రంగురంగుల ఎలక్ట్రిక్ బల్బుల తోరణాలతో వెలిగిపోతోంది ఫంక్షన్ హాల్. బాగా దగ్గరి బంధువులయినందున పెళ్లి ముందు రోజు కూడా రావాల్సి వచ్చింది. సరే! రొటీన్ లైఫ్ నుండి కాస్త ఆటవిడుపు... కాలక్షేపం... పనిలో పని.. అదే పనిగా ఎలాగూ వెళ్లి ఒకర్నొకరం కలవలేని బంధువర్గాన్నీ చూడొచ్చు కదా అన్న తలంపుతో కుటుంబ సమేతంగా వెళ్ళాం.
ప్రవేశ ద్వారం దగ్గరే ఇద్దరు అమ్మాయిలు నిలబడి ఉన్నారు. లోపలికి వెళ్తున్న వాళ్ళందరి చేతుల్లో మడత పెట్టిన మందపాటి కార్డు ఒకటి పెట్టేస్తున్నారు. ఇదేంటా అని తెరిచి చూస్తే... పెళ్లి ముందు రోజు, పెళ్లిరోజు ఆహూతులకు ఏర్పాటు చేయనున్న విందులో రక రకాల డిషెస్ లిస్టు ! క్యాటరింగ్ వాళ్ళ పని! ఓహో! ఇదోరకం పబ్లిసిటీ అన్నమాట ! అందులో వాళ్ల అడ్రస్, ఫోన్ నెంబర్... వగైరా.. వగైరా.. అన్నీ పొందుపరచబడి ఉన్నాయి.
స్నాక్స్, ఫ్రూట్ జ్యూస్ లు, కాఫీలు, టీలు నాల్గు రకాల టిఫిన్లు, రకరకాల బిర్యానీలు కర్రీలు...అంతటితో సరా ! ఐస్ క్రీములు, పళ్లముక్కలు, అరటిపండు..ఇన్ని ఉండి తాంబూలాలు లేకుంటే ఎలా? అవీనూ !!
మనిషన్నవాడు ఒకేసారి అన్ని ఐటమ్స్ తినగలడా!సాధ్యమా ! అంటే... ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు తినడానికే ఇవన్నీ.. అన్నారు కొందరు !
ఆ రెండు రోజులూ భోజనాల సమయంలో ఎంత వద్దనుకున్నా కంటబడ్డ దృశ్యం... ప్లేట్లలో తిన్నదెంతో గానీ... పారవేస్తున్నదే ఎక్కువగా కన్పించింది వేస్ట్ బకెట్లలో ! అక్కడక్కడా కొన్ని స్వీట్లు కూడా కన్పించాయి దీనంగా చూస్తూ !
మా ఫ్రెండ్ ఒకామె గృహప్రవేశానికని పిలిస్తే వెళ్ళాను కొద్ది రోజుల క్రితం. ఆహ్వానించినవారంతా వచ్చారు గానీ పదార్థాలు మాత్రం ఎక్కువగా ఖర్చు గాక మిగిలిపోయాయంటూ వాపోయింది. ముఖ్యంగా పప్పు, రసం, సాంబార్ ఇంకా వెజ్ కర్రీస్ లాంటివి నిండుగా అలాగే ఉండిపోయాయి. బిర్యానీలు, కుర్మాలు లాగించిన తర్వాత పప్పు, రసం జోలికెవరు వెళ్తారు చెప్పండి ! ఇక నాన్ వెజ్ ఉన్నట్లయితే,వెజ్ వైపు ఎవరో ప్యూర్ వెజిటేరియన్స్ తప్ప ఇతరులు చూసే ప్రసక్తే ఉండదు. అలాంటప్పుడు అవి మిగిలి పోయే అవకాశాలు సహజంగానే ఎక్కువ మరి ! అంతా అయ్యాక... కొందరు ఏ అనాధ శరణాలయాలకో ఫోన్లు చేయడం.. వాళ్ళు వచ్చి, వాళ్లకు కావలసినవి మాత్రం పట్టుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది.మిగతాదంతా వృథానే!
" అందరూ చేయిస్తున్నారు... మనం చేయించకపోతే ఎలా "
అన్న ఫీలింగుతో నలుగురు నడిచే దారిలోనే నడవాల్సొస్తోంది అంటున్నారు ఆహ్వానించే వారు.
అదలావుంచితే.... ఇక use and throw వాటి గురించి... తినే ప్లేట్లు, ప్లాస్టిక్ నీళ్ల గ్లాసులు, లాంటివి..
ఈమధ్య చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ కూడా పెడుతున్నారు. కొందరు నీళ్లు సగం తాగి ఆ గ్లాస్ పక్కన పడేయడం!
( ఇదోరకం వృధా ). ఇవేనా! ఐస్ క్రీమ్ కప్స్, స్వీట్ కప్స్.... వగైరాలకూ కొదవేంలేదు. ఇవన్నీ పర్యావరణానికి ఎంత చేటు తెస్తాయో వేరే ప్రస్తావించక్కర్లేదు. ఒకప్పుడు స్టీలు లేదా ఫైబర్ ప్లేట్లు వాడేవారు. కడిగే శ్రమ ఎందుకని ఈ సౌలభ్యం ! దాని పర్యవసానం కాలుష్యం! కాలుష్యం !
విమర్శించడం కాదు గానీ.. దీనికి అందరం... ప్రతి ఒక్కరం బాధ్యులమే. వీటి అవసరం గుర్తిస్తున్నామే గానీ, పర్యావరణ కాలుష్యం గురించి... మనకెందుకులే అనుకుంటున్నాము. అది మనకు సంబంధించిన వ్యవహారం కాదనుకుంటాము.
భోజన పదార్థాల వృధా, వాతావరణ కాలుష్యం..
ఈ రెండూ నివారించలేని అత్యవసరాలుగా మారిపోయాయి ప్రస్తుత రోజుల్లో !
ఓ ఫంక్షన్ లో భోజనాలయ్యాక ఆడా, మగ కొందరు ఓ చోట చేరి బాతాఖానీ మొదలెట్టారు ఇదే విషయం మీద.
" ఏమిటో, మా రోజుల్లో ఇవన్నీ ఎరగం...."
" ఆ రోజులు వేరు బావా, ఇప్పుడలా చేశామంటే ఒప్పుకోరు జనాలు..."
" ఏం ఒప్పుకోవడమో ఏమో, నన్నడిగితే ఏ రిజిస్ట్రార్ ఆఫీసులోనో దండలు మార్చుకుని.. ఓ రోజు సింపుల్ గా రిసెప్షన్..అదీ.. దగ్గరి బంధుమిత్రులకు అరేంజ్ చేసేస్తే భేషుగ్గా ఉంటుందంటాను.... "
ఒకాయన తన అభిప్రాయం అలా వెలిబుచ్చాడో లేదో..
"... చాల్లే ఊరుకో... ఇంత బతుకూ బతికి.... "
పూర్తి చేయకుండా సాగదీసి మూతి తిప్పుకున్నాడు వెంటనే పక్కనే ఉన్న మరొక పెద్దాయన.
మరి కొందరు ఆడవాళ్ళు,
" ఏ వంటకాలు బాగున్నాయి, ఏవి బాగాలేవు" అన్న చర్చలో పడ్డారు.
ఒకప్పుడు బంతి భోజనాలు.... విస్తళ్ళు వేసి మితంగా కొన్ని రకాలతో రుచికరంగా వడ్డించేవారు. ఇప్పుడా పరిస్థితి కాగడా వేసి వెతికినా కానరాదు.నిర్వాహకులకు ఖర్చుతో పాటు శ్రమ !పైగా వృథా ! తినేది రవంత, ఆర్భాటం కొండంత!అన్నట్లు !!
ఇన్నేసి రకాలు చేయిస్తారా... తృప్తిగా తినడం గానీ, కడుపు నిండిన భావన రావడం గానీ జరగదు ! చివరగాచెప్పొచ్చేదేమంటే...పెళ్లికి వెళ్లొచ్చిన'ఫీల్' అసలుండటం లేదు. అటూఇటూ మొక్కుబడి తంతు!
ఇది ఏ ఒక్కరి మాటోమాత్రం కాదు.ఎక్కువ శాతం జనాల్లో నలుగుతున్నదే ! కాకపోతే ఓ రకమైన comfort zone లో పడిపోయి దానికి పూర్తిగా అలవాటుపడిపోయాక మళ్లీ పాత పద్ధతుల్లోకి వెళ్లాలంటేనే ఇబ్బంది !! నాగరికత ప్రగతి పథంలో నడిస్తే బాగానే ఉంటుంది. ప్రతీ దాంట్లోనూ ప్లస్ లూ, మైనస్ లూ ఉంటుంటాయి.అలా ఆలోచిస్తూ... కాలానుగుణంగా సర్దుకుపోవాలి అనిపిస్తుంది ఒక్కోసారి. మార్పు మంచిదే..... కానీ....
******************************************