Monday, July 15, 2024

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే..21... ఓ వెన్నెలరాత్రి...ఎడ్లబండిలో ప్రయాణం...


     జీవితమనే ప్రయాణంలో అనుకున్నవీ, అనుకోనివీ ఎన్నో జరుగుతుంటాయి. అవన్నీ అనుభవాల రూపంలో మదిలో నిలిచిపోతుంటాయి. వాటిలో తీపి,చేదు రెండూ ఉంటాయి. అందులో కొన్ని కొంతకాలం వరకే  ఉంటూ, ఆ తరువాత మరుగున పడిపోతుంటాయి. 
    కానీ... కొన్ని మాత్రం ఏళ్ళు గడుస్తున్నా అదేమిటో ఏమాత్రం చెక్కు చెదరక స్థిరంగా పాతుకొని పోయి ఉంటాయి. వాటిలోనూ తీపి, చేదు రెండూ ఉంటాయి. అలాంటి వాటిలో నా చిన్నతనంలో ఓ తీపి జ్ఞాపకం... చిన్నదే...  కానీ దశాబ్దాలు గడిచినా... గుర్తుకు వచ్చినప్పుడు... అదీ... ఏ వెన్నెలరాత్రో బయట ఉండే సందర్భం అనుకోకుండా ఎదురైనప్పుడు నా మదిలో అలా క్షణకాలం తళుక్కున మెరిసి, అంతలోనే మాయమైపోతూ ఉంటుంది...
    నేను హైస్కూల్ లో చదువుతున్న రోజులవి. ఆ రోజుల్లో టెంట్ సినిమా అంటే ఆతరం వాళ్ళలో తెలియని వాళ్ళు ఉండరు.టౌన్లలో థియేటర్లు లేని చోట ఈ టెంట్ ( డేరా )సినిమాహాళ్ళు ఒకటి, రెండు ఉండేవి. వీటిని హాళ్ళు(థియేటర్స్) అని  కూడా అనలేము.అప్పటి జనాలకు  అవే ఏకైక కాలక్షేపాలు,వినోదాలు! చుట్టుపక్కల పల్లెటూర్ల వాళ్లంతా పండగ పబ్బాలకు ఎద్దుల బండ్లు కట్టుకుని సాయంత్రనికంతా టౌన్ చేరుకొని.. మొదటాట, రెండో ఆట చూసుకుని అర్ధరాత్రి పూట తిరిగి బండ్లు ఎక్కి వాళ్ళ ఊర్లకు వెళ్లిపోయేవాళ్లు. మాట్నీ షో ఉండేది కాదు, పగలు బొమ్మ కనిపించదు కాబట్టి...ఇక్కడ చెప్పదగ్గ ఓ విషయం ఒకటుంది.. అంత అర్ధరాత్రి అయినా, ఒక్కోసారి అందరూ ఆడవాళ్లే బండిలో ఉన్నా ఏమాత్రం భయమన్నది ఎవరికీ ఉండేది కాదు.నిశ్చింతగా కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ ప్రయాణం సాగించేవారు.అదే ఈరోజుల్లో... రాత్రి తొమ్మిది గంటలకే భయపడే పరిస్థితి !! సమాజం ఎంత మారిపోయిందీ అనిపిస్తుంది అది తలచుకుంటే...!
   కర్నూలు జిల్లా (ఇప్పుడు నంద్యాల) కోవెలకుంట్లకు నాలుగు మైళ్ళ దూరాన ఉంటుంది మా ఊరు. మా ఊరు నుండి కూడా అలాగే వెళ్లే వాళ్లంతా.. ఎడ్ల బండి లేనివాళ్లు బాడుగ బండి కట్టించుకుని వెళ్లేవారు. అందుకోసం మూడు నుండి ఐదు రూపాయలు బాడుగ తీసుకునేవాళ్ళు. సాయంత్రం నాలుగింటికంతా అంతా భోజనాలు చేసేసి, ఏవైనా చిరుతిళ్ళు మూటగట్టుకుని ఇరుగుపొరుగు ఆరేడు మంది బండి మాట్లాడుకుని బయలుదేరే వాళ్ళు. సినిమా అంటే పిచ్చి ఉన్న వాళ్లకు చాలా సరదాగా ఉండేది ఆతతంగం.. పెద్దగా ఆసక్తి లేని వాళ్లేమో ఎందుకు వచ్చిన బాధరా బాబూ.. అని కూడా అనేవాళ్ళు. మా అమ్మ అందులో ఒకరు. ఆమె సినిమాలు అంటే పెద్దగా ఇష్టపడేది కాదు. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, సూర్యకాంతం... వీళ్ళు తప్ప వేరే ఎవరూ తెలియదు ఆమెకు. గుర్తుపట్టలేదు కూడా. అలాంటి మా అమ్మ ఒకసారి ఎందుకో ఏమో గానీ, తనకి తాను ప్రస్తావించి, 
" రేపు బండి కట్టించుకొని సినిమాకు పోదాం. పీరుసాబుతో చెప్తా, బండి కట్టమని.. "
అని చెప్పింది నాతో. నాకు ఆశ్చర్యం...  ఆనందం!!
   మరుసటి రోజు సాయంత్రం తెలిసినవాళ్లు మరో ముగ్గురు ఆడవాళ్లు తయారై వచ్చారు. సాయంత్రం... నాలుగింటికి బండి కదిలింది.6.30 కి సినిమా మొదలై అయిపోయేసరికి పది దాటింది. ఆ సినిమా పేరు అయితే గుర్తులేదు నాకు. టెంట్ సినిమా కదా.. మూడు, నాలుగు ఇంటర్వెల్స్ ఉంటాయి. చాలాసేపు చూడాల్సి వచ్చేది మరి..! అయినా విసుగొచ్చేది కాదు. అయ్యో అప్పుడే అయిపోయిందా! అని కూడా అనిపించేది.
   పదిన్నరకు తిరుగు ప్రయాణం మొదలైంది. సరిగ్గా ఆ రాత్రి పౌర్ణిమ.! పిండారబోసినట్లు వెన్నెల హాయి గొలుపుతూ ఉంది. అంతా నిశ్శబ్దం!! ఎద్దుల మెడలో గంటల చప్పుళ్లు లయబద్ధంగా వినిపిస్తున్నాయి. మధ్య మధ్యలో  పీరుసాబు అదిలింపులు! పదకొండవుతోంది. నాకేమో నిద్రమత్తు ఆవహించేసింది. బాగా అలసిపోయానేమో.. కళ్ళు మూతలు పడిపోతూ జోగుతున్న నన్ను పక్కనున్న మా అమ్మ దగ్గరగా తీసుకొని ఒడిలో పడుకోబెట్టుకుంది. కళ్ళు మూసుకుని మెల్లిగా నిద్రలోకి జారిపోయాను. కుదుపులకు మెలకువ వచ్చినప్పుడల్లా... కళ్ళు తెరిచి చూడడం...! పైన నల్లని ఆకాశంలో జిగేలుమంటూ తెల్లటి నక్షత్రాలు మెరుస్తూ... మధ్యలో పసిమి వర్ణంలో గుండ్రంగా మెరిసిపోతూ చందమామ!!ఎంత చక్కని దృశ్యం !
   అదలా ఓ ఫోటోలా నా హృదయఫలకం మీద ముద్రించుకుపోయింది. మధ్య మధ్యలో అమ్మ చేయి నా చెంపలను తాకుతూఉన్న చల్లని స్పర్శతో సహా..! టౌన్ కూ, మా ఊరికి మధ్య ఏటిపై బ్రిటిష్ కాలం నాటి ఓ వంతెన ఉండేది. దానిమీద బండి కదిలిపోతూ  మెల్లమెల్లగా మరో గంట తర్వాత ఇల్లు చేరాము. ఆ తర్వాత మంచంపై పడి ఆదమరిచి నిద్రించడం వరకే తెలుసు.ఏళ్ళు గడిచిపోయాయి ఇప్పటికి ఇది జరిగి...
  ఓ వెన్నెలరాత్రి కొన్ని గంటలు మాత్రమే సాగిన ఈ పయనం ఇప్పటికీ అలా హత్తుకుని పోయి నిక్షిప్తమై నిలిచిపోయింది జ్ఞాపకాల్లో.. ఆ రాత్రి ఆ ప్రయాణం... ఆకాశంలో చుక్కలు...చందమామ.. చల్లని గాలి... అన్నింటినీ మించి అమ్మ చేతి స్పర్శ!! ఇప్పుడు తిరిగి రమ్మంటే వస్తాయా!! రావు... రానేరావు.. ఎంత పిలిచినా...! కళ్ళ నుండి ధారలుగా కారే కన్నీళ్లు దప్ప!!

( టెంట్ సినిమా గురించిన మరి కొన్ని జ్ఞాపకాలు ఇదే బ్లాగులో " టెంట్ సినిమా...ఓ జ్ఞాపకం " అన్న శీర్షికతో 11.10.23 నాటి పోస్టులో వ్రాయబడినది.) 

🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂

No comments:

Post a Comment