నంత వరకేనా మనిషి మనుగడ ! ఆ తర్వాత ఎంతటి వారలైనా కాటికి చేరాల్సిందేనా !

* మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఈ పేరు వినని వాళ్లు ఏ తరం లో నైనా ఉంటారా? ఓ బక్కపలుచని వ్యక్తి కొల్లాయి గట్టి కనీసం వంటిమీద చొక్కా అయినా లేకుండా అతి నిరాడంబరంగా కనిపిస్తూ అందర్నీ తన కనుసన్నల్లో నిలుపుకుని మొత్తం భారతావనికే తలమానికంగా నిలిచిన ఓ మహా మనీషి. భరతమాత దాస్యశృంఖలాలను తెంచాలన్న దృఢ సంకల్పంతో సకల జనావళినీ తన వెన్నంటే నడిచేలా చేయగలిగిన ధీశాలి. స్వాతంత్ర్యం సాధించి బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టే దాకా నిద్రించని పట్టువదలని నిత్య శ్రామికుడు! 

 అంతటి మహోన్నత వ్యక్తి చివరకోతూటాకు బలై నేలకొరిగి ప్రాణమన్నది అనంత వాయువుల్లో కలిసిపోయి అచేతనుడై పోయాడు. యావత్తు దేశాన్ని నడిపించిన ఆ వ్యక్తి దేహం నిర్జీవమై పోయి పిడికెడు బూడిదగా మారి మట్టిలో కలిసిపోయింది. ప్రాణం ఉన్నంత వరకు అంతటి శక్తివంతమైన ఆ కాయం అది కాస్తా మాయమవగానే కూలిపోయింది ! ఇంతకూ ఆ ప్రాణమన్నదెక్కడ? 

* ఇందిరాగాంధీ. ధీరవనిత! శక్తివంతమైన మహిళ! మేధోసంపత్తి, చాకచక్యం పుష్కలంగా కలిగి దేశ ప్రధానిగా తిరుగులేని విధంగా భాసిల్లి ఇందిర అంటే ఇండియా అన్న విధంగా కీర్తింప బడ్డ అద్వితీయ నారీమణి! చక్కటి చీర కట్టుతో, ఒత్తయిన తలకట్టుతో ఎంతో హుందాగా కనిపించే ఇందిరమ్మ తన ఇంటి ప్రాంగణంలో అండగా నిలవాల్సిన అంగరక్షకుల తూటాలకే బలై పోయింది. దేశాన్ని తిరుగులేని విధంగా ఏలిన ఆ గొప్ప మహిళ కూడా ప్రాణం దేహాన్ని వీడగానే ఒక్కసారిగా ఆమె జీవనయానం స్తంభించిపోయి నిస్సహాయురాలై పోయింది. 

* చక్కటి రూపం, అంతకుమించిన అద్భుత నటనా కౌశలం, గంభీరమైన స్వరం -- ఆయన సొంతం. పౌరాణిక చిత్రాల్లో రాముడు, కృష్ణుడు, రావణాసురుడు, భీముడు, అర్జునుడు, కర్ణుడు, దుర్యోధనుడు. భీష్ముడు ఆయనే! ఇంకా ఇంకా ఎన్నో సాంఘిక చిత్రాల్లోని పాత్రల్లోనూ జీవించిన నందమూరి తారక రామారావు అశేష తెలుగు ప్రజానీకానికి ఆరాధ్య దైవం. రాజకీయాల్లోనూ ముఖ్యమంత్రిగా వెలుగొంది కాలిడిన ప్రతీ రంగంలో తనకు తానే సాటి అనిపించుకున్న కారణజన్ముడు! అంతటి ధీరోదాత్తచరిత ప్రాణం ఉన్నంత వరకే!-- ప్రాణం అంటే ఏమిటి? 

* ఒకటి కాదు, వంద కాదు, వెయ్యి కాదు --ఏకంగా నలభై వేల పాటలు --అదీ పదహారు భాషల్లో పాడిన ఘనత సాధించి రికార్డు సొంతం చేసుకుని 'గానగంధర్వుడి' గా కీర్తింపబడ్డ ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారు --ఏరీ, ఎక్కడ? నిండైన ఆ విగ్రహం, చిరునవ్వులు చిందించే ఆ మోము గళం విప్పితే చాలు  జాలువారే మధుర గీతాలు, పెదవి విప్పితే చాలు అనర్గళంగా సాగిపోయే ఆ వాక్ప్రవాహం -- ఇప్పుడెక్కడ?  గాజుపెట్టెలో -- తేనెల వానలు కురిపించే ఆగళం, ఆ పెదవులు నిర్జీవంగా-- ప్రాణం లేనందుకే గా!

  దేహంలో ప్రాణమన్నదానికి ఇంతటి ప్రాధాన్యత ఉందన్నమాట! అది వీడిన మరుక్షణం దానికి విలువ లేదు. మట్టిలో కలిసి పోవాల్సిందే. ఊపిరి ఉన్నంత వరకే ఈ బంధాలు, అనుబంధాలు, బాధలూ, బాధ్యతలూ --- అది కాస్తా ఆగాక అంతా శూన్యం, శూన్యం. 

  ఏమిటీ, గొప్ప గొప్ప వ్యక్తుల గురించి? సెలబ్రిటీల గురించే చెబుతున్నావు, వాళ్లంతా జగమెరిగిన వాల్లనా ! నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాటేమిటి?  వాళ్లు సెలబ్రెటీలు కారా? 

 ఎంత మాట! ప్రతీ వ్యక్తికీ అమ్మ నాన్నలను మించిన వారెవరుంటారు? 

గుడ్లురిమినా నీపైనే 

గుండెలకదుముకున్నా నిన్నే  --- అనే అమ్మ 

 వేలెడంత వయసు నుంచీ 

వేలు పట్టి నడిపించి 

లోకం చూపించి  లోకజ్ఞానం 

తెలిసేలా చేసి, విలువలు నేర్పించి 

దారిచూపిన నాన్న !

--- మేము లేకున్నా ఇక నీవు బ్రతుకు బాటలో సాగిపోగలవులే -- అన్న భరోసా వచ్చాక నిష్క్రమించిన ఇరువురూ కట్టెల్లో కట్టెగా మారి కాలిపోతున్న క్షణాన చూడలేక తల తిప్పుకున్న క్షణాలు ఇప్పటికీ గుర్తే ! 

  ఇంతకీ నేచెప్పాలనుకున్నది దేహంలో ఈ ప్రాణం గురించి--

 అసలు ప్రాణం అంటే ఏమిటి?  ఆత్మ అంటే ఏమిటి? ఆత్మకు మరణం ఉండదంటారు. మనిషి మరణించాక శరీరం నుండి ఆత్మ వేరై పోతుంది అనడం వింటుంటాం. అయితే దానికి మరణం తర్వాత తన భౌతికకాయానికి జరిగే తతంగాలన్నీ తెలుస్తూ ఉంటాయా?  ఇవన్నీ వేధించే ప్రశ్నలే. జవాబులు మాత్రం దొరకడం లేదు. 

************************************************

                       🌷🌷' భువి ' భావనలు 🌷🌷

************************************************

No comments:

Post a Comment