Saturday, March 19, 2022

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే !...6... ఎంతెంత దూరం ఇంకెంత దూరం?

🌺
      "  ఎంతెంత దూరం? ఇంకెంత దూరం
        కథలు చెప్పుతూ పోతూ ఉంటే 
        కాసింత దూరం... "
-- చాలా ఏళ్ళ క్రితం వచ్చిన ఓ తెలుగు సినిమాలోని ఈ పాట అప్పట్లో ఎప్పుడూ తలపుకొస్తూ ఉండేది నాకు. ఎలాగంటే ---
 స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ వచ్చాక వెళ్లి జాయిన్ అయ్యానని చెప్పాను కదా,  అదో చిన్న పల్లెటూరు! హైవే నుండి లోపలికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకటే బస్సు! ఉదయం 7.30 కు ఒకసారి, మధ్యాహ్నం 3.30 కు ఒకసారి ఆ  ఊరికి వస్తూపోతూ ఉంటుంది. ఉదయం పూట బస్సు మిస్ అయితే మూడు కిలోమీటర్లు నడవాలి... తప్పదు! ఆటో సౌకర్యం అప్పట్లో ఆ ఊరికి లేదు. మధ్యాహ్నం 4.10 దాకా స్కూల్. బస్సేమో 3.30 కే వెళ్లిపోతుంది! ముందుగా స్కూల్ వదిలేయ లేము. రూల్స్ ఒప్పుకోవు. ఇంకేముంది! నడక తప్పనిసరి! ఆ విధంగా ఉదయం బస్  తప్పిపోయిన రోజు ఉదయం,  సాయంత్రం కలిపి మొత్తం ఆరు  కిలోమీటర్ల నడక! కాస్త దూరం అయితే ఓకే.... ఏదో ఒకటి రెండు రోజులు అయినా ఓకే... కానీ.. ఇలా ప్రతీ రోజు మైళ్ళ కొద్దీ నడవాలంటే ప్రాణం ఉసూరుమనేది. నేను H.M గా ఉన్నా గాబట్టి మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సి వచ్చేది. నాతో పాటు మొత్తం ఆరుగురం ఉపాధ్యాయులం. అందరం ఆడవాళ్లమే! 
    హైవే దాకా చేరుకుంటే కర్నూలు వెళ్లే బస్సులు గానీ, ఆటోలు గానీ వస్తాయి. 45 నిమిషాలు పట్టేది నడవడానికి. అరగంట సేపు ఏదో సరదాగా మాట్లాడుకుంటూ హుషారుగానే లాగించేసేవాళ్ళం. ఇక మిగిలిన 15 నిమిషాలు...ఉహూ !  కాళ్ళు మొరాయించేవి. ఎలాగోలా కాళ్ళీడ్చుకుంటూ ఎప్పుడెప్పుడు రోడ్డు ఎక్కుతామా దేవుడా... ఇంకా ఎంత దూరంరా  బాబు! అనుకుంటూ.. నిట్టూర్పులు విడుస్తూ... చెప్పొద్దూ.. నిజంగా మా తిప్పలు  దేవుడికే ఎరుక!
    రోడ్డెక్కాక 'అమ్మయ్య!' అనుకుంటూ గట్టిగా ఓ సారి గాలి పీల్చుకుని, అక్కడున్న చెట్ల కింద కూలబడి,  ఏ ఆటోనో, బస్సో రాక పోతుందా అని నిరీక్షిస్తూ ఉండేవాళ్ళం. ఆ శబ్దం వినబడగానే ప్రాణం లేచి వచ్చి పరుగున వెళ్లి ఎక్కి  కూర్చునేవాళ్ళం. 
   ఆ నిస్సహాయస్థితిలో కూరుకుపోయిన మేము విధిలేక ఒక్కోసారి కొన్ని సాహసకృత్యాలు కూడా చేసిన రోజులున్నాయి! అందులో ఒకటి -- పెద్ద పెద్ద బండరాళ్లను ట్రాలీ లో వేసుకుని పోతున్న ట్రాక్టర్లు ఎక్కేసి, ఆ బండ రాళ్ల మీద కూర్చుని ప్రయాణించడం ! అంతేనా ! లారీల్లోకి అతి  ప్రయాసపడి ఎక్కడం ! బొత్తిగా  అలవాటు లేని పనులు! ఏం చేస్తాం మరి !
    ఇంతగా అలసిపోయి ఇంటికెళ్తే --- ఆడవాళ్ళం  కదా, గడపలో అడుగుపెట్టగానే ముందు చీపురు కట్ట స్వాగతం ! ఆ పిమ్మట వంటింట్లో గరిటెలు ! అలసిన దేహం విశ్రాంతి కోరుకుంటున్నా ఎదురు చూస్తున్న పనులు అనుమతించవు కదా!అంతే!నడుం బిగించి లేని ఉత్సాహం తెచ్చుకుంటూ, నన్ను నేనే సముదాయించుకుంటూ  పనుల్లో చొరబడ్డం ! మళ్లీ వంటలు ! పిల్లలు, వాళ్ల ఆలనా పాలనా ! పెద్దల అవసరాలు! అష్టావధానమే! రాత్రి పొద్దుపోయాక ఏ పదకొండుకో పక్క మీద వాలితే, తెల్లవారుజామునే మళ్ళీ లేవాల్సి రావడం ! దినచర్య ప్రారంభం ! పిల్లల్ని రెడీ చేయడం తో పాటు నేనూ  రెడీ అవ్వడం! క్యారియర్లు  టిఫిన్ తో సహా సర్దేసుకుని హడావుడిగా బయటపడ్డం ! బస్ తప్పి  పోయిందంటే ఇంతే సంగతులు! మూడు కిలోమీటర్ల నడక ! సాయంత్రం ఎలాగూ తప్పదు మరోమూడు కిలో మీటర్లు !  😔 
    ఒక్కపూటైనా నడక బాధ తప్పించుకోవాలంటే ఉదయం త్వరగా తెమిలి బస్ స్టాప్ చేరుకోవాలి. ఉరుకులూ పరుగులు ! చెప్పొద్దూ,  జీవితంలో క్షణం తీరిక లేని అధ్యాయమది ! అయినా అంత హడావిడి లో,  రవంత  తీరిక కూడా దొరకని ఆ జీవనయానంలో ఏ మాత్రం విసుగన్నది లేకపోగా ఏదో తెలియని సంతోషం! సంతృప్తి! ఇంటాబయటా బరువు బాధ్యతలతో బంధింపబడినా ఏదో అనిర్వచనీయమైన ఆనందానుభూతి!
    ఇన్నేళ్లయినా,  ఇప్పటికీ ఆ రోజులు,  ఆ జ్ఞాపకాలు మదినిండా నిక్షిప్తమయే  ఉన్నాయి. ముఖ్యంగా సాయంత్రం ఇంటికి తిరుగుముఖం పడుతూ మా ఉపాధ్యాయురాళ్ళం అందరం మొదట్లో ప్రస్తావించిన ఆ పాట.....
" ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం? 
 అనుకుంటూ ఆపసోపాలు పడుతూ, జారిపోతున్న ఉత్సాహాన్ని బలవంతంగా కూడదీసుకుని శక్తి పుంజు కుంటూ సాగించిన ఆ 45 నిమిషాల నడక! అదెప్పటికీ మరిచిపోలేని మధురాతి మధురమైన జ్ఞాపకం నా జీవనయానంలో  !! 😊
                            🌷🌷🌷


   




2 comments:

  1. నా ఉద్యోగంలో నేను కూడా అప్పుడప్పుడు అలా లారీల సాహసకృత్యాలు, వేరే ఊరికి నడక చేశాను - కానీ మీ లాగా రోజుకి రెండుసార్లు చొప్పున ప్రతిరోజూ నడవడం కాదు లెండి.

    ఇప్పుడు అనుకునేదంతా గతజలసేతుబంధనమే అవుతుంది గానీండి నా అభిప్రాయంలో మీరు రెండు పనులు చేసి ఉండచ్చు. అయ్యేది అని చెప్పలేం అనుకోండి.
    (1). పొద్దున్న స్కూలు మొదలయ్యే వేళ ఒక గంట ముందుకు జరిపి, ఆ మేరకు సాయంత్రం స్కూలు మూసే వేళను అడ్జస్ట్ చెయ్యండని విద్యా శాఖలో పై అధికారులకు విన్నపం పెట్టుకోవడం (మీ స్కూలు అందరూ కలిసి).

    (2). సాయంత్రం ట్రిప్పు 3:30 కు బదులు 4:30 కు మార్చమని ఆర్టీసీ వారికి విజ్ఞప్తి పంపించడం (అందరూ కలిసి).

    వీటిల్లో ఏదో ఒక రాయి తగిలుండేదేమో? ప్రయత్నించలేదా?

    ReplyDelete
  2. మీరు సూచించిన వాటిల్లో మొదటిది-మాలాంటి పాఠశాలలే మండలంలో మరో రెండు మూడు ఉండేవి. ఒకరికి అనుమతిస్తే మిగతా వారూ అదే బాట పడతారన్న ఉద్దేశం తో అధికారులు అలాంటి వాటికి సుముఖంగా లేరని తెలిసి మిన్నకుండి పోయాము. రెండవది-టీచర్లమంతా RTC వాళ్ళను కలిసి సాయంత్రం సమయం మార్చమని రిక్వెస్ట్ చేశాము. ఆయన తప్పకుండా ప్రయత్నిస్తానన్నారు గానీ... అంతే సంగతులు..
    అలా రెండేళ్లు కష్టపడ్డాక..ఎడారిలో ఒయాసిస్సులా ఆ ఊరతను ఒకరు ఆటో తెచ్చుకుని నడపడం మొదలెట్టాడు. క్రమంగా కర్నూలు నుండీ ఆటోల రాకపోకలు మొదలయ్యాయి.అలా మా కష్టాలు గట్టెక్కాయి.
    Thank you very much for your comment sir.

    ReplyDelete