Monday, September 15, 2025

బాలగేయం... పిల్లలం మేము పిల్లలం

 
 పల్లవి :

 పిల్లలం మేము పిల్లలం..
 బడి పిల్లలం 
 గుడిలాంటి బడిలో
 గురువుల సన్నిధిలో
 చదువులమ్మ ఒడిలో
 పాఠాలు నేర్చే విద్యార్థులం 
 వసివాడని కుసుమాలం        
                                                  //పిల్లలం// 
 చరణం :
 చదువే మా ధ్యేయం
 సమతావాదం మా నినాదం 
 ప్రగతి బాట మా గమ్యం
 దేశభవిత మా లక్ష్యం
                                                 //పిల్లలం//
 చరణం :
 గురువులను గౌరవిస్తాం
 పెద్దల మాట మన్నిస్తాం 
 పిన్నలను ప్రేమిస్తాం
 కర్తవ్యం బోధిస్తాం
                                                 //పిల్లలం//
 చరణం :
 రేపటి తరం వారసులం
 భావి భారత నిర్మాతలం
 కలలు కంటాం కష్ట పడతాం
 కలల తీరం చేరుకుంటాం
 సమాజహితం కోరుకుంటాం
 సదాశయంతో సాగుతాం
                                                 //పిల్లలం//
 



  
                                     

Wednesday, September 10, 2025

ఈ సమయం గడిచిపోతుంది...

🥀🌷🌷🥀🌷🌷🥀🌷🌷🥀🌷🥀🌷🌷🥀🌷

కష్టాలు...కన్నీళ్లు...అశాశ్వతం...
 వచ్చి పోయే చుట్టాలవి...ఇది నిజం... 
భగవానుడు సూచించిన దివ్య మంత్రం... 
"గడిచిపోతుందిలే ఈ సమయం" అనుకో నేస్తం...
తక్షణం పొందుతావు ఉపశమనం...!!

🥀🌷🌷🥀🌷🌷🥀🌷🌷🥀🌷🌷🥀🌷🌷🥀

Friday, September 5, 2025

నా జ్ఞాపకాల్లో నా గురువులు...

                                           🌺భువి భావనలు 🌺🐦                                                     *************
        

 ఐదేళ్ల  వయసుకు ముందు నా మస్తిష్కంలో పెద్దగా నిక్షిప్తమైన జ్ఞాపకాలేవీ లేవనే చెప్పాలి. కానీ మా నాన్నగారు ఓ కొత్త పలక, బలపం నా చేతికిచ్చి నా చేయి పట్టుకుని తీసుకెళ్లి ఓ మున్సిపల్ పాఠశాలలో కూర్చోబెట్టిన రోజు మాత్రం బాగా గుర్తుంది. కాసేపయ్యాక ఓ  పంతులమ్మ వచ్చి నా వద్ద కూర్చుని పలక మీద'అ ఆ' అక్షరాలు రాసి నా చేయి పట్టుకుని దిద్దించింది. ఆమె చాలా ప్రశాంతంగా, ఆప్యాయంగా ఇంకా ప్రసన్నంగా కనిపించింది. ఆమె పేరు అయితే గుర్తులేదు గానీ ఆ రోజు అక్షరాలు దిద్దించిన ఆ పంతులమ్మ నా స్మృతిపథంలో ఈనాటికీ నిలిచి  ఉంది. అలా మొదలైన నా ప్రాథమిక విద్య మరో రెండు స్కూళ్లు మారాక పూర్తయింది.
  అప్పట్లో కొందరు ఉపాధ్యాయులు ట్యూషన్ ఫీజ్ అంటూ ఏమీ ఆశించకుండా సాయంత్రాలు వాళ్ళ ఇంటి వద్ద పిల్లలకు పాఠాలు చెప్తూ ఉండేవారు. అలా ట్యూషన్  చెప్పే ఓ మాస్టర్ గారి వద్దకు నేనూ  వెళ్లేదాన్ని. ఎక్కాల పుస్తకాలు ప్రింట్ చేసినవి అప్పట్లో విరివిగా దొరికేవి కావు. అందువల్ల ఆయన, తెల్ల కాగితాలతో చిన్న పుస్తకాలు కుట్టి, వాటిలో ఎక్కాలు  సొంతంగా చేత్తో రాసి పిల్లలకు ఇచ్చే వారు. ఓ సారి ఆయన ఇచ్చిన ఎక్కాల పుస్తకం పోగొట్టుకుని ట్యూషన్ కెళ్ళా. మాస్టారు బాగా కోప్పడతాడేమో అనుకుని బిక్క మొహం వేసుకుని భయపడుతూ ఓ మూల కూర్చున్నాను. విషయం తెలిసిన ఆయన నన్ను పల్లెత్తు మాట కూడా అనక వెంటనే మరో పుస్తకం తెచ్చి నా చేతిలో పెట్టాడు. ఆ సహనమూర్తి ఆనాటి నా జ్ఞాపకాల్లో ఓ చెరగని ముద్ర. ఆయన పేరు సుబ్బన్న గారు.
   ఐదవ తరగతి దాకా నేను స్కూల్లో  నేర్చుకున్న ఇంగ్లీషు కంటే ఇంటి వద్ద మా నాన్నగారు యం.వి. సుబ్బారెడ్డి (గామాగో) నేర్పించినదే చాలా ఎక్కువ. చార్టులు, స్కెచ్ పెన్నులు లేని    కాలమది. ప్రింటెడ్ చార్టులు  కూడా ఉండేవి  కాదు. అందువల్ల నాకు ఆంగ్ల అక్షరాలు నేర్పించడానికి ఆయన చేసిన పని ఒకటుంది. ఇంట్లో ఏదో ఒక ప్యాకేజీకి  వచ్చిన అట్టపెట్టెను  కత్తిరించి దానిపై తెల్లకాగితాలు అంటించారు. ఓ పుల్లను బ్రష్ లా   మలిచి దాన్ని సిరాలో అద్ది ఆ అట్టపై నాలుగు తరహాలు ABCD లు వ్రాశారు. దాన్ని  గోడకు తగిలించి, ప్రతిరోజు నాతో పలికిస్తూ రాయించేవారు. అదేవిధంగా ఆంగ్ల పాఠాలన్నీ స్కూల్లో కంటే ముందుగా ఇంట్లోనే బోధించేవారు. ఆ విధంగా తొలి రోజుల్లో మా నాన్నగారే నా తొలి ఆంగ్ల ఉపాధ్యాయుడయ్యాడు. 
   6, 7 తరగతులు చదివేటప్పుడు ఆ పాఠశాల హెడ్మాస్టర్ గారు ఇంటింటికీ  తిరిగి కథల పుస్తకాలు, మ్యాగజైన్ లు సేకరించి స్కూల్లో ఓ  అలమరలో వాటిని ఉంచి చిన్న సైజు లైబ్రరీ తయారు చేశారు. ప్రతీరోజూ  సాయంత్రం మమ్మల్ని కూర్చోబెట్టి  చదివించేవారు. ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకునేవారు. ఆయన సుబ్బారాయుడు మాస్టర్ గారు. ఇంట్లో మా నాన్నగారు కూడా ' చందమామ' తెలుగు, ఇంగ్లీష్ పిల్లల మాస పత్రికలు చందా కట్టి తెప్పించి నాతో చదివించేవారు. అలా పుస్తక పఠనం బాగా అలవాటైపో యింది.
   హైస్కూల్లో చేరాక అక్కడ విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. అలాగే ఉపాధ్యాయులు కూడా. సుశీలమ్మ గారని సైన్స్ టీచర్ ఉండేవారు అక్కడ.. ఆవిడ అంటే  అందరికీ హడల్.  ఆ  ఉపాధ్యాయిని  బోధించిన సైన్స్ పాఠాలు ఇప్పటికీ నాకు గుర్తే! ఎందుకో అప్పట్లో ఆమెను చూసి నాకూ టీచర్ అయితే బాగుండేది అనిపించేది.
    ఇంటర్లో శ్రీరాములు గారని తెలుగు లెక్చరర్ పద్య పఠనం, బోధన అమోఘంగా ఉండేవి. తెలుగు భాషపై మమకారం నాకు ఏర్పడింది ఆరోజుల్లోనే  ! చిన్న చిన్న కవితలు, కథలూ వ్రాసుకుంటూ ఉండేదాన్ని, కానీ ఎవరికీ చూపించేదాన్ని మాత్రం కాదు.
        మూడేళ్ల డిగ్రీ చదువు చకచకా ముగిసిపోయింది. ఆ పీరియడ్ లో ఒకరని కాదు గానీ లెక్చరర్స్ ను  చూసినప్పుడు భవిష్యత్ లో నాకూ లెక్చరర్ కావాలన్న కోరిక మాత్రం కలిగేది. డిగ్రీ తర్వాత అనుకోని విధంగా BEd  లో చేరి  పోయాను. అలా అలా ఉపాధ్యాయ వృత్తి నన్నాహ్వానించి క్రమంగా అదే నా బ్రతుకు తెరువైపోయింది. క్రమంగా నా  ఉద్యోగం మీద ఇష్టం బాగా పెరిగిపోయి అది  విద్యార్థులపై అవ్యాజానురాగంగా మారిన సందర్భాలూ లేకపోలేదు. తర్వాతికాలంలో  క్వాలిఫికేషన్ పెంచుకుని లెక్చరర్నీ అయిపోయాను. 
     ఎందుకో, ఈ గురు పూజోత్సవం రోజు వచ్చిందంటే చాలు..ఆ రోజులూ, దాంతోపాటు  నాకు చదువు చెప్పిన నా  గురువులు గుర్తుకొస్తూఉంటారు. అందుకనే ఈ నాలుగు మాటలు రాయాలనిపించింది. 

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
             గురుపూజోత్సవం సందర్భంగా
          ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

                                                        
                                      

Wednesday, September 3, 2025

పాఠశాల గేయం

పల్లవి :
మా పాఠశాల ఓ పర్ణశాల 
ఇది మాకు ఆలయం /ఇదియే మా భవితవ్యం 
మా మంచిగురువులు దైవస్వరూపాలు 
మా మార్గదర్శులు నడయాడు దేవతలు 
                                                   //మా పాఠశాల//
చరణం 1 : 
ఉదయాన ప్రార్థనలు / సందేశపాఠాలు 
తరగతిగది బోధనలు / నీతిసుధా కథనాలు
మరపురాని అనుభవాలు / మదినిండా జ్ఞాపకాలు 
మాకోసమే తరలివచ్చి మాకు దిశామార్గమిచ్చి 
చీకట్లను తొలగించి చిరుదివ్వెలు వెలిగించి 
చేయి పట్టి నడిపించీ  తలరాతను మార్చేసే 
మా మంచిగురువులు దైవస్వరూపాలు 
మా మార్గదర్శులు నడయాడే దేవతలు 
                                                      //మా పాఠశాల//
చరణం 2 :
బోధించు వేళల వారు మాకు గురువులు 
ఆటాడు సమయాన మా తోటి నేస్తాలు 
మా కష్టకాలాన భుజం తట్టు బాంధవులు 
నిత్య విద్యార్థులు / స్ఫూర్తికి నిదర్శనాలు
విద్యార్థి ఉన్నతే ఎనలేని సంతృప్తి వారికి
వారి చేత మా భవిత పొంది తీరు ఘనకీర్తి
మా మంచి గురువులు దైవస్వరూపాలు 
మా మార్గదర్శులు కనిపించే దేవతలు 
                                                      //మా పాఠశాల//





Monday, September 1, 2025

తెలతెలవారుతోంది...

 *****************************************
తెలతెలవారుతోంది..తలుపు తీసింది...
సూర్యోదయం పలకరించింది చిరునవ్వుతో..
ముంగిలి ఊడ్చింది...కల్లాపి జల్లింది..
భూమాత పరవశించింది..
ముత్యాలముగ్గు పెట్టింది..
మహలక్ష్మి గడపలో అడుగు పెట్టింది...
దేవుని ముందు దీపం వెలిగించింది.. 
గంటలు మ్రోగాయి...పనులు మొదలయ్యాయి..
గోడ మీద గడియారం ముల్లు సాగుతూ ఉంది..
తోడుగా పరుగులు తీస్తూ ఆమె !! 
అందర్నీ సిద్ధపరిచి సాగనంపింది..ఎవరామె ?
ఆ ఇంటి ఇల్లాలు..అలా అలా..
ఉదయం..మధ్యాహ్నం..సాయంత్రం..
దాటిపోయాయి..పనులకు కొదవలేదు ..
తీరిక..!క్షణం లేదు..! రాత్రీ గడిచింది..
తెల్లారింది..మళ్లీ మొదలు ! 
ఇది గృహిణి దినచర్య !!
" ఏం చేస్తావు నువ్వు? " అనడిగితే.. 
ఏమీ చేయనంటుంది...ఎదురు ప్రశ్నించదు..
"గడప దాటి పని చేస్తేనే ఉద్యోగమా?"అనదు...
ఆ తలపే రాదు మరి !!
సంపాదన నోచుకోని..పదవీ విరమణ ఎరుగని 
జీవితకాల 'ఉద్యోగం!'…వెల కట్టలేము...
ధర చెల్లించలేము...అది అమూల్యం!!  
అలసట దరిజేరినా..చిరునవ్వుతో తరిమేస్తుంది..
విసుగొచ్చినా ఓపిక కొని తెచ్చుకుంటుంది ! 
స్వార్థ చింతన..స్వీయ రక్షణ...
తలవని తరుణి...! తనకు మారుగా దైవం
ఇలకు పంపిన దైవ స్వరూపిణి !!
గృహాన్ని స్వర్గసీమగా మార్చి...
అలవోకగా నడిపే మంత్రిణి !!
ప్రతి ఇంటా తిరుగాడే ఆ ఇంటి దీపం...
అనునిత్యం నడయాడే వెన్నెల కెరటం !!
*********************************              ఆగస్ట్ 2025' విహంగ' మహిళా 
                 మాసపత్రికలో  ప్రచురితం            
*********************************