~యం. ధరిత్రీ దేవి
జనని లేని జగతి జనం ఊహకందునా
అతివలేక అవనికంటు అర్థమొకటి ఉండునా
ఇలకు దిగిన ఆ దైవం మరో రూపు మగువ కదా
తాను కరిగి కాంతులొసగు కర్పూరమె కాంత కదా
ఇంతులార ఇల వెలిసిన వేల్పులార
వందనం ఇదె మీకు వందనం
గైకొనుమా అభివందనం //జనని//
గృహమే ఒక స్వర్గసీమ ఇల్లాలే సృష్టికర్త
జగమెరిగిన నిజమిది కాదా
మగనికి తను కుడి భుజమై నడిపించే నాయికగా
బ్రతుకున సహభాగినియై పయనించే సహచరిగా
తనయుల తగురీతిని తీర్చిదిద్దు మాతగా
తన బాగు తను కోరని..నిరతం తనవారల
తలచు తరుణీమణి తానె గదా
పలుపాత్రల పోషణతో అలరించే ప్రమదలార
ఇంతులార ఇల వెలిసిన వేల్పులారా
వందనం ఇదె మీకు వందనం
గైకొనుమా అభివందనం //జనని//
అలనాటి ఝాన్సీరాణి రుద్రమల ధీరత్వం
ఇందిరమ్మ నాయకత్వ పటిమ సకలలోక విదితం
భారత కోకిల సరోజినీ కవితావల్లరి కమనీయమే
ఆదినుండి నేటిదాక నెలతలకెదురేమున్నది ఈ భువిపైని
సబలలం మేమంటూ మాతో సరి మేమంటూ
మహిని చాటుతున్న మహిమాన్విత మహిళలారా
ఇల వెలిసిన వేల్పులారా
వందనం ఇదె మీకు వందనం
గైకొనుమా అభివందనం //జనని//
అమ్మచాటు పసికూన ఆ అల్లరి పిల్ల
కుందనాలబొమ్మ ఎపుడాయెనే
మూడు ముళ్ళు పడగానే మగని మాయలో
పడిపోయెనదిఏమి వింతోయమ్మ
ఇంటిపేరు మారి ఈ ఇంటిని మరిచి
ఆ ఇంటి దీపమై అలరారే భామినీ ఓ భాగ్యశాలినీ
ఇంతులార ఇల వెలిసిన వేల్పులారా
వందనం ఇదె మీకు వందనం గైకొనుమా //జనని //
ఇంతలో అంతలా అంతోటి పనితనం
ఎలా వచ్చిచేరెనో మునుపెరుగని ఆ పెద్దరికం
ఏ బడి నేర్పెనమ్మ ఆ లౌక్యమాలోకజ్ఞానం
ఏ గురువు నూరిపోసి తీర్చిదిద్దె నిన్నిట్లా కడుమేటిగా
ఆరిందావై..ఇల్లంతా నీవై..ఇంటి బయట నీవై..
అంతటా నీవై.. సర్వమూ నీవై...
ధరణికి సరితూగు సులక్షణాల ఓ ధన్యజీవీ
ఇంతులార ఇల వెలిసిన వేల్పులారా
వందనం ఇదే మీకు వందనం గైకొనుమా //జనని //
( 'విహంగ' అంతర్జాల మహిళా మాసపత్రిక డిసెంబర్ 2025 సంచికలో ప్రచురింపబడ్డ నా పాట)