Tuesday, March 15, 2022

ఎవరు గొప్ప?... అన్నప్పుడు...

    నేను ప్రాథమిక పాఠశాల విద్యనభ్యసిస్తున్నప్పుడు ఐదవ తరగతి తెలుగు వాచకం లోని ఒక పాఠ్యాంశం నాకు బాగా గుర్తు. ఆ పాఠ్యాంశం పేరు 'ఎవరు గొప్ప?'
అప్పట్లో నాకు బాగా నచ్చిన పాఠమది !అదేమిటంటే--
  -- ఒకసారి మానవ శరీరంలోని అవయవాలన్నింటికీ మూకుమ్మడిగా జీర్ణాశయం ( పొట్ట ) మీద విపరీతమైన కోపం వచ్చేసింది. అంతే ! అవన్నీ సమావేశమై చర్చ మొదలెట్టాయి. ముందుగా --- తల మొదలెట్టింది.
" శరీరంలో నాకున్న ప్రత్యేకత ఎవరికుంది? నేనే లేకుంటే మనిషి ఉనికే లేదు. ఫలానా అతను, ఫలానా ఆమె అని గుర్తించాలంటే ముఖమే  కదా ఆధారం! నాలో ఉన్న కళ్ళు, ముక్కు, చెవులు, నోరు చేస్తున్న పనులు అన్నీ ఇన్నీ కావు. అవే  లేకుంటే మనిషి మనుగడే లేదు. అంతేనా! నాలో ఉన్న మెదడు లేకుండా తెలివి తేటలకూ, ఆలోచనలకూ తావేది? ఇంత చేస్తానా, ఈ పొట్ట  మాత్రం ఆవగింజంత పని లేకుండా తృప్తిగా తినేసి, హాయిగా నిద్దరోతుంది. అహర్నిశలూ కష్టపడేది మాత్రం మనం..."
 వెంటనే చేతులు అందుకున్నాయి....
"... మేం మాత్రం...! ఎంత చేయడం లేదు! చేతులు లేని జీవితం ఓ సారి ఊహించుకుంటే తెలుస్తుంది.! ఎన్ని పనులు! ఎన్ని పనులు! కాయకష్టం చేస్తాం, రాత పనులు చేస్తాం. ఇంకా అతి క్లిష్టమైనది... వంటింట్లో వంటా వార్పు! మేం లేకుంటే ఇంటిల్లిపాదీ పస్తే కదా! అంత చేస్తామా! అంతటితో అయిపోతుందా! పళ్లెంలో అన్నీ సర్ది, కలిపి నోటికి అందించేదీ  మేమే!..ఈ పొట్ట అంతా మింగేసి గుర్రు పెట్టి ఎంచక్కా  బబ్బుంటుంది. రెండ్రోజులు తిండి లేకపోతే తెలుస్తుంది దీనికి.... "
మధ్యలో అడ్డుకున్నాయి కాళ్ళు... 
"...సరిసర్లే.. చెప్పొచ్చావు మాబాగా.. అసలు కాళ్లనేవి లేకుంటే వంటింటి దాకా చేతుల్తో పాకుతూ పోయి చేస్తావా వంట?  ఈ శరీరం అంగుళం జరగాలన్నా మేం  లేకుండా అయ్యేపనేనా !ఏ పని ఎవరు చేయాలన్నా కాళ్ళు కదలాల్సిందే కదా ! సరే, మీమాట మాత్రం ఎందుకు కాదనాలి? మనమంతా  ఇంత చేస్తున్నాము, నిజమే. కానీ ఈ పొట్ట ఏంచేస్తోంది? కదలదు, మెదలదు... తేరగా తినడం, పనీపాటా అన్నది లేక పొద్దంతా విశ్రాంతే విశ్రాంతి.. !.."
--- ఇలా అన్నీ పొట్ట మీద ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అలుపొచ్చేదాకా చేశాక...  ఆఖరికి అన్నీ కలిసి ఓ తీర్మానం చేసేశాయి. 
" ఈ పొట్టకెలాగైనా బుద్ధి చెప్పాలి. అప్పుడు తెలుస్తుంది మన తడాఖా, మన విలువ దానికి.."
   అనుకున్నదే తడవుగా అన్ని అవయవాలు సరే అంటే సరే అనుకొని ఆ క్షణం నుండే నిర్ణయాన్ని అమలులో పెట్టేశాయి. అంతే! ఒక్కుమ్మడిగా కాళ్లు, చేతులు, తల అన్నీ  పనులు మానేశాయి
  ఇంకేముంది? నోటికి ఆహారం బొత్తిగా అందడం లేదు. ఫలితంగా... పొట్ట లో ఏమీ  పడడం లేదు. ఒకరోజు గడిచింది. రెండో రోజూ  మొదలైంది. మెల్లి మెల్లిగా ఏమిటో తెలియని నీరసం ! కాళ్లు లాగడం మొదలెట్టాయి. చేతులు నీళ్ల గ్లాసు అందుకోవడానికి కూడా సహకరించడం లేదు. తలలో అయితే.. ఏదో చెప్పలేని కలవరం ! కళ్ళు తిరగడంతో పాటు మెదడంతా సన్నగా అలజడి ! మూడు రోజులు గడిచాయి. శరీరం నిస్సత్తువగా మంచం మీద వాలిపోయింది ! కదలడానికి కూడా శక్తి కరువైంది. ఎందుకో అర్థం కాక అన్నీ డీలా పడిపోయి, కారణాలు అన్వేషించ సాగాయి. ఎందుకో  అనుమానం వచ్చి, పొట్ట కేసి చూశాయి. ఎప్పుడూ ఉబ్బెత్తుగా ఉండేది కాస్తా లోతుకు పోయి ఉంది. అయినా, వాటిని చూసి  పకపకా నవ్వింది పొట్ట ! అవన్నీ విస్తుబోతుండగా ---
" అన్నీ మీరు అందిస్తుంటే నేను తిని కూర్చుంటున్నానా ! హాయిగా నిద్దరోతున్నానా? ఎంతటి  అవగాహనారాహిత్యం మీది! మీరు ఇస్తున్న ఘన ఆహారాన్ని జీర్ణం చేసి, ద్రవ  రూపానికి మార్చి, అందులోని పోషకాల్ని శరీరానికంతటికీ రక్త నాళాల ద్వారా అందజేస్తున్నది ఎవరనుకుంటున్నారు? అలా అందుతున్న పోషకాలతోనే మీరంతా ఆరోగ్యంగా, హుషారుగా, ఉత్సాహంగా పని చేస్తున్నారు. సక్రమంగా ఆలోచించగలుగుతూ,  శరీరం సజావుగా నడిచేందుకు దోహదం చేస్తున్నది జీర్ణాశయం అన్న సంగతి ఏమాత్రం  స్ఫురణకు రాక   నన్ను చాలా  తేలిగ్గా అంచనా వేసి, అవహేళన చేశారు. కేవలం ఆహారాన్ని నాకందిస్తున్నామనే తలచారు గానీ, ఆ పిమ్మట జరిగే ప్రక్రియ గురించి ఎంత మాత్రమూ మీకు తట్టలేదు. ఇప్పుడు తెలిసిందా, నేను లేకుంటే మీ పరిస్థితి ఏమిటో ?..."
 తెల్లబోయి చూస్తున్న వాటితో ఇంకా ఇలా అంది, 
".... అసలు ఎవరు గొప్ప అన్న ప్రశ్నే అనవసరం. ఎవరి ప్రత్యేకత వారిదే. అంతా ఒకరిపై ఒకరు ఆధారపడ్డ వాళ్ళమే. మీరు అనుకుంటున్నదీ  నిజమే! మీరు అందిస్తున్న ఆహారంతోనే నేనూ  పని చేయగలుగుతున్నాను. వాస్తవానికి ఈ మూడు రోజులూ నేనూ  అవస్థపడ్డాను. మీరు లేకుంటే నేను లేను. కానీ, నేనే గొప్ప అనుకోవడమే పొరపాటు అంటున్నాను..."
 ఆ మాటలతో ఒక్కసారిగా జ్ఞానోదయమైన అవయవాలన్నీ సిగ్గుతో  కుంచించుకుపోయి, మౌనముద్ర వహించాయి. 
 😊 నిజంగా నిజమే కదా ! శరీరంలో ప్రతీ  అవయవం ప్రత్యేకమైనదే. చేతులు లేని జీవితం ఊహించలేం!
" సర్వేంద్రియానాం నయనం ప్రధానం!" అంటారు.కానీ, కళ్ళు ఉండి, కాళ్లు లేకపోతేనో !అమ్మో ! చెవులు వినిపించకపోతే చుట్టూ  ప్రపంచమే మూగవోదా ! కాబట్టి, దేన్నీ తేలిగ్గా తీసిపారేయరాదన్నది  నగ్నసత్యం!
  😊  ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం చదువుకున్న పాఠ్యాంశం! ఇప్పటికీ మదిలో నిలిచిపోయింది ! అప్పట్లోపెద్దగా తెలీలేదు గానీ... పెరిగేకొద్దీ అందులోని నీతి బాగా బోధపడింది. 
🌷" ఎవరినీ తక్కువగా అంచనా వేయరాదనీ, ఎవరి శక్తి సామర్థ్యాలనూ కించపరచరాదనీ ఇంకా... నేనే గొప్ప అన్న దురభిప్రాయపు భావన మదిలోకి చొర బడకుండా జాగ్రత్త వహించాలనీ.... "🌷
🌺   --- ఇదంతా ఒక ఎత్తయితే... దీనికి మరో కోణం కూడా ఉందని ఈ సందర్భంగా చెప్పకతప్పదు.  అన్ని అవయవాలూ సక్రమంగా ఉంటేనే మనుగడ సజావుగా ఉంటుందనుకున్నాం ఇంతవరకూ. కానీ... కాళ్లు లేకపోయినా, చేతులు లేకపోయినా ఆఖరికి కళ్లు లేకపోయినా... పట్టుదలతో శ్రమించి  దీక్షతో, ఎంతో సాధించిన వాళ్లూ, సాధిస్తూన్నవాళ్లూ ఎందరో మన చుట్టూ ఉన్నారు. అది వేరే సంగతి ! వారందరికీ ప్రత్యేక అభినందనలు 💐 🙏👌
                         

                           


            











 

No comments:

Post a Comment