Monday, March 7, 2022

ఆలోచనా సరళి మారితే గానీ...

🌷 "ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి 
 ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి"

--- ఇంటి ఇల్లాలిని దేవునితో పోల్చి, ఎంత అద్భుతమైన పల్లవిని సృష్టించాడు కవి ! అంతేనా ! దశాబ్దాలు గడిచినా పాటలోని భావం ఎలాంటి  హృదయాన్నైనా తట్టిలేపుతుంది. స్త్రీ ఔన్నత్యాన్ని కొనియాడే  ఇలాంటి పాటలు తెలుగు సినిమాల్లో ఆది నుండీ వినిపిస్తూనే  ఉన్నాయి. 
🌷" ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం... "
 --- స్త్రీ లేకపోతే ఈ సృష్టే  లేదు అంటూ ఎలుగెత్తి చాటుతాయి ఇలాంటి గీతాలు ! 
   మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాలూ ఎన్నో వచ్చి నిత్య జీవితంలో అడుగడుగునా ఆమె ఆవశ్యకతను తెలియపరచాయి. ఇటీవల వచ్చిన ఓ సినిమాలోని పాట ఎంత ప్రాచుర్యం పొందినదో విదితమే !
🌷" మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ? 
   మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు గలవా"

--- అంటూ సాగిన ఆ గీతం బహుశా వినని వారు ఉండరేమో ! ఇక విషయంలోకి వస్తే ---
 మహిళ గురించి ఎన్ని పాటలు రాసినా, ఎంత ఆర్ద్రంగా ఆలపించినా, ఆమె లేని ఈ జగతి శూన్యం అని చాటినా -- వాస్తవానికి ఆమెకు దక్కుతున్న గౌరవమర్యాదలు అంతంత మాత్రమే అంటే ఒప్పుకోక తప్పదు.
    ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. సంపాదించి  తెచ్చిపెట్టేది పురుషుడే అయినా కుటుంబాన్నంతా సజావుగా నడిపించేది ఆడదే అనడం నిర్వివాదాంశం. ఏ అనారోగ్యంతోనో, ఏరోజైనా ఆమె పనిచేయలేని స్థితి వచ్చినప్పుడు ఇంటి పనులన్నీ ఎలా స్తంభించిపోతాయో తెలియని వారుంటారా? తన విలువ, ఆవశ్యకత ఎంతో అందరికీ తెలుసు. ఆమె సేవలు లేని నాడు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో తెలుసు. ఇల్లంతా ఎంత కంగాళీ అవుతుందో తెలుసు. అన్నీ తెలుసు! అయినా ఆమె విలువను  మాత్రం గుర్తించరు ! ఒప్పుకోరు !
        ఇంట్లో ఏమున్నా లేకపోయినా పొదుపుగా సంసారాన్ని నడపడంలో ఆమె సిద్ధహస్తురాలు. దేహం ఎంత సహకరించకపోయినా పనుల్ని  వాయిదా వేయక, పూర్తయ్యేదాకా బొంగరంలాగా   తిరుగుతూనే ఉండడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య! ఒంటిచేత్తో సర్వం చక్కబెట్టగల నేర్పరితనం ఆమె సొంతం.
     ఇవన్నీ ఎవరికి  తెలియవని? మళ్లీ మళ్లీ ఎందుకు రాయాలి? ఎందుకు గుర్తు చేయాలి? 
 --- ఎందుకంటే ఆమె సేవలు అడుగడుగునా  ఎంత అవసరమైనా,  ఆమె  స్థానం మాత్రం అట్టడుగునే ఉంటున్నది గనుక ! చెప్పాలంటే ఒకప్పటికంటే కూడా దిగజారింది ! దానికి ప్రత్యక్ష నిదర్శనాలు ---
 ఇవాళ మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, గృహహింసలు, దౌర్జన్యాలు, అవమానాలు, రక్షణ కరువైన వైనాలు ! చెప్పుకుంటూ పోతే ఎన్నో.. ఎన్నెన్నో !
    నిజమే ! స్త్రీవిద్య ప్రాముఖ్యత తెలుసుకున్నారు. ఒకప్పటి కంటే ఇప్పుడు స్త్రీల అక్షరాస్యత శాతం పెరిగింది. ఉన్నత చదువులు చదువుతున్నారు. ఉద్యోగాలూ  చేస్తున్నారు. అత్యంత కీలకమైన పదవులూ  నిర్వహిస్తున్నారు. అలాంటి వారి శాతం  మాత్రం బహు తక్కువే! ఎక్కడున్నా లింగవివక్ష మాత్రం ఎదుర్కొంటూనే ఉన్నారు. మహిళలంటే   చిన్న చూపు! ఎంతో శక్తి సామర్థ్యాలు, ఆత్మస్థైర్యం, పట్టుదల, ధైర్య సాహసాలు -- కలిగిన మహిళలే కీలక స్థానాల్లో రాణించగలుగుతున్నారు.    
     చాలా కుటుంబాల్లో స్త్రీ ఉద్యోగం చేస్తున్నా ఆమెకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉండడం లేదు. అంతేకాక ఇంటా బయటా బాధ్యతలు మోస్తూ వత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎందుకు చదివామా అని లోలోన  బాధపడేవాళ్ళూ ఉన్నారు. 
   ఆడపిల్ల చదువంటే అదనపు బరువు అని భావించే తల్లిదండ్రుల శాతం ప్రస్తుతకాలంలో తగ్గిపోయిందన్న మాట వాస్తవమే గానీ... పెళ్లిళ్లు చేయడానికీ, కట్నకానుకలివ్వడానికీ ఇబ్బంది పడ్తున్నవాళ్ళు ఎందరో !
    ఒకప్పుడు బాగా చదివి ఉద్యోగం చేస్తుంటే మంచి సంబంధాలు వస్తాయనీ, కట్న కానుకల ప్రసక్తి ఉండదనీ భావించేవారు. ఇప్పుడు పరిస్థితి తద్భిన్నంగా ఉంటోంది. చదువు ఎక్కువైన కొద్దీ కట్నాల రేటు కూడా పెరిగిపోతున్నందువల్ల ఇంత  చదువు ఎందుకు చదివించామురా దేవుడా అని తల్లిదండ్రులు బాధ పడుతున్న రోజులివి ! ఇది విడ్డూరమే ! 
   పెళ్లి చేసి పంపాక  కూడా అదనపు కట్నాల  గోల తప్పడం లేదు. అబ్బాయిలకు తగినంతగా అమ్మాయిల నిష్పత్తి ఉండడం లేదు అని వాపోతున్నారు  గానీ.. సమాజంలో ఆధిక్యత విషయంలో అబ్బాయిల దే  పైచేయి !!
    వరకట్న నిషేధం, నిర్భయ చట్టం... ఇంకా ఇలాంటి చట్టాలు ఆచరణలో స్త్రీ జాతికి ఎంతవరకూ తోడ్పడుతున్నాయో  ఆలోచించాలి. మహిళా దినోత్సవాలు ఎన్నో వస్తున్నాయి, పోతున్నాయి.. మళ్లీ మళ్లీ వస్తున్నాయి.. మహిళల అభ్యున్నతి కోసం స్త్రీలే కాదు.. పురుషులూ స్పందిస్తున్నారు. కానీ... మనుషుల ఆలోచనా సరళి, వైఖరి మారనంత వరకు కలిగే ప్రయోజనం శూన్యమే !!
                    ******************




     


No comments:

Post a Comment