Saturday, April 27, 2024

చేజారింది కాదు...🌷 కథ

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    దిక్కుతోచడం లేదు. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. తెల్లారితే చాలు నా జీవితం నా చేతుల్లోంచి పూర్తిగా జారిపోతుంది. ఏం చేయను ! సినిమాల్లో లాగా సంచీలో రెండు చీరలు కుక్కుకుని బయట పడిపోతే ! ఒక్క క్షణం ఆ తలంపుకే గుండె ఆగినంత పనయింది. అమ్మ నాన్న, కుటుంబం, పరువు ప్రతిష్ట--- గంగలో కలిసి పోవూ ! మళ్లీ ఆందోళన ! పోతే పోనీ! తొక్కలో పరువు ! ఇక్కడ నా నూరేళ్ళ బ్రతుకు ! ఎటూ తోచని అయోమయ స్థితి ! తల బాదుకున్నా. 
     ఇంతకీ మాముసల్దాన్ననాలి.  కాటికి కాళ్ళు చాపుకొని ఈ విపరీతమైన కోరికలేమిటో  ! ఎవరో కాదు, మా నానమ్మ ! ఎనభై అయిదు కూడా దాటాయి. పది దినాల క్రితం ఉన్నట్టుండి కళ్ళు తేలవేసింది. పోయిందనే అనుకున్నారంతా. అలా జరిగినా బావుణ్ణు ! సాయంత్రానికల్లా లేచి కూర్చుని తన చివరి కోరికంటూ వెళ్ళబుచ్చింది. ఫలితమే, ఇప్పుడు నేననుభవిస్తున్న నరకం! నేను పుట్టిన తర్వాత మా అమ్మ బాగా జబ్బు పడిందట. అప్పుడీవిడే నా ఆలనా పాలనా చూసిందట ! అందుకని నా మీద ప్రత్యేకమైన అభిమానం. అదే ఈ రోజు నా కొంప ముంచింది. 
     సరిగ్గా వారానికి ఆగమేఘాల మీద నా పెళ్లి కుదిరించేశారు. నా ప్రమేయం లేకుండా నాకు సంబంధం ఏమీ లేదన్నట్లుగా ఇంట్లోవాళ్లు కూడబలుక్కుని నిర్ణయించేసారు. ఇదేమిటని అమ్మ దగ్గర వాపోతే ఓ వెర్రి నవ్వు నవ్వి కొట్టిపారేసింది. 
      ఇంతకీ నా బాధ పెళ్లి చేసుకోవడానిక్కాదు. మరి ! నా బుర్రలో మరొకరు తిష్టవేసుకుని ఉన్నారే ! అది చెప్పాలంటే ఓ అయిదేళ్ళు వెనక్కెళ్ళాలి. నేను పక్కటౌన్లో పదో తరగతి చదివే రోజులవి. ఒక రోజు సాయంత్రం బస్సు దిగి ఇంటికి వస్తూ ఉండగా మా వీధి చివర పార్వతమ్మ గారి ఇంట్లో నుంచి వస్తూ ఒక అబ్బాయి ఎదురయ్యాడు. పార్వతమ్మ గారు మా బంధువేమీ కాదు, కానీ ఓకే వీధి కాబట్టి బాగా పరిచయం. అతను ఆవిడ చెల్లెలి కొడుకనీ, డిగ్రీ చదువుతున్నాడనీ తర్వాత తెలిసింది. ఎందుకో ఏదో తెలీని ఆకర్షణ ! అంతే! ఈ ఐదేళ్ళ లోనూ ఐదారుసార్లు చూసుంటానేమో ! మా మధ్య ఏ రోజూ మాటలన్నవి లేవు. కానీ ఇష్టం అంతే ! ఎప్పటికీ అతనితోనే జీవితం అన్న ఆలోచన ఆ వయసులోనే నాకు బలంగా ఉండేది. అలా అలా రెండేళ్లు గడిచి నా ఇంటర్ పూర్తయింది. ఇక చాలు అంటూ చదువు మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టారు. ఖాళీగా ఉండలేక ప్రైవేట్ గా డిగ్రీ కట్టాను. చూస్తుండగానే మరో రెండేళ్లు గడిచిపోయాయి. ఇంతకాలమైనా నా ఆలోచనల్లో మార్పయితే లేదు మరి ! కానీ--- ఉన్నట్టుండి హఠాత్తుగా ఈ పెళ్లి ! ఒక్కసారిగా నాయనమ్మమీద మళ్లీ పీకలదాకా కోపం ముంచుకొచ్చేసింది. కానీ ఏం చేయను? ఎవరినీ ఎదిరించ లేని వయసు! తెల్లారితే పెళ్లి! అందుకే ఈ దిక్కుతోచని స్థితి ! ఆ స్థితిలోనే మగత నిద్ర. భళ్ళున తెల్లారింది. 
                                  ********
    ఇంటి ముందు కొబ్బరాకుల్తో చిన్నగా పందిరి వేశారు. మామిడాకు తోరణాలు కట్టారు. కల్లాపి జల్లి ముగ్గులు పెట్టారు. అనుకోకుండా జరుగుతున్న పెళ్లయినందుకు పెద్దగా బంధువుల హడావిడి కనిపించడం లేదు. రాత్రంతా నిద్ర కరువై నీరసంగా కూర్చుని కళ్ళు నులుముకుంటున్న నా వద్దకు మా పిన్ని, పక్కింటి వనజత్త వచ్చి నన్నులేపుకుపోయి హడావుడిగా తలపై నీళ్లు గుమ్మరించి స్నానం వగైరా పూర్తయిందనిపించారు. ఇంకా తడియారని జుట్టును విదిలించి జడలా అల్లి ఓ మూరెడు మల్లెదండ అందులో కుక్కేశారు. ఏదో తెల్లటి చీర, కొత్తదే...తెచ్చి చుట్టబెట్టి పెళ్ళి కూతుర్ని తయారుచేశామనిపించు కుని నన్నలా వదిలేసి పక్కకు వెళ్లి పోయారు. అచేతనంగా ఉండిపోయిన నాలో అలజడి! ఎన్నెన్ని ఊహించుకున్నాను? పెద్దంచు పట్టు చీర, పూలజడ, ఆ జడకు బంగారు కుచ్చులు, చేతులకు గోరింటాకు, మోచేతుల దాకా రంగురంగుల మట్టి గాజులు, కాళ్లకు వెండి పట్టీలు, ఇంకా స్నేహితురాళ్ళ వేళాకోళాలు " ఎక్కడ? ఏమీ లేకుండా ఇంత సాదా సీదాగా ఏమిటిది?  
   బయట సన్నాయి మేళాలు మొదలయ్యాయి. మళ్లీ వచ్చారిద్దరూ. నన్ను బరబరా తీసుకెళ్లి, పీటలమీద కూర్చోబెట్టారు. మరో అరగంటలో పెళ్లి తంతు ముగిసింది. నా మెడలో పసుపు తాడు పడిపోయింది. ఆ క్షణంలో పక్కనున్న పెళ్లికొడుకన్నవాడిని చూడాలన్న ధ్యాస ఎంత మాత్రమూ నాలో కలగలేదు. అంతా వైరాగ్యం !
   మరో అరగంట తర్వాత ఇద్దరిని తీసుకొని అక్కడే ఓవార మంచం మీద కూర్చుని ఉన్న సూత్రధారి మా నాయనమ్మ దగ్గరికి తీసుకెళ్లి ఆవిడ కాళ్ళకి మొక్కించారు. ఎంత అయిష్టంగా ఉన్నా తప్పదుగదా ! లోపల మాత్రం పళ్ళు నూరు కుంటూ అనుకున్నా, 
" ఏయ్, ముసల్దానా, కోరిక తీరింది గా, చచ్చిపోవే, ఇప్పుడు వెళ్తా, మరో మూడు రోజుల తర్వాత మళ్ళీ వస్తా. నీ మొహం కూడా చూడను. నీవు చస్తే నీ కాళ్ళ కి దండం కూడా పెట్టను.... ( నేనున్న మానసిక స్థితి లో ఈ భాష సబబే మరి ! )" పట్టరాని కోపంలో నా మనసు నా ఆధీనంలో లేని పరిస్థితి నాది!
      వారం క్రితం వరకూ కళకళలాడుతూ తిరిగిన నేను ఇప్పుడు నవ్వన్నది మర్చిపోయాను. అంతవరకూ అతని మొహమే ఎరగని నేను మొదటి సారి అతను నా చేతిని తన చేతిలోకి తీసుకుని,  
" వాసంతీ, నీవంటే నాకెంత ఇష్టమో తెలుసా... "? అన్నప్పుడు చివ్వున ఒక్కసారి తలెత్తి చూశాను. కోటి వీణలు ఒక్కసారిగా మోగిన అనుభూతి ! 
".... నిన్ను ఒకే ఒక్కసారి బయట బస్స్టాప్ దగ్గర చూశాను. అప్పటినుండీ నీపై ఓ మంచి అభిప్రాయం ఏర్పడిపోయింది. ఆ క్షణం నుండీ...... "  చెప్పుకుంటూ పోతున్నాడు. ఆ స్వరం గంభీరంగా ఉంది. అయినా మృదువుగా సాగిపోతోంది. ఆ సమయంలో నేను గమనించింది ఆ వదనంలో ప్రశాంతత, చిరునవ్వు! అతను పెద్దగా చదువుకోలేదని చెప్పారు. ఆస్తిపాస్తులూ అంతంత మాత్రమే. అందచందాలు అరకొరగా. అయినా అవన్నీ అతని హృదయ సంస్కారం ముందు దిగదుడుపే! ఈ నిజం తెలియడానికి నాకెన్నో క్షణాలు పట్టలేదు. ఒక్కసారిగా అనుకోని పెన్నిధేదో వచ్చి ఒడి లో పడినట్లయింది. అంత వరకూ నాలో గూడుకట్టుకుని ఉన్న దిగులు, నిర్లిప్తత పటాపంచలయిపోయాయి. 
    టీ. వీ లో ఆ మధ్య ఓ సినిమా చూశాను. అందులో ఓ డైలాగ్ గుర్తొచ్చింది. దాని సారాంశం--- ఆడ పిల్లకు పెళ్లి కాకముందు ఆమె హృదయం ఫోటో ఫ్రేమ్ లా ఉంటుందట! పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి ప్రతిబింబం మాత్రమే అందులో పడుతుందట ! ఆకాస్త పెళ్లి ఫిక్స్ అయి మెడలో తాళి పడ్డాక తన భర్త రూపం అందులో పడి పోయి శాశ్వతంగా ఫోటో అయిపోతుందట  ! నిజంగా అక్షర లక్షలైన విలువైన మాటలవి. సరిగ్గా నాకు అలాగే జరిగింది. హఠాత్తుగా నానమ్మ గుర్తొచ్చి ఒక్కసారిగా దుఃఖం ఎగదన్నుకొచ్చింది. పెళ్లిరోజు నేను ఆవిణ్ణి తిట్టుకున్న తీరు తలపుకొచ్చి సిగ్గుతో తల వాలిపోయింది. 
                              *******
     సరిగ్గా వారం తర్వాత ఆయనతోపాటు పుట్టింట్లో కాలు మోపాను. అడుగు పెట్టీపెట్టగానే నా కళ్ళు వెతికాయి నాయనమ్మ కోసం. నేను వచ్చానని తెలిసి తన మంచం మీంచి లేచి రాబోతున్న ఆమె దగ్గరికి పరుగున వెళ్లి ఒడిలో తల పెట్టుకొని వెక్కివెక్కి ఏడ్చే శాను. ఎన్నడూ నా కంట నీరు చూడని ఆ పండుటాకు చలించిపోయి, 
" అయ్యో, నా తల్లి, ఏమైందే" 
అంటూ నన్ను పొదువుకుంది. నేను తేరుకుని నవ్వుతూ ముడతలు పడ్డ బుగ్గలు నిమురుతూ, ముడివడ్డ భృకుటి మీద నెమ్మదిగా చుంబించాను. తన మనవరాలు సంతోషంగానే ఉందన్న విషయం గ్రహించి నన్ను అక్కున జేర్చుకుని బోసి నోటితో నవ్వుతూ నా బుగ్గలు పుణికింది. 
                              ********
      ఏమిటి! ఇదంతా ఏ నిన్ననో మొన్ననో జరిగింది అనుకుంటున్నారా?  లేదండీ బాబూ, చాలా సంవత్సరాలే గడిచాయి. ఇప్పుడు నా వయసు నలభై అయిదు. ఇద్దరు పిల్లలు, ఆయన్తో సలక్షణంగా సాగుతోంది నా జీవితం. ఇన్నేళ్లలో బాధ పడ్డ క్షణం లేదు. ఈ క్షణమో మరుక్షణమో అన్న మా నాయనమ్మ మరో ఏడాది పాటు పిడి రాయిలా బ్రతికింది. ఆ తర్వాత ఓ రాత్రి మామూలుగా నిద్రపోయి మరి లేవలేదు. పోతే పోయింది గానీ, ఆమె చివరి కోరిక నెరవేర్చుకునే నెపంతో నాకు మాత్రం మా ఆయన రూపంలో ఓ అపురూపమైన వరం ఇచ్చి పోయింది. ఇంతకీ, నా మెడలో తాళి పడే క్షణం వరకూ నిరంతరం నాలో అలజడి రేపిన మహానుభావుడు మా ఆయన ఆగమనం తర్వాత మళ్ళీ ఈనాటి వరకూ గుర్తుకొస్తే ఒట్టు ! తర్వాత్తర్వాత తెలిసొచ్చింది, అది కేవలం ఆకర్షణ! Infatuation ! అయినా ఓ విషయం చెప్పాలిప్పుడు. ఆతని గురించి నేనంతగా ఆరాటపడ్డానే గానీ, అతనెప్పుడూ నా వంక చూసిన దాఖలాలు గానీ, నాతో మాట కలిపే ప్రయత్నం చేసిన క్షణాలుగానీ నా స్మృతి పథంలో లేవు. దీని ద్వారా నే తెలుసుకున్న జీవిత సత్యం--- మనం ఇష్టపడే వాళ్ళని కాదు, మనల్ని ఇష్టపడుతున్న వాళ్లని గుర్తించి తీరాలి. ఎందుకంటే ప్రేమించడం కాదు ప్రేమించబడడం గొప్ప. అందులోనే అసలైన ఆనందం దాగుంది. దురదృష్టం ఏంటంటే మనం కోరుకునే వాళ్ళు మన గురించి అస్సలు ఆలోచించరు. మనం ఎంత మాత్రం ఆసక్తి చూపని వాళ్లు మూగగా మనల్ని గమనిస్తూ ఉంటారు. దాన్నే ఆరాధన అంటారేమో!! ఇలా ఆలోచిస్తున్నప్పుడు నా చిన్నప్పుడు నేను చూసిన ఓ పాత సినిమాలోని ఓ పాట గుర్తుకు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు--- జీవిత సత్యాల్ని రంగరించి రాశాడేమో ఆ కవి అనిపిస్తుంది అది విన్నప్పుడల్లా... అందులో ఓ చరణం----
       కోరిక ఒకటి జనించు
       తీరక ఎడద దహించు
       కోరనిదేదో వచ్చు
       శాంతి సుఖాలను దెచ్చు 
       ఏది శాపమో ఏది వరమ్మో 
       తెలిసీ తెలియక అలమటించుటే 
       ఇంతేరా ఈ జీవితం
       తిరిగే రంగులరాట్నము 
       బ్రతుకే రంగులరాట్నము....
                       *******
  ఏవేవో కావాలి అనుకుంటాము. అవేమీ అందవు. కానీ మరేదో వస్తుంది. నిజంగా కోరుకున్నది లభించినా అంత ఆనందంగా ఉండలేమేమో?  ఇది మాత్రం ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గుర్తించవలసిన మహత్తరమైన విషయం! అందుకే అంటున్నా ----
 చేజారింది కాదు, చేజిక్కిందే మనది, మన సొంతం అని !
*************************************

No comments:

Post a Comment