Thursday, July 13, 2023

ఊహ ఎంత మధురం !

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦
🌷🌺🌹🌷🌺🌹🌷🌺🌹🌷🌺🌹🌷🌺🌹🌷🌺🌹

ఊహలకే రెక్కలొస్తే !!
నింగిని చేరి మేఘాల పరుపుపై
తేలియాడుతూ... అరమోడ్పు
కన్నులతో కలలుగంటూ...
ఎల్లలు.. భాషా భేదాలు లేని...
అవాస్తవాల్ని వాస్తవాలుగా
ఎదుట నిలిపే ఆ వినూత్న ప్రపంచం
ఆహా! ఎంత మధురం !!
ఆ క్షణాన ---
కడు బీదను తరగని పెన్నిధి
కధిపతినౌతాను !
బానిసై మగ్గుతున్న బందీని
వినువీధిని విహరించే
విహంగమౌతాను !
అనాకారిని అందాల రాణిగా...
అక్షరమే ఎరుగక అపర మేధావిగా...
నడకే రాక నాట్యమయూరిగా... 
రూపాంతరం చెందుతాను !
ప్రేమరాహిత్యంలో పగుళ్ళు వారిన
నా గుండె తలుపులు తడుతూ
రా రమ్మంటూ వేనవేల పిలుపులు... 
వినిపించేదీ ఆ క్షణాల్లోనే !!
నిరాశతో నిట్టూర్పులతో
ప్రశ్నార్థకమైన భవిత
ఆశల చివుళ్ళతో 
కొత్త ఊపిర్లు పోసుకునేదీ 
ఈ ఊహల ఊసులతోనే !!
ఓహ్ !! వర్ణించనలవికానిది !!
ఎంతటి విలక్షణ జీవన చిత్రమది !
నా భావి ప్రయాణానికి
ఇంధనం ఈ ఊహా ప్రపంచం...
అందుకే--- ఊహలకే రెక్కలొస్తే...! 
ఎంత మధురం! ఎంతెంత మధురం !!

🌺🌹🌷🌷🌹🌺🌺🌹🌷🌷🌺🌹🌷🌺🌷🌺🌷
'ఆంధ్రభూమి' వారపత్రిక 4.4.2013 లో ప్రచురితం
🌺🌷🌹🌺🌷🌹🌺🌷🌹🌺🌷🌹🌺🌷🌹🌺🌷


2 comments:

  1. LRSR:

    ఊహలకు ఉన్నత పీఠం వేశావు. ఊహల గురించి గొప్పగా రాశావు. నిజమే! ఏమి లేనివాడు ఊహల్లో గొప్ప ఐశ్వర్యవంతుడు. ఎంతో ఆనందంగా ఉంటాడు. పరమాత్మ కూడా చేతికి చిక్కుతాడు. చాలా చక్కగా రాశావు. బాగా నచ్చింది. 👌👌

    ReplyDelete