🌷
కల్లాకపటం ఎరుగని
పాల బుగ్గల ఆ పసితనం
కల్మషం, కాఠిన్యం దరిజేరని
బాధ్యతలకతీత మైన నా బాల్యం
నాకు మళ్ళీ కావాలి...
కదులుతున్న కాలమా, కాస్త ఆగవా !
వెనుకకు మరలి గతంలోకి పరుగిడవా !
ఏ బంధం లేని బంధువులు
అనుబంధాలే బంధాలై
పెన వేసుకున్న స్నేహాలు
అయినవాళ్లను సైతం మరిపించి
మధురస్మృతులుగా మిగిలిపోయిన
నా నేస్తాలు ! నాకు మళ్ళీ కావాలి...
ఆ స్వేచ్ఛాజీవనంలోకి
తిరిగి నన్ను నడిపించవా !
నిద్రలేని రాత్రులు,
తీరిక దొరకని క్షణాలు...
అయినా... ప్రతీ క్షణం
ఎగసిపడే ఆనంద కెరటాలు !!
తీయనైన ఆ బానిసత్వ సేవలు !!
నడి వయసులో, నడిసంద్రంలో
ఆ జీవనయానం....
గతించిన గతంలోని
సజీవ జ్ఞాపకాలతో సహజీవనం..
నాకు మళ్ళీ కావాలి.. ప్రసాదించవా !
ఒక్క ఘడియ సైతం
తిరిగి రాదని తెలుసు...
అయినా లోలోన...ఆశ ! ఏదో ఆశ...!
అత్యాశే...! అయినా మారాం చేస్తోంది
పిచ్చి మనసు...! అందుకే...
ముందుకు కదులుతున్న కాలమా !
ఒక్కసారి వెనుదిరగవా !
గతంలోకి చేరుకోవా !!.
పసిపాపగ మళ్లీ పుడతా !
ఆ మహద్భాగ్యం నాకు కలిగించవా !! 🌷
**************************************
No comments:
Post a Comment