😊
" వేణమ్మక్క పంపించిందమ్మా, పని మనిషి కావాల న్నావంట కదా... "
గేటు చప్పుడు విని బయటకొచ్చిన జలజను చూస్తూ చెప్పిందామె.
" అలాగా.. రా.. "
అంటూ జలజ లోపలికి పిలిచిందావిణ్ణి. దాదాపుముప్ఫయి ఏళ్లు దాటి ఉంటాయేమో ! పొట్టిగా గుమ్మటంలా ఉంది. మనిషి చాలా' స్టైలిష్' గా ఉందనిపించింది జలజకు. . చూస్తే ఇంటి పని చేసే దానిలా అనిపించలేదు ఎందుకో ఆమెకు. రెండేళ్ల నుండి పని చేస్తున్న భాగ్యవేణమ్మ కూతురి కాన్పు కోసం వెళ్లాలి, మళ్లీ మూడునెలల్లో వచ్చేస్తానంటూ రెండ్రోజుల క్రితం చెప్పి వెళ్ళిపోయింది. ఈలోగా తనకు ఇబ్బంది ఉండకూడదని, తెలిసినావిడ ఉందంటూ, పంపిస్తానని చెప్పి, తిరిగి వచ్చాక మళ్లీ నేనే చేస్తానని హామీ ఇచ్చి మరీ వెళ్ళింది. ఆవిడే ఈవిడ అన్నమాట!
లోపలికి రమ్మని, చేయవలసిన పనులు, ఇచ్చే జీతం మాట్లాడుకున్నారిద్దరూ. ఉద్యోగిని అయిన జలజకు ఇంటిపని, బయటపనీ చేసుకోవాలంటే చాలా శ్రమ గా ఉంటోంది. మళ్లీ ఇంత త్వరగా పనా విడ కుదిరినందుకు పొంగిపోయి, అడిగినంతా ఇచ్చేస్తానని ఒప్పేసుకుని,
".. ఇంతకీ నీ పేరేమిటి?.. " అనడిగింది జలజ.
" అనుష్క "
ఉలిక్కిపడింది జలజ.
".. ఔనమ్మా, అనుష్క.. "
కళ్లింతలు చేసుకున్న జలజను చూస్తూమళ్ళీ చెప్పిందామె.
".. అదేదో వేరే పేరు చెప్పిందే వేణమ్మ.. "
".. ఆ.. అలివేలని చెప్పుంటుందిలే... నేనంటే దానికి కుళ్ళు... "
".. అయ్యో, అలాగైతే నిన్నెందుకు పనిలో పెడుతుంది? "
లోపల అనుకోబోయి, ఠక్కున పైకే అనేసింది జలజ.
" ఆ.. మరొకరూ మరొకరైతే ఇల్లు విడిచి పెట్టడానికి ఒప్పుకోరు కదమ్మ, నేనైతే గమ్మున వెళ్లిపోతానని. "
వెంటనే అందుకుని చెప్పేసింది.
" భలే గడుసు దానిలా ఉందే.. " అనుకుంటూ,
"... సరిసర్లే.. ఏదైతే ఏమి గానీ పేరు చక్కగా ఉందిలే.. ఎవరు పెట్టారింతకీ? "
నవ్వుతూ అడిగింది జలజ.
".. టీవీ సీరియల్ లో డాక్టరమ్మ ఇంట్లో పనిమనిషి పేరు ప్రియమణి కదమ్మా, అంతకంటే నేనేమి తక్కువని అనుష్క అని నేనే పెట్టేసుకున్నానమ్మ.. "
చప్పిడి ముక్కు, గార పళ్ళు...గట్టిగా రబ్బర్ బ్యాండ్ తోబిగించి కట్టిన పొట్టి జుట్టు, భూమికి నాలుగడుగులు ఉండీ లేక.. ఇది అనుష్క!.. "
వస్తున్న నవ్వాపుకుంటూ,
" అదేమిటి? అలివేలు.. దేవత పేరు... బాగానే ఉందిగా?, "
అంది మళ్ళీ.
" బాగుందమ్మ, కానీ మరీ బొత్తిగా పాత పేరు. మొరటుగా కూడా ఉంటుందని.. "
నెత్తి గీరుకుంటూ నసిగింది. దీంతో ఇక ఎక్కువ మాటలు ఎందుకులే అనుకుని, లేస్తూ అడిగింది,
" సరేలే.. పన్లోకి రేపటినుంచి వస్తావా? "
" రేపటి దాకా ఎందుకు? ఇప్పుడే మొదలెట్టనూ .. "
అంటూ తనూ లేచి మూలనున్న చీపురు అందుకుంది.
' అమ్మయ్య,.. వంటింట్లో సింకులో అంట్ల గిన్నెల బాధ తప్పిందన్నమాట..."
అనుకుంటూ లోనికి దారితీసింది జలజ.
** ** **
మరుసటి రోజు ఉదయం వంటావార్పు పూర్తి చేసుకుని రెడీ అయింది జలజ. భర్త, పిల్లలు అరగంట క్రితమే వెళ్లిపోయారు. అలివేలు...అదే.. అదే ..అనుష్క.. ఇల్లు తుడవడం ఆఖరి దశలో ఉంది. మరో పావు గంటలో బ్యాగ్ తగిలించుకుని, తాళం తీసుకుని బయటికొచ్చింది జలజ. సరిగ్గా అప్పుడే పని ముగించుకున్న అలివేలు ఇల్లు తుడిచిన నీళ్ల బకెట్ తెచ్చి, ముందుకూ వెనక్కూ ఓ ఊపు ఊపి కాంపౌండ్ లో ఓ మూలనున్న స్థలం కేసి దబ్బుమని చల్లేసింది. అంతే ! జలజలా వర్షం కురిసినట్లుగా నీళ్లన్నీ అక్కడున్న ఎండిపోయిన చెట్టుమీద ఒక్కసారిగా పడిపోయాయి. బకెట్ తీసుకుని లోపలికెళ్లబోతూ అటు వైపు చూసి,
" అమ్మా, ఈ చెట్టు బాగా ఎండిపోయింది, పీకి పారేయండి.."
అని ఓ ఉచిత సలహా పారేసింది. ఆ మాటతో అటువైపు అప్రయత్నంగా దృష్టిసారించింది జలజ. ఒక్క క్షణం ఆమె మనసంతా అదోలా అయిపోయింది.
" అరె ! ఎంత పొరపాటయిపోయింది ! పని వత్తిడిలో పడిపోయి రెండు వారాలుగా అటువైపు చూడ్డమే లేదు. ఇంతలో ఇలా అయిపోయిందేమిటి !..."
అచేతనంగా నిలబడిపోయింది జలజ. తనకు మొక్కలంటే చాలా ఇష్టం. చిన్న ఇల్లు. అదీ అద్దె ఇల్లు.. అయినా ఉన్న కాస్త స్థలంలో ఓ అరడజను తొట్లు తెచ్చి, వాటిల్లో క్రోటన్లు, పూల మొక్కలు నాటి, అవన్నీ కాంపౌండ్లో ఓవైపు సర్దేసింది. రోజూ వాటికి నీళ్లు పోయడం తనకలవాటు. మరో మూల ఎందుకో కాస్త స్థలం వదిలేశాడు ఓనరు. ఓసారి తన కొలీగ్ ఇంట్లో ఓ పూల మొక్క చూసి ముచ్చటపడి, చిన్న మొలక తెచ్చి ఆ ఖాళీ స్థలంలో నాటేసింది జలజ. వర్షాకాలం అయినందువల్లో ఏమో... ప్రత్యేకించి నీళ్లుపోయక పోయినా అది కాస్తా నిలదొక్కుకుని కొద్ది రోజుల్లోనే ఏపుగా పెరిగి, పూలు పూయడం మొదలెట్టింది. కనకాంబరం రంగులో చిన్న చిన్న పూలు !! సంవత్సరం క్రితం నాటిన ఆ మొక్క బాగా పెద్దద యిపోయి ముచ్చటగొలుపుతూ చాలా అందంగా కనిపిస్తూ ఉండేది.
అసలే ఎండాకాలం. ఒక్కరోజు నీళ్లందకపోతే నీరసించి, వేలాడిపోతాయి మొక్కలు. ఎలాగోలా తొట్లకు పోస్తోంది గానీ మరో మూల నుండే ఆ పూల మొక్కను అశ్రద్ధ చేసేసింది. దాని ఫలితమే ఇదన్నమాట !
" సరే, ఏం చేస్తాం. ఆఫీసు నుండి వచ్చేటప్పుడు మరో మొక్క ఏదైనా కొని తెచ్చి, అక్కడే నాటేస్తాను.. "
తనను తాను ఓదార్చుకుని లోనికెళ్లి పోయింది జలజ. అనుకుందేగానీ పనుల ఒత్తిడితో సతమతమ వుతూ జలజ ఆ సంగతి తాత్కాలికంగా పక్కనపెట్టేసింది. మరో రెండు వారాలు గడిచిపోయాయి. ఆ రోజు ఉదయం రెడీ అవుతున్న జలజకు ఠక్కున గుర్తొచ్చింది మొక్క సంగతి.
" ఈరోజు ఎలాగైనా సాయంత్రం వస్తూ వస్తూ ఏదైనా పూల మొక్కతేవాల్సిందే.. "అని గట్టిగా అనుకుంది.
అలివేలు..అహ.... కాదు కాదు అనుష్క.. ఇల్లు తుడవడం పూర్తిచేసి, బకెట్ నీళ్లతో బయటికి వచ్చి, అలవాటు ప్రకారం నీళ్లను మూలకు చల్లేసి, అటువైపయినా చూడకుండా లోపలికి తుర్రుమంది. సరిగ్గా అప్పుడే బయటికొచ్చిన జలజ చూపు అటు వైపు మరలింది. ఆశ్చర్యం ! ఒక్క క్షణం తన కళ్ళను తానే నమ్మలేక పోయింది. మూలనున్న ఆ ఎండిన మొక్క నిండా పచ్చని ఆకులు !! పులకించిపోయి, పరుగున వెళ్ళి దగ్గరగా నిలబడి పరిశీలించింది. సందేహం లేదు. అదే పూల మొక్క ! చివుళ్ళు వేసి, నిండా ఆకులతో అక్కడక్కడా మొగ్గలతో కళకళలాడుతోంది.
" మై గాడ్! ఇదెలా సాధ్యమైంది? చచ్చిపోయింద నుకున్నానే ! "
మరుక్షణంలో ఆమె బుర్రలో తళుక్కున మెరిసింది అలివేలు... ప్రతిరోజూ ఇల్లు తుడిచిన నీళ్లు ఆ మూలకు చల్లేయడం! బాప్ రే ! అదా సంగతి! ఆ నీళ్లతో వాడిపోయిన ఈ మొక్క బతికి బట్టకట్టిందన్న మాట !
" ఔరా!జలమహిమ!"
అబ్బురమనిపించింది జలజకు. నీళ్ళే కదా అనుకుంటాం గానీ వాడి ఎండిపోతున్న మొక్కల్ని సైతం పునరుజ్జీవింప జేయగల శక్తివంతమైన టానిక్ ఈ నీరన్న మాట!దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ మొక్కే ! తెలిసొచ్చింది జలజకు.
ఇంకా నయం! ఆ రోజే వెంటనే పీకి పారేశాను గాదు. చూడచక్కని పూల మొక్క...ఎండి పోయినందుకు ఎంత బాధ పడిందా రోజు ! ఎప్పుడూ విపరీతంగా తిట్టుకునే తన పని ఒత్తిడి పై మొట్టమొదటిసారిగా ఎన్నడూ లేనంత ఇష్టం కలిగింది జలజకు.
" ఇంతకీ.. అనుష్కకి చెప్పుకోవాలి థాంక్స్..."
అంతవరకూ అలివేలు గానే తప్ప అనుష్క గా 'యాక్సెప్ట్ ' చేయని జలజకు ఉన్నట్టుండి ప్రేమ పొంగి పోయింది పనావిడ మీద.
** ** ** **
చూస్తుండగానే రెండు నెలలు గడిచిపోయాయి. ఆ రోజు ఆదివారం. పనవగానే వెళ్తూ వెళ్తూ చెప్పింది అలివేలు,
" అమ్మా, వేణక్క బిడ్డ కాన్పయిందంట. మనవడు పుట్టాడంట. ఈ నెలాఖరుకల్లా వచ్చేస్తాదంట.... "
"... అమ్మా, వేణక్కొస్తే నేవెళ్ళిపోతా గదా.... నీవి రెండు పాత చీరలేవైనా.... ఇవ్వండమ్మా.. "
మెల్లిగా నసుగుతూ కోరిక వెలిబుచ్చింది. నవ్వుకుని,
" నీకు పాత చీరేంటి, కొత్తదే ఇచ్చుకుంటాలే "
అని లోలోపల అనుకుంది జలజ. నిజానికి వేణమ్మ కంటే అలివేలే హుషారుగా పనిచేస్తోంది. ఉన్నంతసేపు గలగలా మాట్లాడ్తూ సందడి చేస్తూ ఉంటుంది. పైగా ఉదయం చాలా తొందరగా వచ్చేస్తుంది. అదో వెసులుబాటు తనకు.మొదట్లో చూడంగానే,
" ఇదేం పని చేసే బాపతులా లేదే "
అనుకుంది గానీ త్వరలోనే తన అభిప్రాయం తప్పని నిరూపించింది అలివేలు. తను వెళ్ళి పోతుందనుకుంటే జలజకు ఏదో వెలితిగా అనిపిస్తోందిప్పుడు. మూడు నెలల సమయమే అయినా ఎంతో దగ్గరయినట్టుంది అలివేలు. కానీ పాత పనావిడ వేణమ్మను వద్దనలేదుగా ! మరో విషయం ఏంటంటే...ఆకులతో పోటీ బడుతూ విరగగాస్తున్న పూలచెట్టును చూస్తుంటే తనకే తెలియకుండా ఆ పూల మొక్కకు పునర్జన్మ నిచ్చిన అలివేలంటే ఏమిటో ప్రత్యేకమైన అభిమానం పుట్టుకొచ్చింది జలజకు.
** ** ** **
నెలాఖరు వచ్చేసింది. మరుసటి రోజు నుండీ పనిలోకి వస్తానని వేణమ్మ కబురు పంపింది. రోజులాగే పనంతా ముగించుకుని చేతిలో బకెట్ తో బయటకు వచ్చింది అలివేలు. యధాలాపంగా నీళ్లు మూలన గుమ్మరించేసి లోపలికి పోబోతూ అనుకోకుండా అటువైపు చూసింది.
"..అమ్మా, నువ్వు మళ్ళీ నాటావు కదా, ఈ మొక్క ! అప్పుడే ఎంతగా పెరిగిందో చూడు!పూలు కూడా పూస్తోంది.. ."
అంటూ జలజ వైపు చూసింది, కళ్లింతవిగా చేసి.
" పిచ్చి మొద్దూ, అది ఆ ఎండిన మొక్కే. పీకేయమన్నావు గదా, కానీ... రోజూ నీవు పోసే నీళ్ళతో మళ్ళీ ఇలా తయారైంది.."
అని నవ్వేసింది జలజ.
" ఔనామ్మా.... "
బుగ్గలు నొక్కుకుంది అలివేలు.మరో పది నిమిషాల్లో పనంతా పూర్తి చేసి,
" అమ్మా, వెళ్తానమ్మా. రేపు వేణక్క వస్తుంది... "
చేతులు తుడుచుకుంటూ వచ్చి చెప్పింది అలివేలు.
" సరేగానీ ఇలారా... "
అంటూ లోపలికి పిలిచి ఓ ప్యాకెట్ చేతిలో ఉంచింది జలజ. తెరిచి చూసి,
"..కొత్త చీర ! అయ్యో, పాతది చాలమ్మ నాకు.... "
అంటూ మొహమాటపడింది.
"... అవి కూడా ఉన్నాయిలే.. ఇదిగో.. "
అంటూ మరో పాకెట్ అందించింది.దాంతోపాటు ఆనెల జీతం డబ్బులు ! అలివేలు ముఖంలో ఎన్నడూ ఎరగని ఆనందం ! కోరకనే ఒళ్ళో వచ్చిపడ్డ బహుమతులు !రెండు పాకెట్లూ ఒక చేత్తో, మరోచేత్తో డబ్బులూ పట్టుకుని,
" ఎప్పుడు ఏ పని బడినా కబురు పెట్టమ్మా. చిటికెలో వచ్చి వాలిపోతా...మర్చిపోకమ్మా...ఎల్లొస్తా "
అనేసి ముఖం మతాబులా వెలిగిపోతుండగా గేటు తీసుకుని క్షణాల్లో అదృశ్యమై పోయింది అలివేలు... అహహ... కాదు కాదు... అనుష్క !!
🌷🌷🌷🌷🌷🌷🌷