Wednesday, July 5, 2023

ఇది నా జీవితం..PART--1

( మనిషికి స్వార్థం అన్నది ఉండకూడదా ! తన సంగతి పూర్తిగా పక్కన పెట్టి పక్క వాళ్ళ కోసం ఆలోచించడం, తనను తాను బలి చేసుకోవడం ఎంతవరకు సమంజసం ! )
🌺

 " మన పిల్ల నచ్చిందంట... కట్న కానుకలేవీ వద్దన్నారు. పెళ్లి  మాత్రం చేసిస్తే చాలట! ఖాయం చేసుకుని వచ్చాను..."
 కారుతున్న చెమటలు భుజం మీది  టవల్ తో తుడుచుకుంటూ, చెప్పులు మూలన వదిలేసి లోపలికి వస్తూ ఎదురొచ్చిన భార్యతో చెప్పాడు వెంకటేశ్వర్లు.వంటింట్లో ఉన్న పరిమళకు ఆ మాటలు స్పష్టంగా వినిపించాయి. క్షణం గుండె దడ దడ లాడింది. ఎక్కడలేని నీరసం ఆవహించి అక్కడే గోడకు జారగిలబడింది. 
   పరిమళ పది దాకా చదివింది. కాస్త పొట్టిగా, చామనఛాయతో చూడగానే అందంగా ఏమీ లేదనే భావన కలిగేలా ఉంటుంది. పాతికేళ్ళు దాటాయి. ఆమె ఈడు వాళ్ళందరికీ పెళ్లిళ్లయిపోయినా తను మాత్రం ఇంకా అలాగే ఉంది. తనకన్నా అందవిహీనంగా ఉన్నవాళ్లకు కూడా అయిపోయినా ఈ పిల్లకు మాత్రం పెళ్లి ఘడియలు రాకపోవడానికి కారణం... ఆమె అవిటితనం! మూడేళ్ల వయసులో పోలియో సోకి కుడికాలు సన్నగా, వంకరగా ఉండిపోయి కాస్త గెంటుతూ  నడుస్తుంది. సంబంధాలు చాలా చూశారు. కట్నం కూడా బాగానే ఇస్తామన్నారు...అప్పుల పాలైనా సరే...! ఓవైపు వయసు మీద పడిపోతోంది. ఇలా ఉండగా... పది రోజుల క్రితం దగ్గర బంధువొకాయన ఓ సంబంధం  గురించి చెప్పాడు. ఇప్పుడు ఖాయం చేసుకొచ్చిందదే !
   పెళ్ళికొడుకు ఓ గవర్నమెంట్ ఆఫీసులో రికార్డు అసిస్టెంటట ! తల్లీదండ్రీ, ఓ తమ్ముడు, విధవరాలైన ఓ  చెల్లెలు...ఆమె పదేళ్ల కొడుకు ! అంతవరకూ  బాగానే ఉంది... కాకపోతే...రెండో పెళ్ళివాడు. ఇటీవలే భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఇద్దరు ఆడ పిల్లలు. ఎనిమిది, ఆరేళ్ల వయసు వాళ్ళు! అతని వయసూ నలభైకి దగ్గరలో ఉంటుంది...! విధి లేని పరిస్థితుల్లో వెంకటేశ్వర్లు భార్యను ఒప్పించి, పెళ్లిచూపులు ఏర్పాటు చేయించాడు. వద్దనుకుంటే, ఇంతకన్నా మేలైన సంబంధం వచ్చే ఛాయలేవీ కనుచూపుమేరలో వాళ్లకు కనిపించలేదు. ఆలస్యం చేసేకొద్దీ ఇలాంటివి రావడమూ గగనమే అవుతుందన్న భయంతో సరే అనుకున్నారు వెంటనే...కూతుర్ని అడిగే ఆలోచన కూడా చేయలేదిక ! ఇప్పుడు ఏకంగా అన్నీ మాట్లాడుకుని వచ్చానని చెబుతున్నాడు !
            **              **            **
🌹
   సువర్చల దిక్కు తోచని స్థితిలో పడిపోయింది ఒక్కసారిగా. ఇదేమిటి!ఇలా అయిపోయింది! మరిది మాటలు గుర్తొచ్చి ఆమె మనసంతా వికలమైపోయింది. ముందుగా ఈ పరిస్థితి ఏమాత్రం ఊహించని ఆమె అయోమయంలో పడిపోయింది.
   పెళ్లయి పది సంవత్సరాలయింది సువర్చలకు. అప్పటినుంచీ భర్తతో పాటు తానూ ఇంటికే అంకితమైపోయింది. మూడు సంవత్సరాల క్రితం భర్త యాక్సిడెంట్ లో పోయాడు. ఇద్దరు  పిల్లలు. పుట్టింటి ఆసరా  లేదు. అత్తిల్లు తప్పలేదు. అత్తమామలు, మరిది, ఆడపడుచు.. ఆ ఇద్దరు కాలేజీ చదువుల్లో , తన కొడుకు, కూతురు   ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నారు. సహనం కూడగట్టుకుని ఆ ఇంట్లో ఈదడం మొదలెట్టింది. అలా ఐదేళ్లు గడిచాయి. మరిది ఉద్యోగంలో చేరాడు. పెళ్లయింది.ఆడబిడ్డ అత్తారింటికి వెళ్ళిపోయింది. బాధ్యతలన్నీ తీరినట్టే..! అయితే... ఈమధ్య ఆమెను తొలిచేస్తున్న సమస్య  'ఇలా ఎంతకాలం'! అన్నది!!
 పిల్లలు హైస్కూల్  చదువుకొచ్చారు.ఈ పల్లెలో వానాకాలం చదువులతో వాళ్ల భవిష్యత్తు ఎలా మారనుంది!? భర్త పోయాక అందరి బాధ్యత వహిస్తూ అతడి  స్థానంలో కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు మరిదికి ఆ బాధ్యతలన్నీ అప్పజెప్పి, తాను టౌన్ కి వెళ్లి పిల్లల చదువు పట్ల శ్రద్ధ పెట్టాలన్న ఆలోచనలో పడిపోయింది కొంతకాలంగా. అన్న తర్వాత కొడుకుగా తల్లిదండ్రుల  బాధ్యత తనది  కూడా  కదా! ఎంత కాలమని తానే మోయగలదు ! మరీ  ముఖ్యంగా తన పిల్లల గురించిన ఆందోళన ఆమెలో రోజురోజుకూ పెరిగిపోసాగింది.
    టౌన్ లో ఉన్న తన తమ్ముడి సాయంతో తనూ అక్కడే ఏదో ఒక పనిలో చేరి, జీవనం సాగిద్దామని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అంతా ఓ కొలిక్కి వచ్చాక అత్తమామలకు విషయం చెబుదామని తాత్సారం చేసింది... అదే ఇప్పుడు తాను చేసిన పొరపాటై కూర్చుంది.
  సాయంత్రం తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి, మరిది చెప్పిన మాటలు వినేసరికి సువర్చల కాళ్ల క్రింది భూమి కంపించినట్లయింది. 
" నాన్నా, నేనూ, కమల టౌన్ కెళ్ళిపోదామనుకుంటున్నాము. కమలకు అక్కడ ఓ ప్రైవేట్ స్కూల్లో జాబ్ వచ్చింది. ఇక్కణ్ణుంచి రోజూ ఇద్దరం తిరగాలంటే చాలా కష్టం. వచ్చేవారం జాయిన్ అవ్వాలనుకుంటోంది. ఇల్లు చూసుకొని వెళ్ళిపోతాం నాన్న..."
తల్లిగానీ, తండ్రి గానీ  మారు మాట్లాడలేదు. చెప్పడం పూర్తి చేసి, బయటికి వెళ్ళిపోయాడతను. తానొక విధంగా ఆలోచిస్తుంటే... ఇతని పంథా మరోలా ఉండేసరికి సువర్చల మ్రాన్పడిపోయింది. ప్రస్తుతం తన కర్తవ్యమేమిటో బోధపడక తలపట్టుకు కూర్చుండిపోయింది. మరోపక్క తన ఇద్దరు పిల్లలు! పక్కనే అమాయకంగా నిద్రపోతున్న వాళ్లని చూసేసరికి ఆమె బాధ  రెట్టింపయింది.
    ఇదేమిటి ! నా జీవితం నా ఇష్టం కాదా ! పోయినంతకాలం  అందరి అభిప్రాయాలూ మన్నిస్తూ తాను బలై పోవాల్సిందేనా! ఇన్నేళ్లుగా ఎన్నో సందర్భాల్లో మనసుకు విరుద్ధంగా ఇష్టం లేని పనులెన్నింటినో ఆమోదిస్తూ వచ్చింది. వద్దంటే ఏమనుకుంటారో, కాదంటే వాళ్ళ దృష్టిలో చెడ్డదాన్నయిపోతానేమో అనుకుంటూ  అనవసరమైన మొహమాటానికి పోతూ అనుక్షణం నలిగిపోతూ వచ్చింది. కానీ ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. తన బలహీనతలతో తనతో పాటు వాళ్లనూ, వాళ్ల భవిష్యత్తునూ ఫణంగా పెట్టే హక్కు తనకే మాత్రం లేదు.పైగా అత్తమామల ఆరోగ్య పరిస్థితీ బాగానే ఉంది.ఆర్థికపరంగానూ లోటేమీ లేదు.  ఆమె అంతరంగం ఆలోచనలో పడిపోయింది...
                **              **          **
🌷
" ఏంటి ప్రసాద్, ఇంకెన్నాళ్లిలా? ఇంట్లో నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. రెండు సంబంధాలు రెడీగా ఉన్నాయి. ఏదో ఒకటి సెట్ చేసేస్తాం అంటున్నారు. నువ్వేమో ఉలకవూ, పలకవూ.. మూడు సంవత్సరాల మన ప్రేమకిక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. పెళ్లి లేదా బ్రేకప్..! ఏదో ఒకటి.. చెప్పేయ్ త్వరగా..."
రెండ్రోజుల క్రితం ప్రగతి అన్నమాటలు పదేపదే చెవుల్లో మారుమ్రోగుతూ ప్రసాదును ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఇరకాటంలో పడేశాయి.
    ఓవైపు రిటైర్ అవబోతున్న తండ్రి, చదువు ఇంకా పూర్తికాని తమ్ముడు, డిగ్రీ చదువుతున్న పెళ్లి కావాల్సిన చెల్లెలు, ఇంటికే  పరిమితం అయిపోయిన తల్లి !!  ఇన్ని బాధ్యతల్ని గాలికి వదిలేసి, తన సుఖం తను చూసుకుంటే.. ఎలా ! ఇన్నాళ్లూ  ప్రగతి అర్థం చేసుకుని తనకోసం ఆగింది. ఇక అది కొనసాగేలా అనిపించడం లేదతనికి.
   తన ఆఫీసులోనే పనిచేస్తున్న ప్రగతితో మూడేళ్ల పరిచయం, ప్రేమ అతనిది. ఆమెను వదులుకోలేడు. ఇటు తన వాళ్ళనీ దూరం చేసుకోలేడు. నిద్రకు దూరమై తీవ్ర ఆందోళనలో మునిగిపోయాడు ప్రసాదు.
             **           **               **
   ఆ మధ్యాహ్నం ఆఫీస్ లో ఎవరూ లేని టైం చూసి ప్రగతి ఎదురుగా కూర్చున్నాడు ప్రసాద్.
" నీతో మాట్లాడాలి..."
" మాట్లాడడానికి ఇంకేమీ లేదు..."
" ఎందుకు ఉండదు? మన పెళ్లి గురించి.."
".. ఇక మరిచిపో, నాకు పెళ్లి కుదిరింది.."
 నిటారుగా అయిపోయాడు ప్రసాద్.
" అదేంటి !అదెలా !"
" అదంతే..ఇక నీకూ నాకూ మాటలొద్దు.సారీ,గుడ్ బై"
 ఫైళ్ళు సర్దేసి, లేచి విసురుగా బయటికి వెళ్ళిపోయింది
 ప్రగతి.
" ఓ గాడ్ ! ఇంత స్పీడ్ గా ఇంత తీవ్ర నిర్ణయమా !"
 తల పట్టుకున్నాడు ప్రసాద్. 
  అప్పటినుంచీ, ఆ రాత్రి ఇల్లు చేరేవరకూ, చేరాక, మంచం మీద పడుకున్నాక...ఆలోచిస్తూనే ఉన్నాడు . రెండేళ్ల క్రితం...ప్రగతితో ప్రేమ మొదలయ్యాక, ఇంట్లో మెల్లిగా విషయం బయటపెట్టాడతను.  
" తమ్ముడి చదువు పూర్తి కానియ్ రా, తొందరేముంది!ఆకాస్త డిగ్రీ అయిపోతే వాడూ ఏదోక ఉద్యోగంలో చేరిపోతాడు.అప్పుడు చూద్దాం... "
అని దాటవేశాడుతండ్రి. డిగ్రీ అయిపోయింది. వాడేమో పీ.జి చేస్తానని మొండికేసి చేరిపోయాడు. తల్లీదండ్రీ వాణ్ణే సపోర్ట్ చేశారు. 
" శభాష్ !ఏమదృష్టం రా నీది !"
అనుకున్నాడు. మొదటిసారిగా ఇంట్లో పెద్దకొడుకుగా పుట్టినందుకు తనమీద తనకే జాలేసింది ప్రసాద్ కు. మరోవైపు...బాధ,కోపం అంతరంగంపై యుద్ధం ప్రకటిస్తున్నా, తమాయించుకున్నాడు.వెధవది! దిక్కుమాలిన మొహమాటమొకటి! గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టు మాట పెగిలిరాదే బయటకు!    తను పెళ్లి చేసుకుంటే ఆవచ్చే పెళ్ళాం కొడుకును తీసుకుని వేరే కాపురం పెడితే!కుటుంబాన్ని తానొక్కడే లాగ్గలడా!అదీ...తండ్రి భయం!తల్లి అనుమానం !!తను సరే, మగాడు..ప్రగతి పరిస్థితేంటి !ఎన్నాళ్లని ఆడపిల్లను ఇంట్లో అట్టిపెట్టుకుంటారు!రెండ్రోజుల క్రితం ఆమె మాటలు గుర్తొచ్చి, 'నిజమే కదా' అనుకున్నాడు. ఇక లాభం లేదనుకుని, లేచి కూర్చుని..అటూ ఇటూ  ఉన్న పరిస్థితులన్నింటినీ తూకం వేసుకుని చూశాడు. 
" నాన్న రిటైర్ అయినా పెన్షన్ వస్తుంది. తన జీతం ఎలాగూ ఉంటుంది. వీళ్ళ చదువులేమీ ఆగిపోవు... సాఫీగా సాగిపోతాయి.పీ.జి తర్వాత తమ్ముడికి ఏదో ఒక జాబ్ రాక మానదు. చెల్లి పెళ్ళీ  కుదురుతుంది. అవన్నీ ఇప్పుడు తన  పెళ్లి జరిగినా  ఏమీ  ఆగిపోవు.... సజావుగానే  జరిగిపోతాయి. ఎలాగూ ప్రగతి జాబ్ ఉందాయె  ! తనూ ఓచెయ్యి వెయ్యదా ఏమిటి ! మరి... తనిప్పుడు పెళ్లి చేసేసుకుంటే అభ్యంతరం ఏమిటిట !! చిక్కుముడి విడిపోయింది...వెధవది ! మట్టి బుర్రకు ఇన్నాళ్లూ  తట్టనేలేదేమిటి !? సన్నగా ఈల వేయబోయాడు.... ఠక్కున స్ఫురించి,ఈల మధ్యలోనే ఆగిపోయింది.
" కానీ...ఎలా ! పెళ్లి కుదిరిపోయిందని చెప్పిందే !!"
 మళ్లీ వెంటనే ఫ్లాష్ !
" కుదిరింది అని చెప్పింది గానీ... జరిగింది అని కాదు గదా! "
 మళ్లీ హుషారొచ్చి, ఈల  బయటికొచ్చింది.
               **             **             **
🌺
  పరిమళకు తిండి సయించడం లేదు. ఇంట్లో అన్నా, వదిన కూడా ఉన్నారు. కానీ, తల్లితో సహా ఎవరూ ఏమీ కల్పించుకోవడం లేదు...ఆమె మనోగతం తెలిసిపోతున్నా....!
   ఇదేమిటి ! నాపెళ్ళి నా ఇష్టం కాదా ! నన్నడిగి నిర్ణయించాల్సిన అవసరం లేదా! లోలోన కుమిలిపోతూ మూడు రోజులపాటు నిద్రాహారాలు లేకుండా గడిపేసింది పరిమళ. అలా అలా వారం గడిచింది.ఆసాయంత్రం వెంకటేశ్వర్లు కొడుకు వీరేష్ తో  కలిసి పెళ్లివారింటి నుండి వచ్చాడు. 
" ముహూర్తం పెట్టేసుకుని వచ్చాము. రెండు వారాలుంది పెళ్లికి. రేపెళ్లి శుభలేఖలు ప్రింటింగ్ కియ్యాలి. పెద్దగా టైం లేదు. అందరూ తలోచెయ్యి వేస్తే గానీ పనులు జరగవు... "
కాళ్ళు కడుక్కుంటూ అక్కడే ఉన్న భార్యనూ, కోడలినీ ఉద్దేశించి చెప్పాడు. పరిమళ అక్కడే ఓ మూల కుర్చీలో కూర్చుని ఉంది... కానీ ఆమె వైపు తల తిప్పి కూడా చూడలేదాయన. పరిమళ మనసు చివుక్కుమంది. ఆస్థానంలోనే కోపం భగ్గుమని రగులుకుంది....
" ఏమిటిది! ఈయన నా తండ్రే నా ! ఇంట్లో ఉన్నది నా వాళ్లేనా! నన్నడగాలని గానీ, నా ఇష్టాఇష్టాలు గ్రహించాలనిగానీ ఎవ్వరికీ పట్టదా ! కన్నతల్లి కూడా ఇలా రాయిలా మారిపోయిందేమిటి!..."
జలజలా రాలుతున్న కన్నీళ్ళని తుడుచుకోవాలని కూడా అనిపించలేదాపిల్లకి! తనకేమిటి తక్కువ! కాలు సరిగా లేనంత మాత్రాన ఇంత హీనంగా చూడాలా! పది  పాసయింది. కుట్టు మిషన్ నేర్చుకుంది. జాకెట్లు చక్కగా కుట్టగలదు. రకరకాల కుట్లు, అల్లికలతో పాటు చీరలపై ఎంబ్రాయిడరీ చేయగల నైపుణ్యం ఉంది. అన్నింటికన్నా మిన్నగా ఎలాగైనా బ్రతకగలనన్న నమ్మకం ఉంది.తమ ఊరిదే అయిన శ్రీలక్ష్మి అక్క మాటలు తలపుకొచ్చాయామెకు.... 
" నీకేంటే పరిమళా, ఏ దర్జీ కుట్టలేనంత చక్కగా జాకెట్లుకుడతావు. ఎంబ్రాయిడరీ చేయగలవు, నాతో పాటురా... మా టైలరింగ్ షాప్ లో చేర్పిస్తా. ఏడాది తిరిగేసరికల్లా నంబర్ వన్ నీవే అవుతావు. సొంత షాప్ కూడా పెట్టుకుంటావు చూడు...! ఎందుకు నిన్ను నీవే తక్కువ చేసుకుంటూ అస్తమానం బాధపడతావు!"
తన వైకల్యాన్ని తలచుకొని పదే పదే దిగులు చెందుతున్న తనతో రెండు మూడుసార్లు ఆమాటలన్నది. ఎంతో ధైర్యం నూరిపోసేది. ఆ మాటలిప్పుడు మరీ మరీ గుర్తొచ్చి కళ్ళ మీద కునుకు లేకపోతోందామెకు. 
 ఎందుకీ  బలవంతపు పెళ్లి! రేపాయింటికి వెళ్లి, అందరికీ వండి వారుస్తూ, సేవలు చేస్తూ జీవితం గడిపేయాలా! అది తప్పని కాదు... తనూ అందరిలాంటి ఆడపిల్లేగా ! తనకూ అచ్చట ముచ్చటా ఉండవా ! అవన్నీ ఆ ఇంట్లో తీరుతాయా! పుట్టింట్లోనే లేదు... ఇక అత్తింట్లో...అదీ అలాంటి వాతావరణంలో... సాధ్యమా ! ఇద్దరు  పిల్లల తండ్రి!అదీ ఆడపిల్లలు !వారిని  పెంచాలి, బాగోగులు చూడాలి, పెళ్లిళ్లు చేయాలి....! అంత భారం మోసేశక్తి  తనకు ఉందా!అమ్మానాన్నల కీవిషయం ఎందుకు తోచలేదు ! కనీసం ఆ పెళ్ళివారికైనా...ఇంటికి తగ్గ కోడల్ని ఎంచుకోవాలన్న ఆలోచన రాలేదే !!
   అవన్నీ పక్కన పెడితే...తను అనాకారి అనే కదా... వీళ్లంతా తన ఇష్టానికి ఏ విలువా లేకుండా ప్రవర్తిస్తున్నారు! ఆ తీరే పరిమళకు అస్సలు నచ్చడం లేదు. నేను మాత్రం వీళ్లకు ఎందుకు తలవంచాలి ? ! నా జీవితం నాది కాదా! దానిపై నాకే హక్కు లేదా!!
                     **         **            **

      ( రెండవ భాగం తర్వాతి పోస్ట్ లో )





No comments:

Post a Comment