" ఇది లేటెస్ట్ మోడల్ టీవీ, ఈ సోఫా సెట్ ఏమో కిందటి నెల షాపులోకొచ్చిందట, ఇంకా ఆ డైనింగ్ టేబుల్, వాషింగ్ మెషిన్, కుక్కర్.... "
" ఆగాగు.. "
చెప్పుకుంటూపోతున్న రాజేష్ ను మధ్యలోనే ఆపేశాడు విశాల్.
"... ఏమిటీ, ఇవన్నీ ఇన్స్టాల్ మెంట్ బేసిస్ మీద కొన్నావా ఏమిటి? "
" ఆ అవసరం నాకేంటి ! అన్నీ మా మామగారే ఇప్పించారు... "
" అవునా, కట్నం బాగానే ఇచ్చారన్నావుగా, మరి ఇవన్నీ..."
" కానుకలు... " నవ్వుతూ అన్నాడు రాజేష్.
" అంతా కలిపి బాగానే కొట్టేశావ్, " లోలోపల అనుకున్నాడు విశాల్.
రాజేష్ కు రెణ్ణెళ్ల క్రితం పెళ్లయింది. విశాల్ పెళ్ళికి వెళ్ళలేకపోయాడు. ఈరోజు ఆఫీస్ అయ్యాక విశాల్ ను వెంటబెట్టుకుని ఇంటికి తీసుకు వచ్చాడు రాజేష్.మూడు నెలల క్రితం అతను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఓసారి వచ్చాడీ ఇంటికి విశాల్. అప్పుడు ఇల్లంతా ఖాళీగా ఉంది. రెండు కుర్చీలు, ఓ చిన్న టీపాయ్ తప్ప.
" ఇప్పుడివన్నీ చూపించడానికే తనని బలవంతంగా లాక్కువచ్చాడులా ఉంది " అనుకున్నాడు విశాల్.
ఈలోగా రాజేష్ భార్య కాఫీ కప్పులతో వచ్చింది.
" నా మిసెస్.. ప్రమద.. " అంటూ పరిచయం చేశాడు రాజేష్. అతి మామూలుగా ఉన్నా ఎంతో ప్రసన్నంగా ఉంది ఆ అమ్మాయి. విశాల్ కు నమస్కరించి లోనికి వెళ్లి పోయింది ప్రమద.
" అవునూ, నెల క్రితం పెళ్లిచూపులకెళ్లానన్నావ్, ఏమయిందీ, " అడిగాడు రాజేష్.
" దాదాపు సెటిల్ అయిపోయినట్లే. అమ్మాయి డిగ్రీ పూర్తి చేసింది. టైపిస్ట్ గా చిన్న ఉద్యోగం కూడా చేస్తోంది. ఆయనకిద్దరూ అమ్మాయిలే. పెద్దగా కట్నం ఇచ్చుకోలేనని ముందే చెప్పేశాడు. కుటుంబం బాగుంది. నాకు అమ్మాయి నచ్చింది. మా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు..."
" అయ్యో.. ఎందుకలా!.. ఇంకాస్త ఆగితే పెద్ద సంబంధమే వచ్చేదేమో కదా,.. " మధ్యలో అందుకుని అన్నాడు రాజేష్.
" వద్దు రాజేష్,.. అమ్మాయి నచ్చినప్పుడు మిగతా విషయాల గురించి నేను ఆలోచించదలుచుకోలేదు. అందుకే ఓకే చెప్పేసాను. "
" మరీ, ఏమీ లేకుండా... ఎలా!"
" నాకు ఉన్నదాంట్లోనే అన్నీ అమర్చుకుంటాను. భార్య తెచ్చేవేవీ నేను ఆశించ దలుచుకోలేదు.. ఏదైనా ఎంత చిన్నదైనా సొంతంగా కొనుక్కుంటేనే నాకు తృప్తిగా, సంతోషంగా ఉంటుంది రాజేష్... ఇక వస్తా మరి..." అంటూ లేచాడు.
రాజేష్ కు సూటిగా తగిలాయా మాటలు. అయినా లెక్క చేయనట్లు తల తిప్పుకున్నాడు.
లోపల ప్రమదకు వీరి సంభాషణ అంతా చెవిని బడుతూనే ఉంది.
" ఇతన్ని చేసుకోబోయే ఆ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు ! నా పెళ్ళికి మా నాన్న చేసిన అప్పులు తీరాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది. ఈలోగా చెల్లి తానూ పెళ్ళికి సిద్ధంగా ఉంటుంది. పైగా తమ్ముడి చదువొకటి ! "
తన పెళ్లి తర్వాత, కూతురి పెళ్లి చేశానన్న ఆనందం ఆయన మొహంలో ఎక్కడా ఆమెకు కనిపించలేదు. క్షణ కాలం తండ్రి దీనవదనం గుర్తొచ్చిన ఆమె కళ్ళలో పల్చటి నీటి తెర !!
******************************************
No comments:
Post a Comment