Saturday, November 19, 2022

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే.. 12.. ముందు నుయ్యి... వెనుక గొయ్యి... ! ఆ క్షణాలు !

 🌺

   ఒక్కోసారి,   కొన్ని విషయాల్లో... అవి ఎలాంటివైనా సరే... చిన్నవి కానీయండి, పెద్దవి కానీయండి.. గుండె నిబ్బరం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇలా ఎందుకన్నానంటే... 
    ఆ రోజు నాకు బాగా గుర్తుంది. బహుశా అంత త్వరగా మరిచిపోలేనేమో కూడా. ఎన్నో సంవత్సరాల క్రితం నాటి మాట. అవి నేను ఓ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న రోజులు. ఓ రోజు... మధ్యాహ్నం నుండి సాయంత్రం దాకా ఊహించని రీతిలో కుంభవృష్ఠి కురిసింది. ఊరు వాడా ఏకమై వరదలా  వర్షపు నీరు పారింది. ఎక్కడెక్కడి  గుంటలన్నీ పూర్తిగా నీటితో నిండిపోయి, అది శీతాకాలమైనా వర్షాకాలాన్ని తలపింపజేశాయి. వేసవిలో ఆ గుంటలన్నీ పూర్తిగా ఎండిపోయి బీటలు వారి ఉంటాయి. కానీ ఈ వర్షం మూలాన అవన్నీ  చిన్నపాటి చెరువులుగా మారిపోయాయి. 
    అలాంటి సమయాన,  నేనో రోజు సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో బజార్లో అర్జెంటుగా కొనవలసినవి ఉండడం వల్ల ఇంటి నుండి బయలుదేరాను. మా ఇంటి వెనక రైలు మార్గం ఒకటి ఉంది. అది బాగా ఎత్తులో ఉంటుంది. ఇరువైపులా బాగా లోతైన గుంటలు !  ఎండాకాలంలో అయితే జనాలంతా రైలు కట్ట దిగి ఈ గుంటల్లోనే నడిచి,  వస్తూ పోతూ ఉంటారు. అందువల్ల అక్కడ ఓ దారి లాగా ఏర్పడిపోయింది. మామూలు రహదారి ఉన్నది కానీ, అది చుట్టూ...పైగా  దూరం అని అందరూ ఈ దారిని ఎంచుకున్నారు.
    ప్రస్తుతం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అవతలి వైపు వెళ్లాలంటే రైలు కట్ట దాటి వెళ్లాలి. నీటి గుంటల మూలాన ఇప్పుడేమో దాటలేని పరిస్థితి ! అందుకని నేరుగా రైలు పట్టాల వెంబడి  వెళ్లి, అక్కడ నీరు లేని, కాస్త ఎత్తైన ప్రదేశం నుండి వెళ్లాలి. 
     ఈ పరిస్థితి ఏమాత్రం ఊహించని నేను.. యధాలాపంగా ఇవతలి గట్టు  ఎక్కి, పట్టాల మీదకి చేరుకున్నాను. తలవంచుకొని నడుస్తున్న నేను ఉన్నట్టుండి తలెత్తాను. ఇద్దరు, ముగ్గురు కింద  నిలబడి నావైపే  చూస్తూ, చేతులూపుతూ ఏమిటో అరుస్తున్నారు.. ! నాకేమీ అర్థం కాలేదు. చూపు మరల్చి  వెనుతిరిగాను. అప్పుడు కళ్లబడిందది... !!అల్లంత దూరాన రైలు కూత వేస్తూ కదలి వస్తోంది. దూరాన ఉన్న గుబురు చెట్లు, ఎత్తయిన ఫ్యాక్టరీ గొట్టాల మూలాన రైలయితే కనిపించడం లేదు గానీ అది  అతి సమీపంలో ఉన్నదనడానికి చిహ్నంగా అది విడిచిన  పొగ ఉవ్వెత్తున లేస్తోంది. గట్టు ఎక్కేటప్పుడు నా హడావుడిలో అది వేసిన కూత నాకు వినపడలేదు. ఆ ప్రయత్నంగా వెనక్కి  తిరిగి చూశాను. లాభం లేదు... పట్టాలు దాటి మళ్ళీ వచ్చిన వైపే తిరిగి వెళ్దామన్నా వీలుగాని పరిస్థితి ! పోనీ ముందుకు సాగుదామా అనుకుంటే... అది వచ్చేలోగా గమ్యం చేరుకోలేనని తెలుస్తూనే ఉంది. పక్కకు తిరిగి నిలబడదామా అనుకుంటే, రైలు పట్టాల పక్క స్థలం చాలా ఇరుగ్గానూ, ఏటవాలుగానూ ఉంది. పొరపాటునో, తొట్రుపాటుతోనో కాలు జారిందో... కింద అగాధం లాంటి నీటి కుంటలో పడటం ఖాయం.. ! దానిలోతు  ఎంత ఉంటుందో ఊహించగలను. పైగా... అంతా బురద నీరు.. పిచ్చి  మొక్కలు దుబ్బులుగా పెరిగి ఆ నీటినంతా దాదాపు కప్పేశాయి.అందులో గానీ  పడ్డానంటే... అంతే సంగతులు ! అలా కాకున్నా... రైలుకు అతి సమీపంలో ఉన్నందున, అది ఏ కాస్త నన్ను తగిలినా... !? ఆ ఊహ మెదలగానే... నా గుండె లయ తప్పింది.
     ఆ క్షణంలో.. ముందు నుయ్యి వెనక గొయ్యిలా అయిపోయింది నా పరిస్థితి !! ఎటూ  పాలుపోని  స్థితిలో రెండు క్షణాలు అచేతనంగా ఉండిపోయిన నన్ను  అనూహ్యంగా తక్షణ కర్తవ్యం తట్టి లేపింది. గుండె చిక్కబట్టుకుని, గబగబా అడుగులు వేస్తూ, పరుగు లాంటి నడకతో కాస్త 'సేఫ్' గా ఉన్న చోటికి కదిలిపోయాను. ఆ సమయంలో నా మనస్థితిని మాటలలో వర్ణించలేను.
    నా భయాన్ని, ఆందోళననూ ఏ మాత్రం లెక్కచేయకుండా, భూతంలా  ఆ రైలు దూసుకు రానే వచ్చింది. రైలు కూత, ఆ ఇంజను మోత అంత కర్కశంగా, కర్ణకఠోరంగా ఉంటాయన్న నిజం మొట్టమొదటి సారి తెలిసొచ్చింది నాకు !  ప్రాణాలరచేత పట్టుకుని, పట్టాలకు కాస్త  దూరంగా  ఎలాగో నిలదొక్కుకుని నిలబడిపోయాను. అంతే ! మరో క్షణంలో అది నన్ను దాటుకుని తాపీగా వెళ్ళిపోయింది. భయంతో మూసుకుపోయిన నా కళ్ళు మెల్లిగా తెరిపినబడ్డాయి.
    తెరిచిన నా కళ్ళకు.. ఇందాక నన్ను హెచ్చరిస్తూ, చేతులూపిన వాళ్ళు ఆవలిపేపు నన్నే చూస్తూ కనిపించారు. అప్పుడు అర్థమైంది నాకు..వాళ్ళ సైగలకర్థం ! నేను క్షేమంగా కనిపించేసరికి.. వాళ్ళు చిన్నగా నవ్వుకోవడం గమనించాను. గట్టిగా ఓసారి ఊపిరి పీల్చుకున్నాను ... 
      ఎప్పుడు గట్టు దిగి అవతలపడ్డానో  ఏమో... నాకే తెలియదు. ఆ తర్వాత షాపింగ్ చేస్తున్నానన్నమాటే గానీ... నా కాళ్ళలో వణుకు మరో అరగంట దాకా తగ్గుముఖం పట్టలేదంటే నమ్మండి !  చాలా రోజుల దాకా... ఆ క్షణాలు మరపుకు రాలేదు. గుర్తొచ్చినప్పుడల్లా..బాబోయ్ ! ఎలాగో బ్రతికి బయట పడ్డానుగా.. అనుకోకుండా ఉండలేకపోయేదాన్ని!
     జీవన యానంలో ఇలాంటివీ ఓ భాగమే కదా అనిపిస్తూ ఉంటుంది  నాకు అప్పుడప్పుడు ... ! 🙂

*****************************************



No comments:

Post a Comment