Tuesday, August 22, 2023

కళ్ళతో కాదు, మనసుతో చూడు !... కథ లాంటి ఓ నిజం !

     వివేక్ మనసు మనసులో లేదు. ఎలాగోలా ఇంటికొచ్చాడన్నమాటేగానీ మెదడంతా అల్లకల్లోలంగా ఉంది.
" ఏంటిరా వివేక్, నువ్వేమో సినిమా హీరోలా  ఉంటావ్, నీ పక్కన ఆ అమ్మాయి నిలబడితే ఎంత మాత్రం బాగా లేదు తెలుసా, అసలెలా  ఒప్పుకున్నావురా... !"
  సాయంత్రం ఆఫీసు నుండి వస్తోంటే చిన్ననాటి స్నేహితుడొకడు ఎదురుపడి, కుశల ప్రశ్నల తర్వాత పెదవి విరుస్తూ, ఏమాత్రం విచక్షణ అనేది లేకుండా అన్న ఆ మాటలు వివేక్ గుండెల్ని పదే పదే తాకుతూ నిలవ నీయకుండా చేస్తున్నాయి. అతని పెళ్లయి మూడు నెలలు దాటుతోంది. ఇలాంటి మాటలు వినడం ఇదే మొదటి సారి కాదతనికి. పెళ్లి పందిట్లోనే అంతా గుసగుసలు పోయారు కానీ, అతని చెవి దాకా సోకలేదు. అంతా అయిపోయి, రెండు మూడు వారాలు గడిచేదాకా అతను  భార్యతో బాగానే ఉన్నాడు. కానీ ఆ తర్వాతే మెల్లిమెల్లిగా కొందరు బంధువులు, మరి కొందరు ఆప్తులనబడే మిత్రులూ ఉబుసుపోక ఏవో ' కామెంట్లు' ఇలాంటివే చేయడం ఆరంభించారు. 
   నిజానికి వివేక్ భార్య ప్రశాంతి మరీ అనాకారేమీ కాదు. కాస్తోకూస్తో చదువుకుంది. బాగా కలిగినింటి  అమ్మాయి. అన్ని విధాలా అతనికి చక్కని సంబంధమే. కానీ వివేక్ బలహీనత బాగా ఎరిగిన సన్నిహితులు కొందరు దాన్ని ఆలంబనగా చేసుకొని అతనిలో లేనిపోని దురాలోచనలు రేపడమే  పనిగా పెట్టుకున్నారు. కొందరి మనుషుల నైజమే అలా ఉంటుంది. ఎదుటివారు పచ్చగా ఉంటే చూడలేరు. ఎవరికైనా ఏదైనా చెడు జరిగిందని తెలిస్తే చాలు లోలోపల చెప్పలేని ఆనందం వాళ్లకి!  అలాంటి బాపతు వాళ్ల వలలో వివేక్  లాంటి బలహీన మనస్కులు చాలాతేలికగా  చిక్కుకుంటారు. అది చూసి వాళ్ళు ఓ పైశాచిక ఆనందం పొందుతారు. వాళ్ళకదో తృప్తి. అలాంటి కుసంస్కారులు, ఓర్వలేని  లేని వాళ్ళ కుయుక్తులు పారడానికి వివేక్ఓ పావుకాగా, ప్రశాంతి అనే అమాయకురాలు అకారణంగా బలైపోతోంది. 
   రాన్రానూ భార్య మొహం చూడాలంటేనే కంపరంగా ఉంటోందతనికి. భర్త ప్రవర్తనలో మార్పు గ్రహించిన ఆమె కారణం ఏంటో తెలియక అల్లల్లాడిపోయింది. మొదట్లో ప్రేమగా మాట్లాడే అతను ఇలా ఎందుకు మారిపోయాడో ఆమెకు ఓ పట్టాన అర్థం అవ్వలేదు. క్రమంగా ఆమెను చీటికిమాటికి విసుక్కోవడం, ప్రతీ  పనిలో వంకలు వెతకడం, అందరికీ ఆమె మీద లేనిపోని ఫిర్యాదులు చేయడం మొదలైపోయాయి. ఇవన్నీ భరించడం విపరీతమైన బాధగా పరిణమించిందామెకి. ఆఖరికి ఆమెను ఎలా వదిలించుకోవాలా అన్న విపరీత పోకడ అతనిలో గుర్తించి వణికిపోయిందా నిస్సహాయురాలు ! దీనికంతా కారణం --వివేక్ లో లోపించిన వివేకం. ఫలితం ! ప్రశాంతి జీవితంలో కరువైపోయిన ప్రశాంతత !మరోవైపు ప్రశ్నార్థకంగా మారిన ఆమె భవిత !
                          * * * *
   తేజస్విని చాలా అందంగా ఉంటుంది. డిగ్రీ దాకా  చదువుకుంది. కాలేజీ రోజుల్లో కాలేజీ బ్యూటీ అన్న పేరు కూడా ఆమెకుంది. ఇటీవలే శ్రీమతి కూడా అయింది. ఓ రోజు సాయంత్రం భర్త రంగనాథ్ తో  కలిసి షాపింగ్ కెళ్ళింది. అక్కడ అనుకోకుండా కాలేజీలో తన క్లాస్మేట్ నీరజ కనిపించింది. తను కూడా అందంలో తేజస్విని కేమీ తీసిపోనట్లుగా ఉంటుంది. భర్తను  పరిచయం చేసాక, కాసేపు అక్కడే కాఫీ తాగుతూ కబుర్లాడుకుని, ఫోన్ నెంబర్ లు  తీసుకుని, సెలవు పుచ్చుకున్నారు.
   వారం తర్వాత నీరజ తేజస్విని వాళ్ళ ఇంటికి వచ్చింది, తన ఆహ్వానంపై. కాసేపు అవీ ఇవీ మాట్లాడుకున్నాక, నీరజ కాస్త తటపటాయిస్తూనే తన సందేహం బయటపెట్టింది.
 " తేజూ, నిజంగా ఇష్టపడే రంగనాథ్ గారిని  చేసుకున్నావా?"
 అలాంటి ప్రశ్నేదో ముందే ఊహించిందేమో, తేజస్విని చిన్నగా నవ్వేసి, నీరజ కేసి చూస్తూ, 
" ఏ, ఎందుకలా అడిగావు?.." అంది.
" అహ, ఏమీ లేదు, ఈ  కాలేజీ బ్యూటీ అతనికి నచ్చడం లో వింతేమీ లేదు, కానీ...."
" నాకెలా నచ్చాడని ! .. అంతే కదా!.." అందుకుంది తేజస్విని.
"............... "
" చూడు నీరజా, ఆయన నాకంటే ఎక్కువగా చదువుకున్నాడు. పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, నాకంటే ఎంతో చక్కగా మాట్లాడుతూ, అందరితో కలిసి పోతాడు. మరీ ముఖ్యంగా ఏ మాత్రం గర్వమన్నది  లేదు. అందర్నీ గౌరవిస్తాడు. ఎవరినీ నొప్పించడు. మరి నేను... అతనికంటే అందంగా ఉంటానన్న ఒకే ఒక్క క్వాలిఫికేషన్ తప్ప నాలో ఏముంది చెప్పు!.."
".............. "
" నిజమే, అతను పొట్టిగా, లావుగా, రంగు తక్కువగా నా పక్కన సరి జోడీగా ఉండని  మాట వాస్తవమే. కానీ అదంతా పైకి కనిపించేది మాత్రమే.  పెళ్ళికి ముందు ఆయన నాతో ఓ అరగంట మాట్లాడాడు.నా జీవితం ఇతనితో ఆనందంగా గడిచిపోతుందన్న ప్రగాఢ నమ్మకం ఆ కాస్త సమయంలోనే నాకు కలిగింది... ఎవరేమనుకుంటే నాకేంటి ! మేమిద్దరం సంతోషంగా ఉండడమే మాక్కావాల్సింది...."
".................................."
" నీరజా, ఒకటి చెబుతాను, అందాన్ని ఎప్పుడూ కళ్ళతో కాదు మనసుతో చూడాలి.... ఈవిషయం ఆయనతో పరిచయమై, పెళ్లి జరిగాక నాకు బాగా అర్థమయింది తెలుసా ! .. "
ప్రసన్నంగా చూస్తూ చెప్పింది తేజస్విని. ఆమాటలతో కొద్ది క్షణాలపాటు ఏదో మాయ ఆవహించినట్లయింది నీరజకు.
క్షణకాలం కళ్ళు మూసుకుంది. వెంటనే ఆమెను కొన్ని నెలలుగా విపరీతంగా వేధిస్తున్న సమస్య మంచుతెరలా మెల్లిమెల్లిగా కరగడం మొదలైంది. 
    ఆర్నెల్ల క్రితం  పెళ్లయిన ఆమెకు భర్త మాధవరావు ఎంత మాత్రమూ నచ్చడం లేదు. అయిష్టంగా అందరి బలవంతం మీద చేసుకుంది గానీ అతనితో సవ్యంగా ఉండలేక పోతోంది. కారణం అతను తన అందానికి ఏ మాత్రం సరిపోడన్న ఆమె దురభిప్రాయం. అతనెంత  అనునయంగా సర్దుకుపోదామన్నా ఆమె మనసందుకు ఎంత మాత్రం సహకరించక నిత్యం తను బాధపడుతూ అతన్నీ బాధపెడుతూ వస్తోంది. ఇప్పుడు తేజస్విని దంపతుల్ని చూస్తే ఆమెను కప్పుకున్న కంటిపొరలు మెల్లిగా విడివడి మనసంతా నిర్మలంగా మారడం మొదలైంది. కొందరి మాటల్లో నిజంగా ఎంతటి మహత్తు ఉంటుందో ఆమెకు అవగతమైంది. నిజానికి తన భర్త రంగనాథ్ గారి కంటే బాగుంటాడు. కానీ తనకూ  తేజస్వినికీ ఎంత తేడా! నిజమే ! తేజస్విని అన్నట్లు ఎదుటి వారి అందాన్ని -- ముఖ్యంగా భాగస్వామి అందాన్ని కళ్ళతో కాదు, మనసు తోనే చూడాలి. అప్పుడే వారిలో ఉన్న అసలైన అందం ప్రస్ఫుటమవుతుంది, అనుకుంటూ మనసులోనే తేజస్వినికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ లేచింది నీరజ. ఆ క్షణంలో ఆమెలో ఎప్పుడెప్పుడు వెళ్లి తన భర్త మాధవ రావుని కలుద్దామా అన్న ఆతృత కనిపించింది.
                       *   *    *     *
   నీరజ విచక్షణతో ఆలోచించగలిగింది. సర్దుబాటు ధోరణితో సంసారం సరిదిద్దుకోవాలనుకుంది. మరి, వివేక్ !ఇంగితమన్నది  ఏ మాత్రం లేక చెప్పుడు మాటలకే ప్రాధాన్యమిచ్చి  సంతోషం కోల్పోయి కొట్టుమిట్టాడుతూ తనతో పాటు మరో ప్రాణికీ  మనసుకు శాంతి అన్నది లేకుండా చేస్తున్నాడు.
 తన భార్యను గానీ, భర్తను గానీ ఎవరైనా అభ్యంతరకరంగా 'కామెంట్' చేస్తే తేజస్వినిలా మాట్లాడగలిగే నేర్పు ఉండాలి. 

" నా భార్య అందంగా లేకపోతే నీకేమిటి  సమస్య? నీ సమస్యలు నీకు బోలెడుంటాయి, వాటి సంగతి చూసుకో చాలు,.. " 
 అని వెంటనే అలా అన్న వారి  నోరు మూయించ గలిగే మానసిక పరిపక్వత వివేక్  లాంటి వాళ్లలో ఉండాలి. అంతే, మళ్లీ మరోసారి అలాంటి వ్యాఖ్యానాలు చేయడానికి ఎవ్వరూ  సాహసించరు. 

******************************************
                  🌺 భువి భావనలు  🌺
******************************************














No comments:

Post a Comment