Monday, August 7, 2023

థాంక్యూ సౌమ్యా...!

🌺

                                           ~~ యం. ధరిత్రీ దేవి ~~

"అయితే రాజేంద్రనాథ్ నిన్ను ప్రేమిస్తున్నాడంటావ్..."
" అవును సౌమ్యా, సంవత్సరం క్రితం మొదలైన మా పరిచయం ప్రేమగా మారడానికి ఎన్నో రోజులు పట్టలేదు.
"... మంచిదే కళ్యాణీ,కానీ ఒక మాట,  నీ కుటుంబ స్థితిగతులు నీకు బాగా తెలుసు. బీటెక్ లో ఫ్రీ సీట్ తెచ్చుకున్నావు గనుక మీ నాన్న నిన్ను చదివించగలుగుతున్నాడు. అతనేమో డబ్బులో  పుట్టి , డబ్బులో పెరిగిన వాడంటున్నావు. కోట్లాది ఆస్తికి వారసుడంటున్నావు. అతని వరకు ఓకే... కానీ... అతని ఇంట్లో ఓకే అంటారా...! మీ ఇరు కుటుంబాల మధ్య చాలా అంతరం ఉంది కల్యాణీ . నిన్ను ఆ ఇంటి కోడలిగా అంగీకరిస్తారంటావా... ఆలోచించు..."
" నాకు రాజేంద్ర మీద పూర్తి నమ్మకం ఉంది సౌమ్యా. వాళ్ళింట్లో చెప్పి ఒప్పిస్తానని చెప్పాడు..."
"...ఒప్పిస్తానంటున్నాడు. ఇతను చెప్పగానే సరే అని వాళ్ళు వెంటనే అనకపోతేనే కదా ఒప్పించే ప్రయత్నం చేయాల్సివచ్చేది..."
వెంటనే అందుకుని అంది సౌమ్య. ఆ మాటకు కళ్యాణిలో ఆలోచన మొదలైంది.
                     **             **           **
" సరే కళ్యాణీ, ఈ వీకెండ్ నేను మా ఊరికెళ్తాను. ఈ ఇయర్   నా B.Tech కంప్లీట్ అవుతుంది. ఇంట్లో కూడా పెళ్లి ప్రస్తావన తెస్తూ ఉన్నారు. మన సంగతి అమ్మా నాన్నలతో  చెప్తాను. సరేనా... "
అలా చెప్పి వెళ్లిన రాజేంద్ర వారం తర్వాత తిరిగి కాలేజీకొచ్చాడు. కానీ కళ్యాణి నైతే కలవలేదు. బిజీగా ఉన్నాడేమోలే అనుకుని రెండ్రోజులాగి కల్యాణే అతన్ని కలిసింది.
" సారీ కల్యాణీ, వెంటనే నిన్ను కలవలేకపోయాను.... నాన్న ఫ్రెండ్ ఒకాయన.. ఆయన కూడా బిజినెస్ మ్యానే... ఆయన కూతుర్ని మా ఇంటి కోడలిగా చేయాలని ఉందని మా నాన్నతో అన్నాడట కళ్యాణీ.. నాన్నేమో వెంటనే అలాగేనంటూ మాటిచ్చేశాడట !మన సంగతి చెబితే...ఏమిటో...ఇంట్లో అంతా సుముఖంగా కనిపించలేదు కళ్యాణి... అయినా.. మరోసారి ప్రయత్నిస్తాను.. నీవేమీ వర్రీ అవకు.. "
నీళ్లు నములుతూ చెప్పాడు రాజేంద్రనాథ్. నిర్వికారంగా అయిపోయింది కళ్యాణి. 
" మరి నువ్వు నాకిచ్చిన మాట సంగతి ఏంటి!!"
ఊహించని అతని మాటలకు నివ్వరపోయినా పైకి  ఏమీ  అనలేదు. సౌమ్య మాటలు గుర్తొచ్చాయి ఆమెకు. అయినా... మరోసారి ప్రయత్నిస్తాను అన్నాడు కదా..! ఆమెలో మళ్లీ ఏదో ఆశ పొడసూపింది. 
                **                 **             **
    రాజేంద్రనాథ్ B.Tech ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు. ఆ తర్వాత M.B.A  చేసే ఆలోచనలో ఉన్నాడు. కళ్యాణి సెకండ్ ఇయర్ లో ఉండగా ఆమెను చూశాడు ఆమె అందం చూసి  ఆకర్షితుడై పరిచయం పెంచుకున్నాడు. మొదట్లో పట్టించుకోకపోయినా కళ్యాణి నెమ్మదిగా అతని గురించిన ఆలోచనల్లో పడిపోయింది. సౌమ్య చెప్పేదాకా ఆమెకు మరో ఆలోచనే  రాలేదు. ఈరోజు అతని మాటలు ఆమె ఆశలపై ఇంకా చెప్పాలంటే ఆమె నమ్మకంపై నీళ్లు చిలకరించినట్లయింది.
    వారం గడిచింది. క్యాంపస్ సెలక్షన్స్ జరగబోతున్నాయి. కళ్యాణికేమో పుస్తకాల మీద మనసు లగ్నం కావడం లేదు. ఆ మాటకొస్తే రాజేంద్ర తో ప్రేమ వ్యవహారం మొదలైనప్పటినుంచే ఆమెకు చదువు మీద శ్రద్ధ తగ్గిందని చెప్పాలి. ప్రస్తుతం రాజేంద్ర ప్రవర్తనతో తన ప్రేమ సౌధం పునాదులు మెల్లిగా కంపిస్తున్న భావన ఆమెలో కలగసాగింది. దానికి తోడు అతను తనతో మునుపటిలా  మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. ఎదురుపడినా పక్కకు తప్పుకుని పోతున్నాడు.
" ఏమిటి ! ఇంత బలహీనమైనదా ఇతని  ప్రేమ!"
 కళ్యాణిలో తెలియని బాధ సుళ్ళు  తిరగసాగింది.
                      **           **             **
    క్యాంపస్ సెలక్షన్స్ పూర్తయ్యాయి. కళ్యాణి సెలెక్ట్ అవలేదు. అవుతానని కూడా ఆమె అనుకోలేదు. రెండు రోజుల తర్వాత మధ్యాహ్నం క్లాసులయ్యాక హాస్టల్ వైపు నడుస్తున్న ఆమెకు ఆనంద్ ఎదురయ్యాడు. అతనూ  కళ్యాణి క్లాస్ మేటే... పైకి చెప్పకపోయినా నెమ్మదిగా ఆమె అంటే లోలోపల ఇష్టం లాంటిది కలిగింది అతనికి. దూరాన కనిపిస్తే ఆరాధనగా  చూసేవాడు.కానీ,  క్రమంగా ఆమె రాజేంద్ర తో చనువుగా ఉండడం, క్యాంటీన్లో ఈవినింగ్స్ కలిసి గడపడం చూసి  తన ఇష్టాన్ని బలవంతాన తుంచేసుకున్నాడు. అతన్ని చూసిన కళ్యాణి, 
" కంగ్రాట్స్, సెలెక్ట్ అయ్యారట  కదా.. !"
"థాంక్సండీ. .."
అన్నాడు ఆనంద్. ఎందుకో డల్ గా కనిపిస్తూన్న కళ్యాణిని చూసి ఊరుకోలేక, 
" మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదండీ.. మనకి ఇంకా ఒక సంవత్సరం టైం ఉంది. నెక్స్ట్ ఇయర్ గ్యారంటీ గా మీరు సెలెక్ట్ అవుతారు చూడండి.."
అన్నాడు.కళ్యాణి పేలవంగా నవ్వింది.అది చూసిన ఆనంద్, 
" మీరేమీ అనుకోకపోతే ఒకటడుగుతాను..కొద్ది రోజులుగా మీరు చాలా డల్ గా కనిపిస్తున్నారు. హెల్త్ జాగ్రత్తండీ.ఇది మన కెరీర్ ను నిర్ణయించుకునే పీరియడ్. మన ఫ్యూచర్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అది మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనకెన్ని సమస్యలున్నా పక్కకు నెట్టేసి చదువు మీదే కాన్సన్ట్రేట్ చేయాలంటాను. ఓకే...బెటర్ లక్ నెక్స్ట్ ఇయర్ "
అంటూ ముందుకు వెళ్లిపోయాడు. 
    ఆనంద్ కూడా మిడిల్ క్లాస్ వాడే. తనతోపాటే చేరాడు. మొదట్లో...అతను తనను ఆసక్తిగా చూడడం కళ్యాణి గమనించకపోలేదు. కానీ...అప్పుడు తనేమో పూర్తిగా రాజేంద్ర మత్తులో ఉండిపోయి అదేమీ పట్టించుకోలేదు. ఇప్పుడు చదువుపై,భవిష్యత్తుపై అతని శ్రద్ధ చూస్తుంటే...ఏమిటో గిల్టీగా అనిపించింది కల్యాణికి.ముఖ్యంగా ఎంతో కేరింగ్ గా తనకు అతనిచ్చిన సలహా ఆమె మనసుకు హత్తుకుపోయింది..
   రెణ్ణెళ్ల తర్వాత ఒకరోజు...రాజేంద్ర తన ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చాడని తెలిసింది.కారణం తెలిసి నిర్వికారంగా నవ్వుకుంది. ఇంత వ్యక్తిత్వం లేని  అతన్ని నేనెలా ప్రేమించగలిగాను !! తానేమీ అతని వెంట పడలేదే ! కొద్దిరోజులు తేరుకోలేకపోయింది.ఏదేమైతేనేం...అతని ఆంతర్యం తెలిశాక అతని ప్రేమ కేవలం కాలక్షేపానికే అన్న విషయం రూఢిగా అర్థమయిపోయిందామెకు. ఆ క్షణాన్నే అతన్నీ, అతని ప్రేమనూ దూరంగా నెట్టేసింది. ఇప్పుడు పెళ్లి కూడా చేసుకున్నాడని తెలిసినా ఏబాధా కలగలేదు కళ్యాణికి. ఆలోచిస్తుంటే ఆమెకు తనది కూడా నిజమైన ప్రేమ కాదేమో అనిపించింది. లేకుంటే ఇంత త్వరగా తాను కూడా మరిచిపోవడమేమిటి !!
        ఆరోజు ఆనంద్  మాటలు విన్నప్పటినుంచీ ఆమె ఓ స్థిర నిశ్చయానికి  వచ్చింది... పూర్తిగా స్టడీస్ మీదే మనసు లగ్నం చేసింది. ఇప్పుడు ఆమె  లక్ష్యం... చదువు పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడటం...అంతే !
        ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఆరోజు సాయంత్రం క్లాసులు అయ్యాక హాస్టల్ కు వెళ్తున్న కళ్యాణికి క్యాంపస్ లో ఓ  చెట్టు కింద సౌమ్య, ఆనంద్ నిలబడి మాట్లాడుకుంటూ ఉండడం కనిపించింది. సౌమ్య టెన్త్ క్లాస్ నుండీ కళ్యాణికి క్లాస్మేట్. ఇద్దరూ ఒకేసారి B.tech లో చేరారు. క్లాస్మేట్ గా  కంటే ఓ మంచి ఫ్రెండ్ అనడమే కరెక్ట్. అంతకన్నా...తన శ్రేయోభిలాషి కూడా.
     ఈరోజే కాదు... రెండు మూడు సార్లు వాళ్లిద్దరూ కలిసి మాట్లాడుకోవడం కళ్యాణి కంటబడింది. ఏదో మూల అదోలాంటి ఫీలింగ్ కలిగిందామెకు. 
               **           **           **
" ఏమిటి కల్యాణీ, నువ్వు మరీను... క్యాంపస్ సెలక్షన్స్ కు ప్రిపేర్ అవడం గురించి టిప్స్ కొన్ని తెలుసుకోవాలని ఆనంద్ తో మాట్లాడుతున్నానంతే. మా ఇద్దరి మధ్యా మరేదీ  లేదు..."
కళ్యాణి ప్రశ్నకు సమాధానంగా నవ్వింది సౌమ్య.
"...అసలు నీకో విషయం చెప్పనా.. మొన్న మాటల మధ్యలో రాజేంద్ర ప్రసక్తి వచ్చింది. అతనితో నీ ప్రేమ, బ్రేకప్, అతని పెళ్లి... ఇవన్నీ చూచాయగా అతనికీ తెలిసినట్లున్నాయి. నవ్వేసి, అదంతా ట్రాష్ అంటూ సింపుల్ గా కొట్టిపడేశాడు. ఇందులో నువ్వు బాధ పడాల్సిన అవసరం కూడా ఏమీ లేదంటూ మాట్లాడాడు.కల్యాణీ, అతని మాటల్లో నీపట్ల ఏదో తెలియని అవ్యక్తభావం...అదే, ఇష్టం లాంటిదన్నమాట! కనిపించింది నాకు... "
" సౌమ్యా.. !"
" అవును.. రాజేంద్ర లాంటివాడు కాదు ఆనంద్ కల్యాణీ,  చాలా ప్రాక్టికల్ పర్సన్. అతని మాటల్లో నిజాయితీ, ఎదుటి వాళ్ళ పట్ల గౌరవం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. తనకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి. అవి చేరుకోవడానికి శ్రమించే గుణమూ ఉంది... "
సౌమ్య చెబుతూ ఉంటే అలా వింటూ ఉండిపోయింది కళ్యాణి.
" నీ పట్ల మొదటినుంచీ అతనికి ఇష్టం ఉందన్న విషయం అతని మాటల ద్వారా నేను గ్రహించాను... "
ఆ మాటలు వినీ విననట్లు తల పక్కకు తిప్పుకుంది కళ్యాణి. రాజేంద్ర వల్ల ప్రేమ అనే భావన మీదే ఒకలాంటి విరక్తి పుట్టిందామెకి.. ! అదే చెప్తూ, 
" అదంతా ఏమోగానీ సౌమ్యా, నీకు మాత్రం నేను థాంక్స్ చెప్పుకొనితీరాలి. ఆరోజు నువ్వు రాజేంద్ర గురించి నన్ను హెచ్చరించి ఉండకపోతే, నాకై నేను మేలుకొని ఉండేదాన్ని కాదేమో...!"
".. ఊరుకో కళ్యాణీ, అంతస్తుల తారతమ్యాలు అంత సులభంగా పోయేవి కావని నాకెందుకో అనిపించింది. నీతో ఓ  మాట చెప్పాలనిపించింది. ఎంతో తటపటాయిస్తూనే చెప్పాను. అసలు  చెప్పకుండా ఉండలేకపోయాను కూడా.  ఎన్నో సంవత్సరాల స్నేహం మనది. మీ అమ్మానాన్న కూడా నాకు బాగా తెలుసు.రాజేంద్రను చూస్తుంటే ఎందుకో అతను నీకు, నీ కుటుంబానికి సెట్ అవడేమో అనిపించింది. అతని స్టైలిష్ నేచర్, లైఫ్ స్టయిల్, స్నేహాలూ...రానురానూ నీ మెంటాలిటీకి  సరిపడవని తోచింది.ఓ మాట చెప్పాలనిపించింది.నా మాటలకు నువ్వు కోపం తెచ్చుకోక పాజిటివ్ గా తీసుకున్నావు. అందుకు నేనే నీకు థాంక్స్ చెప్పాలి.. సరే, జరిగిందేదైనా మన మంచికే అనుకుందాం,  పద"
"మన స్నేహం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి సౌమ్యా, "
చేతిలో చెయ్యి వేసింది సౌమ్య. 
                     **        **           **          
 మూడేళ్లు గడిచిపోయాయి. ఆనంద్ ఇప్పుడు బెంగుళూరులో ఓ  మంచి పేరున్న కంపెనీలో చేస్తున్నాడు. కళ్యాణి, సౌమ్యలకు క్యాంపస్ సెలక్షన్స్ లోనే జాబ్స్ వచ్చాయి. కళ్యాణి ప్రస్తుతం హైదరాబాదులో ఉంది. సౌమ్య సంవత్సరం పాటు జాబ్ చేసి,తల్లిదండ్రులు  చూసిన సంబంధం చేసుకుని కెనడా వెళ్లిపోయింది. అక్కడే తానూ జాబ్ చూసుకుంది. అప్పుడప్పుడూ  ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో పోరు పెడుతున్నా, కళ్యాణి మాత్రం పెళ్లి విషయం దాటవేస్తూ వస్తోంది. 
      ఆరోజు ఆదివారం. విజిటర్స్ డే. సాయంత్రం నాలుగు గంటలకు అటెండర్ ఒకమ్మాయి వచ్చి, తనకోసం ఎవరో వచ్చారని చెబితే, కిందికి వెళ్ళింది కళ్యాణి . విజిటర్స్ రూమ్ లో అటువైపు తిరిగి కూర్చున్న ఓ వ్యక్తి అలికిడి విని ఇటువైపు తిరిగాడు. కళ్యాణి మొహం అప్రయత్నంగానే విప్పారింది. 
ఆనంద్ !! ఎన్నాళ్ళకి !
" బాగున్నారా.. "
 లేచి దగ్గరగా వస్తూ పలకరించాడతను. తలూపుతూ, 
" మీరు ఎలా ఉన్నారండీ?  నేనిక్కడున్నట్లు మీకెలా తెలిసింది? "
" మనసుంటే మార్గం ఉండదా కళ్యాణి గారూ... !"
నవ్వాడు. ఎప్పటి పరిచయం! ఏడేళ్లయింది... ఫైనల్ ఇయర్ అయ్యి,  సెండ్ ఆఫ్ చెప్పుకున్నాక,. మళ్లీ మాట్లాడుకున్నది లేదు. కనీసం ఫోన్ నెంబర్స్ కూడా తీసుకోలేదు... మళ్లీ ఇప్పుడు !!
    అరగంట తర్వాత బయట రెస్టారెంట్లో టీ తాగుతూ, 
" ఉపోద్ఘాతాలేవీ  వద్దు. సూటిగానే అడుగుతాను. మీరు ఓకే అంటేనే... ప్రొసీడ్ అవుతాను..."
"..................."
"... నాతో పెళ్లికి మీరు సుముఖంగా ఉంటే చెప్పండి. మా నాన్నగారు వెళ్లి, మీ పెద్దవాళ్ళతో మాట్లాడతారు."
ఓ క్షణం ఆనంద్  వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది కళ్యాణి.
" మాట్లాడండి"
" కాస్త ఉపోద్ఘాతం ఉంటే బాగుండేదేమో....!"
చిన్నగా నవ్వింది. కాలేజీలో చేరిన కొద్దిరోజుల తర్వాత పరిచయం అతనితో..ఎన్నడూ పెద్దగా మాట్లాడు కున్నది లేదు ఇద్దరూ. ఇన్నేళ్ల  తర్వాత కూడా తనమీద ఇష్టమన్నది చెక్కుచెదరలేదన్న మాట! ఈ ఇష్టాన్నే ప్రేమ అనొచ్చా! కొంతకాలం క్రితం ఓచోట చదివింది కళ్యాణి. 
"ఏ మనిషి మీదైనా ఇష్టం అన్నది  పుట్టి, ఆఇష్టం... రోజులు,  వారాలు, నెలలు కాదు...ఏళ్ళు గడిచినా... ఏమాత్రం తగ్గక స్థిరంగా నిలిచి ఉంటే...అదే అసలైన ప్రేమ"
అని !!
రెండు నిమిషాల మౌనం తర్వాత పెదవి విప్పింది కళ్యాణి.
" మీతో ఓ విషయం చెప్పాలి..."
" ఎమిటీ, రాజేంద్ర గురించేనా ! అదే అయితే ఏమాత్రం అవసరం లేదు. అయినా అది ఇంకా మీ మైండ్ లోఉందా ! వెంటనే డిలీట్ చేసేయండి ఇప్పటికైనా..."
" అదెప్పుడో జరిగిందే అయినా... మీకు చెప్పాల్సిన అవసరం నాకు ఉందనిపించింది"
" నో ప్రాబ్లం.. అలా అనుకుంటే నాకూ ఒకటీఅరా ఉన్నాయిలెండి. నేనూ చెప్పాలంటారా ఏంటి కొంపదీసి..!"
" ఔనా..." నమ్మలేనట్లు మొహం పెట్టింది కళ్యాణి.
" అవునండీ  బాబూ ! చదువుకునే రోజుల్లో యాభై శాతం స్టూడెంట్స్ కు ఇలాంటివి క్వైట్ నాచురల్ ! అదంతా లవ్ అనుకుంటే మన పని అయినట్లే..."
"...................."
"..మొదలయ్యేటప్పుడు సిన్సియర్ గానే మొదలౌతుంది. రోజులు గడిచేకొద్దీ  ఒకరి వీక్నెస్ లు మరొకరికి తెలిసిపోయి ప్రేమ స్థానంలో మరేదో పుట్టుకొస్తుంది. అంతే....ప్రేమ పక్షులు చెరో దిక్కు  ఎగిరిపోతాయి.!"
ఇద్దరూ గట్టిగా నవ్వుకున్నారు. కళ్యాణికి ఏదో పెద్ద భారం తలమీంచి దిగిపోయినట్లయింది. ఆనంద్ అంటే తనకూ ఇష్టం ఏర్పడినా, తనకు తాను బయటపడటం బాగుండదనుకుంటూ సౌమ్య చెప్తున్నా జాప్యం చేస్తూ వచ్చింది. ఇప్పుడు తనకు తానే వచ్చాడు. ఎదురుగా నిలబడ్డాడు. ప్రేమ డైలాగులు వల్లించలేదు. పెద్దల ద్వారానే వెళ్దాం అంటున్నాడు.అదీ..తనకి ఇష్టమైతేనే!! ఈరోజుతో తనకున్న అనుమానాలూ, భయాలూ పూర్తిగా తొలగిపోయి,  తుఫాను వెలిసినట్లయి మనసంతా తేలికైపోయింది.ఇప్పటికీ  తను ఎస్ అనకపోతే... చేజేతులా కలిసొచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకున్నట్లవుతుంది.
" ఇంతకీ మీ రెస్పాన్స్ ఏమిటో చెప్పనేలేదు..."
 ఆలోచనల నుండి బయటపడిన కళ్యాణి, 
" ఇంత ఓపెన్ గా ఉన్న మీకు నో ఎలా చెప్పగలను!"
" అంటే... ప్రొసీడ్ అవమంటారు...! అమ్మయ్య! బ్రతికించారు.. మా నాన్నకి ఈ రోజే ఫోన్ చేసి చెప్తాను.."
గుండెల నిండా గాలి పీల్చుకుంటూ అన్నాడు ఆనంద్. 
ఇద్దరూ నవ్వుకుంటూ లేచారు.
"ఇక  నేను మీ సౌమ్యకు థాంక్స్ చెప్పుకోవాలి.."
వద్దనుకుంటేనే పైకి అనేశాడు ఆనంద్. విస్మయంగా చూసింది కళ్యాణి.
" అవునండీ, తమరి ఆచూకీ  లీక్ చేసింది తనేగా మరి!!"
అమ్మ సౌమ్యా ! అనుకున్న కళ్యాణి, 
" మీరే కాదండీ, నేను కూడా చెప్పుకోవాలి... పదండి, ఇద్దరం కలిసే  చెబుదాం సౌమ్యకు థాంక్స్.."
ఇద్దరూ నవ్వుకుంటూ తమ భావిజీవితానికి సోపానాలు వేసుకునే తలపులతో కలిసి అడుగులు ముందుకు వేశారు. 
******************************************




No comments:

Post a Comment