దేవుడు లేడూ లేడంటూ
ఏడీ ఎక్కడున్నాడో చూపించండంటూ
ప్రశ్నలు గుప్పిస్తూ జవాబుకై దబాయించే
మనుషులందరికీ తిరిగి ఒక ప్రశ్న! ఒకే ఒక్క ప్రశ్న !
భగభగ మండుతూ భూగోళమంతా
వెలుగులు విరజిమ్ముతూ
జీవకోటికి జవసత్వాలిస్తున్న భానుడు
కాడా కనిపించే భగవానుడు?
రేయంత వెండి వెన్నెల కురిపిస్తూ
చల్ల చల్లగా జనాల్ని సేదదీరుస్తూ
హాయిగొలిపే నిండు చందురుడు
కాడా కనిపించే దేవుడు?
గుండె గదులకు ఊపిరులూదుతూ
నిత్యం ప్రతినిత్యం శ్వాసలో శ్వాసగా
నిలుస్తూ చుట్టూ ఆవరించి ఉన్న ఈ గాలి
కాదా కనిపించే దేవుడు?
ఇందరు దేవుళ్లను కళ్ళెదురుగా చూస్తూ
ఇంకా దేవుడెక్కడ అంటూ చూపించమంటూ
ప్రశ్నలేమిటి ? అంతదాకా ఎందుకు--
దేశ క్షేమం కోసం స్వార్థం వీడి
సరిహద్దుల నిలిచి నిద్ర మరిచి
మనల్ని నిద్రబుచ్చుతూ
జనం కోసం తమ ప్రాణాలడ్డువేస్తూ
కాపుగాస్తున్న మన వీర సైనికులంతా
కారా కనిపించే దేవుళ్లు?
యావత్ప్రపంచాన్నీ గడగడలాడించిన
' కరోనా ' రక్కసికెదురొడ్డి పోరాడి
నమ్ముకున్న వాళ్ళని కంటికి రెప్పలా
కాచుకున్న అపర ధన్వంతరులు
వైద్యనారాయణులు
కారా కనిపించే దేవుళ్లు?
సవాల్ విసిరిన మహమ్మారిని
మట్టుబెట్టే మందు కోసం
మానవాళి మనుగడ కోసం
రేయింబవళ్ళు తపించిన మన శాస్త్రజ్ఞులు
కారా కనిపించే దేవుళ్లు?
కిరీటం దాల్చి నాలుగు చేతులు
శంఖు చక్రాలతో పట్టుపీతాంబరాలతో
ధగ ధగా మెరుస్తూ దర్శనమిస్తేనే దేవుడా!
ఆపదలో చేయందించే ప్రతి మనిషీ
కనిపించే దేవుడే ! ప్రతీ మంచి మనసూ
భగవత్స్వరూపమే !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
LRSR:
ReplyDeleteMarvelous! It is a Master piece!
ఎల్లప్పుడు ఇలాంటి అద్భుత కవిత్వాలు రాయాలి.
దైవాన్ని అద్భుతంగా దర్శింపజేశారు.
Thank you very much for your appreciation. 🙏🙏👃
ReplyDelete