🌷
రోడ్లన్నీ గతుకులమయం ! దారుణంగా దెబ్బ తిన్న రహదారులు !! కూలుతున్న వంతెనలు! వరదలతోో పోటెత్తుతున్న నదులు ! జనావాసాల్లోకి వచ్చిన నీళ్లు! నిలువ నీడ లేక అగచాట్లు !!
వార్తా పత్రికల నిండా ఇవే వార్తలు. వాటి తాలూకు ఛాయాచిత్రాలు ! టీవీ న్యూస్ ఛానల్స్ అన్నింటా ఇదే ఘోష !
మొన్నటిదాకా మండే ఎండలు ! భరించలేనంత ఉక్కపోత ! చెమటలు కక్కుతున్న శరీరాలతో చిరాకులు, విసుక్కోడాలు! అదంతా ఎలా మటుమాయమైపోయిందో ఏమో! వానలు మొదలయ్యాయి.. ఒక్కసారిగా జనాలకు ఊరట ! అదీ ఎంతసేపు ! రోజుల వ్యవధిలోనే మళ్లీ బాధలు మొదలు! ఈసారి కొత్త రకంగా ! జల్లుగా మొదలైన చినుకులు జడివానలై, వరదలై వీధులన్నీ జలమయం చేస్తూ... నదులు, ఏరులు పొంగుతూ ఊరువాడల్ని ముంచెత్తుతూ, బీభత్సం సృష్టిస్తూ జన జీవనాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. ప్రస్తుతం ఇదీ పరిస్థితి!
కాంక్రీట్ బిల్డింగుల్లోకి కూడా నీళ్లు చొరబడి రక్షణ అన్నది కరువైపోయిన వైనం ! గుడిసెలు, మట్టిమిద్దెల దుస్థితి ఇక వర్ణించలేము. అవి బాగుపడేదాకా వారి అవస్థ చెప్పనలివి కాదు. ఎలా? ఎప్పుడు? ఎంత కాలం పడుతుందో ! మళ్లీ మామూలుగా మారేవరకు తిప్పలు తప్పవు మరి ! మారడమైతే జరుగుతుంది. కానీ అంత వరకు తప్పదు కదా భరించడం!
ఇక... క్రమంగా మొదలవుతుంది చలికాలం... కాస్త ఊపిరి పీల్చుకునేలోగా...మళ్లీ మొదలు కష్టాలు... చలి!! రాను రాను రోజులు గడిచే కొద్దీ భరించలేని చలి మరి జనాలకి ప్రశాంతత, సంతోషం సంవత్సరంలో ఎంతకాలం? ఆలోచిస్తే...కొద్ది కాలం మాత్రమే !!
ఇంతకీ...ఎండాకాలం, వానకాలం, చలికాలం... ఈ మూడింటిలో ఏది నీకు ఇష్టం అంటే...!
అన్ని కాలాలూ మంచివే... అన్నీ ఉండాల్సిందే... అన్నింటికీ వాటి వాటి ప్రత్యేకత ఉంది. ఏది లేకపోయినా జనావళికి తీరని నష్టమే. కాకపోతే ఏదైనా మితంగా ఉంటేనే మంచిది... ఆ హద్దు దాటిందంటే... ఇదిగో.. ఇలాంటి అనర్ధాలే !
వరదలు, ముంపులూ, వంతెనలు కూలడాలు, రోడ్లు పాడైపోయి నడకకు కూడా ఇబ్బందులు రావడాలు ! వీటికి తోడు జబ్బులు, అంటువ్యాధులు, అనారోగ్యాలు !!
వర్షాకాలం ఇలాగైతే... వేసవి కాలం వడదెబ్బలు, అత్యధిక ఉష్ణోగ్రత వల్ల వచ్చే సమస్యలు మరో విధంగా మనుషుల్ని బాధ పెడతాయి.అలాగే చలికాలం మరోరకం బాధలు ! కానీ చిత్రం ఏమిటంటే...చలికాలం వచ్చాక ఎండాకాలం కోసం ఎదురుచూడడం, ఎండలు భరించలేక వర్షాల కోసం ఆరాటపడడం...అవీఎక్కువైపోతే...మళ్ళీదేనికోసమో!ఇదంతా సహజమే కదా !
ఇవన్నీ ఋతురాగాలే ! ఏదిఏమైనా...ప్రకృతి అనుగ్రహిస్తే అంతా ఆనందమే ! ఆగ్రహిస్తే ప్రళయమే!!
******************************************
No comments:
Post a Comment