Wednesday, September 21, 2022

తోడు... కథ లాంటి ఓ నిజం !

      ఆటో దిగి గబగబా ఇంటి వైపు కదిలింది సుజాత. ఆఫీస్ లో ఏదో మీటింగ్ ఉండి లేటయిపోయింది తనకు. దానికి తోడు ఆటో దొరకడం కూడా ఆలస్యం! ఇల్లు చేరి, గేటు తెరచిన సుజాతకు కనిపించిన దృశ్యం చూడగానే గుండె తరుక్కుపోయింది. మూడేళ్ల తన పాప మెట్ల మీదే  పడుకుని నిద్రపోతోంది. భుజాలకు తగిలించుకున్న  బ్యాగ్, కాళ్లకు షూ అలాగే ఉన్నాయి. ఒక్క ఉదుటున వెళ్లి, తాళం తీసి, పాపను భుజాన వేసుకుని లోపలికెళ్ళిపోయింది.
    రెండు నిమిషాల తర్వాత, పక్కింటావిడ బయటి నుండి వచ్చింది.
" వచ్చేశావా సుజాతా! అనుకోకుండా పనిబడి అలా బయటికి వెళ్లాల్సి వచ్చింది.."
అంటూ పలకరించింది.
" అమ్మా నాన్న ఎక్కడికెళ్లారు పిన్నీ?... "
 అసహనంగా అడిగింది సుజాత.
" అర్జంటుగా ఏదో కొనాలని, పాప వచ్చేసరికి తిరిగొస్తామని చెప్పి వెళ్లారు సుజాతా... ఒకవేళ రావడం లేటయితే.. కాస్త  పాపని కనిపెట్టుకుని ఉండమని నాతో చెప్పి వెళ్లారు.కానీ.. చెప్పానుగా.. నాకూ..అనుకోకుండా,బయటికెళ్లాల్సొచ్చింది...ఈ లోగానే పాపవచ్చేసినట్టుంది  "
కాస్త నొచ్చుకుంటున్న ధోరణిలో చెప్పిందావిడ. 
ఇక ఏమంటుంది సుజాత !
                  **         **           **
  సుజాత ! పేరే 'సుజాత' ! కానీ జాతకమే మంచిగా రాయలేదా దేవుడు ! ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న కృష్ణకుమార్ మూడేళ్లు తిరగక్కుండానే బైక్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయాడు. ఊహించనివి జరగడమేనేమో జీవితమంటే ! గుండె బద్దలయ్యేలా విలపించింది సుజాత. 
  మూడు  నెలల దాకా డిప్రెషన్ లో పడిపోయిన ఆమెను ఓవిధమైన  నిర్వేదం ఆవహించింది. సంవత్సరం నిండిన లోకం తెలియని పాప ఒడిలో కేరింతలు కొడుతున్నప్పుడూ, అమాయకంగా నిద్దరోతున్నప్పుడూ.... ఆ నిద్రలో తనలో తనే నవ్వుకుంటున్నప్పుడు... ఆమెకు భర్త అన్న మాటలు గుర్తొచ్చేవి.
" సుజా, పాప ముద్దుగా ఉంది కదూ ! ఆ  నవ్వు చూడు, ఎంత అందంగా ఉందో ! ఇదెప్పుడూ ఇలా నవ్వుతూనే  ఉండాలి..."
అనేవాడు. ఆ నవ్వు చూసే.. ఎంతో ప్రేమగా, మరింత ఇష్టంగా...'సుహాసిని' అని  పేరు పెట్టాడు. పాపను చూసినప్పుడల్లా.. సుజాతకు అతని మాటలే పదే పదే గుర్తొస్తూ... మనసంతా బాధతో నిండిపోసాగింది రానురానూ..! కానీ, అంత బాధనూ...పాప నవ్వు చూస్తూ మరిచిపోయేది. 
" నీవు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావనుకున్నా, కుమార్... కానీ.. లేదు.. పాపను నాకు తోడుగా ఉంచే వెళ్ళావు..."
అనుకునేది. అప్పుడే.. అలాంటి క్షణాలే ...ఆమెలో  బతకాలన్న కోరికా, అంతకుమించిన బాధ్యతా  తట్టి లేపాయి. అందుకే.. నైరాశ్యాన్ని పక్కకునెట్టి, తనను తాను సంభాళించుకుని,  గుండె దిటవు పరుచుకుంది. చేతిలో ఉన్న డిగ్రీ ఆమెకో  దారి చూపించింది. మరోపక్క,  విధి వెక్కిరించిన కూతురి బాధ్యత తల్లీదండ్రికి   తప్పలేదు. కానీ, మూడు పదులు నిండకుండానే మోడువారిపోయిన   బిడ్డను నిత్యం చూసుకుంటూ ఉండడమే వారికి బాధాకరమైపోయింది. తామెంత కాలం ఉంటారు ! ఆ పిదప  కూతురు పరిస్థితి ఏమిటి? ఆ ఆలోచనే  వాళ్లను కుంగదీయసాగింది.
   అలా రెండేళ్ళు గడిచిపోయాయి. పాపకు మూడేళ్ళు నిండి.. దగ్గర్లోనే ఉన్న ఓ  స్కూల్లో చేర్పించారు. ఓ ప్రైవేటు ఆఫీసులో క్లర్క్ గా చేస్తున్న సుజాత, ఉదయం వెళ్లి సాయంత్రానికంతా  వచ్చేస్తుంది. పాప బాగోగులు అందాకా తల్లీదండ్రే  చూసుకుంటూ ఉంటున్నారు. అలా సాగిపోతే బాగానే ఉండేది. కానీ వాళ్ళ బాధ్యత అనుక్షణం వేధిస్తుండగా... అనుకోని రీతిలో తెలిసిన వాళ్ల ద్వారా ఓ సంబంధం వాళ్ల దృష్టిలోకొచ్చింది.
              **           **              **
  " డైవోర్స్ అయ్యాక పెళ్లి గురించి నేనాలోచించలేదండీ.. ఐదేళ్ళయిపోయింది. కానీ ఇంట్లో వాళ్ళ ఒత్తిడి ! పైగా.. నాకూ ఈమధ్య లైఫ్ చాలా డ్రై  గా అనిపిస్తోంది. అందుకే మీ గురించి చెప్పాక ఓసారి మిమ్మల్ని కలుద్దామనిపించింది.. "
అమ్మనాన్నల బలవంతం మీద పార్కు లో అతన్ని కలిసిన సుజాతతో చెప్పాడు శిరీష్. 
" ఎన్నాళ్లిలా ఉంటావమ్మా ?  ఈ వయసులో మాకీ క్షోభ ఏమిటి ! పాప బాధ్యత మేం తీసుకుంటాం. నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు. నువ్వు మళ్ళీ సెటిలైపోతే మాకు నిశ్చింత... "
ఈ మాటలు సంవత్సరకాలంగా వాళ్ళ నోటినుండి వింటూనే ఉంది... కానీ పాప ! తన దారి తాను చూసుకుంటే  ఎలా! కృష్ణ కుమార్ గుర్తొచ్చే వాడు తనకు. కానీ ఈసారి ఎందుకో వాళ్ల ఆరాటం కూడా సబబే అనిపించిందామెకు.
"... సంవత్సరన్నరపాటు సాగింది మా వైవాహిక జీవితం. ఇద్దరికీ ఎందులోనూ పొత్తు  కుదరలేదు. పరస్పర అంగీకారంతో విడిపోయాం. సంతానం లేదు.. గతాన్ని పక్కన పెట్టేసి, కొత్తగా  లైఫ్ మొదలెట్టాలని మీకూ  అనిపిస్తే... స్టెప్  ముందుకేద్దాం..."
 తలదించుకుని కూర్చున్న సుజాతనే  చూస్తూ కొనసాగించాడతను. 
" అమ్మా  వాళ్ళు చెప్పారనుకుంటాను...నాకోపాప.. "
 నోరు విప్పింది సుజాత.
" చెప్పారండీ.. అదేమీ ఆటంకం కాదనుకుంటున్నా."
 వెంటనే అన్నాడతను. సుజాతకు ఆ  మాటలు పూర్తిగా అవగతం కాలేదు. అంటే ఏమిటి? పాపను తమతోనే ఉంచుకోవడం ఓకేనా కాదా?.. ఊగిసలాడింది ఆమె అంతరంగం. పావుగంట తర్వాత మళ్ళీ కలుద్దామనుకుని  లేచారిద్దరూ.
                **          **            **
  రాత్రి పడుకుని... ఆ  సాయంత్రం ఇద్దరి మధ్యా జరిగిన సంభాషణ మళ్ళీ మళ్ళీ మననం  చేసుకుంది సుజాత. అతని మాటల ద్వారా సుజాత గ్రహించిన విషయం.... త్వరలో అతను కెనడా వెళ్తున్నాడు ఉద్యోగరీత్యా.. అక్కడే సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నాడు. పాపను సుజాత తల్లిదండ్రుల వద్దే కొంతకాలం ఉంచితే మంచిదన్న తన అభిప్రాయాన్ని స్పష్టంగానే వెలిబుచ్చాడు. తొలుత ఆమె మనసు ఎదురు తిరిగింది. తల్లిదండ్రులు గుర్తొచ్చి...వారి కోణంలో కూడా ఆలోచించడం మొదలెట్టింది. నెమ్మది నెమ్మదిగా.. మనసు వారి వైపు మొగ్గసాగింది..... 
     రెండు వారాలు గడిచాయి. రిజిస్టర్ మ్యారేజ్ కి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఆఫీసులో చెప్పేసింది సుజాత రిజైన్ చేస్తానని.. శిరీష్ ఇద్దరికీ కెనడా వెళ్లే ఏర్పాట్లు చూడడంలో నిమగ్నమయ్యాడు. 
   ఓ వారం దాకా సుజాత కాస్త ఉల్లాసంగానే ఉంది. నెమ్మదిగా ఆమెలో ఏదో గుబులు మొదలై, క్రమంగా  పెరిగిపోతూ మనసంతా ఆవరించుకుంది . పాపను చూస్తుంటే అది  రెట్టింపై తనని అచేతనంగా మార్చేస్తోంది. ముఖ్యంగా రాత్రిపూట... తనను  గట్టిగా వాటేసుకొని పడుకున్నప్పుడు..! ఇలా ఇంక కొన్ని రోజులే కదా..! ఆ తరువాత అమ్మ కనిపించక ఎంత అల్లాడిపోతుందో  కదా ఈ పసిది... ! ఇదే ఆలోచన ఆమెను పట్టి వేధించసాగింది.
    ఆమెను కలచివేసిన మరో అంశం ! రెండు రోజుల క్రితం శిరీష్ ఇంటికి వచ్చాడు, ఏదో పనిమీద. పాప ఓపక్కగా కూచుని బొమ్మల్తో ఆడుకుంటోంది. అతను అటువేపు ఓ చూపు చూసి తను వచ్చిన పని గురించి చెప్పడంలో నిమగ్నమయ్యాడు.. పాపను పిలవడం గానీ, ఎత్తుకోవడం గానీ చేయకపోగా... బొత్తిగా ఆ స్పృహే  లేనట్లున్న ఆతని తీరు సుజాతకు ముల్లు గుచ్చుకున్నట్లయింది. ఆ క్షణంలో ఆమెకు కృష్ణ కుమార్ మదిలో మెదిలి బాధ రెట్టింపైంది.
    పైగా ఈ రెండు వారాల్లో శిరీష్  గురించి ఆమె గ్రహించిన విషయం...పూర్తిగా యాంత్రికమైన అతని మనస్తత్వం ! ఎంతసేపూ... అతని ఉద్యోగం, సంపాదన.. అతని కెరీర్ .. పూర్తిగా తన గురించిన ఆలోచనే! పక్కనున్న వారి ఊసే పట్టనంత స్వార్థం ! కృష్ణ కుమార్ అతనికి పూర్తిగా విరుద్ధం !అతన్ని  చూస్తుంటే పాపపట్ల కేరింగ్ గా  ఉంటాడా, అన్న అనుమానం ఆమెలో కలగసాగింది. తనకు తాను ఎంత సర్ది చెప్పుకున్నా ఎందుకో తన భర్త స్థానాన్ని శిరీష్ భర్తీ చేస్తాడన్న నమ్మకం ఆమెకు కలగడం లేదు.   ప్రతిక్షణం అలా పోల్చుకోవడంతో ఆమెలో తీవ్ర సంఘర్షణ చెలరేగడం మొదలైంది.
              **            **                **
   పెళ్లి తేదీ దగ్గర పడే కొద్దీ సుజాతలో ఉత్సాహం, సంతోషం పూర్తిగా మసకబారసాగాయి. ఆమె మన స్థితి అలా కొట్టుమిట్టాడుతున్న దశలోనే,  ఆ రోజు సాయంత్రం జరిగిన సంఘటన ఆమెను పూర్తిగా ఇరకాటంలో పడవేసింది.
    మరణించిన తన భర్త ఏ దుర్మార్గుడో, శాడిస్టో అయి ఉంటే.. ఈపాటికి అతన్ని మరిచిపోయి ఆలోచించేదేమో! గడిపింది మూడు సంవత్సరాలే అయినా ...ఆ  జ్ఞాపకాలు పచ్చగా,  పదిలంగా తనలో సజీవంగా ఉన్నాయి ఇప్పటికీ ! పోనీ.. చేసుకోవాలనుకుంటున్నవాడు అతన్ని మరిపించేలా ఉంటాడన్న దాఖలాలేవీ  తనకు కనిపించడం లేదు. ముఖ్యంగా పాపకు తండ్రి స్థానాన్ని ఇస్తాడన్న నమ్మకం తనకసలు కలగటం లేదు. ఇక ఏ భరోసాతో అతనితో పెళ్లికి సంసిద్ధురాలు కాగలదు ! తన గుండెల్లో తలదాచుకుని పడుకున్న సుహా ని గట్టిగా అదుముకుంటూ ఆలోచనలో పడిపోయింది సుజాత.
    మూడు పదులు దాటిన తమ కూతురి జీవితం గురించి తపించిపోతున్నారు తన అమ్మనాన్న ! నిండా  మూడు సంవత్సరాలు కూడా లేని తన బిడ్డ గురించి తను ఆలోచిస్తోందా? ఏం చేయబోతోంది తాను!! డెబ్భై కి చేరువలో ఉన్న అమ్మమ్మ,  తాతయ్య ఎంతవరకూ  దాని బాగోగులు  చూసుకోగలరు ! ఈరోజుతో ఆ నమ్మకం కూడా పోయింది తనకు ! కళ్లు మూసినా, తెరచినా.... అలసిపోయి,  మెట్లమీద దిక్కులేని దానిలా పడి నిద్రపోతున్న తన పాపే మెదులుతూ ఆమె తల్లి మనసు తట్టుకోలేకపోతోంది. ఇక ఏ దైర్యంతో దానికి దూరంగా తాను నిశ్చింతగా ఉండగలదు ! 
                 **           **           **
    "  ఇంతదాకా వచ్చాక వద్దంటావేమిటే ! మేం నీకోసం, నీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంటే... నీవేమో నోటిదాకా వచ్చిందాన్ని కాలదన్నుకుంటానంటా వేమిటే!.."
రాజ్యలక్ష్మి ఏడుపు  లంకించుకుంది. 
"ఔనమ్మా, ఉన్నట్టుండి ఎందుకిలా మనసు మార్చుకున్నావు? చెప్పు తల్లీ... "
విశ్వనాధం గారు కూతురి పక్కన జేరి అనునయంగా అడిగారు. 
"...అసలు తోడు లేకుండా ఎలా బ్రతగ్గలననుకుంటున్నావే ? అదృష్టం కొద్దీ ఈ సంబంధం వచ్చిందని మేం సంబరపడుతుంటే..... "
" ఏమిటమ్మా తోడు ! అసలెవరికి... ఎవరికి తోడు అవసరం? బయట నుండి ఇంట్లో కాలు పెడితే మంచినీళ్లు కూడా ఒకరందిస్తే గానీ తాగలేని అశక్తుడు మగవాడు. అతనికవసరమమ్మా తోడు ! ఆకలేస్తే వండిపెట్టడానికి, జబ్బు చేస్తే సేవలు చేయడానికి.. మగాడికి కావాలి తోడు !అతని అవసరాలన్నీ తీర్చడానికి, ఆఖరికి....ఇల్లు ఊడ్చడానికి, ఇంట్లో దీపం పెట్టడానికీ.. మళ్లీ ఆడదే కావాలి మగాడికి...!"
"..........................."
" అనుక్షణం అతనో  డిపెండెంట్ ఆడదానిపైన !. మరి ఆడది! ఇంట అన్నింటినీ  సంభాలించుకుంటూ, బయటకెళ్ళి ఉద్యోగాలు కూడా చేస్తూ, ఒంటి చేత్తో అన్నీ చక్కబెట్టగల సమర్థురాలు ! చెప్పమ్మా... తోడు ఎవరికి అవసరం? మగాడికా?  ఆడదానికా?.... "
కొద్దిరోజులుగా పడుతున్న వేదన సుజాతలో ఒక్కసారిగా పెల్లుబికింది. 
".................."
" ఈ సమాజంలో ఆడది  బ్రతకడానికి కావాల్సింది మగతోడు కాదమ్మా... గుండెనిండా ధైర్యం, కొండంత ఆత్మ విశ్వాసం ! అది నాకు ఉందనే  నమ్మకం నాకు కలిగింది... చాలు.. నాకు నా పాప  తోడు చాలమ్మా.."
"...................."
".. గతించిన నా భర్త జ్ఞాపకాలు చాలు ఈ జన్మంతా నేను గడిపేయడానికి.. మరో పెళ్లి పేరిట నన్ను నేను మరో కొత్త సమస్యను నెత్తికెత్తుకోలేను. అర్థం చేసుకోండి.."
గొంతు గాద్గదికమై వెక్కి వెక్కి ఏడుస్తూ కూలబడిపోయింది సుజాత. విశ్వనాధం,రాజ్యలక్ష్మి కంగారుగా కూతురు దగ్గరకు చేరుకున్నారు. అమ్మ ఎందుకు ఏడుస్తోందో తెలియని పాప తల్లి ఒడిలోకి చేరి, గట్టిగా వాటేసుకుంది.
" ఏడవద్దమ్మా, నీకోదారి చూపాలన్న  తాపత్రయంలో నీలో గూడుకట్టుకున్న బాధను చూడలేక పోయాము. సరే, నీకు ఇష్టం లేకుండా ఏదీ  జరగదు. మేము ఉన్నంతకాలం మేమే నీకు తోడు. ఆ తర్వాత ఇదిగో... నీ పాప  సుహా.. నీ భర్త ప్రతి రూపం!  "
కూతురి తల నిమురుతూ ఆర్ద్రంగా అన్నాడు విశ్వనాధం.తేరుకుని, కన్నీళ్ళు తుడుచుకుంటూ, తలెత్తింది సుజాత.
" జీవితాంతం ఎవరూ ఎవరికీ తోడుండరు నాన్నా!చివరికి మనిషెప్పుడూ ఒంటరే ! ఒంటరిగానే పోతాడు.."
 ఓ క్షణం అప్రతిభుడైన ఆయనకళ్ళలో నీళ్లు తిరిగాయి. మానసికంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన కూతురి దృఢత్వం చూసి చలించిపోయి...ఆపై సంతృప్తిచెంది  స్థిమితపడ్డాడు.
" శిరీష్ గారితో నా జీవితం సవ్యంగా సాగుతుందన్న నమ్మకం నాకు కలగటం లేదు నాన్నా. పాపకు దూరమైపోయే ఈ కొత్త  బంధం నాకు అవసరమా అనిపిస్తోంది.... "
"...అయినా నాతోపాటు నా కూతుర్నీ ఆమోదించగల వ్యక్తి తారసపడితే తప్పక ఆలోచిస్తాను...నా  గురించి మీరేమీ బెంగ పడకండి.."
తండ్రి చేతులు పట్టుకుంది  సుజాత.
"నిజమే ! కూతురి జీవితం సంతోషంగా సాగితేనే కదా తమకైనా నిశ్చింత !" 
ఆయన  కూడా ఆలోచనలో పడ్డాడు. రాజ్యలక్ష్మికూడా  కూతుర్ని దగ్గరికి తీసుకుని అనునయించింది. 
   నెల దినాలుగా రేయింబవళ్లు సుజాత పడుతున్న మానసిక సంఘర్షణకు తెర పడినట్లయింది. 

******************************************





 

2 comments:

  1. ఉపన్యాసాలు ఎలా ఉన్నా కథ మాత్రం చాలా చక్కటి కథ.

    అసలు పాపని మీ తల్లిదండ్రుల వద్దే కొంతకాలం ఉంచుదాం అని ఆ పెద్దమనిషి అన్న తరువాత ఇంక అతనితో పెళ్ళి అనే ఆలోచనే విరమించుకోవలసింది సుజాత.

    ఏనాటికైనా ఆ పాపని అతను కెనడా తీసుకువెళ్ళుండేవాడని నేను అనుకోను. సుజాత తల్లితండ్రులు పోయిన తరువాత కూడా ఆ పిల్లని ఇక్కడే ఏదో ఒక హాస్టల్లో పెట్టుండేవాడేమో?

    అతని నిర్లక్ష్యపు ధోరణీ, బాధ్యతారహిత ప్రవర్తన తన మొదటి భార్య దగ్గర కూడా ప్రదర్శించుంటాడు, అందుకే ఆ అమ్మాయి విడాకులు ఇచ్చేసుంటుంది …….. అని కూడా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది.

    నిజం కథ అంటున్నారు కాబట్టి ఆ సుజాత (వేరే పేరుతోనయినా) మీకు తెలిసిన వ్యక్తేనేమో బహుశః ? తన బాధ్యతనెరిగి తీసుకున్న సాహసవంతమయిన నిర్ణయం, తన ఆత్మస్ధైర్యం మెచ్చుకోదగినవి అని తెలియజేయండి 👏.

    ReplyDelete
    Replies
    1. ఎవరో ఒకరిని దృష్టిలో పెట్టుకుని రాయలేదండీ. ప్రస్తుత సమాజంలో ఇలాంటివి తరచుగా కనిపిస్తున్నాయి. పిల్లలున్న మగవాడు భార్య చనిపోతే వెంటనే మళ్ళీ పెళ్లికి సంసిద్ధుడౌతాడు. అతని పిల్లలు అతని వద్దే ఉంటారు. చేసుకోబోయే ఆమె అనుమతి గురించి ఆలోచించడు. ఆమె వాళ్ళను తన సొంత పిల్లల్లాగే పెంచాలి. అదంతే !అదే పరిస్థితిలో ఉన్న ఓ ఆడది పునర్వివాహం చేసుకునే అవకాశం వచ్చినా... సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతుంది, ( కథలో సుజాత లా ).
      స్త్రీ, పురుషులకు సమాన హక్కులున్నాయంటున్నారు గానీ... కొన్ని విషయాల్లో స్త్రీ పరిస్థితిలో అనాది నుండీ ఏమాత్రం మార్పు ఉండడం లేదు. అందుకే.. కాలం ఏదైనా... స్త్రీ కి ఆత్మస్థైర్యం చాలా అవసరం అన్నాను.
      అందరూ ఇలాగే ఉంటారని కాదు... సర్వసాధారణంగా జరుగుతున్నది ప్రస్తావించాను.
      కథ మీకు నచ్చినందుకు సంతోషం 🙂

      Delete