Friday, July 8, 2022

అంతేగా ! పెత్తనం మారితే అంతేగా !!

    రాత్రి ఏడు దాటింది. కరుణ లోనికెళ్లి స్టవ్ వెలిగించి వంట ప్రయత్నాలు మొదలెట్టబోయింది. అంతలోనే.. అంతవరకూ బయట పక్కింటావిడతో బాతాఖానీ చేస్తున్న అత్తగారు ఎప్పుడొచ్చిందో ఏమో ఠక్కున స్టవ్ ఆర్పేసింది. 
" అప్పుడే  మొదలెట్టావేంటమ్మా ! తినే టైమ్ కంతా చల్లారిపోదూ... ఇంకో గంటాగి మొదలెడదాంలే .. "
అంటూ కోడల్ని వారించి, మళ్ళీ బయటికెళ్లి కూర్చుంది. 
    కరుణ ఉసూరుమంటూ రూములో కెళ్ళి కూర్చుంది. తను సాయంత్రం స్కూల్ నుండి వచ్చేసరికే 5.30 దాటిపోతుంది. ఇల్లు ఊడ్చటాలు, టీ లు అందించటాలు అన్నీ అయ్యేసరికి మరో గంట ! తనకేమో త్వరగా వంట పనులు కూడా ముగించుకొని మర్నాడు లెసన్స్ ప్రిపరేషన్ గానీ, పేపర్ కరెక్షన్ గానీ చూసుకోవాలని ఉంటుంది. కానీ అత్తగారు పడనీయదు. రోజూ ఇదే తంతు ! తనకేమో వంటింట్లో పనంతా అలాగే ఉంచుకొని స్కూల్ వర్క్ చేసుకోవాలంటే ఏకాగ్రత కుదరక మనస్కరించదు. ఆవిడేమో అర్థం చేసుకోదు. పోనీలే, తానే ఏమైనా చేస్తుందా అంటే అదీ లేదు. అన్నింటికీ కోడలు పక్కన ఉండాల్సిందే.. పెళ్లయి కాపురానికి వచ్చిన దగ్గర్నుంచీ ఇదే తంటా ఆవిడతో. తనకు నచ్చిన విధంగా, తనకు వీలైన సమయంలో చేసుకునే స్వేచ్ఛ ఏ కోశానా ఉండడం లేదు. విసుగ్గా తలపట్టుకుంది కరుణ.
     ఒకటో తేదీ వచ్చింది. జీతాలొచ్చాయి. స్కూల్లో తీసుకున్నకవరు తెచ్చి భర్త చేతిలో  పెట్టింది కరుణ. వెంటనే అతను అది తీసుకెళ్ళి తల్లి చేతిలో పెట్టేశాడు. రెండు సంవత్సరాలుగా జరుగుతున్నదిదే. ఇందులో మార్పన్నదుండడం లేదు. అంతా అత్త  పెత్తనం! చదువుకున్న నేరానికి ఇంటాబయటా చాకిరీ తప్పడం లేదు. ఆర్థిక స్వాతంత్ర్యం అస్సలు  లేదు. స్వతంత్రంగా కనీసం ఓ చిన్న వస్తువు కొనడానికి కూడా వీలు లేదు.
   ఇక... మామగారు అదో టైపు ! చూసీ  చూడనట్లుంటారు. కానీ పూర్తిగా భార్య పక్షమే. ఇంట్లో అంతా సజావుగా జరుగుతూ ఉందా లేదా అని సైలెంట్ గా పైనుండి పర్యవేక్షిస్తుంటారు. ఏదైనా తేడాగా కనిపిస్తే 'ఇండైరెక్ట్ ' గా చర్య తీసుకునే రకం ! ఆయన  పద్ధతులు ఆయనకు ఉన్నాయి మరి ! కొడుకు సంపాదనాపరుడైనా, పెళ్లి చేసుకుని ఇంటివాడైనా తన కనుసన్నల్లోనే ఉండాలనుకునే మనస్తత్వం ! కోడలంటే సంపాదించే ఓ యంత్రం,  ఆ సంపాదన మాకే సొంతం, అన్న ప్రగాఢమైన అభిప్రాయాలు వారివి! ఆ గీత దాటే  ఆలోచన తన భర్తకు లేకపోవడం కరుణ దురదృష్టం. ఏదో ఆశగా  భర్త వైపు చూసినప్పుడల్లా 'నేను అశక్తుణ్ణి' అన్నట్లు చూస్తాడతను !
                         **        **       **   
    పది సంవత్సరాలు గడిచాయి. ఇద్దరు పిల్లల తల్లి అయింది కరుణ. కొలీగ్స్ ను చూసి  కొంత, స్వానుభవంతో కొంత 'లౌక్యం' అన్నది అలవరుచుకొని, లోకజ్ఞానం పెంపొందించుకుని ఇంకా చెప్పాలంటే... మేలుకొని... కాస్త బుర్ర ఉపయోగించడం నేర్చుకుంది. క్రమంగా వచ్చిన జీతమంతా తెచ్చి వాళ్ల చేతిలో పెట్టడం మానేసి, తనకంటూ ఇంత,  పిల్లల కోసం అంటూ కొంత ఉంచేసుకోవడం మొదలెట్టింది. ఇదేమిటని ప్రశ్నించే అత్తగారికి సమాధానం చెప్పడం కూడా అలవరచుకుంది. భర్త చెప్పిన ప్రతిదానికీ తలాడించడం మానేసింది. అలా అలా.. మౌనంగానే అయినా కాస్త గడుసుదనం వచ్చి చేరిందామెలో !! ఫలితం ! కాస్త మనశ్శాంతికి నోచుకుంటోంది. 
                  **         **         **
    పెళ్లయి ముప్ఫయి ఏళ్ళు  దాటాయి.  ఈ మధ్యకాలంలో చాలా జరిగిపోయాయి. కొడుకు చదువు పూర్తయి ఉద్యోగంలో ప్రవేశించాడు. కూతురి పెళ్లి చేసి అత్తారింటికి పంపేశారు. మామ గారు కాలం చేశారు.అత్తగారు గట్టిగానే ఉంది, ఆరోగ్యపరంగా ! కాకపోతే ఓ చిన్న మార్పు... కరుణ దృష్టిలో అది పెనుమార్పే !!
    పెత్తనం చేతులు మారింది. ఇప్పుడంతా కరుణదే రాజ్యం ! అత్తగారి పెద్దరికం అంతా గడప అవతలే! ఆవిడకి మరోదారి లేదు. ఉన్న ఒక్క కొడుకే దిక్కు ! అత్యంత శక్తివంతమైన పదవి కోల్పోయిన నాయకురాలిలాగా అయిపోయిందామె  పరిస్థితి ప్రస్తుతం! కొడుకు వంక చూస్తే...
"చెలాయించినన్నాళ్ళూ చెలాయించావు గదా, ఇంకెన్నాళ్లు ! కొత్త నీరు వచ్చే కొద్దీ పాత నీరు తప్పు కోవాల్సిందే... ఈ విషయంలో నేను నిస్సహాయుణ్ణి.."
అన్న ధోరణిలో చూస్తాడు.ఇక కోడలి చూపుల్లో అయితే మరేవేవో అర్థాలు!"
" అత్తనన్న ఆధిపత్యంతో, ఇదంతా నాదీ.. నాదేనన్న అహంకారంతో ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా మాటలతో హింసించి నన్ను మానసికక్షోభకు గురి చేసినందుకు ప్రతిఫలం !"
అన్నట్లుండే ఆ చూపులు చురుక్కుమని ఎక్కడో గుచ్చుకునేవావిడకి. 
 " ఆ రోజుల్లో ముందుచూపుతో వ్యవహరించి ఉంటే ఈ రోజు నా పరిస్థితి ఇలా ఉండేది కాదు గదా... ఎంత అణకువగా ఉండేది! ఎంత సతాయించింది తను   ఆ పిల్లని ప్రతీ విషయంలో ! నా వల్లే కదా, ఏకులా ఉండే కోడలు మేకులా తయారైపోయింది !ఎవరైనా ఏదైనా ఎంత కాలమని భరిస్తారు ! అయినా ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం? గడిచిన కాలం తిరిగి రాదు కదా! కోడలు తనకిచ్చిన గౌరవాన్ని చేజేతులా తనే కాలరాసుకుంది. చేతులారా చేసుకున్న కర్మ !"
 అనుకుంటూ మౌనముద్ర దాల్చడం అలవాటు చేసుకుంది.అలాంటపుడు  అంతేగా మరి ! పెత్తనం మారితే అంతేగా !!
              ****************************




3 comments:

  1. అంతేగా మరి.
    నేను పొరబడుతున్నానేమో కానీ
    ఈ పోస్ట్ మీరు ఇదివరకోసారి పెట్టారని లీలగా గుర్తు 🤔.

    ReplyDelete
    Replies
    1. కాదండీ, ఇది నిన్ననే రాశాను. గత నెలలో' 'జనరేషన్ గ్యాపండీ బాబూ'అనే పోస్ట్ పెట్టాను. అందులోని ఒక పాయింట్ దీనితో కలుస్తుంది. మీరది చదివి ఉండొచ్చు. ఉద్యోగాలు చేసే మహిళల్లో ఆర్థిక స్వాతంత్ర్యం లేని వాళ్లను కొందర్ని నేను చూశాను (కారణాలేవైనా కావచ్చు). అందుకేనేమో, సంబంధిత పోస్ట్ ఏదైనా రాస్తున్నప్పుడు అప్రయత్నంగానే ఆ పాయింట్ దూరి పోతూ ఉంటుంది 🙂. థాంక్యూ వెరీమచ్ సర్ 🙏

      Delete
    2. అంతే అయ్యుంటుంది లెండి.
      బహుశః మీరు స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యే అంశం అన్నమాట. అందుకే మీ రాతల్లో చోటు చేసుకుంటుంటుంది. మంచిదే లెండి.

      Delete