Wednesday, July 29, 2020

శకునం.... ' చిన్నారి ' కథ

   చెప్పులేసుకుని ఏదో పని మీద బయటకు వెళ్ళిపోతున్న శంకరయ్య కాస్తా లోపల ఎవరిదో తుమ్ము వినిపించగానే చటుక్కున వెనుదిరిగి విసుక్కుంటూ కుర్చీలో కూలబడ్డాడు. ఆ పక్కనే పడక్కుర్చీలో పడుకున్న అతని తండ్రి బలరామయ్య కొడుకు చాదస్తానికి గొణుక్కున్నాడు. 
   శంకరయ్యకు విపరీతమైన శకునాల పిచ్చి. కాస్తో కూస్తో చదువుకున్నాడు. చిన్నపాటి ఉద్యోగం కూడా వెలగబెడుతున్నాడు. అయినా మూర్ఖంగా పిచ్చి నమ్మకాల్ని పాటిస్తూ తాను ఇబ్బంది పడుతూ ఇంట్లో వాళ్ళనీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కొడుకుతో ఈ అలవాటు మాన్పించడమన్నది బలరామయ్య కు అంతుపట్టని సమస్యగా మారింది. ఈ మధ్య ఈ చాదస్తం మరీ ఎక్కువైంది. అది చాలదన్నట్లు బద్ధకం కూడా అలవడింది. 
ఓ నిట్టూర్పు విడిచి, కూతుర్ని కేకేసి గ్లాసుతో మంచినీళ్లు తెమ్మన్నాడు శంకరయ్య. 
" రేయ్, శంకరా, ఏంట్రా నీ పిచ్చి! అలా చూడు లోపలికి ఓసారి,.. " అంటూ లోపలి గదిలో బూజులు దులుపుతున్న కోడలు రాజేశ్వరివేపు చూపించాడు. 
".... అక్కడ రాజేశ్వరి బూజు దులుపు తుంటే వచ్చే దుమ్ము వల్ల తుమ్మింది. అదీ మంచి శకునం కాదు అంటే ఎలా రా? అవతల పట్నం వెళ్లాలని బయలుదేరావు, బస్సు కాస్తా తప్పిపోతే మళ్లీ మధ్యాహ్నం దాకా మరో బస్సు లేదు, పనంతా ఆగిపోతుంది ఆలోచించావా? " కొడుకు వైపు చూస్తూ అన్నాడు. 
" ఆ ఆ, ఆలోచించాలే, అలాగని ఇదేమీ పట్టించుకోకుండా వెళ్లానంటే మొదటికే మోసం వచ్చి వెళ్లిన పని చట్టుబండలవుతుంది తెల్సా? " 
 ఎదురు చెప్పి తండ్రి నోరు ఒక క్షణంలో మూయించాడు. నెత్తి కొట్టుకుంటూ పడక్కుర్చీలో వాలిపోయాడు బలరామయ్య. మంచినీళ్లు తాగి బయలుదేరిన శంకరయ్య అరగంట తర్వాతఉస్సురంటూ తిరిగొచ్చి తండ్రి పక్కనే చతికిలబడి, 
" హు " తుమ్ము మహిమ! తప్పుతుందా! బస్సు కాస్తా వెళ్ళిపోయింది " అన్నాడు. 
" అదేంటి? కాసేపాగి, మంచినీళ్లు తాగేసి మరీ వెళ్లావుగా" కొడుకు వైపు ఓరగా చూస్తూ అన్నాడు బలరామయ్య. తండ్రి వైపు కొరకొరా చూస్తూ లేచి విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు శంకరయ్య. 
" ప్చ్ ! వీడు మారడు " అనుకుంటూ నిట్టూర్చాడు బలరామయ్య. 
  రోజులు గడిచిపోతున్నాయి. శంకరయ్య కూతురు సుమతి పట్నంలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోంది. సుమారు ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే కాలేజీకి ప్రతిరోజూ వాళ్ళ ఊరి బస్సు లో వెళ్లి వస్తూ ఉంటుంది. మరుసటి రోజు నుండే సంవత్సరాంతపు పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం ఎనిమిదికే పరీక్ష. సుమతికి పెద్ద చిక్కే వచ్చిపడింది. ఆ సమయానికి ఊరి బస్సు రాదు, ఆటో సౌకర్యం లేదు. విధిలేక తండ్రిని బ్రతిమాలు కుంది. తప్పనిసరై శంకరయ్య తానే తన బైక్ మీద కూతుర్ని వదలి రావటానికి ఒప్పుకున్నాడు.  
   తీరా కూతురికి మాటిచ్చాక తన బైకు రెండ్రోజులుగా పంక్చరయి రిపేరు లో ఉన్న సంగతి గుర్తొచ్చింది శంకరయ్యకు. రేపు కూతుర్ని వదలి రావాలంటే ఈరోజే రిపేరు చేయించాలి అనుకుంటూ బండిని బయటకు తీయబోయాడు. సరిగ్గా అప్పుడే వీధిలో నుండి ఓ నల్ల పిల్లి గేటు దాటి శంకరయ్య కు ఎదురు వచ్చి నిలబడింది. అంతే ! శంకరయ్య ఠకీమని వెనుదిరిగి, బైకు లోపలికి తెచ్చి, వెళ్లి లోపల కూర్చున్నాడు. సుమతి లోపల్నుంచి ఇదంతా గమనిస్తోంది. అప్పుడు సమయం రాత్రి ఏడు దాటింది. ఇప్పుడు దీన్ని బాగు చేయించకపోతే రేపు ఉదయం ఎలా వీలవుతుంది? అనుకుంటూ తండ్రిని మరోసారి హెచ్చరించింది. తలాడించి అరగంట అటూ ఇటూ తిరుగుతూ తాత్సారం చేసి, తీరా బండి తీసుకెళ్లే సరికి ఉన్న ఒక్క మెకానిక్ షాపు కాస్తా మూసేసి ఉంది. మరుసటి రోజు సుమతి వేకువనే లేచి తయారయ్యి, తండ్రి కోసం ఎదురు చూడసాగింది. అసలే మొదటిరోజు. కనీసం అరగంట అయినా ముందుండాలి. ఏడుపు మొహం తో తండ్రిని విసుక్కోవడం మొదలెట్టింది. బలరామయ్య అదిలింపులతో, రాజేశ్వరి సణుగుళ్లతో శంకరయ్య ఎట్టకేలకు తయారై బయటపడి కూతురి వేపు చూస్తూ, 
" మరేం పర్వాలేదు, దగ్గరేగా మెకానిక్ షాపు, త్వరగా పంక్చర్ వేయించుకుని వెళ్దాం పద.... " అంటూ బండి తీశాడు. సుమతి గుండె గుభేలుమంది. అంటే ! నిన్న రాత్రి బండి రిపేర్ చేయించలేదా ?  దేవుడా !ఇప్పుడెలా? మరో ప్రత్యామ్నాయం కూడా లేదు కదా !అనుకుంటూ చేసేదేమీలేక కాళ్ళీడ్చుకుంటూ తండ్రిని అనుసరించింది. తీరా షాపు దగ్గరికి వెళ్ళేసరికి మెకానిక్ ఇంకా రాలేదు ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తూ నిలుచున్నారు ఇద్దరూ. పావుగంట తర్వాత తీరిగ్గా చేతులు ఊపుకుంటూ వచ్చాడు, మెకానిక్. బాగుచేయడానికి మరో పావుగంట! అంతసేపూ విపరీతమైన ఆందోళన తో అంతకుమించి నిస్సహాయస్థితిలో దాదాపు నరకం అనుభవించింది సుమతి. ఇంక కేవలం అరగంట మాత్రమే మిగిలి ఉంది. 
   ఎలాగోలా ఆదరాబాదరాగా బండి నడుపుతూ పరీక్ష సెంటర్ వెదుక్కుంటూ వెళ్లేసరికి పుణ్యకాలం కాస్తా ముగిసిపోయింది. అప్పటికే పరీక్ష ప్రారంభం అయిపోయి పావు గంట గడచిపోయింది. శంకరయ్య ఎంత ప్రాధేయపడినా ఆ అమ్మాయిని అనుమతించలేదు. కనీసం గేటు దాటి లోపలికి కూడా వెళ్లనివ్వలేదు. అంతే! గుడ్లనీరు కుక్కుకుంటూ కూలబడిపోయిందాపిల్ల ! కూతురి కన్నీళ్లు చూసిన శంకరయ్య చలించిపోయి, ఇదంతా తన వల్లే ననుకుని తలదించుకున్నాడు. 
   నల్ల పిల్లి శకునం మంచిది కాదనే కదా, ఆలస్యం చేయడం వల్ల ముందురోజు రాత్రే బండి బాగు చేయించలేకపోయాడు ! అమాయక ప్రాణీ,? నోరులేని ఆ  జంతువు చేసిన పాపం ఏమిటి?  తన అర్థంపర్థంలేని చాదస్తం ఫలితం! ప్రస్తుతం కూతురి తీవ్ర మనోవేదన ! ఆమె చదువుకు అంతరాయం ! ఆ  సంఘటనతో ప్రారంభమైన అంతర్మధనం అతనిలోని శకునాల పిచ్చిని పక్కకునెట్టి, పారద్రోలేలా చేసింది. 
  మనవరాలు తాత్కాలికంగా బాధపడినా, కొడుకును పీడిస్తున్న చాదస్తపు పిచ్చి సమసి పోయినందుకు సంతోషించాడు బలరామయ్య. సుమతి కొద్దిరోజులు బాధపడ్డా రెణ్ణెల్ల తర్వాత మళ్లీ పరీక్ష రాసి ఉత్తీర్ణురాలైందన్నది వేరే విషయం ! 

🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂

Sunday, July 26, 2020

అయినవాళ్లు..... కవిత

నాడి పట్టి చూసే వైద్య నారాయణులు 
మందులిచ్చి ఊరట నిచ్చే
 వారల సహాయక బృందాలు
 నిస్సహాయ చూపులతో
 ఆ పక్కనే పరుండిన 
 మరికొందరు వ్యాధి పీడితులు దప్ప 
 అయిన వాళ్ళ పలకరింపులూ 
 ఆప్తుల పరామర్శలూ నోచుకోని
 అభాగ్యులీ  ' కరోనా ' బాధితులు!
 కన్న వాళ్ళు, వాళ్లు కన్నవాళ్ళు 
 ఒకరికొకరు దరిజేరరాని 
 దయ లేని క్షణాలివి !
 ఈ క్లిష్టసమయాన మరణం
 సంభవించిన అదెంత దారుణం!
 గుండెలవిసేలా రోదిస్తూ 
 రక్త సంబంధీకులు
 కడచూపు సైతం
 నోచుకోని నిర్భాగ్య జీవులు
 కడకు అనాధ శవాలుగా
 అంత్యక్రియలు !
 అయినవారు కానివారై 
 విధిలేక వెనుదిరుగుతున్న క్షణాన 
 ఏమీ కాని వారే అంతా అయినవారై 
'  ఆ నలుగురై ' 
 విద్యుక్తధర్మాన్ని నిర్వర్తిస్తూన్న 
విశాల హృదయులూ 
మానవతా మూర్తులు !
 వారందరికీ మన:పూర్వక 
 ధన్యవాదాలు!


Thursday, July 23, 2020

రేపటి అత్తా, నీకు శతకోటి దండాలు !

  " అమ్మా, నీకనవసరం, నీకేమీ తెలీదు, ఊరుకుంటావా... "
 విసురుగా అనేసి పక్కకు తిరిగిన వివేక్ చొక్కా ఒక్క ఉదుటున పట్టుకుని ఈడ్చి ముందుకు వంచి వీపుమీద దబదబా మోదింది యశోద. అనుకోని ఈ హఠాత్పరిణామానికి వికాస్, ఆ పక్కనే కూర్చుని అల్పాహారం తింటున్న ఆమె అత్త జానకమ్మ ఉలిక్కి పడ్డారు. 
  వికాస్ ఇంటర్ ఫస్టియర్, వివేక్ తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ యశోద పిల్లలు. తింటున్న ప్లేటు తో సహా లేచి, 
" అయ్యో అయ్యో! అదేమిటే, మగపిల్లవాణ్ణి పట్టుకుని అలా కొట్టేశావు? " అంటూ జానకమ్మ అరిచింది. 
" నువ్వు ఊరుకోఅత్తా, వీళ్ళు ఇలా తయారవడానికి నువ్వే కారణం. నీకు తోడు మీ అబ్బాయి.... ఇద్దరూ కలిసి వీళ్ళని మంచి మర్యాద,  పెద్దా చిన్న అన్నది తెలియకుండా తయారు చేశారు.... "
" ఏమిటీ, నేనా?.. "
" అవును, మొదట్నుంచీ మగ పిల్లలు మగ పిల్లలు అంటూ నెత్తికెక్కించుకున్నారు. ఆయనేమో ప్రతిదానికి' నీకేం తెలీదు ఊరుకో', ' నోరు మూసుకొని అవతలికి పో'  అంటూ వీళ్ళ ఎదుటే నన్ను హీనంగా చేసి తీసి పారేయడం.... " అంటూనే వివేక్ వేపు తిరిగి, " ఏరా, వెధవా, నాకేమీ తెలియకుండానే నువ్వు ఇంతెత్తు ఎదిగావా?.... " అంటూ నిలదీసింది.  
" అయ్యో, అయ్యో ! నిక్షేపం లాంటి మగ పిల్లల్ని పట్టుకుని వెధవా, గిధవా అంటూ ఏమిటే !... "
" ఏ, మగ పిల్లలైతే కొమ్ములొచ్చాయా, లేక పై నుండి ఊడి పడ్డారా?.. అసలు ఇంట్లో అటుంచి బయట వీళ్ళు చేస్తున్న నిర్వాకం ఏమిటో నీకు తెలుసా? మొన్నటికి వీధి చివర ఉండే లలితమ్మ, ఆవిడ పొరుగింటి ఆవిడ ఇంటి మీదకు వచ్చి ఏమన్నారో తెలుసా?... ఏంటండీ, యశోదమ్మ గారూ, మీ పిల్లల్ని మీరు అదుపులో పెట్టుకుంటారా లేక మమ్మల్నే పెట్టమంటారా?... అంటూ గొడవ! విషయం ఏంటంటే--- టెన్త్ చదువుతున్న వాళ్ళిద్దరి అమ్మాయిల్ని ఈ ఇద్దరు వెధవలు దారెంటా పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూ ఒకటే ఏడిపిస్తున్నారంట ! పోనీలే, పట్టించుకోకుంటే వాళ్లే నోరుమూసుకుని పోతారని ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోయి కామెంట్ చేస్తున్నారట. వాళ్ళు చెప్తుంటే సిగ్గుతో తల ఎత్తుకోలేకపోయాన్నేను..... "
' సరే సరే... ఏదో మగపిల్లలు.. సరదాకి..... "
" చాల్లే, ఊరుకో, ఇది తప్పని మందలించాల్సింది పోయి ఇలా వెనకేసుకొస్తున్నావు... అందుకే అంటున్నా నిన్ను కూడా... " ఊపిరి తీసుకోవడానికన్నట్లు ఆగింది యశోద. 
" అమ్మా, అదేమీ లేదమ్మా వాళ్లే మమ్మల్ని చూసి ఏదేదో.... " ముందుకొస్తూ తల్లికేదో చెప్పబోయాడు వికాస్. 
".. నోర్ముయ్, అడ్డగాడిదల్లారా, నీ మాటలు నేను నమ్మాలి, ఇంట్లో నన్నెంత గౌరవిస్తున్నారో చూడడం లేదా... "
"... అయ్యో అయ్యో, మళ్ళీ తిడుతున్నావేమిటే?  "
" తిట్టడం కాదు, ఆడవాళ్లంటే గౌరవం లేని వీళ్ళని అడ్డంగా నరికేయాలి. " 
బుగ్గలు నొక్కుకుంది జానకమ్మ. ఈ గొడవకు బయట రూమ్  లో షేవింగ్ చేసుకుంటున్న ఆమె భర్త కృష్ణ మోహన్ కదిలివచ్చాడు. " ఏమిటీ గొడవ?.... "
"చాలించండి, అంతా మీ చెవుల్లో పడింది, ఇక మళ్ళీ వివరించే ఓపికల్లేవిక్కడ... మీ సుపుత్రుల ఘనకార్యాలు చెప్తున్నా... "
ఏదో అనబోయాడతను. కానీ యశోద వెంటనే అందుకుంది. 
" మీరెప్పుడూ ' నీకేం తెలీదు ', ' నోరుమూసుకో ', 'అవతలికి పో ' అంటూ వీళ్ళ ముందే నన్ను చీపురుపుల్లలా తీసిపారేస్తూ తల్లిగా నాకంటూ ఏ విలువా లేకుండా చేసేశారు. మీకు తోడు ఇదిగో ఈవిడగారి వత్తాసు ఒకటి. దాంతో ఇద్దరూ ఇంట్లోనే కాదు బయట కూడా జులాయిల్లాగా తయారయి ఇంటి మీదకి ఫిర్యాదులు తెచ్చి మధ్యలో నా మర్యాద మంట కలుపుతున్నారు. దీనికంతా అసలు కారణం మీరే అంటున్నాను.. " 
" నేనా? "
" చూశావా రా, ఇద్దర్నీ ఎంత లేసి మాటలంటోందో !.."
" సర్లే, ఇన్నాళ్లు నోరు మూసుకుని ఉన్నాను. కానీ పిల్లలిలా చెడి పోతుంటే చూస్తూ చూస్తూ ఊరుకోలేను. " 
 ఆవిడ ఏదో అనబోయింది. కానీ యశోద లో ఎన్నేళ్ళుగానో గూడుకట్టుకున్న ఆవేదన పొంగిపొరలి, భర్తనూ, అత్తగార్నీ ఆ క్షణాల్లో మాట్లాడనీయకుండా చేసేసింది.
" ఈ ఇంటికి వచ్చిన నాటి నుండీ నేను పడ్డ నరకం మరిచిపోలేను. ఈ ఇద్దరూ ఇలా పెరిగితే రేపు వాళ్లకు పెళ్లాలై ఈ ఇంటికొచ్చే కోడళ్ళు పడే అవస్థ నేను చూడ దలుచుకోలేదు. ఓ కోడలిగా నేను పడ్డ కష్టం వాళ్లకు రానీయనుగాక రానీయను "
" అదేమిటే, వాళ్ళు మగవాళ్ళు... "
 ఆవిడ కలగజేసుకుని మాట్లాడబోయింది. 
" మళ్లీ అదే మాట! మగవాళ్ళు మగవాళ్ళు ! మగ పిల్లల్ని నెత్తికి ఎక్కించు కోవడం, మహారాజుల్లా చూడడం, ఆడపిల్లల్నయితే చిన్నప్పట్నుంచీ అన్ని పనులూ చేయాలనడం. ఎందుకంటే రేపు మరో ఇంటికెళ్ళి గొడ్డుచాకిరీ చెయ్యాలిగా మరి! ఇలాంటి మీ ఆచారాలు ఇక వద్దంటున్నా... రేయ్... "
 కొడుకుల వైపు తిరిగి అంది 
".... ఇకనుంచీ ఇంట్లోనే కాదు బయట కూడా పిచ్చి వాగుడు, పిచ్చి చేష్టలూ చేశారంటే పళ్ళు రాలగొడతా ను. రెండు కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండండి, జాగ్రత్త!.... "
 గరిటే పట్టుకున్న చేయి ఆడిస్తూ హెచ్చరించి వంటింట్లోకి వెళ్ళిపోయింది యశోద. జానకమ్మ ఏదో అనబోయింది గానీ కోడలు చూసిన చూపుకు నోరు మూత పడిపోయింది. 
  ఇన్నాళ్లూ కోపం వస్తే ఏదో కాస్త మందలించి ఊరుకునే తల్లి ఈరోజిలా చేయిజేసుకుని తీవ్రంగా అరిచేసరికి, అంతా నిశ్చేష్టులై పోయి ఓ క్షణం అక్కడ నిశ్శబ్దం తాండవించింది. ఆమెలో ఓ కొత్త అమ్మను, కొత్త భార్యను, కోడల్నీ చూసిన వాళ్ళు అవాక్కై అలాగే భూమికి అతుక్కుపోయారు. 
                         ************
 శభాష్ యశోదా ! " అత్తగారింట్లో నేను నరకం అనుభవించాను, నన్ను రాచిరంపాన పెట్టారు, నిన్ను మాత్రం సుఖపడనిస్తానా. నేను పడ్డ బాధలన్నీ నువ్వూ పడాల్సిందే " నంటూ ఇంట్లో అడుగు పెట్టిన కొత్త కోడలిపై అకారణ ద్వేషంతో, అర్థం పర్థం లేని ప్రతీకార వాంఛతో ఆమెని ముప్పుతిప్పలు పెట్టే అత్తగార్లున్న ఈ గొప్ప సమాజంలో ఎప్పుడో రాబోయే కోడళ్ల క్షేమం గురించీ, వాళ్ళ ఆత్మగౌరవం కాపాడ్డం గురించీ ఇంతగా ఆలోచిస్తున్నావే.... నిజంగా నీకు హాట్స్ ఆఫ్ !  అందరు తల్లులూ కొడుకుల్ని ఇలాగే పెంచితే, ఆడపిల్లలకూ వాళ్ళ తల్లిదండ్రులకూ సుఖశాంతులకు లోటన్నదే ఉండదు గదా ! అందుకే -రేపటి అత్తా ! అందుకోవమ్మా, ఇదిగో నీకు శతకోటి వందనాలు ! 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Monday, July 20, 2020

పెరుగుట విరుగుట కొరకే... కానీ, అదెప్పుడు?

  " పెరుగుట విరుగుట కొరకే  " అన్న నానుడి అనాది నుండీ ఉన్నదే. కానీ ఈ మధ్య కొద్ది రోజులుగా వింటూన్న ఇంకా ప్రత్యక్షంగా చూస్తోన్న విపరీతాలు ఆ మాటని పూర్తిగా మార్చి పారేసేలా ఉంటున్నాయి. 
   ఈ ' కరోనా ' మహమ్మారి ఏ గడ్డు క్షణాల్లో ఉత్పన్నమైందోగాని అయిదు నెలలు దాటిపోయినా తగ్గడం అటుంచి రోజు రోజుకీ అనూహ్యంగా రెచ్చిపోతూ మనుషుల్లో ఎన్నడూ ఎరగని ఓ భీతి కలగజేస్తోంది. ఏ వైరస్ అయినా సహజసిద్ధంగా కొద్ది పీరియడ్ తర్వాత దానంతటదే తగ్గిపోతూ ఉండేది ఇదివరలో. లేదా వాటిని నిర్మూలించే మందులు త్వరగానే కనిపెట్టగలిగే వారు. కానీ ఇది కొరకరాని కొయ్యగా తయారై శాస్త్రవేత్తల్ని సైతం ముప్పుతిప్పలు పెడుతూ తలలు పట్టుకునేలా చేస్తోంది. " దేవుడా! దీనికి అంతం ఎప్పుడు?  మళ్లీ మామూలు పరిస్థితి అన్నది అసలు వస్తుందా?  " ఇదీ నేడు ప్రతి వారిని తొలిచేస్తున్న ప్రశ్న! 
  ఇదివరకు ఏ వైరస్ కు లేని ఆంక్షలు, ప్రత్యేకతలు ఈ మహమ్మారి కుండడం విశేషం !

  •  బయట కాలు పెడితే చాలు, మాస్క్ తప్పనిసరి. భౌతిక దూరం పాటించి తీరాలి. అంటరానితనం నేరం అని మునుపు అంటే అంటుకుంటే రోగం అంటున్నారు ఇప్పుడు !
  •  ఎవరింటికైనా వెళ్లాలంటే ఆలోచిస్తూ మన ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే హడలి పోయే దుస్థితి !
  •  పూజలూ, వ్రతాలు ఇంటికే పరిమితం. వరలక్ష్మీ వ్రతం వాయినాలు బంద్. మా ఇంటికి వాయనాలు అంటూ ఎవరూ రావద్దు అని ఓ పూజారి గారు ఇంటి ముందు బ్యానర్ కూడా పెట్టారట! ( ఈరోజు తాజా వార్త  )
  •  ఇదివరకు ఎవరింట్లో అయినా ఏ చిన్న సమస్య ఉత్పన్నమైనా వెళ్లి పరామర్శించి రావడం కనీస ధర్మంగా భావించేవారు. ఇప్పుడు మరణం సంభవించినా కదలడం లేదు. 
  •  అనుకోని విధంగా దారిలో ఎవరికైనా ఏ ప్రమాదమైన జరిగితే పదిమంది కూడి ఆ వ్యక్తికి సహాయం అందించే సహృదయత అప్పుడుండేది. మరి ఇప్పుడు--- రోడ్డుపై పడి హఠాన్మరణం పాలైనా కనీసం కుటుంబ సభ్యులు కూడా స్పందించడం లేదు !  ( నిన్నటి రోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన ఉదంతం ఇందుకు నిదర్శనం. ఇదెంతటి హృదయవిదారకం  !
  • ' కరోనా ' తో  మరణిస్తే చివరిచూపుకు కూడా నోచుకోని దౌర్భాగ్యస్థితి !
  •  అంత్యక్రియలకు అడ్డుకుంటూ ఒక చోటి నుండి మరో చోటికి తరిమేస్తూ మరణం తరువాత మనిషికి కనీస గౌరవమన్నది ఇవ్వని క్రూర మనస్తత్వం మనుషుల్ని ఆవరించడం ! 
  • ఈ పరిస్థితుల్లో కర్మ కాలి ఏ అనారోగ్య స్థితి తలెత్తినా బేజారవ్వాల్సివచ్చి మానసికంగా మరీ దిగజారిపోతున్న జనం! డాక్టర్లు సైతం రోగిని పరీక్షించి చూడాలంటే ఆలోచిస్తున్నారు, నిరాకరిస్తున్నారు కూడా. 
  •  గత కొద్ది నెలలుగా జరుగుతున్న విపరీత పరిణామాల వల్ల మరీ సున్నిత హృదయులు మానసిక రోగులుగా మారిపోయారని పేపర్లలో వార్తలు!
  • ఇలా ఇలా ఇంకెన్నెన్ని దారుణాల్ని చూడాల్సి వస్తుందో !ఏమో !ఈ పెరుగుట ఆగిపోయి " పెరుగుట విరుగుట కొరకే " అన్న పై మాట నిజమైపోతే ఎంత బాగుంటుంది కదా !!
  • ****************************************-
  • మళ్ళీ కలుద్దాం 
  • *******

Thursday, July 16, 2020

ప్రతిరోజు ఆదివారం.. ప్రతీరోజు పండగ... మాకు వద్దే వద్దు దేవుడా.. !

   శ్రావణి ఓ హై స్కూల్ లో టీచర్ గా చేస్తోంది. ఇద్దరు పిల్లలు ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నారు. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగి. ఇంట్లో సహాయపడే వాళ్ళు ఎవరూ లేరు. పనిమనిషిని కుదుర్చుకున్నా సమయానికి రాక, ఉన్నట్టుండి చెప్పాపెట్టకుండా మానివేస్తూ ఇబ్బంది పెడుతూ ఉండడంతో లేకుంటేనే సుఖమని ఓ దండం పెట్టి మానిపించేసింది. ఇక ఏమాత్రం చెప్పాల్సిన అవసరం లేకుండా ఆమె పని ఒత్తిడి అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఆరు రోజుల ఉరుకులు పరుగుల తర్వాత ఆదివారం వస్తోందంటే ఏదో తెలియని ఆనందం శ్రావణికి, కాస్త ఉదయం పూటన్నా నిదానంగా నిద్రలేవచ్చుగదాని!
    కల్పన ఓ గవర్నమెంటు ఆఫీసులో ఆఫీస్ అసిస్టెంట్. ఇంకా పిల్లలు లేరు గానీ ఉమ్మడి కుటుంబంలో అంతా కలిసి ఆరేడుగురు ఉంటారు. ఉదయం టిఫిన్లు, రాత్రి వంట డ్యూటీ తనదే. రోజంతా అలసిపోయి వచ్చి అంతమందికి వండివార్చాలంటే శ్రమే మరి! తను కూడా ఆదివారం కోసం ఇంతలేసి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటుంది. 
  ఇకపోతే రజిత! గృహిణి. తను తయార వాల్సిన పని లేక పోయినా, పిల్లలకు, భర్తకు అన్నీ రెడీ చేసి లంచ్ బాక్సులు సర్ది బయటకు తోలి, ఉస్సురని నిట్టూర్చేసరికి గడియారం10.30 చూపించి, బ్రేక్ ఫాస్ట్ మీద ఆసక్తిని చంపేస్తుంది. మరి,  ఈవిడకీ ఆదివారం అవసరమే మరి!
    ఏమిటీ ! ఎంతసేపూ ఆడవాళ్ళ గురించేనా! మా మగవాళ్ళ సంగతి ఏమిటి?  మాకు మాత్రం పని వత్తిడి, అలసటా ఉండవా,  అంటారా మగవాళ్ళంతా.  అయ్యో, ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఆరు రోజులు నిర్విరామంగా శ్రమించి ఓరోజు ఆటవిడుపు కావాలనుకోవడం ధర్మమే కదా! కాకపోతే, స్త్రీలకు మరీ ముఖ్యంగా ఉద్యోగినుల లైన స్త్రీలకు గోడ వేటు, చెంప వేటు లాగా ఉంటుందీ అంటున్నాను. ఇంటాబయటా విధులు నిర్వర్తించాలి మరి!  ఏతా వాతా అందరికీ సెలవన్నది అత్యవసరమే. పండగ సెలవులు ఎప్పుడో ఒకసారి ఎన్నాళ్లకోగానీ రావు. ఆదివారం మాత్రమే క్రమం తప్పకుండా వారానికోసారి వస్తుంది. కాబట్టే దానికోసం అందరి ఎదురుచూపులూనూ !
   సరే సరే! మరి మా సంగతేంటంటున్నారా పిల్లలూ?  ఇదిగో వస్తున్నా మీ వద్దకే. ప్రతిరోజు ఉదయాన్నే లేవటాలు, హడావుడిగా తయారవటాలూ, దీనికితోడు బండెడు పుస్తకాల బరువు మొయ్యటాలు, అక్కడ స్కూల్లో ఒక దాని వెంట ఒక సబ్జెక్టు తల తినేయటాలూ, ఇంటికిరాంగానే, మళ్లీ హోంవర్క్ లూ ---- అబ్బా! వీటన్నింటినీ టోటల్ గా కాస్త పక్కకు నెట్టేసి, ఊపిరి పీల్చుకునేది టీ. వీ కి అతుక్కు పోయేది ఒక్క ఆదివారమే గా. అందుకే పిల్లలందరికీ ఆదివారం అంటే ప్రాణం మరి! పిల్లలకే కాదు పైన చెప్పిన విధంగా పెద్దలందరికీ కూడా ఆదివారం అంటే ఆటవిడుపే !
  సరేగానీ -- ఇదంతా మూడు నాలుగు నెలల కిందటి వైనమూ, ముచ్చటా ఇంకా వైభోగమూనూ. ప్రస్తుతం'కరోనా ' పుణ్యమాని ఇవన్నీ బంద్ అయిపోయి ప్రతీ రోజూ ఆదివారమే అయి ప్రతీ రోజూ పండగే అయిపోయింది పిల్లలకి, పెద్దలకి కూడానండోయ్ ! పండగలు అప్పుడప్పుడు వచ్చి పలకరించి పోతే బాగుంటుంది కానీ ఇలా ప్రతిరోజూ పండగే అంటే పెద్దలకే కాదు పిల్లలక్కూడా విసుగొచ్చి ఎప్పుడెప్పుడు స్కూల్ కి వెల్దామా అని పిల్లలూ అలాగే డ్యూటీలో ఎప్పుడు చేరుదామా అని ఉద్యోగులూ కొద్దిరోజులుగా ఎదురుచూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. 
   అలాగే ఇంట్లో ఇల్లాళ్లు ! House arrest అయిపోయి పొద్దస్తమానం పిల్లా పీచూ, పెద్దా, ముసలీ ముతకా -- అంతా ఇంట్లోనే తిష్టవేసి చీటికి మాటికీ అవీ ఇవీ కావాలంటూ వేధిస్తోంటే వాళ్ళనడుం విరిగిపోతోంది. దీనికంటే మునుపే బెటర్ బాబూ ! అనుకునే పరిస్థితి వాళ్లకి దాపురించింది. ఈ' మహమ్మారి ' ఎప్పుడు అంతమవుతుందా, ఎప్పుడు మళ్లీ మునుపటి పరిస్థితి వస్తుందా అని అందరికంటే ఇంటి ఇల్లాళ్లు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు మరి! మళ్ళీ వారానికి ఒక్కసారి మాత్రమే వచ్చే' ఆదివారం ' కోసం ఎదురు చూసే రోజులెప్పుడొస్తాయో కదా? 
" భగవంతుడా! త్వరగా ఈ వైరస్ సమసిపోయి మళ్లీ జనజీవనం ' నార్మల్' అయ్యే రోజు రానీయవా  తండ్రీ ! " 
 స్వార్థ చింతన మానేసి ప్రతీ దినం ఉదయం, సాయంత్రం ప్రతీవాళ్ళూ దేవుణ్ణి కోరుకుంటున్న కోరిక ప్రస్తుతం ఇదే! అవునంటారా, కాదంటారా? 
🙏🙏🙏👃👃👃👃👃👃👃👃🙏🙏🙏

Friday, July 10, 2020

అద్భుతం !!



                                           ~~ యం. ధరిత్రీ దేవి 
 మూడు రోజుల క్రితం
 నా అరచేతిలో ఒదిగిన 
 ఓ చిన్ని విత్తనం...
 చూసింది నను అమాయకంగా...!
 ఈ దినం అది అంకురమై... 
 నేల తల్లి ఒడిని
 దోబూచులాడుతూ... 
 కొంటెగా చూస్తూ
 ఇచ్చింది దర్శనం!
 ఎంత అద్భుతం!
 ఎంతటి విషయం
 దాచుకుందో కదా
 దాని అంతర్భాగం !
 అలా అలా...చూస్తున్నా...
 చూస్తూనే ఉన్నా...
 ఋతువులు మారి మారి... 
 రోజులు వారాలు దొరలి దొరలి... 
 వత్సరాలై తరలి తరలిపోతుండగా...
 దినం దినం ప్రవర్ధమానం
 అవుతూ అవుతూ... 
 ముసి ముసిగా నవ్వుతూ...
 మౌనంగానే ఎదిగి ఎదిగి... 
 నింగికేసి ఎగసి ఎగసి...
 కొమ్మలు రెమ్మలతో 
 అలరారుతూ...
 పువ్వుల గుత్తులతో 
 పరిమళిస్తూ... 
 చూసే కనులకు
 విందులు చేస్తూ....
 కిలకిలా రావాల
 పక్షులకావాసమై... 
 వచ్చిపోయే
 జనాలకాశ్రయమై...
 చల్లచల్లగా సేదదీరుస్తూ... 
 అబ్బురపరిచెనే ఈనాడు నను...!!
 ఒకనాటి అతిసూక్ష్మ కణం...
 నా అరచేతిలో ఇమిడిపోయిన 
 ఆ చిన్ని విత్తనం !!
 నేడో నిండైన వృక్షరాజం !
 తలచి తలచి గతాన్ని... 
 తరచి తరచి చూస్తే... 
 నాకిదో అద్భుతం ! 
 నిజంగా అద్భుతం !!

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦

Wednesday, July 1, 2020

గులాబీ మొక్క హృదయస్పందన ! 🌷

ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ మొక్కలకు ప్రాణం ఉంటుందని కనుగొన్నాడు. వాటికి మనసనేది కూడా ఉండి, ఆలోచించే శక్తి కూడా ఉండి ఉంటే బహుశా ఇలాగే ఉంటుందేమో! ఓ ఇల్లాలు బజారుకెళ్లి తిరిగి వస్తూ దారిలో రోడ్డు వారన క్రోటన్లు, పూల మొక్కలు అమ్ముతున్న ఒకతని వద్ద ఆగిపోయి వాటిల్లోనుంచి ఓ గులాబీ మొక్క ను ఎంచుకుని, కొని ఇంటికి తీసుకు వచ్చింది. కొద్ది రోజులు గడిచాక ఆ మొక్క స్పందన చూడండి, ఎలా ఉందో  !
 రోడ్డువార రద్దీ కూడలిని 
 దుమ్ము ధూళి అద్దుకుని
 కళ తప్పిన నన్ను కొని తెచ్చి
 కుండీలో పెట్టి నాకంటూ
 ఓ సామ్రాజ్యాన్నిచ్చావు 
 నా అణువణువూ స్పృశిస్తూ
 నేల తల్లిని మరిపించావు 
 నా తల్లీ ! నీకు వందనం!
 గుప్పెడు నీళ్లకై తపించే నాకు
 గుప్పిళ్ళతో పోషకాలందించి 
 కంటికి రెప్పలా కాపాడావు 
 చీడపీడల దరిజేరనీక 
 ఏపుగ పెరిగేలా చేసి 
 ఎంతందంగా తీర్చిదిద్దావు  !
 నా తల్లీ ! మళ్లీ నీకు వందనం !
 దారీ తెన్నూ ఎరగని నన్ను
 ఓరీతిగ సరిజేసి 
 కొమ్మ కొమ్మనూ 
 చిరు మొగ్గలతో నింపేసి
 నా జన్మ ధన్యం చేసావు !
 నా తల్లీ ! మరల మరల 
 నీకు వందనం!
 ఇంత చేసిన నీకు
 తిరిగి నేనేమివ్వగలను? 
 నీ దోసిలి నిండుగ 
 విరబూసిన నారెమ్మల 
 చిట్టి గులాబీ బాలల్ని దప్ప !
 అర్పిస్తున్నా నా తల్లీ 
 స్వీకరించుమమ్మా !!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 పెంచిన వారి పట్ల మొక్కలు ఇలాగే కృతజ్ఞతలు చెల్లించుకుంటాయేమో !
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺