Wednesday, November 30, 2022

'తాళి' మహత్యం !


🌷

పఠనం ఆమెకిష్టం.. ఆయనకేమో అయిష్టం 

కవిత్వం ఆమె ప్రాణం.. అతనికి కలవరం !

రచన ఆమె వ్యాపకం.. రుచించదతనికి పాపం !

సినిమా పిచ్చి అతనికి.. ఆమెకేమో తలనొప్పి !

ఒకరు గలగలా పారే ప్రవాహం.. 

మరొకరు మౌనానికి నిత్యం దాసోహం !

రుచులు.. అభిరుచులు.. వేర్వేరు.. 

అవి ఎన్నడూ కలవని భిన్నధృవాలు.. !!

కలిశాయి చిత్రంగా.. అంతరంగాలు !

తనువులు వేరు.. తలపులు ఒకటే.. 

సమస్య ఒకటే .. పరిష్కారం ఇద్దరిదీ.. !

కలిపింది ఇద్దరినీ... 'తాళి' బంధం !

ఒకే చూరు కింద సహజీవనం !!

కలహాలతో కాపురం.. కష్టమైనా వారికిష్టం.. 

అలకలు అతిసహజం.. అయినా.. 

అరక్షణంలో మటుమాయం... !

పుట్టుకలు ఎక్కడో ఎరుగని వైనం !

పరస్పరం చేపట్టి అల్లుకున్న అనుబంధం !

వత్సరాలెన్ని గడిచినా వడలని, సడలని 

ఏడడుగుల బంధం వారిది.. 

ఏడేడుజన్మలకూ వీడనిది !

ఒకరికి ఒకరు వారు.. ఒకరు లేక మరొకరు లేరు !

అది అపురూపమైన ఆలుమగల బంధం.. 

బ్రతుకంతా తోడూనీడై 

కలిసి సాగే ప్రియమైన ప్రేమ ప్రయాణం  !!

***************🌷***************





Wednesday, November 23, 2022

నిస్వార్ధంలో స్వార్థం !!

🌷

చిరకాలం జీవించాలని లేదు... 
అర్ధాంతరంగా పోవాలనీ లేదు !
కాసులు కోట్లాది  కూడబెట్టాలని లేదు... 
కన్నబిడ్డలకు కాసింత కట్టబెట్టాలనుంది !
ఇంద్రభవనమైతే వద్దు... ఇల్లన్నదొకటి చాలు.. 
అదృష్టవంతుల్ని చూసి అసూయపడను..అయితే...  
నాకూ కాస్త అంటించమంటాను ఆ దైవాన్ని !
సమస్యలు,  సవాళ్లు వద్దనుకోను... 
ఆ సుడిగుండం దాటే ధైర్యం కోరుకుంటాను...   
ఆశలున్నాయి నాకు ... అత్యాశలైతే లేవు.. 
అవధులు దాటే ఆశయాలు.. నా చెంతకు చేరలేవు...
నా శక్తిసామర్థ్యాలు వాటికెరుకే గనుక !
ఆదర్శాలు వల్లించలేను..ఆచరించే దమ్ము లేదు మరి..!
అనునిత్యం.. 'అందరం'  బాగుండాలనుకుంటాను...
అందులో ఖచ్చితంగా  నేనూ ఉంటాను గనక  !!   🙂

*****************🌷******************




Saturday, November 19, 2022

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే.. 12.. ముందు నుయ్యి... వెనుక గొయ్యి... ! ఆ క్షణాలు !

 🌺

   ఒక్కోసారి,   కొన్ని విషయాల్లో... అవి ఎలాంటివైనా సరే... చిన్నవి కానీయండి, పెద్దవి కానీయండి.. గుండె నిబ్బరం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇలా ఎందుకన్నానంటే... 
    ఆ రోజు నాకు బాగా గుర్తుంది. బహుశా అంత త్వరగా మరిచిపోలేనేమో కూడా. ఎన్నో సంవత్సరాల క్రితం నాటి మాట. అవి నేను ఓ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న రోజులు. ఓ రోజు... మధ్యాహ్నం నుండి సాయంత్రం దాకా ఊహించని రీతిలో కుంభవృష్ఠి కురిసింది. ఊరు వాడా ఏకమై వరదలా  వర్షపు నీరు పారింది. ఎక్కడెక్కడి  గుంటలన్నీ పూర్తిగా నీటితో నిండిపోయి, అది శీతాకాలమైనా వర్షాకాలాన్ని తలపింపజేశాయి. వేసవిలో ఆ గుంటలన్నీ పూర్తిగా ఎండిపోయి బీటలు వారి ఉంటాయి. కానీ ఈ వర్షం మూలాన అవన్నీ  చిన్నపాటి చెరువులుగా మారిపోయాయి. 
    అలాంటి సమయాన,  నేనో రోజు సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో బజార్లో అర్జెంటుగా కొనవలసినవి ఉండడం వల్ల ఇంటి నుండి బయలుదేరాను. మా ఇంటి వెనక రైలు మార్గం ఒకటి ఉంది. అది బాగా ఎత్తులో ఉంటుంది. ఇరువైపులా బాగా లోతైన గుంటలు !  ఎండాకాలంలో అయితే జనాలంతా రైలు కట్ట దిగి ఈ గుంటల్లోనే నడిచి,  వస్తూ పోతూ ఉంటారు. అందువల్ల అక్కడ ఓ దారి లాగా ఏర్పడిపోయింది. మామూలు రహదారి ఉన్నది కానీ, అది చుట్టూ...పైగా  దూరం అని అందరూ ఈ దారిని ఎంచుకున్నారు.
    ప్రస్తుతం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అవతలి వైపు వెళ్లాలంటే రైలు కట్ట దాటి వెళ్లాలి. నీటి గుంటల మూలాన ఇప్పుడేమో దాటలేని పరిస్థితి ! అందుకని నేరుగా రైలు పట్టాల వెంబడి  వెళ్లి, అక్కడ నీరు లేని, కాస్త ఎత్తైన ప్రదేశం నుండి వెళ్లాలి. 
     ఈ పరిస్థితి ఏమాత్రం ఊహించని నేను.. యధాలాపంగా ఇవతలి గట్టు  ఎక్కి, పట్టాల మీదకి చేరుకున్నాను. తలవంచుకొని నడుస్తున్న నేను ఉన్నట్టుండి తలెత్తాను. ఇద్దరు, ముగ్గురు కింద  నిలబడి నావైపే  చూస్తూ, చేతులూపుతూ ఏమిటో అరుస్తున్నారు.. ! నాకేమీ అర్థం కాలేదు. చూపు మరల్చి  వెనుతిరిగాను. అప్పుడు కళ్లబడిందది... !!అల్లంత దూరాన రైలు కూత వేస్తూ కదలి వస్తోంది. దూరాన ఉన్న గుబురు చెట్లు, ఎత్తయిన ఫ్యాక్టరీ గొట్టాల మూలాన రైలయితే కనిపించడం లేదు గానీ అది  అతి సమీపంలో ఉన్నదనడానికి చిహ్నంగా అది విడిచిన  పొగ ఉవ్వెత్తున లేస్తోంది. గట్టు ఎక్కేటప్పుడు నా హడావుడిలో అది వేసిన కూత నాకు వినపడలేదు. ఆ ప్రయత్నంగా వెనక్కి  తిరిగి చూశాను. లాభం లేదు... పట్టాలు దాటి మళ్ళీ వచ్చిన వైపే తిరిగి వెళ్దామన్నా వీలుగాని పరిస్థితి ! పోనీ ముందుకు సాగుదామా అనుకుంటే... అది వచ్చేలోగా గమ్యం చేరుకోలేనని తెలుస్తూనే ఉంది. పక్కకు తిరిగి నిలబడదామా అనుకుంటే, రైలు పట్టాల పక్క స్థలం చాలా ఇరుగ్గానూ, ఏటవాలుగానూ ఉంది. పొరపాటునో, తొట్రుపాటుతోనో కాలు జారిందో... కింద అగాధం లాంటి నీటి కుంటలో పడటం ఖాయం.. ! దానిలోతు  ఎంత ఉంటుందో ఊహించగలను. పైగా... అంతా బురద నీరు.. పిచ్చి  మొక్కలు దుబ్బులుగా పెరిగి ఆ నీటినంతా దాదాపు కప్పేశాయి.అందులో గానీ  పడ్డానంటే... అంతే సంగతులు ! అలా కాకున్నా... రైలుకు అతి సమీపంలో ఉన్నందున, అది ఏ కాస్త నన్ను తగిలినా... !? ఆ ఊహ మెదలగానే... నా గుండె లయ తప్పింది.
     ఆ క్షణంలో.. ముందు నుయ్యి వెనక గొయ్యిలా అయిపోయింది నా పరిస్థితి !! ఎటూ  పాలుపోని  స్థితిలో రెండు క్షణాలు అచేతనంగా ఉండిపోయిన నన్ను  అనూహ్యంగా తక్షణ కర్తవ్యం తట్టి లేపింది. గుండె చిక్కబట్టుకుని, గబగబా అడుగులు వేస్తూ, పరుగు లాంటి నడకతో కాస్త 'సేఫ్' గా ఉన్న చోటికి కదిలిపోయాను. ఆ సమయంలో నా మనస్థితిని మాటలలో వర్ణించలేను.
    నా భయాన్ని, ఆందోళననూ ఏ మాత్రం లెక్కచేయకుండా, భూతంలా  ఆ రైలు దూసుకు రానే వచ్చింది. రైలు కూత, ఆ ఇంజను మోత అంత కర్కశంగా, కర్ణకఠోరంగా ఉంటాయన్న నిజం మొట్టమొదటి సారి తెలిసొచ్చింది నాకు !  ప్రాణాలరచేత పట్టుకుని, పట్టాలకు కాస్త  దూరంగా  ఎలాగో నిలదొక్కుకుని నిలబడిపోయాను. అంతే ! మరో క్షణంలో అది నన్ను దాటుకుని తాపీగా వెళ్ళిపోయింది. భయంతో మూసుకుపోయిన నా కళ్ళు మెల్లిగా తెరిపినబడ్డాయి.
    తెరిచిన నా కళ్ళకు.. ఇందాక నన్ను హెచ్చరిస్తూ, చేతులూపిన వాళ్ళు ఆవలిపేపు నన్నే చూస్తూ కనిపించారు. అప్పుడు అర్థమైంది నాకు..వాళ్ళ సైగలకర్థం ! నేను క్షేమంగా కనిపించేసరికి.. వాళ్ళు చిన్నగా నవ్వుకోవడం గమనించాను. గట్టిగా ఓసారి ఊపిరి పీల్చుకున్నాను ... 
      ఎప్పుడు గట్టు దిగి అవతలపడ్డానో  ఏమో... నాకే తెలియదు. ఆ తర్వాత షాపింగ్ చేస్తున్నానన్నమాటే గానీ... నా కాళ్ళలో వణుకు మరో అరగంట దాకా తగ్గుముఖం పట్టలేదంటే నమ్మండి !  చాలా రోజుల దాకా... ఆ క్షణాలు మరపుకు రాలేదు. గుర్తొచ్చినప్పుడల్లా..బాబోయ్ ! ఎలాగో బ్రతికి బయట పడ్డానుగా.. అనుకోకుండా ఉండలేకపోయేదాన్ని!
     జీవన యానంలో ఇలాంటివీ ఓ భాగమే కదా అనిపిస్తూ ఉంటుంది  నాకు అప్పుడప్పుడు ... ! 🙂

*****************************************



Tuesday, November 15, 2022

నేనూ ఇంతేనేమో... !

🌹

    సమయం ఒంటిగంట కావస్తోంది. మిట్ట మధ్యాహ్నం... స్కూల్ నుండి ఇంటికి బయలుదేరి వస్తున్నాను. దాదాపు ఇల్లు సమీపిస్తుండగా... ఓ దృశ్యం నన్నెంతో ఆకర్షించింది. లెక్కలేనన్ని  బిందెలు... ఒకదాని వెనుక ఒకటి వరుసగా నిలబడి ఉన్నాయి. అందులో ప్లాస్టిక్, స్టీలు,  కంచు..తోపాటు...  అక్కడక్కడా విరిగిన ప్లాస్టిక్ బకెట్లు, పగిలిన సత్తు గిన్నెలూ... అలా రకరకాలు ఉన్నాయండోయ్ ! 

   ఆ కాలనీలో  మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ. చాలామంది అద్దె ఇళ్లలో ఉంటున్న వాళ్లే. ఆ ఇళ్లలో నీటి సౌకర్యం ఉండేవి చాలా తక్కువ. వాళ్లకంతా ఈ వీధిపంపే దిక్కు !     మెల్లిగా వాటిని పరిశీలిస్తూ అడుగులు ముందుకు వేశాను. ఆ వీధి మొదట్లో ప్రారంభమైన ఆ బిందెల వరుస వీధి చివర నున్న కొళాయి వద్ద ఆగిపోయింది. చిన్నగా నవ్వుకుంటూ అక్కడే రెండిళ్ళ అవతల ఉన్న మా ఇంట్లోకి గేటు తీసుకుని వెళ్ళబోయాను. సరిగ్గా అప్పుడే బుస్సుమని శబ్దం చేస్తూ సన్నగా నీటి ధార ప్రారంభమైంది. అంతే! అంతవరకూ బిందెల సొంతదారులు ఏమూల దాక్కుని ఉన్నారో ఏమో... ఒక్కుమ్మడిగా బిలబిలమంటూ వచ్చి, కొళాయి చుట్టూ మూగారు. అంతవరకూ ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణం ఒక్క క్షణంలో అరుపులతో, కేకలతో, సణుగుళ్లతో... ఇంకా చెప్పాలంటే తిట్లతో నిండిపోయింది. ఆ క్షణంలో బిందెలు కాసేపు నాట్యం చేశాయి. అంతవరకూ వరుసలో కిమ్మనకుండా ఉన్న సరంజామా కాస్తా వాటి యజమానుల చేతుల్లోకి, చంకల్లోకి ఎక్కి కూర్చుంది.  లోపలికి పోబోతూ ఆగిన నాకు ఈ తమాషా కాస్త చూడాలనిపించి, అక్కడే ఆగిపోయాను.

    చిత్రమేమిటంటే... ఎక్కడో వరుసలో చివర్లో ఉన్న బిందెలు తెచ్చి ముందుకెళ్లి నిలుచున్నారు కొందరు ! కొందరైతే మెల్లిగా వెనకనున్న  బిందెలు తీసుకెళ్లి ఎవరూ చూడడం లేదులే అనుకొని వరుసలో ముందుగా ఉన్న బిందెల మధ్య దూరుస్తున్నారు. మరికొందరు దౌర్జన్యవాదులు దురాక్రమణ చేస్తూ జబర్దస్త్ గా వెళ్లి పంపు కింద బిందె పెట్టేస్తున్నారు, ఇదేమిటని అడిగితే...

" నా వంతే... ముందు నేనే పెట్టా..." 

 అని  దబాయిస్తున్నారు. నువ్వు నోరు ముయ్యి అంటే నువ్వే ముయ్యి అంటూ యుద్ధం ప్రకటించేస్తున్నారు.

' ఔరా ' అని  ముక్కు మీద వేలేసుకున్నాను. అంతా గమనిస్తున్న నా కళ్ళు అక్కడే ఓ వారగా నిలబడి, ఆ గుంపువేపే చూస్తున్న సుశీల మీద పడ్డాయి. ఆమెకు కాస్త ఎడంగా వరుసలో ఆమె ఆకుపచ్చ బిందెను గుర్తుపట్టాను. ఇంతలో ప్రమీల... ఒక చేతిలో కూరగాయల సంచి, మరో చేతిలో నిండుగా ఉన్న సరుకుల సంచీ పట్టుకుని ఆదరాబాదరాగా మా పక్కనే ఉన్న తన  ఇంట్లోకి దూసుకుపోయింది. మరుక్షణంలోనే సంధించి వదిలిన బాణంలా బయటపడి వరుసలో సుశీల కన్నా ఎంతో దూరంగా ఉన్న తన బిందె పుచ్చుకొని,  ముందుకెళ్లి గుంపులో కలిసిపోయింది. రెండు మూడు నిమిషాలు గడిచిపోయాయి. గేటుమూస్తూ  లోపలికి వెళ్ళి పోదాం అనుకుంటూ అటు తిరగబోయాను. కానీ చంకలో నీళ్ల బిందెతో గబగబా వస్తున్న ప్రమీలను చూసి మళ్ళీ ఆగిపోయాను. పాపం...! సుశీల ఇంకా అక్కడే నిలబడి ఉంది. ఆమె ఆకుపచ్చ బిందె వరుసలో 'సిన్సియర్' గా నిలబడి ఆమె వంక దీనంగా చూస్తోంది.

    ఇదంతా చూస్తూ ఉంటే..

" నోరు ఉన్న వాడిదే రాజ్యం సుమీ.. "

 అన్న మాట అక్షరాల నిజమని అనిపించింది నాకు!!

 "ఈ మాత్రం దానికి కొండవీటి చాంతాడులా ఈ బిందెల  క్యూ దేనికో.. !"

 అనుకుంటూ అంతకంతకూ పెచ్చు పెరిగిపోతున్న కోలాహలాన్ని మరి చూడాలనిపించక లోనికి దారి తీసాను.

               ****  *****   *****

  సమయం మధ్యాహ్నం రెండు కావస్తోంది. తిరిగి స్కూలుకు బయలుదేరాను. గేటు దాటిన నాకు.. ముప్పావు గంట క్రితం చెలరేగిన యుద్ధ వాతావరణం మచ్చుకైనా కనిపించలేదు. సద్దు మణిగి నిర్మానుష్యంగా ఉంది. కానీ... చిత్రంగా పంపు నుండి నీళ్లు ధారగా పారిపోతూ ఉన్నాయి.

     కాసేపటి క్రితం వరకూ ఇదే నీళ్ల కోసం హోరాహోరీ పోట్లాడుకున్నారు.. మరి ఇప్పుడో ! వీధినంతా జలమయం చేస్తూ వృధాగా పోతున్నాయి ఆ  నీళ్లు.. ! ఓ క్షణం పాటు ఆ మనుషుల ప్రవర్తనను చీత్కరించుకున్నాను. కాస్త ఆగితే.. తాపీగా.. ప్రశాంతంగా,  ఏ గొడవా లేకుండా  కావలసినన్ని  నీళ్ళు పట్టుకోవచ్చు గదా..! అనుకున్నా. కానీ... మరుక్షణమే మెరుపులా  మెరిసిన ఓ ఆలోచన నన్ను ఊపివేసింది.

   ఇంట్లోనే నీటి సౌకర్యం ఉన్న నాకు వీధిలోకెళ్లి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కానీ.. కానీ...  నా బిందె కూడా ఆ వరుసలో ఉండి ఉంటే... !నేనూ వాళ్లలో ఒకదాన్నయి ఉండేదాన్నేమో !!

      నిటారుగా అయిపోయాను... !

******************************************




 

Thursday, November 10, 2022

ఏడంతస్తుల మేడ !

🙂

అందమైన బొమ్మరిల్లు నా ఇల్లు...
పూరిళ్లయితేనేమి గాక  !
నాకదే ఏడంతస్తుల మేడ  ! 
ఇది మమతానురాగాలు
వెల్లివిరిసిన చిన్ని గూడు... 
మధుర జ్ఞాపకాలు
గూడు కట్టుకున్న మందిరం... 
నిధి నిక్షేపాలకవి సరి సమానం
అవి నా ఆత్మ బంధువులు 
కలతలు, కన్నీళ్లు.. కష్టాలు, కడగండ్లు.. 
వచ్చి పోయే  చుట్టాలు...!
నా ఈ కుటీరం 
నను  సేదదీర్చే బృందావనం !
ముంగిట్లో  ముత్యాల ముగ్గులు
అటూ ఇటూ  అలరించే...
మందారాలు... మల్లెమొగ్గలు !!
అటుపై నర్తించే వన్నెవన్నెల 
సీతాకోకచిలుకలు... 
అనుదినం... అనుక్షణం
నను ఆహ్లాదపరిచే నేస్తాలు... 
అల్లంత దూరాన పారే 
సెలయేటి గలగలల సరిగమలు
చేస్తాయి వీనుల విందులు.. !
గాలికి ఊగే కొమ్మల రెమ్మల
వాయిద్యగోష్ఠులు... ఆపై... 
వంత పాడుతూ కొమ్మ చాటు కోయిల
కుహూ... కుహూ రాగాలు... !
అలసి సొలసి మేను వాల్చిన నాకు... 
అవి జోల పాటలవుతాయి...
నిదురమ్మ ఒడిని జేర్చి
విశ్రమింపజేస్తాయి... 
కమ్మని కలల్ని రప్పిస్తాయి ... !
ఇంతకన్నా వైభోగం
మరెక్కడైనా దొరకునా...? 
పోటీ పడగలదా 
దీనితో ఏ భవంతైనా ? 
అందుకే.... నా ఈ కుటీరం 
నాకెంతో ప్రియం.. !
పూరిళ్లయితేనేమి గాక... !
నాకిదే ఏడంతస్తుల మేడ  !!😊

************************************



  

Monday, November 7, 2022

పసిపాపగ మళ్లీ పుట్టాలని... !

🌷

కల్లాకపటం ఎరుగని
పాల బుగ్గల ఆ పసితనం
కల్మషం,  కాఠిన్యం దరిజేరని 
బాధ్యతలకతీత మైన నా బాల్యం 
నాకు మళ్ళీ కావాలి... 
కదులుతున్న కాలమా, కాస్త ఆగవా !
వెనుకకు మరలి గతంలోకి పరుగిడవా !
ఏ బంధం లేని బంధువులు 
అనుబంధాలే బంధాలై 
పెన వేసుకున్న స్నేహాలు
అయినవాళ్లను సైతం మరిపించి
మధురస్మృతులుగా మిగిలిపోయిన
నా నేస్తాలు ! నాకు మళ్ళీ కావాలి...
ఆ స్వేచ్ఛాజీవనంలోకి
తిరిగి నన్ను నడిపించవా !
నిద్రలేని రాత్రులు,
తీరిక దొరకని క్షణాలు...
అయినా... ప్రతీ  క్షణం
ఎగసిపడే ఆనంద కెరటాలు !!
తీయనైన ఆ బానిసత్వ సేవలు !!
నడి వయసులో,  నడిసంద్రంలో 
ఆ జీవనయానం....
గతించిన గతంలోని
సజీవ జ్ఞాపకాలతో సహజీవనం..
నాకు మళ్ళీ కావాలి.. ప్రసాదించవా !
ఒక్క  ఘడియ సైతం
తిరిగి రాదని తెలుసు...
అయినా లోలోన...ఆశ ! ఏదో ఆశ...!
అత్యాశే...! అయినా మారాం  చేస్తోంది
పిచ్చి మనసు...! అందుకే...
ముందుకు కదులుతున్న కాలమా  !
ఒక్కసారి వెనుదిరగవా !
గతంలోకి చేరుకోవా !!. 
పసిపాపగ మళ్లీ పుడతా !
ఆ మహద్భాగ్యం నాకు కలిగించవా !! 🌷

**************************************



Friday, November 4, 2022

కన్నుల భాష

🐦 🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦
🌷 కళ్ళు.. !!
కలలు కంటాయి. మాట్లాడతాయి.కబుర్లు చెబుతాయి. 
ఆ కబుర్లు కథలవుతాయి. కళ్ళు కళ్ళు కలిస్తే... ఊసులాడుకుంటాయి. ఆ  ఊసుల్లో ఎన్నెన్నో అర్థాలు దాగి ఉంటాయి. కళ్ళు నవ్వుతాయి. అవేకళ్ళు ఏడుస్తాయి. హృదయ స్పందనను ప్రతిబింబిస్తాయి. మాటలకందని భావాలెన్నో అందిస్తాయి. 
   కళకళలాడే ఆ కళ్ళు కోటి కాంతులు కురిపిస్తాయి. ఎర్రబడితే అగ్ని కీలలూ సృష్టిస్తాయి. ఆ చూపులు విరితూపులు అవగలవు. ప్రేమను వర్షించగలవు. విర వేదన అనుభవించగలవు.అభినయించగలవు. ప్రేమతో ఆకట్టుకున్న ఆకళ్లే పగనూ, ప్రతీకారాన్ని వెలిగ్రక్కగలవు. 
    నాట్యమాడేవేళ ఓ నర్తకి, నటించే వేళ ఓ నటి... పలికించే హావభావాలు ఆ కళ్ళవే మరి ! ఆ కళ్ళ ద్వారానే అవి సాధ్యం ! ఇంకా.... 
 ఎంతటి అద్భుత దృశ్యాన్నయినా వీక్షించి, మెదడులో నిక్షిప్తం చేయగల శక్తి, సత్తా ఉన్నది కళ్ళకే. కళ్ల కింత కథ ఉంది.. అందుకేనేమో... ! సినీ కవుల మస్తిష్కంలో ఎన్నెన్నో భావనలు రేపి, వారి కలం నుండి ఎన్నో మధుర గీతాల్ని జాలువారేలా  చేశాయి కళ్ళు !!

🌷 కనులు కనులతో తలపడితే
     ఆ తగవుకు ఫలమేమి ? 
     కలలే... 

🌷 కనులు మాటలాడుననీ
     మనసు పాట పాడుననీ 
     కవితలల్లితి నిన్నాళ్ళు 
     అవి కనుగొన్నాను ఈనాడు... 

🌷 నా కన్నులు నీకో  కథ చెప్పాలి
      కన్ను తెరూ, కన్ను తెరూ.... 

🌷 నా కళ్ళు చెబుతున్నాయి
      నిను ప్రేమించాననీ... 

🌷 కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు..

🌷 చూపులు కలిసిన శుభవేళ
      ఎందుకు నీకీ  కలవరము
     ఎందుకు నీకీ  పరవశము.. 

🌷 కళ్ళలో పెళ్లి పందిరి కనబడసాగే
     పల్లకీ లోన ఊరేగే ముహూర్తం
     మదిలో కదలాడే...

🌷 చల్లగ వీచే పిల్ల గాలిలో
     కనులు మూసినా కలలాయే 
     కనులు తెరచినా నీవాయే 
     నే కనులు మూసినా నీవాయే..

🌷 కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు ? 

🌷 కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు...

🌷 నయనాలు కలిసె  తొలిసారి
     హృదయాలు పలికె మలిసారి ... 

🌷 మాటలకందని భావాలు
     మంచి మనసులు చెబుతాయి
     కవితల కందని భావాలు
     కంటిపాపలే చెబుతాయి.!

----  యువతీయువకులు ప్రేమలో పడాలంటే ముందుగా అడుగేసేది ఈ కళ్ళే కదా ! కళ్లూ కళ్ళు కలుసుకుంటేనే గదా... తర్వాతి కథ నడిచేది ! తొలిచూపు లోనే ప్రేమ  ( love at first sight ) అని కూడా అంటారు గదా !

🌷 తొలిచూపు దోచిందీ హృదయాన్ని
      మలిచూపు వేసిందీ బంధాన్ని 
       ప్రతి చూపు చెరిపింది దూరాన్ని 
       పెళ్లి చూపులే కలపాలి ఇద్దరినీ...
--- ఎంత నిజం !

 స్త్రీ పురుషులిద్దరిలో ఎవరికి కోపం వచ్చినా, అలిగినా.. నోటితో చెప్పక్కర్లేదు. ఆ కళ్ళు చాలు. ఆ చూపు చాలు  ! ఎదుటి వాళ్ళకి ఇట్టే అర్థమైపోవడానికి ! అంత శక్తిమంతమైనది ఆ కంటి చూపు మరి !
-- అలాగే.. సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని, విషాదాన్ని, ప్రేమను, ఆప్యాయతను, అహంకారాన్ని, రౌద్రాన్ని, జుగుప్సనూ, అసహ్యాన్ని, అనునయాన్ని...  వ్యక్తీకరించడానికి మాటలు వేయేల?  ఆ కళ్ళు చాలవా ! అన్ని రసాల్నీ పలికించడానికి ! ఎన్నెన్నో సందేశాల్నివ్వడానికి !!
 అంతెందుకు? ముఖంలో అత్యంత ఆకర్షణీయమైనవీ, అందమైనవీ చూడగానే ఇట్టే అందర్నీ ఆకట్టుకునేవి.. కళ్ళు కాక  మరేవి ! కలువ రేకుల్లాంటి  కళ్ళు అంటూ, చేప కళ్ళ చిన్నది అంటూ... కవులు వర్ణిస్తారు. చెంపకు చేరడేసి ఆ సోగకళ్లకు కాటుక దిద్దితే.. ఆ సొగసు  వర్ణించ తరమా ! 

🌷 నీ కాటుక కన్నులలో
      ఏ కమ్మని కథ ఉందో 
      చెవిలో వినిపించనా !

🌷 కాటుక కళ్ళను చూస్తే
     పోతోందే   మతి పోతోందే.. 

--- అంతేనా ! విషాద గీతాలూ కళ్ళతోనే కదా !

🌷 కళ్ళలో నీరెందులకూ 
      కలకాలం విలపించుటకు 
      మంచితనం మనకెందులకూ 
      వంచకులను మన్నించుటకు...

 🌷 ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కనులు
       అన్నీ కల్లలై ఇచ్చాయి కన్నీళ్లు !

🌷 కల చెదిరింది కథ మారింది
     కన్నీరే ఇక మిగిలింది..

--- వెండి తెరపై నటీ నటులు ఒక్క మాట కూడా లేక కళ్ళతోనే వారి నటనా  వైదుష్యాన్ని గుప్పించిన చిత్రరాజాలు ఎన్నో, ఎన్నెన్నో ! ఈ దేహంలో అన్ని అవయవాలకూ దానిదైన ప్రత్యేకత, ప్రాధాన్యత అన్నది ఉందనడంలో సందేహం లేదు. కానీ, కళ్లకున్న నైపుణ్యాలే వేరు... అంటే ఒప్పుకోవాల్సిందే !
--- ఇంకా...అతి ముఖ్యంగా చెప్పుకోవలసినదీ, పై అన్నింటినీ అధిగమించేది...ఒకటుంది... 
చూపు !! అన్నీ ఉన్నా... మనిషికి చూపు అన్నది లేకపోతే జీవితం దుర్భరం..! ఊహించలేము. చీకట్లో రెండు మూడు నిమిషాల పాటు కళ్ళు మూసుకొని తడుముకుంటూ నడిస్తే చాలు... ఇట్టే తెలిసిపోతుంది... కంటి చూపు లేక ఎంత నరకమో ! 
 మరి ఆ చూపునివ్వగల సామర్థ్యం కళ్ళకే కదా ఉన్నది! ఇంతకు మించిన ప్రత్యేకత ఏమున్నది ! అందుకే ఎప్పుడో అన్నారు..
" సర్వేంద్రియానాం నయనం ప్రధానం "
అని !!
---- నోటితో పలుకలేని, చెప్పలేని, చెప్పుకోలేని  ఎన్నెన్నో భావాలు కళ్ళు చెబుతాయి. మది పలికించే రాగాలు  నయనాలు మౌనంగా వినిపించగలవు. అందుకేనేమో...!
Face is the index of the mind 
అంటారు... ముఖారవిందంలో ప్రముఖంగా కనిపించేది కళ్ళే కదా మరి  !!

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦