Wednesday, January 19, 2022

షూరిటీ.... !

     లంచ్ బ్రేక్ బెల్ మోగింది. నీరసంగా స్టాఫ్ రూమ్ లో అడుగు పెట్టి అన్యమనస్కంగానే  లంచ్ బాక్స్ ఓపెన్ చేసింది ప్రసూన.  ఏదో తింటోందన్న మాటే   గానీ ఆమె మనసంతా గజిబిజిగా, అల్లకల్లోలంగా తయారై ఇంకా విపరీతమైన ఆందోళన తో నిండిపోయిఉంది. దానికి కారణం గంట క్రితం వచ్చిన ఫోన్ కాల్!
       " హలో, ప్రసూనాంబ గారేనా? "
       " అవును, మీరెవరు..? "
       "... ఎనిమిది  నెలల క్రితం సుబ్బరాయుడు అనే వ్యక్తి మా బ్యాంకులో లోన్ తీసుకున్నారు. మీరు అతనికి షూరిటీ ఇచ్చారు..."
 అలా ఓ నిముషం పాటు మాట్లాడి  పెట్టేసాడతను. విషయం బోధపడే సరికి ప్రసూన మెదడు కాసేపు మొద్దుబారిపోయింది.
    నిజమే. ఎనిమిది  నెలల క్రితం గతంలో తాను పనిచేసిన స్కూల్లో క్లర్కుగా పని చేసిన సుబ్బారాయుడు తన ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడు. అత్యవసరంగా డబ్బు అవసరం పడి పాతిక వేలు లోను తీసుకుంటున్నాననీ, దానికి షూరిటీ సంతకం కావాలనీ, మీరు సంతకం పెడితే లోను శాంక్షన్  అవుతుందనీ ప్రాధేయపడ్డాడు. ఒక చోట కలిసి కొంతకాలం పని చేసిన వాడు అయినందున మొహమాటంతో సరేనని సంతకం పెట్టేసింది తను. ఆ తర్వాత ఆ విషయం దాదాపు మర్చిపోయింది. ఇప్పుడీ  ఫోన్ కాల్! 
    అతను రెండు నెలలుగా లోన్ ఇన్స్టాల్మెంట్ కట్టడం లేదని, అందువల్ల పై నెలలో మీ శాలరీ నుండి కట్ చేస్తామని హెచ్చరించాడు ఇందాక  బ్యాంక్ అతను! అంటే, అతను తీసుకున్న లోన్ చెల్లించడం లేదన్నమాట !
   హతాశురాలైంది ప్రసూన ! నమ్మి ఏదో సహాయపడితే ఇలా చేశాడేంటి? తలపట్టుకుంది. వెంటనే స్ఫురించి సుబ్బరాయుడు కి ఫోన్ చేసింది. కాని రెస్పాన్స్ లేదు. మళ్లీ మళ్లీ చేసింది. లాభం లేదు. అదీ  ప్రస్తుతం ఆమె పరిస్థితి ! దిక్కుతోచని స్థితిలో సాయంత్రం దిగాలుగా ఇంటికి బయలుదేరుతుండగా ఫోన్ రింగ్ అయింది. సుబ్బారాయుడు ! వెంటనే ఎత్తి, గాభరాగా  విషయం చెప్పేసింది.
" మేడమ్, మీరేమీ టెన్షన్ అవ్వద్దు. కాస్త ఇబ్బందిగా ఉండి కట్టలేకపోయాను. ఈ నెల అంతా కట్టేస్తాను..."
 కూల్ గా జవాబిచ్చాడతను. అలా అన్నాడు గానీ మాట నిలబెట్టుకోలేదని మరుసటి నెల జీతం లో కట్ అయిన  అమౌంట్ చూసేసరికి తెలిసొచ్చింది ప్రసూనకు. అంతే, ఆమె  లో సహనం నశించింది.
" మేడం, నేనేమైనా అప్పు ఎగ్గొట్టే  వాడిలా కన్పిస్తున్నానా? కట్ చేసిన మీ డబ్బు త్వరలోనే తెచ్చి మీకు ఇచ్చేస్తాను. కాస్త ఓపిక పట్టండి..."
   ఫోన్ చేసి' ఏంటిది' అని అడిగితే అతనిచ్చిన జవాబది ! సంతకం కోసం ఇంటికి వచ్చినప్పుడు అతని మాట తీరు, ప్రవర్తన గుర్తొచ్చింది ప్రసూన కు. ఎంత వినయంగా అభ్యర్థించాడు ! మరి ఇప్పుడు ! అతని స్వరం లో తేడా కొట్టొచ్చినట్టు వినిపించింది. అవసరం తీరిపోయింది కదా మరి ! ఖర్మ ! ఏం చేస్తాం! అనుకుంటూ తనకు తానే సర్ది చెప్పుకుంది.
   మరో రెన్నెళ్లు  గడిచాక ఆ సంగతి బుర్రలోంచి పక్కకు నెట్టేసింది బలవంతాన. నాలుగైదు నెలల తర్వాత ఆ  సుబ్బారాయుడనే అతను కట్ అయిన డబ్బయితే తెచ్చిచ్చాడు ప్రసూన కు,  కానీ ఈ మధ్యకాలంలో ఆమె పడిన మానసిక వ్యధ సంగతేంటి? ఆ అనుభవం ఓ గుణపాఠమై, ఇకపై ఎవరికీ షూరిటీ లన్నవి ఇవ్వరాదని దృఢంగా నిశ్చయించేసుకుంది ప్రసూన !
--- ప్రసూన లానే ఇలా చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. నా సర్వీసులో నలుగురైదుగురికి ఈ  షూరిటీ లన్నవి ఇచ్చి  ఉంటాను.అందులో ఒకాయన సరిగ్గా సుబ్బారాయుడిలాగే ప్రవర్తించాడు. మరో కొలీగ్ ఒకావిడ షూరిటీ కోసం అడిగింది. కొలీగ్ కదా అనుకుని సంతకం పెట్టేశాను. పెట్టాక, నోరూరుకోక, 
" ఈ షూరిటీ లెందుకు? ఒకవేళ మీరు లోన్ కట్టకపోతే నా శాలరీ నుండి కట్ చేస్తారా? "
అని ఏదో మాటవరసకి ఠక్కున అడిగేశాను.  అంతే. ఆవిడకి కోపం వచ్చేసింది. చిత్రమేమిటంటే ఆ రోజు వరకు బాగా మాట్లాడే ఆవిడ సడన్ గా నాతో మాటలు తగ్గించేసి ముభావంగా మారిపోయింది. "ఇదేం ఖర్మ రా బాబు! షూరిటీ ఇచ్చి చెడ్డయిపోయానా" అనుకుని  బాధపడ్డం నా వంతయ్యింది. 
    ఇదంతా ఎందుకు రాయాలనిపించిందంటే  ---
 ఇటీవల న్యూస్ పేపర్ లో దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారన్న ఓ వార్త ! తమ వాటా దారునికి షూరిటీ సంతకం చేసి, ఆ వాటాదారు తీసుకున్న లోను చెల్లించకపోతే వీళ్ళ ఆస్తులు జప్తు చేశారట! అయినా అప్పు తీరక, మూడు కోట్ల ఆ అప్పు  తీర్చే దారి లేక ఆ దంపతులిద్దరూ దిక్కుతోచక ఆత్మహత్యకు పాల్పడ్డారన్న  ఉదంతం చదివి మనసంతా వికలమై పోయింది. అప్పు తీసుకున్న వాళ్లకు మనస్సాక్షి అన్నదుంటే ఇలా ప్రవర్తిస్తారా? మంచికి పోతే చెడు ఎదురైనట్లు ఏమిటీ విపరీతాలు !
    ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతుంటాయి. అలాంటప్పుడు షూరిటీ ఇచ్చినవాళ్ళ మానసిక వేదన మాటలకందనిది ! అలాగే అవసరమంటూ అప్పు తీసుకొని తిరిగి తీర్చాలన్న ధ్యాస లేకపోగా, అసలు ఆ ఊసే ఎత్తని మహానుభావులకూ కొదవేమీ లేదు  మన చుట్టూ ఉన్న సమాజంలో ! అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలనిపిస్తుంది ఇలాంటి వారి విషయంలో.
    పరులకు ఉపకారం చేయాలనుకునే ఆలోచన మంచిదే. అవతల వారికి కూడా మోసం చేయాలన్న దురాలోచన కూడా లేకపోవచ్చు. కానీ పరిస్థితులు అనుకూలించక వాళ్ళు నిజంగానే కట్టలేని దుస్థితి వాళ్లకి వస్తే, మేలు చేసిన వారి సంగతేమిటి? ఇలాంటి సందర్భాల్లో స్నేహ సంబంధాలు, బంధుత్వాలు చెడి  పోయే ప్రమాదమూ ఎంతగానో ఉంటుంది.
   అందరూ ఇలాగే ఉంటారని చెప్పడం నా ఉద్దేశం ఎంత మాత్రమూ   కాదు. కానీ ఏ ఒక్కరు పైన  చెప్పిన విధంగా ప్రవర్తించినా షూరిటీ  ఇచ్చిన వాళ్లకు ఇబ్బందే కదా! 
        ఏది ఏమైనా, అత్యంత ఆప్తులకూ, ఎంతో నమ్మకస్తులైన సన్నిహితులకు తప్ప వేరెవరికైనా షూరిటీ ఇచ్చే విషయంలో బాగా ఆలోచించి అడుగేయాల్సి  ఉంటుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏముంటుంది గనుక !!

     ********************************






No comments:

Post a Comment