Thursday, July 6, 2023

ఇది నా జీవితం__PART-2

 🌹
 మరుసటిరోజు ఉదయం ఏదో పనిమీద బయటికి వెళ్తున్న మరిదినీ, అతని భార్యను కాస్త ఆగమని చెప్పి కూర్చోబెట్టింది. 
" మురళీ, నిన్న నీవు చెప్పింది విన్నాను బాబూ... కొద్ది రోజులు ఆగి మీ అందరికీ ఓ విషయం చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను. కానీ నిన్న  నీ అభిప్రాయం విన్నాక ఇంక ఆలస్యం చేయకూడదనిపించి చెప్తున్నాను. టౌన్ లో ఓ షాపింగ్ మాల్ లో నాకు ఒక చిన్న ఉద్యోగం చూశాడు, నా తమ్ముడు సురేష్. పిల్లల చదువుల కోసం అక్కడే చిన్న ఇల్లు తీసుకుని ఉండాలని అనుకున్నాను. ఈలోగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పేశావు... నేను వెళ్లడమైతే తప్పనిసరి. అత్తయ్య, మామయ్య అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఏది ఏమైనా, ఇంటి బాధ్యత ఇకనుంచి నీదే బాబు..."
నెమ్మదిగా అయినా స్థిరంగా చెప్పింది సువర్చల. 
" అది కాదు వదినా... "
"... వద్దు మురళీ, ఇంకేమీ చెప్పొద్దు.. మీ అన్నయ్య పోయినప్పుడు నీవింకా చిన్నవాడివి...  బాధ్యత తీసుకునే వయసు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు కదా.. ! దయచేసి నా పరిస్థితీ అర్థం చేసుకోండి...నా పిల్లల భవిష్యత్తు కూడా నాకు ముఖ్యం కదా.. !"
".................... "
".... రెండ్రోజుల్లో నేను  పిల్లల్ని తీసుకుని వెళ్లిపోతాను.. అత్తయ్యా, మామయ్యా, మీకు తప్పనిపిస్తే క్షమించండి..అయినా,  మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా వచ్చేస్తాను.మరోలా అనుకోకండి. "
అత్తమామలకు కూడా అన్యాపదేశంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది సువర్చల. సున్నితంగా బాధ్యతల్ని తప్పించుకోవాలని చూసిన మురళి ఖంగు తిన్నాడు...
                   **           **               **
🌷
" ప్రగతీ, నీతో మాట్లాడాలి... కాదు అని మాత్రం అనకు. వచ్చెయ్, "
ఆ సాయంత్రం ఆఫీసు అవర్స్ ముగియబోతుండగా వెళ్లి ఆమె ముందు నిలబడి చెప్పేసి, ఠక్కున వెనుదిరిగి బయటపడ్డాడు ప్రసాద్. ఆ స్వరంలో స్థిరత్వం చూసి,  వెంటనే లేచింది ప్రగతి.. 
 కాఫీ సిప్ చేస్తూ, 
" సరే, నీవు కోరినట్టే చేసుకుందాం పెళ్లి... "
" ఏంటి సరే.. నా పెళ్లి కుదిరిపోయిందీ  అన్నాగా !"
" జరిగిపోయిందీ  అనలేదుగా.. !"
"అయితే ఏంటిట ! కుదిరిన పెళ్లిని చెడగొట్టుకోమంటావా! అది అయ్యే పనేనా!? ఎలా కనిపిస్తున్నా నేన్నీకు !? "
"నా ప్రేయసి ప్రగతిలాగే కనిపిస్తున్నావులే గానీ....ఏదీ, నంబరిటివ్వు.. "
".. ఏ నంబరు? "
" అతని నంబరు.. అదే ఆ పెళ్లి కొడుకు గారి నంబరు.. నేను మాట్లాడతా అతగాడితో... ! రేయ్, ఫూల్, నేను ప్రేమించిన పిల్లను నువ్వెలా చేసుకుంటావురా ఇడియట్ ! అని చెడామడా కడిగేస్తాను..ఇవ్వు నంబర్.. "
" లేదు... !"
" ఏంటి లేదు..? 
" నంబర్ లేదు.. "
" వీధిబళ్ళో చదివే బుడ్డోడి జేబులో కూడా సెల్ ఉండే  రోజులమ్మా ఇవీ...! చెట్టంత  మగాడికి లేదంటే నమ్మాలిమరి !"
"...అబ్బా ! మగాడంటూ ఉంటే కదా నంబర్ ఉండటానికి... !"
చివ్వున తలెత్తి నవ్వుకుంటున్న ప్రగతిని చూశాడు ప్రసాద్. 
" అంటే...? "
 నవ్వు కంటిన్యూ చేస్తూ. 
" చీకట్లో ఓ రాయి విసిరా... అంతే... !"
" అమ్మ దొంగా..! ఎంత మోసం! టెన్షన్ తో చచ్చిపోయాను తెలుసా,  రాక్షసీ...!"
" లేకపోతే...యుగాలు గడుస్తున్నా, టీవీ సీరియల్లా సాగదీస్తూ ఉంటే ఎలా? సరె  సర్లే.. ఇప్పుడు మళ్ళీ పాతపాటే పాడతావా ఏంటి కొంపదీసి!!"
" నెవ్వర్.. డిసైడ్ అయిపోయాక, తగ్గేదేలే... ఈ రాత్రే ఇంట్లో అందర్నీ కూర్చోబెడతా. విన్నారా సరే... లేదా రేపే నిన్ను లాక్కెళ్లి, ఏ గుళ్ళోనో తాళి కట్టేస్తా... "
పకపకా  నవ్వింది ప్రగతి. శృతి కలుపుతూ, లేచి ప్రగతి చేయందుకున్నాడు ప్రసాద్.. 
                **            **           **
🌺
    వారం గడిచింది...వెంకటేశ్వర్లు, కొడుకు వీరేష్, ఇద్దరూ బయటినుండి వచ్చారు. ఓ సంచీ లోంచి పెద్ద కవరు తీసి, 
" శుభలేఖలొచ్చాయి. ఇవి తీసికెళ్ళి దేవుడిగూట్లో పెట్టి తీసుకురామ్మా "
అని, కోడలి చేతికందించబోయాడు వెంకటేశ్వర్లు. 
" ఆగండి నాన్నా, ఎవరి పెళ్లి? ఎవరి శుభలేఖలు? తెలుసుకోవచ్చా? "
పరిమళ ముందుకొచ్చింది. 
" అదేంటి ! నీ పెళ్లే..అలా అడుగుతున్నావేంటి !"
" నా పెళ్ళా ! నాకు చెప్పారా నా పెళ్ళని !నన్నడిగి నిశ్చయించారా? నాకిష్టమో లేదో కనుక్కున్నారా?..."
" పరిమళా ! ఏంటి వాగుతున్నావ్ !"
ఆయన ముఖం కోపంతో ఎర్రబడింది ఒక్కసారిగా. వీరేష్ కలవరపడ్డాడు. అత్తాకోడళ్ళిద్దరూ అనుకోని ఈ పరిణామానికి విస్తుపోయి, మాటరాక నిలబడిపోయారు.
"జరిగిందేచెప్తున్నా నాన్నా,  మీరంతాఎవ్వరూ, ఏఒక్కరూ  నన్నడగలేదు. అడిగితే ఏం చెప్తానో మీ అందరికీ తెలుసు. అది మీకిష్టముండదు. ఎందుకు నాన్నా, నెత్తిమీది బరువు దించేసుకోడానికి అంత ఆరాటం !కన్నబిడ్డ సుఖసంతోషాలు మీకేమాత్రం పట్టవా !అమ్మా, నువ్వూ అంతే కదా !.."
అంతా తలలు దించుకున్నారు. 
" వద్దు..నాకీ పెళ్లి వద్దు. మీకు భారం కాకుండా నేను బ్రతగ్గలను. కాదూ కూడదంటే...నా మెడకో ఉరి బిగించండి.తాళి కంటే అది ఎంతో నయం... "
వరలక్ష్మి గాభరాగా కూతురి దగ్గరగా వచ్చింది. 
" అదేమిటమ్మా, ఇంతదాకా వచ్చాక... !"
వీరేష్ కల్పించుకున్నాడు. 
"పోయేదేమీ లేదులే అన్నా, నా జీవితం కంటే ఏదీ నాకు ఎక్కువ కాదు. నా గురించి మీరు ఆలోచించనప్పుడు నేనూ అంతే !..."
ఏడుస్తూ లోపలికెళ్ళింది. సిద్ధంగా ఉంచుకున్న సూటుకేసు పట్టుకుని తిరిగి వచ్చింది. 
" ఆగు ! ఎక్కడికి బయలుదేరావు? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా  ! వాళ్లకు మేమేం చెప్పాలి? "
వెంకటేశ్వర్లు గద్దిస్తూ అరిచాడు. 
" అది నా బాధ్యత కాదు నాన్నా, మీరే ఆలోచించుకోండి... "
అవాక్కై నిల్చుండిపోయిన తండ్రినీ, మిగతా వాళ్ళనీ దాటుకుంటూ గడప వైపు నడిచింది. వెళ్తూవెళ్తూ...ఓసారి తల తిప్పి, 
" పెళ్ళిచూపులయ్యాక...నీకు సమ్మతమేనామ్మా అని మాటవరసక్కూడా నన్నడగ లేదు గదా నాన్నా !అలా అడిగి ఉన్నా ఆలోచించి ఉండేదాన్ని...కాలు మాత్రమే సరిగా లేదు నాకు. కానీ, మనసనేది ఒకటుంది. దానికో వ్యక్తిత్వమనేదుంది. అది చంపుకుని మాత్రం బ్రతకలేను.. "
"........................"
"...ఈరోజు నా మాటలు మీకు తప్పుగా అనిపించొచ్చు. కానీ, నాది సరైన నిర్ణయమే అని నిదానంగా మీకే అనిపిస్తుంది. ఎందుకంటే నా నిర్ణయం మీద నాకు పూర్తిగా నమ్మకముంది... "
అప్రతిభులై చూస్తున్న అందర్నీ నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ గడప దాటింది పరిమళ !!
 ఇప్పుడామె మనసంతా తేటగా అయిపోయింది.అంతులేని ఆత్మవిశ్వాసం ఆమె ముఖంలో తొణికిసలాడుతుండగా, తన జీవితం తన చేజారిపోలేదన్న తృప్తితో ఆమె అడుగులు ముందుకు సాగాయి. 
( పరిమళ, సువర్చల, ప్రసాద్...ఈ ముగ్గురూ అవకాశవాదులు మాత్రం కాదు. కొందరు అవకాశవాదుల బారినుండి తమను తాము రక్షించుకుని తమ జీవితాల్ని సరిజేసుకున్న వాళ్ళు. ఇది స్వార్థమనుకుంటే...అంతో ఇంతో ఈమాత్రం స్వార్థం ప్రతి మనిషికీ తప్పనిసరిగా ఉండితీరాలి.. )
                        --- సమాప్తం ---
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


No comments:

Post a Comment