Thursday, November 10, 2022

ఏడంతస్తుల మేడ !

🙂


అందమైన బొమ్మరిల్లు నా ఇల్లు...
పూరిళ్లయితేనేమి గాక  !
నాకదే ఏడంతస్తుల మేడ  ! 
ఇది మమతానురాగాలు
వెల్లివిరిసిన చిన్ని గూడు... 
మధుర జ్ఞాపకాలు
గూడు కట్టుకున్న మందిరం... 
నిధి నిక్షేపాలకవి సరి సమానం
అవి నా ఆత్మ బంధువులు 
కలతలు, కన్నీళ్లు.. కష్టాలు, కడగండ్లు.. 
వచ్చి పోయే  చుట్టాలు...!
నా ఈ కుటీరం 
నను  సేదదీర్చే బృందావనం !
ముంగిట్లో  ముత్యాల ముగ్గులు
అటూ ఇటూ  అలరించే...
మందారాలు... మల్లెమొగ్గలు !!
అటుపై నర్తించే వన్నెవన్నెల 
సీతాకోకచిలుకలు... 
అనుదినం... అనుక్షణం
నను ఆహ్లాదపరిచే నేస్తాలు... 
అల్లంత దూరాన పారే 
సెలయేటి గలగలల సరిగమలు
చేస్తాయి వీనుల విందులు.. !
గాలికి ఊగే కొమ్మల రెమ్మల
వాయిద్యగోష్ఠులు... ఆపై... 
వంత పాడుతూ కొమ్మ చాటు కోయిల
కుహూ... కుహూ రాగాలు... !
అలసి సొలసి మేను వాల్చిన నాకు... 
అవి జోల పాటలవుతాయి...
నిదురమ్మ ఒడిని జేర్చి
విశ్రమింపజేస్తాయి... 
కమ్మని కలల్ని రప్పిస్తాయి ... !
ఇంతకన్నా వైభోగం
మరెక్కడైనా దొరకునా...? 
పోటీ పడగలదా 
దీనితో ఏ భవంతైనా ? 
అందుకే.... నా ఈ కుటీరం 
నాకెంతో ప్రియం.. !
పూరిళ్లయితేనేమి గాక... !
నాకిదే ఏడంతస్తుల మేడ  !!😊

************************************



  

2 comments:

  1. “పలుకు తేనియలు” అనే బ్లాగులో కనిపించిన పోస్ట్ (Sept 29, 2017) 👇

    http://palukuteniyalu.blogspot.com/2017/09/blog-post_633.html

    ========================
    గరికిపాటివారు ప్రస్తావించిన ఒమర్ ఖయాం పద్యం !
    =======================
    “ఉండగ చిన్ని పాకయు, పరుండగ చాపయు రొట్టెలొక్కటో

    రెండొ భుజింప, డెంద మలరింపగ ప్రేయసి చెంతనుండగా

    పండుగ గాదె జీవితము! భ్రష్ట నికృష్టుల కొల్వు సేయుటల్

    దండుగ గాదె! ప్రాణికి స్వతంత్రత కంటెను స్వర్గమున్నదే? “
    ===================

    మీ ఈ పోస్ట్ చూసిన పిమ్మట గరికపాటి వారు చెప్పింది కూడా సొగసుగా ఉందనిపించి, ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

    ReplyDelete
  2. ప్రస్తుత కాలానికి సరిపోయేలా కనీస వసతులతో కూడిన చిన్న ఇల్లయినా నిశ్చింతగా ఉండవచ్చు...పెద్ద భవంతి యే అవసరం లేదు... అన్న భావనతో రాసుకున్నది...😊
    గరికపాటివారు ప్రస్తావించిన పద్యం 👌
    Thank you sir

    ReplyDelete