Thursday, September 1, 2022

కౌసల్య అన్నదిలా... !..?

 🌷
        ఆమె పేరు కౌసల్య. ఓ గృహిణి. ఉబుసుపోక ఓరోజు బయలుదేరింది బజారుకు. వీధీ వీధీ తిరిగి 'విండో షాపింగ్ ' చేసింది. కొన్నదేమీ లేదు. కానీ మానసికోల్లాసంతో కొండంత హుషారొచ్చింది. అయితేనేం ! ఎంతసేపని తిరగ్గలదు ! తిరుగుముఖం పట్టింది. దార్లో ఓచోట ఆమె చూపు చిక్కుకుంది. ఫుట్ పాత్ మీద వరుసగా పేర్చబడ్డ ప్లాస్టిక్ సామాన్లు !ఒకదాంతో ఒకటి పోటీబడుతూ,  రంగురంగుల్లో మెరిసిపోతూ కొలువుదీరిన రకరకాల 'మోడ్రన్' ప్లాస్టిక్ సొగసులు !! ఆగలేక అడుగిడిందటువేపు. పరకాయించి చూసింది.. ఆమెను ఆకర్షించింది... ఆకుపచ్చ, పసుపు రంగుల మిళితమైన ఓ చిన్ని బకెట్టు ! ఎన్నో రకాలు అక్కడ రారమ్మంటున్నా... ఎందుకో కౌసల్య చూపు దాన్ని వదిలి పక్కకు రానంటే రానంది ! పైగా... ఏదైనా కొంటే అది ఉపయోగపడాలన్నది కౌసల్య భావన! అందుకే అప్పటికి దాని అవసరం లేకున్నా... బేరమాడక యాభై ఇచ్చి పుచ్చుకుంది. 
      ఇంటికెళ్ళాక అటకెక్కించింది. కాలం గడిచింది. అవసరం పిలిచింది. చిన్ని బకెట్ అటక దిగింది. ఆరోజు నుండీ కౌసల్యకు  అన్నివిధాలా సహకరిస్తూ  చేదోడు వాదోడయింది.  ఇల్లు తుడిచేటప్పుడు.. అంట్లు తోమేటప్పుడు.. మొక్కలకు నీళ్ళు పోసేటప్పుడు...అలా.. అలా.. ! ముచ్చటపడి కొన్న  కౌసల్య మక్కువ తీరేలా వాడింది దాన్ని అన్ని వేళలా...
      సంవత్సరం... మరో సంవత్సరం... గడిచిపోయాయి అలవోకగా.. వానకాలం వచ్చింది. భారీ వర్షాలు..! ఇంటికి మరమ్మతులు అవసరం అయ్యాయి. ఓరోజు వచ్చాడు మేస్త్రీ... పనివాళ్లను వెంటబెట్టుకుని... అవసరమంటూ అతనడిగితే, సగం పాతబడ్డ తన చిన్ని బకెట్టునిచ్చింది... మరోటి దొరక్క. వారం తర్వాత తిరిగొచ్చిందది కొత్తరూపు సంతరించుకుని... సిమెంటు మరకలతో, దుమ్ము ధూళి అద్దుకుని !! చివుక్కుమన్నది కౌసల్య అంతరంగం !
విధిలేక, అది  చెత్త బుట్టగా మారిపోయి  స్థానభ్రంశం పొందింది పాపం ! 
     రోజులు.. నెలలు.. గడిచాయి. హ్యాండిల్ కూడా పోగొట్టుకుని మరింత దిగజారింది దాని పరిస్థితి !
" అక్కా, పాడయింది, పడేయనా...? ", పనావిడ !
" అమ్మా, పట్టుకెళ్ళనా..? ",  పాత సామాన్లవాడు !
 తల అడ్డంగా ఊపిందందరికీ కౌసల్య. కొన్ననాటి రూపం మెదిలింది ఆమె మదిలో. హృదయం ద్రవించింది... ఆలోచించింది... ఓ అందమైన ఉదయం... మొదలెట్టింది తన పథకం. తొలగించింది అందలి  చెత్తాచెదారం. శుభ్రపరిచి, ఇంట్లో మిగిలిన రంగులు, బ్రష్ తెచ్చి చేసింది దానికి సింగారం ! అంతే ! మరో సరికొత్త రూపం... అరగంటలో సిద్ధమై కౌసల్య ముందు నిలిచింది. ప్రియతమ బకెట్ అందాల కుండీగ మారి, నవ్వింది మనసారా...! మట్టితో నింపి, నాటింది కొని తెచ్చిన నందివర్ధనం ! చిలకరించింది నీటి జల్లు... పులకరించింది పూలమొక్క...! 
     నెల... మరో నెల... కౌసల్య అభీష్టం తీరింది. నందివర్ధనం నిండా మారాకులు !! గుత్తులు గుత్తులుగా చిన్ని చిన్ని మొగ్గలు ! వెలుగులీనుతూ శ్వేతవర్ణ పుష్పాలు !! అద్భుతం అనిపించింది కౌసల్యకు. ఆమె ముంగిటి  బృందావనాన... మరో కొత్త మెంబరై ఠీవిగా కూర్చుంది కుండీలో నందివర్ధనం !
     ఓ ఉషోదయాన...కళ్లార్పక దాన్నే చూస్తూ... కౌసల్య అనుకున్నదిలా...

"వ్యర్థమనుకుంటే వ్యర్థం వ్యర్థమే... 
ఆలోచిస్తే అందులో ఉంది 'అర్థం' ! 
ఆ అర్థంలో దాగి ఉంది ఆనందం.. !
పాడైందని పడేస్తే... కనుమరుగే !
కావాలనుకుంటే... కళ్ళముందే.. !
ఇదిగో ఇలా... కళకళలాడుతూ... 
కనువిందు చేస్తూ... కళ్ళు చెదిరేలా...!
అదిగో....! నా అందాల పూలకుంపటి.. !
మరోజన్మ ఎత్తి... నను రంజింపజేస్తూ... !! "

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷




2 comments:

  1. బాగా చెప్పారు.
    కొన్ని వస్తువులతో అనుబంధం పెరిగి, పాతవైపోయినా కూడా అపురూపంగా చూసుకోవడం జరుగుతుంది. ఆ వస్తువుని పారెయ్యాలంటే మనసొప్పుకోదు.

    అన్నట్లు ఇంటావిడని పనావిడ “అక్కా” అనడం ఏమిటండీ (of course ఆ పిలుపు వల్ల ఇంటావిడ young గా feel అయిపోవచ్చు లెండి 🙂) ? మేడమ్ అని పిలవడం మొదలెట్టి చాలా రోజులైనట్లుందిగా? (కొంత మంది ఆంటీ అని పిలిచినా ఆశ్చర్యం లేదు లెండి 🙂)

    ReplyDelete
  2. ఉంటారండీ.. అలా పిలిచే వాళ్ళూ ఉంటున్నారు. కాకపోతే...'అమ్మా' అని సంబోధించే వాళ్ళ సంఖ్యే బాగా ఎక్కువ. మీరన్నట్లు.. 'మేడం' అనాలంటే... ఆ ఇంటావిడ ఏదో ఒక పెద్ద పోస్టు నిర్వహిస్తూ ఉండి ఉండాలి మరి !🙂🙂🙂 🙏

    ReplyDelete