" రాజయ్యా..."
"............ "
" రాజయ్యా.. "
" ఆబ్సెంట్ సార్... రాలేదు సార్.. "
క్లాసులో పిల్లలంతా ఒకేసారి అన్నారు.
" అదేమిటీ, నాల్గు రోజులైందిరాక... ఏమై ఉంటుంది? బ్రైట్ స్టూడెంట్.. చురుకైన వాడు.. సంవత్సరం పరీక్షలు దగ్గర పడుతుంటే, ఎందుకిలా తరచుగా మానేస్తున్నాడు? "
ఏడవ తరగతి క్లాస్ టీచరైన ప్రభాకర్ ఆలోచనలో పడ్డాడు. ఇంటర్వెల్లో ఐదో తరగతి చదువుతున్న రాజయ్య చెల్లెల్ని అడగాలనుకున్నాడు. కాని ఆ పిల్ల కూడా బడికి రాలేదన్న సమాధానమే వచ్చింది. కానీ వాడి తమ్ముడు శీనయ్య వచ్చాడని పిలుచుకొని వచ్చారు పిల్లలు.
" మా అన్నను పొలం పనులకు పిలుచుకొని పోతున్నాడు సార్ మా నాన్న... ఇక బడికి రాడు.."
వాడు చెప్పింది విని అవాక్కయ్యాడు ప్రభాకర్. అతను ఆ ఊరి హైస్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ గా చేరి రెండు సంవత్సరాలయింది. రాజు అని అందరూ పిలిచే రాజయ్య అంటే ప్రభాకర్ కు చాలా ఇష్టం. చక్కగా చదవడమే కాకుండా వినయవిధేయతలతో ఉంటాడు. కానీ వాడి నాన్న ఎందుకిలా చేశాడు !
ప్రతిరోజూ ఉదయం తన బైక్ మీద వచ్చి సాయంత్రం తిరిగి వెళుతుంటాడు ప్రభాకర్ మాస్టర్. ఆ రోజు సాయంత్రం స్కూల్ అవగానే తను వెళ్ళే దారిలోనే ఉన్న రాజయ్య ఇంటివద్ద ఆగాడతను . బయట మంచం మీద రాజు తాత, పక్కనే అరుగు మీద వాడి అవ్వ కూర్చుని ఉన్నారు. అలికిడి విని, రాజు తండ్రి గుడిసెలో నుండి బయటకొచ్చాడు. అతన్ని చూసి,
" రాజు బడికి రావడం లేదు, ఎందుకు? "
అనడిగాడు ప్రభాకర్.
" అవును సారూ.. వాడిక రాడు. రెడ్డి గారింట్లో పాలేరుగా కుదిర్చాను... "
షాక్ అయ్యాడు ప్రభాకర్ !
"...ఏంచేయను సారూ, నా చిన్న చెల్లెలు పెళ్లికని ఐదేళ్ల నాడు పదిహేను వేలు అప్పు తీసుకున్నా. వడ్డీ కడుతూనే ఉన్నా. ఇంతవరకూ తీరలేదు. ఇక నావల్ల కాక... రెడ్డి గారి మాట విని వాణ్ణి పనిలో పెట్టినా... "
హతాశుడైన ప్రభాకర్ బైకు దిగి, రంగయ్యను కూర్చోబెట్టుకుని నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. అరగంట తర్వాత లేచి,
" సరే.. రేపు రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. నేనాయనతో మాట్లాడతా... "
అని చెప్పి బయలుదేరాడు.
** ** **
" ఏంటి పంతులూ, బడి చెప్పడానికొచ్చినావు ... అంతవరకే నీ పని... ఇలాంటి పెత్తనాలు నీకెందుకు? "
మరుసటి రోజు రంగయ్యతో ఆయన ఇంటికి వెళ్ళిన ప్రభాకర్ ను వీరభద్రారెడ్డి గద్దించాడు.
" అది కాదు రెడ్డి గారూ... తెలివైన కుర్రాడు. మంచి భవిష్యత్తు ఉంది వాడికి...".
" అయితే... నువ్వు నా అప్పు కడతానంటావు..పదైదు వేలు పైమాటే... ! అప్పనంగా పోగొట్టుకుంటావా ! సరే... కడతావు...వాణ్ణి చదివిస్తావా? కలెక్టర్ని చేస్తావా? నీవు చదివించే నాలుగు అక్షరం ముక్కలకి వాడికి బంట్రోతు ఉద్యోగం కూడా రాదు. అర్థమయితందా?.... ఆఖరికి రెంటికీ చెడ్డ రేవడౌతాడు వాడు ... "
"... అలా అనకండి... ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? మీక్కావలసింది రంగయ్య అప్పు తీర్చడమే కదా... అది నేను తీరుస్తాను..."
నిజానికి అతనున్న పరిస్థితిలో అప్పటికప్పుడు అంత మొత్తం కట్టడం ప్రభాకర్ కు అలవిగానిదే. కానీ ఏదైనా అనుకున్న తర్వాత వెనక్కి తగ్గడం అతనికి ఎంత మాత్రం ఇష్టం లేని పని !
వీరభద్రారెడ్డి పకపకా నవ్వాడు.
" ఎక్కడో పిచ్చి పంతులు లాగుండావే !... ఏంటయ్యా నీ భరోసా? రేపు వీడు ఎందుకూ పనికి రాకుండా తయారైతే... అప్పుడు బాధపడేది నువ్వు కాదు..ఇదిగో... వీడూ...వీడి నాయన... అర్థమయితందా? అయినా చదువుకున్న వాళ్లంతా రోడ్లు పట్టుకుని దేవుళ్ళాడుతున్నారు ఉద్యోగాలు దొరక్క. నువ్వు మహా చదివిస్తే.. ఒక సంవత్సరం చదివిస్తావు, లేదా రెండు సంవత్సరాలు చదివిస్తావు. ఆ తర్వాత ఏంటి వీడి గతి !"
"..లేదండీ.. అలా జరగనివ్వను... చదువు విలువ తెలిస్తే మీరిలా అనరు.. "
"... అంటే. నాకు చదువు రాదనా ఏంది అంటుండావు...? "
దిగ్గున లేచాడు వీరభద్రారెడ్డి.
" అయ్యో! నేనలా అనలేదండి...."
అలా చాలాసేపు ఇద్దరి మధ్య.. కాసేపు అనునయంగా, మరి కాసేపు కాస్త గట్టిగా మాటలు సాగాయి. ఆఖరికి ప్రభాకర్ మాటల ప్రభావమో ఏమో... వీరభద్రారెడ్డి సామరస్య ధోరణిలో పడిపోయి దిగి వచ్చాడు. ప్రభాకర్ ఆయన చేతిలో డబ్బు పెట్టి, దస్తావేజులు ఇమ్మని అడిగాడు. వీరభద్రారెడ్డి కళ్ళు ఎరుపెక్కాయి. కానీ అప్పటికే గ్రామస్తులు చాలామంది అక్కడ గుమికూడారు. ఇక, బాగుండదని లోపలికి వెళ్ళి కాగితాలు పట్టుకొచ్చి రంగయ్య చేతిలో పెట్టేశాడు. ప్రభాకర్ కు రెండు చేతులెత్తి దండం పెట్టాడు రంగయ్య.
** ** **
మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. రాజు పదవ తరగతి స్కూల్ ఫస్ట్ వచ్చాడు. అదే సంవత్సరం ప్రభాకర్ కు అక్కడ నుండి బదిలీ అయింది. రంగయ్యకు ఇచ్చిన మాట ప్రకారం.. రాజును తనతో తీసుకెళ్ళాడు ప్రభాకర్. హాస్టల్ లో చేర్పించి, అతనికి కావలసిన అవసరాలన్నీ చూసుకుంటూ వచ్చాడు. ఇంటర్ పూర్తయింది. ఏదైనా డిగ్రీలో చేరి, ఉద్యోగం చూసుకుంటానన్నాడు రాజు. కానీ ప్రభాకర్ ఒప్పుకోలేదు. ఎంసెట్ రాయించాడు. ప్రభాకర్ నమ్మకం వమ్ము కాలేదు. రాజు అకుంఠిత దీక్షకు అతని కఠోర శ్రమతోడై మెడిసిన్ లో ఫ్రీ సీట్ వచ్చింది. రాజుకంటే, అతని తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు ప్రభాకర్ ! రాజుకు స్కాలర్ షిప్ వచ్చింది. ఎడ్యుకేషన్ లోను కూడా తీసుకున్నాడు. ఇంకేముంది ! ప్రభాకర్ మాస్టర్ చేయూత ఎలాగూ ఉంది. PG కూడా చేసేసి డాక్టర్ రాజయ్య అయిపోయాడు. ప్రస్తుతం సిటీలో ఓ పెద్ద హాస్పిటల్ లో అతను కార్డియాలజిస్ట్ !
** ** **
" సర్, హార్ట్ అటాక్ తో ఓ పేషెంట్ అడ్మిట్ అయ్యాడు..."
అంటూ నర్స్ డాక్టర్ రాజు చేతిలో ఓ కేస్ షీట్ పెట్టింది. అందులో వివరాలు చూసిన రాజు భృకుటి ముడివడింది. వెంటనే అతని పెదాలపై చిరు దరహాసం విరిసింది. వెంటనే వెళ్లి అటెండయాడు.
మూడు రోజుల తర్వాత ICU నుండి రూంలోకి షిఫ్ట్ చేశారు పేషెంట్ ని. గండం గడిచినందుకు అతని కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. మరుసటి రోజు ఉదయం భర్తను నెమ్మదిగాలేపి, కూర్చుండబెట్టి, పాలు తాగిస్తోంది అతని భార్య. అంతలోనే డాక్టర్ గారు వస్తున్నారంటూ సిస్టర్ రూమ్ లోకి ప్రవేశించింది. డాక్టర్ ను అనుసరిస్తూ మరో ఇద్దరు నర్సులు లోపలికి వచ్చారు... వారితో పాటు మరో వ్యక్తి !
" ఎలా ఉందండీ..? " అడిగాడు డాక్టర్ పేషెంట్ ని.
" బాగుంది సార్.."
డాక్టర్ అతన్ని పరీక్షిస్తున్నప్పుడు అప్రయత్నంగా పక్కనే ఉన్న వ్యక్తిని చూశాడు. ఎక్కడో చూసిన మొహంలా అనిపించి, అదే మాట పైకి అనేశాడు కూడా.
" అవునండీ, నన్ను మీరు చూశారు.. మీరు నాకు బాగా తెలుసు.. నా పేరు ప్రభాకర్. మీఊళ్ళోటీచర్ గా ఐదేళ్లు పనిచేశాను... "
అన్నాడతను.చప్పున గుర్తొచిందతనికి.
" ఔనా.. ! ప్రభాకర్ పంతులు ! చాలా కాలమైంది కదూ.. వెంటనే పోల్చుకోలేక పోయాను.."
".. నన్ను సరే.. ఈ డాక్టర్ గారిని చూడండి. గుర్తుపట్టగలరేమో..!"
అన్నాడు ప్రభాకర్ పక్కనే ఉన్న రాజును చూపిస్తూ...
"... ... .......... "
అతని సాధ్యం కాలేదు. డాక్టర్ నవ్వుతూ,
".. రెడ్డిగారు.. నేనండీ.. రాజయ్యను... మీ ఊరే.. శివపురం.. రంగయ్య పెద్ద కొడుకును."
నోట మాట రాక,స్థాణువులా అయిపోయాడతను !
" నువ్వు..నువ్వు.. ! రంగయ్య కొడుకువా ! డాక్టర్ అయినావా!..."
" అవునండీ.. అయ్యాడు.. ఆరోజు దేనికీ పనికిరాకుండా పోతాడు అన్నారు కదా. చూడండి. ప్రాణాలు పోసే వైద్యుడే అయ్యాడు.. !"
అందుకుని అన్నాడు ప్రభాకర్.
గతంలో తన ప్రవర్తన, మాటలు గుర్తొచ్చి, మనసంతా కుంచించుకుపోయింది రెడ్డి గారికి !
"...ఆరోజన్నాను నేను.... ఏ పుట్టలో ఏ పాముంటుందో... ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ! "
"... నిజమే పంతులూ.. తెలివి లేకుండా మాట్లాడినా. చదువు విలువ ఏంటో తెలియజెప్పినావు . నీవే గనక పూనుకోకపోయుంటే రాజు పాలేరుగానే మిగిలి, ఆ ఊరికే పరిమితమై పోయుండేవాడు. ఈరోజిలా... నా ప్రాణాలు కాపాడే దేవుడిలా చేసింది నువ్వే పంతులూ... "
ఆయన కళ్ళల్లో సన్నగా నీటి తడి !
"...ఊరుకోండి రెడ్డిగారూ.. ఆరోజు నా మాట విని, అర్థం చేసుకుని రాజును మీరు వదిలేశారు.. లేకపోతే ఇంత స్థాయికి వచ్చేవాడు గాదు. తమ్ముణ్ణీ, చెల్లెల్నీ బాగా చదివించాడు. ఇప్పుడు వాళ్ళు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. తల్లిదండ్రుల్ని తన వద్దే ఉంచుకున్నాడు... నిన్న ఫోన్ చేసి చెప్పాడు, ఇలా మీరు హాస్పిటల్ ల్లో ఉన్న సంగతి... చూద్దామని వెంటనే ఇలా వచ్చాను... "
ఆయన్ని అనునయిస్తూ అన్నాడు ప్రభాకర్. ప్రభాకర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాక, రంగయ్య కుటుంబం ఊరొదిలి టౌన్ కెళ్ళిపోవడం గుర్తొచ్చింది వీరభద్రారెడ్డికి. అందుకే.. వాళ్ళ గురించిన విషయాలేవీ తర్వాత ఆయనకి తెలిసిరాలేదు.మూడు రోజుల క్రితం మనవరాలి పుట్టినరోజుకని సిటీ కొచ్చిన ఆయన అస్వస్థతకు లోనై ఇలా హాస్పిటల్లో చేరాల్సొచ్చింది. రాజు వేపు ఆర్ద్రంగా చూస్తూ రెండు చేతులూ జోడించాడు వీరభద్రారెడ్డి.
" అయ్యో ! మీరు పెద్దవారు.. "
అంటూ ఆయన రెండుచేతులూ పట్టుకున్నాడు రాజు.. అదే... డాక్టర్ రాజయ్య.
".. పంతులూ, చదవడం రాని నాకు, అక్షరం విలువేమిటో ఎరుకపరిచారు. మీలాంటి ఉపాధ్యాయులు ఉండడం చాలా అవసరం.."
ప్రభాకర్ ను మనః పూర్వకంగా అభినందించాడు వీరభద్రారెడ్డి.
" అవును, అనుక్షణం నా వెన్ను తడుతూ, ప్రోత్సహిస్తూ నన్నీ స్థాయిలో నిలబెట్టారు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. రెడ్డిగారూ.. మీకు తెలియని మరో విషయం... చాలా కాలం తర్వాత గానీ నాకూ తెలియలేదు...సార్ నన్నే అనుకున్నానుగానీ.. మరో నలుగురు పేద విద్యార్థులను కూడా ఫీజులు కట్టి మరీ చదివించారు...ఆ అలవాటును ఇప్పటికీ అలా కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగని ఆయనకు కుటుంబం లేదా.. అనుకుంటే పొరపాటే... భార్య ఇద్దరు పిల్లలతో సలక్షణంగా ఉన్న జీవితం వారిది ! మరెందుకిలా...అంటే.. అదాయన స్వభావం!అదంతే!"
నవ్వుతూ చెప్పాడు రాజు. లోపల మాత్రం.....
" ఆయన ప్రకాశించే 'ప్రభాకరుడు' రెడ్డిగారూ... నలుగురికీ వెలుగులు పంచడం ఆయన నైజం!అంతే!"
అనుకున్నాడు.
******************🙏**********************
(గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు 💐)
******************************************
మీరు కూడా ఉపాధ్యాయినే కదా.
ReplyDeleteమీకు కూడా సెప్టెంబర్ 5 శుభాకాంక్షలు.
ధన్యవాదాలు సర్ 🙏
ReplyDelete