Tuesday, November 15, 2022

నేనూ ఇంతేనేమో... !

🌹

    సమయం ఒంటిగంట కావస్తోంది. మిట్ట మధ్యాహ్నం... స్కూల్ నుండి ఇంటికి బయలుదేరి వస్తున్నాను. దాదాపు ఇల్లు సమీపిస్తుండగా... ఓ దృశ్యం నన్నెంతో ఆకర్షించింది. లెక్కలేనన్ని  బిందెలు... ఒకదాని వెనుక ఒకటి వరుసగా నిలబడి ఉన్నాయి. అందులో ప్లాస్టిక్, స్టీలు,  కంచు..తోపాటు...  అక్కడక్కడా విరిగిన ప్లాస్టిక్ బకెట్లు, పగిలిన సత్తు గిన్నెలూ... అలా రకరకాలు ఉన్నాయండోయ్ ! 

   ఆ కాలనీలో  మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ. చాలామంది అద్దె ఇళ్లలో ఉంటున్న వాళ్లే. ఆ ఇళ్లలో నీటి సౌకర్యం ఉండేవి చాలా తక్కువ. వాళ్లకంతా ఈ వీధిపంపే దిక్కు !     మెల్లిగా వాటిని పరిశీలిస్తూ అడుగులు ముందుకు వేశాను. ఆ వీధి మొదట్లో ప్రారంభమైన ఆ బిందెల వరుస వీధి చివర నున్న కొళాయి వద్ద ఆగిపోయింది. చిన్నగా నవ్వుకుంటూ అక్కడే రెండిళ్ళ అవతల ఉన్న మా ఇంట్లోకి గేటు తీసుకుని వెళ్ళబోయాను. సరిగ్గా అప్పుడే బుస్సుమని శబ్దం చేస్తూ సన్నగా నీటి ధార ప్రారంభమైంది. అంతే! అంతవరకూ బిందెల సొంతదారులు ఏమూల దాక్కుని ఉన్నారో ఏమో... ఒక్కుమ్మడిగా బిలబిలమంటూ వచ్చి, కొళాయి చుట్టూ మూగారు. అంతవరకూ ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణం ఒక్క క్షణంలో అరుపులతో, కేకలతో, సణుగుళ్లతో... ఇంకా చెప్పాలంటే తిట్లతో నిండిపోయింది. ఆ క్షణంలో బిందెలు కాసేపు నాట్యం చేశాయి. అంతవరకూ వరుసలో కిమ్మనకుండా ఉన్న సరంజామా కాస్తా వాటి యజమానుల చేతుల్లోకి, చంకల్లోకి ఎక్కి కూర్చుంది.  లోపలికి పోబోతూ ఆగిన నాకు ఈ తమాషా కాస్త చూడాలనిపించి, అక్కడే ఆగిపోయాను.

    చిత్రమేమిటంటే... ఎక్కడో వరుసలో చివర్లో ఉన్న బిందెలు తెచ్చి ముందుకెళ్లి నిలుచున్నారు కొందరు ! కొందరైతే మెల్లిగా వెనకనున్న  బిందెలు తీసుకెళ్లి ఎవరూ చూడడం లేదులే అనుకొని వరుసలో ముందుగా ఉన్న బిందెల మధ్య దూరుస్తున్నారు. మరికొందరు దౌర్జన్యవాదులు దురాక్రమణ చేస్తూ జబర్దస్త్ గా వెళ్లి పంపు కింద బిందె పెట్టేస్తున్నారు, ఇదేమిటని అడిగితే...

" నా వంతే... ముందు నేనే పెట్టా..." 

 అని  దబాయిస్తున్నారు. నువ్వు నోరు ముయ్యి అంటే నువ్వే ముయ్యి అంటూ యుద్ధం ప్రకటించేస్తున్నారు.

' ఔరా ' అని  ముక్కు మీద వేలేసుకున్నాను. అంతా గమనిస్తున్న నా కళ్ళు అక్కడే ఓ వారగా నిలబడి, ఆ గుంపువేపే చూస్తున్న సుశీల మీద పడ్డాయి. ఆమెకు కాస్త ఎడంగా వరుసలో ఆమె ఆకుపచ్చ బిందెను గుర్తుపట్టాను. ఇంతలో ప్రమీల... ఒక చేతిలో కూరగాయల సంచి, మరో చేతిలో నిండుగా ఉన్న సరుకుల సంచీ పట్టుకుని ఆదరాబాదరాగా మా పక్కనే ఉన్న తన  ఇంట్లోకి దూసుకుపోయింది. మరుక్షణంలోనే సంధించి వదిలిన బాణంలా బయటపడి వరుసలో సుశీల కన్నా ఎంతో దూరంగా ఉన్న తన బిందె పుచ్చుకొని,  ముందుకెళ్లి గుంపులో కలిసిపోయింది. రెండు మూడు నిమిషాలు గడిచిపోయాయి. గేటుమూస్తూ  లోపలికి వెళ్ళి పోదాం అనుకుంటూ అటు తిరగబోయాను. కానీ చంకలో నీళ్ల బిందెతో గబగబా వస్తున్న ప్రమీలను చూసి మళ్ళీ ఆగిపోయాను. పాపం...! సుశీల ఇంకా అక్కడే నిలబడి ఉంది. ఆమె ఆకుపచ్చ బిందె వరుసలో 'సిన్సియర్' గా నిలబడి ఆమె వంక దీనంగా చూస్తోంది.

    ఇదంతా చూస్తూ ఉంటే..

" నోరు ఉన్న వాడిదే రాజ్యం సుమీ.. "

 అన్న మాట అక్షరాల నిజమని అనిపించింది నాకు!!

 "ఈ మాత్రం దానికి కొండవీటి చాంతాడులా ఈ బిందెల  క్యూ దేనికో.. !"

 అనుకుంటూ అంతకంతకూ పెచ్చు పెరిగిపోతున్న కోలాహలాన్ని మరి చూడాలనిపించక లోనికి దారి తీసాను.

               ****  *****   *****

  సమయం మధ్యాహ్నం రెండు కావస్తోంది. తిరిగి స్కూలుకు బయలుదేరాను. గేటు దాటిన నాకు.. ముప్పావు గంట క్రితం చెలరేగిన యుద్ధ వాతావరణం మచ్చుకైనా కనిపించలేదు. సద్దు మణిగి నిర్మానుష్యంగా ఉంది. కానీ... చిత్రంగా పంపు నుండి నీళ్లు ధారగా పారిపోతూ ఉన్నాయి.

     కాసేపటి క్రితం వరకూ ఇదే నీళ్ల కోసం హోరాహోరీ పోట్లాడుకున్నారు.. మరి ఇప్పుడో ! వీధినంతా జలమయం చేస్తూ వృధాగా పోతున్నాయి ఆ  నీళ్లు.. ! ఓ క్షణం పాటు ఆ మనుషుల ప్రవర్తనను చీత్కరించుకున్నాను. కాస్త ఆగితే.. తాపీగా.. ప్రశాంతంగా,  ఏ గొడవా లేకుండా  కావలసినన్ని  నీళ్ళు పట్టుకోవచ్చు గదా..! అనుకున్నా. కానీ... మరుక్షణమే మెరుపులా  మెరిసిన ఓ ఆలోచన నన్ను ఊపివేసింది.

   ఇంట్లోనే నీటి సౌకర్యం ఉన్న నాకు వీధిలోకెళ్లి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కానీ.. కానీ...  నా బిందె కూడా ఆ వరుసలో ఉండి ఉంటే... !నేనూ వాళ్లలో ఒకదాన్నయి ఉండేదాన్నేమో !!

      నిటారుగా అయిపోయాను... !

******************************************




 

3 comments:

  1. మీ టపాకు సంబంధం లేని ప్రశ్న.
    “మూల్యాంకనం” అంటే ఏమిటండి? ఇదేదో విద్యావిధానానికి సంబంధించినదే అనిపిస్తోంది కానీ అర్థం తెలియడం లేదు (నాకు).
    థాంక్యూ.

    ReplyDelete
  2. విద్యకు సంబంధించినంతవరకు.... మూల్యాంకనం అంటే ఇంగ్లీష్ లో evaluation.
    -- సంవత్సరాంతాన పరీక్షలయ్యాక జవాబు పత్రాలు దిద్ది, మార్కులు వేసే ప్రక్రియ. ఇదొకటి.
    -- క్లాస్ లో పాఠం చెప్పాక, అది విద్యార్థులకు ఎంతవరకు అర్థమయ్యిందో తెలుసుకోడానికి టీచర్ అందులో కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. దాన్నీ evaluation (recapitulation)అంటాం.
    నాకు తెలిసిన మూల్యాంకనం ఇదే సర్.

    ReplyDelete
    Replies
    1. థాంక్సండి. అంటే స్పాట్ వాల్యుయేషన్ ని కూడా తెలుగులో మూల్యాంకనం అంటారన్నమాట?

      Delete