Wednesday, July 31, 2024

పాదచారులు ప్రకృతి ప్రేమికులైన...


 🌲🍀🌿🌵🌳🌵🌿☘️🌾🍀🌲🪻🪴🍁🦠🌲
        
     రోడ్డువారగా పేరు తెలియని మొక్కలు...
     వరుణుడి దయతో మొలిచి 
     నిలిచిన అడవి అందాలు...!
     తరచి తరచి చూశామా...
     కనిపించగలవు కళాత్మక రూపాలు..
     ఆకులా అవి ! చిత్రకారుడు గీసిన ఆకృతులు..
     హరితవర్ణంతో మెరిసిపోతూ...
     ముద్దులొలుకుతూ ఆ పత్రదళాలు !
     పసుపువన్నెతో విచ్చుకున్న 
     ఆ చిన్ని చిన్ని పూరేకలు !!
     పరిమళభరితాలు కాకున్ననేమి...
     పాదచారులు ప్రకృతి ప్రేమికులైన
     ఇట్టే నిలబెట్టే మనోహర దృశ్యాలు !!
     మదిని సృజన ఉంటే చాలు...
     కవితాఝరులు పొంగిపొరలు !
     కాగితాలపై భావగీతాలుగ మారు !!
     పిచ్చిమొక్కలు కావివి....
     అలలు అలలుగా కదులుతూ భూమాతచే                 లాలించబడుతున్న పసిపాపలు !!
     దేవుని సృష్టిలో  తిరుగులేని భాగస్వాములు !!

🌲🌵🌴🌳🌿☘️🌲🌵🌳🌱🌲🌵🌿🌲🌴🌳

     
     


Wednesday, July 24, 2024

పాప వేదన ! అమ్మ సాంత్వన !... వర్తమానంలో ఓ సజీవ రూపకల్పన !

                                       
                                           
     🤱                          


అమ్మా 😔, 
    కలలు గంటున్నావా అమ్మా ! నీ చేతి స్పర్శ లోపలున్నా నాకెంత  హాయినిస్తోందో   తెలుసా! నులివెచ్చగా నున్న  ఈ చిన్ని  గది నాకెంత సౌకర్యంగా ఉందో, ఇంకా ఎంత రక్షణగా  అనిపిస్తోందో !.... కానీ... ఎందుకో  భయం భయంగా ఉందమ్మా.... ఈ నిశ్చింత ఇంక  కొద్ది రోజులేనని తలుచుకుంటుంటే... తర్వాత ఈ భూమి మీద కొచ్చి పడతాను కదా! ఇంత వరకు నన్ను చూడాలని నీవెంతగా ఎదురు చూస్తున్నావో, నాకూ నిన్ను చూడాలని అంతకంటే కోరికగా ఉందమ్మా... కానీ ఇప్పుడు ఎందుకనో ఆ కోరిక అణగారిపోతోందమ్మా ! వద్దమ్మా వద్దు,  కలలుగనడం మానెయ్యి... 
     ఈ భూమిపై  కాలు మోపాలనీ, నీ ఒడిలో బజ్జో వాలనీ ఆశగా ఎదురు చూశానింతవరకూ. కానీ బయట జరుగుతున్న ఘోరాలు వింటుంటే వణుకు పుడుతోందమ్మా. కారణం నీకూ  తెలుసు. నేటి సమాజంలో ఆడవాళ్ళ దుస్థితి తెలీని ఆడదుంటుందా? మగ తోడుంటే స్త్రీకి రక్షణ ఉంటుందనే వారు. కానీ అది ఒకప్పటి మాట.'నిర్భయ' చట్టం ఎలా వచ్చిందో ఎరుకే కదా! పశువుల నాడి తెలిసిన ఆ వైద్యురాలు పశువుల మధ్య ఉన్నంతవరకూ సురక్షితంగానే ఉండింది. క్రూర మృగాల కంటే భయంకరమైన మనుషుల నాడి మాత్రం పసిగట్టలేక బలైపోయింది. ఫలితంగానే కదమ్మా'దిశ ' చట్టం వచ్చింది! ఎన్ని చట్టాలొస్తేనేమి గాక ! ఆగు తున్నాయా  అకృత్యాలు ఆడవాళ్ళ పైన! పసి మొగ్గలని  కూడా చూడక, కనికరం లేక నికృష్టంగా ప్రవర్తిస్తూ, ప్రాణాలు సైతం తీసేస్తున్నారు కదమ్మా! మొన్న ఓ రమ్య! నిన్న ఓ స్వప్న ! ఎలాగమ్మా? అందుకే ఈ భయం!
     తొలిసారి నన్ను చూసి నువ్వు మురిసిపోతావు, గుండెలకు హత్తుకుంటావు. పాలిచ్చి  కడుపు నింపుతావు. ముద్దులిస్తావు, గోరుముద్దలు తినిపిస్తావు. రంగు రంగుల బట్టలేస్తావు. బుట్ట బొమ్మలా అలంకరిస్తావు. నాన్నేమో నన్ను బడిలో చేర్పిస్తాడు. ఇద్దరూ కలిసి నా చుట్టూ ఎన్నో ఆశలకలల  సౌధాలు కట్టుకుంటారు. తీరా ఫలం చేతికందే క్షణానికి ఏ దుండగీడి వక్ర చూపో నాపై సోకి, నన్ను చిదిమేస్తుంది ! వద్దమ్మా, ఆ నరకం నేను భరించలేను.
    పోనీ, అలా కాకున్నా... పెళ్లి చేసి ఓ ' అయ్య ' చేతిలో పెట్టి  బరువు బాధ్యతలు తీరిపోయాయని నిట్టూర్చి, నిశ్చింతగా ఉండే పరిస్థితి కూడా ప్రస్తుతం కానరావడం లేదు కదమ్మా! అక్కడ అత్తింటి ఆరళ్లు, గృహహింసలు, ఆగడాలు, అదనపు కట్నం వేధింపులు.... ఆపై హత్యలు!... చివరకు ఏ  ఉరితాడు నా ఊపిరి తీస్తుందో, ఏ సజీవదహనం నన్ను బూడిదగా మార్చేస్తుందో.... ! అంత మాత్రానికెందుకమ్మా నేనీభూమ్మీదకు రావడం! దానికన్నా ఏ అడవిలో నైనా మానై పుట్టడం నయం కదా ! ఎందరు తల్లుల గర్భశోకం ప్రతినిత్యం నువ్వు చూడడం లేదు చెప్పు! అంతా సవ్యంగా ఉంటే సరే !కానీ నిత్యం అకృత్యాలతో అరాచకంగా మారిపోయిన ఈ సమాజం ఆడపిల్లలకు ఆ భరోసా ఇస్తుందా  చెప్పు? 
    అనుక్షణం నువ్వు నా పక్కనుండలేవు. ప్రతి చోటా నాన్న నాకు పహరా కాయలేడు. స్వీయ రక్షణకా,  నా లేత వయసు సరిపోదు! మరెలాగమ్మా? మీ ఆశలన్నీ ఆవిరై  తీరని వేదన బ్రతుకంతా మిగిలిపోతుంది. ఇదంతా ఎందుకమ్మా ! అసలు నేనే లేకుంటే ఏ బాధా మిమ్మల్ని తాకలేదు కదా! అందుకే వద్దమ్మా, చెప్తున్నా, కలలు కనడం మానేయ్, నన్ను పూత లోనే చిదిమేయ్! ఇది పాపమే కావచ్చు! కానీ రేపటి నరకం కన్నా ఇది ఎంతో నయం కదా! నా మాట వినమ్మా, నా గోడు అర్థం చేసుకో...! 😔
      అర్ధరాత్రి ఆదమరిచి నిద్రిస్తున్న ఆ తల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. ఎక్కడో వెక్కివెక్కి ఏడుస్తూన్న ధ్వని ! కళ్ళు తెరిచి అటూ ఇటూ  చూసింది. పసిపాప ఏడుపు! ఎవరిదో !అంతటా నిశ్శబ్దం!ఓక్షణం నివ్వెరపోయినా, వెంటనే తమాయించుకుని సర్దుక్కూర్చుంది. ఆ సవ్వడి తన కడుపులోంచే వస్తున్న భావన ఆమెలో...  అప్రమత్తమై ఎత్తుగా ఉన్న తన కడుపు మీద రెండు చేతులూ ఉంచి, నెమ్మదిగా నిమురుతూ, జో కొడుతున్నట్టుగా అనునయించింది, లోపలున్న  పాపకు తెలిసేట్లుగా... 
    " నిజమే, కొద్దిరోజులుగా సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న విపరీత పోకడలు తనని మానసికంగా విచలితురాల్ని చేస్తున్న మాట వాస్తవమే. అది కాస్తా తన గర్భస్థ శిశువుపై పడినదా ఏమిటి ? దాని ఫలితమా ఇది ! అయినా తరచూ జరుగుతున్న అకృత్యాల్ని పదే పదే మనసులోకి తీసుకోవడం కూడా సరికాదేమో!"
    ఆ భావన మది లోకి రాగానే,  తన కర్తవ్యం ఏమిటో బోధపడి వెంటనే స్పందించిందా మాతృ హృదయం! 
" చిట్టి తల్లీ ! వద్దమ్మా, అలా అనకు. నీ కోసం వేయి  కళ్లతో నేనూ, మీ నాన్న ఎదురుచూస్తున్నామురా  కన్నా! చుట్టూ జరుగుతున్న అకృత్యాలకు వెరచి అలా ఆలోచించకు తల్లీ, నీకు మేమున్నాము. జీవితం అంటే  సమస్యలు అతి సహజం. వాటినెదుర్కొంటూ సాగిపోవడం లోనే ఉంది అంతా. మానసిక స్థైర్యం అన్నది మనిషికి చాలా అవసరంరా నా బంగారుతల్లీ ! సమాజం పట్ల, బ్రతుకు పట్ల వ్యతిరేక భావన పెంచుకొని భీతిల్లకు.... 
... మంచీ, చెడూ ఎక్కడైనా ఉంటాయి. చెడును మాత్రమే చూడడం, ఆడపిల్లగా పుట్టడమే వద్దనుకోవడం కూడదమ్మా.  చెడు తో పాటు మంచి కూడా ఉంటుందని లేకుంటే ఈ జగత్తంతా ఎప్పుడో అంతరించి ఉండేదని తెలుసుకో నా చిట్టి తల్లీ ! 
.... జీవితమంటేనే  పోరాటం. ధైర్యం గా ఉండటం అలవరచుకోవాలి. అదే మనకు సదా రక్ష !మన ఆత్మవిశ్వాసమే మనకు పెట్టని కోట ! కష్టాలకు భయపడీ, సమస్యలతో బాధపడీ బ్రతుకులోని తీపిని ఆస్వాదించడం మరువకూడదమ్మా! నీ కోసం ఈ సృష్టిలో ఎన్నెన్నో అందాలు, మరెన్నో ఆనందాలు సిద్ధంగా ఉన్నాయి, నీ రాకకై వేచి చూస్తున్నాయి. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. సరేనా..."
 ఓదారుస్తున్నట్లుగా, అనునయంగా అంది రెండు చేతులతో తడుతూ. తల్లి  మాటలు సాంత్వన నిచ్చాయోఏమో, లోపల ఏడుపు మెల్లిగా ఆగిపోయిన భావన ఆ తల్లిలో ! మెల్లిగా జోకొడుతూ అలా కళ్లు మూసుకుంది. శిశువుకేమర్థమయిందో ఏమోమరి !తల్లిని నిరాశపరచకూడదనుకుందో, లేక పరిస్థితులకు రాజీ పడాలనుకుందో లేక 'అమ్మ 'లాలన సాంత్వన నిచ్చి నిజంగానే ధైర్యం కలిగి శక్తి పుంజుకుందో --  లోపల అలజడి మాత్రం తగ్గిపోయింది. కుదుటబడ్డ ఆ తల్లి మనసు మెల్లిగా నిద్రలోకి జారుకుంది.
    --- ఇది ఓ గర్భస్థశిశువు వేదన ! ఓ తల్లి సాంత్వన!  ఏదిఏమైనా, నేడు ప్రతీ ఆడపిల్లకూ ఈ ధైర్యవచనాలు చాలా... చాలా అవసరం !!👋


👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋🫲🫲







Monday, July 15, 2024

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే..21... ఓ వెన్నెలరాత్రి...ఎడ్లబండిలో ప్రయాణం...


     జీవితమనే ప్రయాణంలో అనుకున్నవీ, అనుకోనివీ ఎన్నో జరుగుతుంటాయి. అవన్నీ అనుభవాల రూపంలో మదిలో నిలిచిపోతుంటాయి. వాటిలో తీపి,చేదు రెండూ ఉంటాయి. అందులో కొన్ని కొంతకాలం వరకే  ఉంటూ, ఆ తరువాత మరుగున పడిపోతుంటాయి. 
    కానీ... కొన్ని మాత్రం ఏళ్ళు గడుస్తున్నా అదేమిటో ఏమాత్రం చెక్కు చెదరక స్థిరంగా పాతుకొని పోయి ఉంటాయి. వాటిలోనూ తీపి, చేదు రెండూ ఉంటాయి. అలాంటి వాటిలో నా చిన్నతనంలో ఓ తీపి జ్ఞాపకం... చిన్నదే...  కానీ దశాబ్దాలు గడిచినా... గుర్తుకు వచ్చినప్పుడు... అదీ... ఏ వెన్నెలరాత్రో బయట ఉండే సందర్భం అనుకోకుండా ఎదురైనప్పుడు నా మదిలో అలా క్షణకాలం తళుక్కున మెరిసి, అంతలోనే మాయమైపోతూ ఉంటుంది...
    నేను హైస్కూల్ లో చదువుతున్న రోజులవి. ఆ రోజుల్లో టెంట్ సినిమా అంటే ఆతరం వాళ్ళలో తెలియని వాళ్ళు ఉండరు.టౌన్లలో థియేటర్లు లేని చోట ఈ టెంట్ ( డేరా )సినిమాహాళ్ళు ఒకటి, రెండు ఉండేవి. వీటిని హాళ్ళు(థియేటర్స్) అని  కూడా అనలేము.అప్పటి జనాలకు  అవే ఏకైక కాలక్షేపాలు,వినోదాలు! చుట్టుపక్కల పల్లెటూర్ల వాళ్లంతా పండగ పబ్బాలకు ఎద్దుల బండ్లు కట్టుకుని సాయంత్రనికంతా టౌన్ చేరుకొని.. మొదటాట, రెండో ఆట చూసుకుని అర్ధరాత్రి పూట తిరిగి బండ్లు ఎక్కి వాళ్ళ ఊర్లకు వెళ్లిపోయేవాళ్లు. మాట్నీ షో ఉండేది కాదు, పగలు బొమ్మ కనిపించదు కాబట్టి...ఇక్కడ చెప్పదగ్గ ఓ విషయం ఒకటుంది.. అంత అర్ధరాత్రి అయినా, ఒక్కోసారి అందరూ ఆడవాళ్లే బండిలో ఉన్నా ఏమాత్రం భయమన్నది ఎవరికీ ఉండేది కాదు.నిశ్చింతగా కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ ప్రయాణం సాగించేవారు.అదే ఈరోజుల్లో... రాత్రి తొమ్మిది గంటలకే భయపడే పరిస్థితి !! సమాజం ఎంత మారిపోయిందీ అనిపిస్తుంది అది తలచుకుంటే...!
   కర్నూలు జిల్లా (ఇప్పుడు నంద్యాల) కోవెలకుంట్లకు నాలుగు మైళ్ళ దూరాన ఉంటుంది మా ఊరు. మా ఊరు నుండి కూడా అలాగే వెళ్లే వాళ్లంతా.. ఎడ్ల బండి లేనివాళ్లు బాడుగ బండి కట్టించుకుని వెళ్లేవారు. అందుకోసం మూడు నుండి ఐదు రూపాయలు బాడుగ తీసుకునేవాళ్ళు. సాయంత్రం నాలుగింటికంతా అంతా భోజనాలు చేసేసి, ఏవైనా చిరుతిళ్ళు మూటగట్టుకుని ఇరుగుపొరుగు ఆరేడు మంది బండి మాట్లాడుకుని బయలుదేరే వాళ్ళు. సినిమా అంటే పిచ్చి ఉన్న వాళ్లకు చాలా సరదాగా ఉండేది ఆతతంగం.. పెద్దగా ఆసక్తి లేని వాళ్లేమో ఎందుకు వచ్చిన బాధరా బాబూ.. అని కూడా అనేవాళ్ళు. మా అమ్మ అందులో ఒకరు. ఆమె సినిమాలు అంటే పెద్దగా ఇష్టపడేది కాదు. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, సూర్యకాంతం... వీళ్ళు తప్ప వేరే ఎవరూ తెలియదు ఆమెకు. గుర్తుపట్టలేదు కూడా. అలాంటి మా అమ్మ ఒకసారి ఎందుకో ఏమో గానీ, తనకి తాను ప్రస్తావించి, 
" రేపు బండి కట్టించుకొని సినిమాకు పోదాం. పీరుసాబుతో చెప్తా, బండి కట్టమని.. "
అని చెప్పింది నాతో. నాకు ఆశ్చర్యం...  ఆనందం!!
   మరుసటి రోజు సాయంత్రం తెలిసినవాళ్లు మరో ముగ్గురు ఆడవాళ్లు తయారై వచ్చారు. సాయంత్రం... నాలుగింటికి బండి కదిలింది.6.30 కి సినిమా మొదలై అయిపోయేసరికి పది దాటింది. ఆ సినిమా పేరు అయితే గుర్తులేదు నాకు. టెంట్ సినిమా కదా.. మూడు, నాలుగు ఇంటర్వెల్స్ ఉంటాయి. చాలాసేపు చూడాల్సి వచ్చేది మరి..! అయినా విసుగొచ్చేది కాదు. అయ్యో అప్పుడే అయిపోయిందా! అని కూడా అనిపించేది.
   పదిన్నరకు తిరుగు ప్రయాణం మొదలైంది. సరిగ్గా ఆ రాత్రి పౌర్ణిమ.! పిండారబోసినట్లు వెన్నెల హాయి గొలుపుతూ ఉంది. అంతా నిశ్శబ్దం!! ఎద్దుల మెడలో గంటల చప్పుళ్లు లయబద్ధంగా వినిపిస్తున్నాయి. మధ్య మధ్యలో  పీరుసాబు అదిలింపులు! పదకొండవుతోంది. నాకేమో నిద్రమత్తు ఆవహించేసింది. బాగా అలసిపోయానేమో.. కళ్ళు మూతలు పడిపోతూ జోగుతున్న నన్ను పక్కనున్న మా అమ్మ దగ్గరగా తీసుకొని ఒడిలో పడుకోబెట్టుకుంది. కళ్ళు మూసుకుని మెల్లిగా నిద్రలోకి జారిపోయాను. కుదుపులకు మెలకువ వచ్చినప్పుడల్లా... కళ్ళు తెరిచి చూడడం...! పైన నల్లని ఆకాశంలో జిగేలుమంటూ తెల్లటి నక్షత్రాలు మెరుస్తూ... మధ్యలో పసిమి వర్ణంలో గుండ్రంగా మెరిసిపోతూ చందమామ!!ఎంత చక్కని దృశ్యం !
   అదలా ఓ ఫోటోలా నా హృదయఫలకం మీద ముద్రించుకుపోయింది. మధ్య మధ్యలో అమ్మ చేయి నా చెంపలను తాకుతూఉన్న చల్లని స్పర్శతో సహా..! టౌన్ కూ, మా ఊరికి మధ్య ఏటిపై బ్రిటిష్ కాలం నాటి ఓ వంతెన ఉండేది. దానిమీద బండి కదిలిపోతూ  మెల్లమెల్లగా మరో గంట తర్వాత ఇల్లు చేరాము. ఆ తర్వాత మంచంపై పడి ఆదమరిచి నిద్రించడం వరకే తెలుసు.ఏళ్ళు గడిచిపోయాయి ఇప్పటికి ఇది జరిగి...
  ఓ వెన్నెలరాత్రి కొన్ని గంటలు మాత్రమే సాగిన ఈ పయనం ఇప్పటికీ అలా హత్తుకుని పోయి నిక్షిప్తమై నిలిచిపోయింది జ్ఞాపకాల్లో.. ఆ రాత్రి ఆ ప్రయాణం... ఆకాశంలో చుక్కలు...చందమామ.. చల్లని గాలి... అన్నింటినీ మించి అమ్మ చేతి స్పర్శ!! ఇప్పుడు తిరిగి రమ్మంటే వస్తాయా!! రావు... రానేరావు.. ఎంత పిలిచినా...! కళ్ళ నుండి ధారలుగా కారే కన్నీళ్లు దప్ప!!

( టెంట్ సినిమా గురించిన మరి కొన్ని జ్ఞాపకాలు ఇదే బ్లాగులో " టెంట్ సినిమా...ఓ జ్ఞాపకం " అన్న శీర్షికతో 11.10.23 నాటి పోస్టులో వ్రాయబడినది.) 

🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂

Sunday, July 7, 2024

సొంతంగా కొనుక్కో, సంతోషం సొంతం చేసుకో...చిన్న కథ

 "  ఇది లేటెస్ట్ మోడల్ టీవీ, ఈ సోఫా సెట్ ఏమో కిందటి నెల షాపులోకొచ్చిందట, ఇంకా ఆ డైనింగ్ టేబుల్, వాషింగ్ మెషిన్, కుక్కర్.... " 
" ఆగాగు.. "
చెప్పుకుంటూపోతున్న రాజేష్ ను మధ్యలోనే ఆపేశాడు విశాల్. 
"... ఏమిటీ, ఇవన్నీ ఇన్స్టాల్ మెంట్ బేసిస్ మీద కొన్నావా ఏమిటి? "
" ఆ అవసరం నాకేంటి ! అన్నీ మా మామగారే ఇప్పించారు... "
" అవునా, కట్నం బాగానే ఇచ్చారన్నావుగా, మరి ఇవన్నీ..."
" కానుకలు... " నవ్వుతూ అన్నాడు రాజేష్. 
" అంతా కలిపి బాగానే కొట్టేశావ్, " లోలోపల అనుకున్నాడు విశాల్.
   రాజేష్ కు రెణ్ణెళ్ల క్రితం పెళ్లయింది. విశాల్ పెళ్ళికి వెళ్ళలేకపోయాడు. ఈరోజు ఆఫీస్ అయ్యాక విశాల్ ను  వెంటబెట్టుకుని ఇంటికి తీసుకు వచ్చాడు రాజేష్.మూడు నెలల క్రితం అతను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఓసారి వచ్చాడీ ఇంటికి విశాల్. అప్పుడు ఇల్లంతా ఖాళీగా ఉంది. రెండు కుర్చీలు, ఓ చిన్న టీపాయ్ తప్ప.
" ఇప్పుడివన్నీ చూపించడానికే తనని బలవంతంగా లాక్కువచ్చాడులా  ఉంది " అనుకున్నాడు విశాల్.
 ఈలోగా రాజేష్ భార్య కాఫీ కప్పులతో వచ్చింది.
" నా మిసెస్..   ప్రమద.. " అంటూ పరిచయం చేశాడు రాజేష్. అతి మామూలుగా ఉన్నా ఎంతో ప్రసన్నంగా ఉంది ఆ అమ్మాయి. విశాల్ కు నమస్కరించి లోనికి వెళ్లి పోయింది ప్రమద. 
" అవునూ, నెల క్రితం పెళ్లిచూపులకెళ్లానన్నావ్, ఏమయిందీ, " అడిగాడు రాజేష్.
" దాదాపు సెటిల్  అయిపోయినట్లే. అమ్మాయి డిగ్రీ పూర్తి చేసింది. టైపిస్ట్ గా చిన్న ఉద్యోగం కూడా చేస్తోంది. ఆయనకిద్దరూ అమ్మాయిలే. పెద్దగా కట్నం ఇచ్చుకోలేనని ముందే చెప్పేశాడు. కుటుంబం బాగుంది. నాకు అమ్మాయి నచ్చింది. మా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు..."
" అయ్యో.. ఎందుకలా!.. ఇంకాస్త ఆగితే పెద్ద సంబంధమే వచ్చేదేమో కదా,.. " మధ్యలో అందుకుని అన్నాడు రాజేష్.
" వద్దు రాజేష్,.. అమ్మాయి నచ్చినప్పుడు మిగతా విషయాల గురించి నేను ఆలోచించదలుచుకోలేదు. అందుకే ఓకే చెప్పేసాను. " 
" మరీ, ఏమీ లేకుండా... ఎలా!" 
" నాకు ఉన్నదాంట్లోనే అన్నీ అమర్చుకుంటాను. భార్య తెచ్చేవేవీ  నేను ఆశించ దలుచుకోలేదు.. ఏదైనా ఎంత చిన్నదైనా సొంతంగా కొనుక్కుంటేనే నాకు తృప్తిగా, సంతోషంగా ఉంటుంది రాజేష్... ఇక వస్తా మరి..." అంటూ లేచాడు.
  రాజేష్ కు సూటిగా తగిలాయా మాటలు. అయినా లెక్క చేయనట్లు తల తిప్పుకున్నాడు.
   లోపల ప్రమదకు వీరి సంభాషణ అంతా చెవిని బడుతూనే ఉంది.
" ఇతన్ని చేసుకోబోయే ఆ అమ్మాయి  ఎంత  అదృష్టవంతురాలు ! నా పెళ్ళికి మా నాన్న చేసిన అప్పులు తీరాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది. ఈలోగా చెల్లి తానూ పెళ్ళికి సిద్ధంగా ఉంటుంది. పైగా తమ్ముడి చదువొకటి ! " 
   తన పెళ్లి తర్వాత, కూతురి పెళ్లి చేశానన్న ఆనందం ఆయన మొహంలో ఎక్కడా ఆమెకు కనిపించలేదు. క్షణ కాలం తండ్రి దీనవదనం గుర్తొచ్చిన ఆమె కళ్ళలో పల్చటి నీటి తెర !!

******************************************






Monday, July 1, 2024

ఆమెకు వెల్కమ్... మరి గుడ్ బై ఎవరికి ?!


*****************************************
 తెలతెలవారుతుండగా...
 వినిపిస్తుందో  'విజిల్ '...!
 అదో అరుపు...!
 అలారం అవసరంలేని ఆ పిలుపు 
 ఇంటింటికీ మేలుకొలుపు...
 చటుక్కున లేచి చిటికెలో
 చెత్తబుట్టలుచ్చుకుని 
 పరుగో పరుగు..!!
 బయట ట్రాలీ తోసుకుంటూ..
 అటు ఇటు చూస్తూ...
 కంటబడుతుందో కష్టజీవి...
 చెత్త సేకరణ  డ్యూటీ చేస్తూ...
 
                                

 ఆ సమయంలో తనోయోధురాలు...
 అలవోకగా అందర్నీ 
 వెలికి రప్పించే ఘటికురాలు...
 అరక్షణం ఆలస్యాన్ని సహించదు..!
 సాగిపోతుంది తన బండితో ముందుకు... 
 అంతటి పనిమంతురాలు !
 తన రాకతో ప్రతి ఇల్లు పరిశుభ్రం 
 ఆరోగ్యం..ఆ ఇంటివారి  సొంతం...
 అందుకే చెబుదాం 
 ఆమెకు వెల్కమ్ 🙂
 పేరుకున్న చెత్తకేమో గుడ్ బై ..🙂

********************************