Monday, January 3, 2022

అసలైన జీవితం...?

     చాలా  సినిమాలు నాయికా నాయకుల పెళ్లవడం తో ముగుస్తాయి. కానీ ప్రతి వారి జీవితం ప్రారంభమయ్యేది అప్పటి నుంచే కదా!
      చెప్పాలంటే కన్ను తెరిచినప్పటినుంచి కన్ను మూసే వరకు మనిషి జీవనయానాన్ని నాలుగు అధ్యాయాలుగా విభజించవచ్చని నా అభిప్రాయం.
🌺 పుట్టినప్పటినుంచీ పెళ్ళయ్యే వరకు మొదటి అధ్యాయం గా చెప్పుకోవచ్చు. ఇది 90 శాతం మందికి ఆహ్లాదకరం గానే ఉంటుంది.
🌺    పెళ్లి తర్వాత మొదలయ్యే అధ్యాయం కొంతవరకూ  ఆనందంగానే సాగుతుంది.పిల్లలు, వాళ్ల పెంపకం, విద్యాబుద్ధులు నేర్పించడం, వాళ్ళ బాగోగులు, కోరికలు  తీర్చడం.. ఇలాంటి బరువు బాధ్యతలతో ఒకింత భారంగానే గడిచినా అందులో ఏదో అనిర్వచనీయమైన సంతోషం,  సంతృప్తి నిగూఢంగా ఉంటాయి కాబట్టి అదీ ఓ. కే. 
🌺   ఇక మూడోది.. పిల్లల పెళ్లిళ్లు, వాళ్ళను  జీవితంలో స్థిరపరచడం ! అదీ తీయనైన బాధ్యతే! కాబట్టి విసుగనిపించక లాగించేస్తారంతా. 
🌺   ఆ తర్వాత మొదలయ్యేదే నాలుగో అధ్యాయం. పిల్లలంతా  సెటిల్ అయిపోయారు అనుకొని ఓ నిట్టూర్పు విడిచి ఇక నిశ్చింతగా ఉండొచ్చు అనుకుంటున్న తరుణంలో... మొదలవుతుంది అసలైన ఈ అధ్యాయం! అదే చివరి అధ్యాయం కూడా అనుకోవచ్చు ! మెల్లిమెల్లిగా ఏదో కోల్పోతున్న భావన! ముదిమి మీద పడుతూ చుట్టుముడుతూ పలకరించే అనారోగ్య సమస్యలు! అది చాలదన్నట్టు మునుపెన్నడూ ఎరుగని రకరకాల కొత్త అనుభవాలు!
🌺 ఓసారి ఇలా చూద్దాం.... 

* సాంబశివరావు, పరమేశ్వరి దంపతులకు నలుగురు పిల్లలు. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. చాలీచాలని జీతం అయినా నలుగురినీ ఏ లోటూ లేకుండా పెంచి, విద్యాబుద్ధులు చెప్పించి, చక్కగా  పెళ్లిళ్లు జరిపించి స్థిరపడేలా చేశారిద్దరూ. వాళ్ల నీడలో, ఆదరణలో శేషజీవితం హాయిగా గడపొచ్చులే అనుకున్నవాళ్ళ ఆశ అడియాశ  కావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఓ కొడుకు, కూతురు అమెరికాలో స్థిరపడ్డారు. మరో కొడుకు, కూతురు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాల్లో ఇరుక్కుపోయారు. వీళ్ళు అక్కడికి వెళ్లి ఉండలేరు. వాళ్లు వీళ్ల వద్దకు వచ్చి ఉండలేని పరిస్థితి! డెబ్భై  సమీపిస్తున్న వృద్ధాప్యంలో ఎప్పుడు ఏ అవసరం ముంచుకొస్తుందో అన్న భీతితో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న వాళ్లలో ప్రస్తుతం ఏదేని వృద్ధాశ్రమంలో చేరితే బాగుంటుందన్న ఆలోచనలు చోటుచేసుకుంటున్నాయి. పిల్లలు పసివాళ్లుగా  ఉన్నప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డా ఏ దిగులు ఉండేది కాదు వాళ్ళకి. పెళ్లిళ్లు  చేసేటప్పుడూ ఇబ్బంది పడలేదు. అలా అన్నింటినీ ధైర్యంగా ఎదురీదిన వాళ్లు ఇప్పుడు బెంబేలు పడుతూ కాలం గడుపుతున్నారు. ఇప్పుడైతే చేతినిండా డబ్బు ఉంది కానీ.... ఎవరైనా వాళ్లను కదిపితే  చాలు.. 
" అసలైన జీవితం ఇప్పుడే మొదలైంది మాకు.. "
 అంటూ వాపోతారు అందరితో!

*   జగన్నాథం, శారదాంబల పరిస్థితీ  దాదాపు ఇదే. కాకపోతే మరో రకంగా ఉంటుందది ! ఇద్దరు కొడుకులూ, కోడళ్లు బాగానే చూసుకుంటున్నట్టే ఉంటారు. కానీ వీళ్ళ మాట ఎంత మాత్రం సాగనీయరు. కొడుకుల పెళ్లిళ్లయే  వరకు ఏకఛత్రాధిపత్యంగా సాగిన ఇంటి పెత్తనం కోడళ్ల రాకతో ఉన్నట్టుండి వాళ్ల చేతిలోకి ' ట్రాన్స్ ఫర్ ' అయిపోయేసరికి వాళ్ల పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైయిపోయి, దయనీయంగా  తయారయింది. పోనీ... విడిగా ఉందామా అంటే కొడుకులు ఒప్పుకోరు. నలుగురూ ఏమంటారంటూ తీసి పారేస్తారు. కలిసుండే సర్దుకుపోదాంలే   అనుకుంటే.. అనుక్షణం  ఆత్మా భిమానం, అహం దెబ్బతింటూ, మింగలేక కక్కలేక అన్నట్టుంది ఇద్దరికీ ! ప్రస్తుతం  వాళ్లదీ అదే మాట.. అదే వేదన...
" అసలైన జీవితం ఇప్పుడే మొదలైంది మాకు..." అని!

*   కృష్ణమూర్తి, సునంద లది ప్రేమ వివాహం. అటూ ఇటూ పెద్దలు ఒప్పుకోకపోయినా ఖాతరు  చేయలేదు ఇద్దరూ. పెళ్ళయ్యాక వాళ్లే దిగి వస్తారులే అనుకున్నారు గానీ అది  జరక్కపోగా మరింత దూరమైపోయారు. బాధపడ్డా క్రమంగా అలవాటు పడిపోయారిద్దరూ. కాలం గడిచే కొద్దీ సంతానలేమి సమస్యా తోడైంది. దాంతో ఒకరికొకరు వాళ్లే ప్రపంచంగా  మారిపోయారు! ముఖ్యంగా కృష్ణమూర్తి భార్య తోడు లేకుండా ఏ చిన్న పనీ  చేసుకోలేని అశక్తుడుగా మారిపోయాడు ! కాలగమనంలో సునంద కన్నుమూసింది. కృష్ణమూర్తి ఒంటరిగా మిగిలిపోయాడు. భార్య ఉండగా కూర్చున్న చోటికే అన్నీ వచ్చి చేరేవి. మరి ఇప్పుడు...? శూన్యంలో ఉన్నట్టు అనిపిస్తోందతనికి. మొదట్నుంచీ  బయటికెళ్ళి నలుగురితో కాలక్షేపం చేయలేని అంతర్ముఖుడతడాయె ! నాలుగు గోడల మధ్య భరించలేని ఒంటరితనం. మరోవైపు అనుక్షణం వెంటాడుతూ భార్య స్మృతులు !!
 'జీవితం అంతా ఒక ఎత్తు.. ఈ చివరి దశ ఒక ఎత్తు.'
 --అనిపిస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడతను ప్రస్తుతం!
--- ఇలా రక రకాలైన సమస్యలతో చివరిదశ ఎదుర్కొనే జీవితాలు  చాలానే ఉంటాయి. యవ్వన ప్రాయంలో, నడివయసులో ఎంత తీవ్రత నైనా ఎదుర్కొనే ఇంకా   భరించే శక్తి సామర్థ్యాలు ఉంటాయి మనిషికి. మరి ఈ అవసానదశలో...? 
   సంపాదన లేని కొడుకుల్ని విధిలేక పోషించే తండ్రులు, పెళ్లిళ్లయినా కుదుట పడని  సంసారాల్తో భారంగా మారిన పిల్లలు... ఇంకా ఎన్నోరకాలుగా డెబ్భై సమీపిస్తున్నా తీరని బాధ్యతలతో కుంగిపోతూ.. తపిస్తూ... ప్రశాంతతను కోల్పోతున్న వారెందరో !!వారందరిదీ ఇదే మాట..
" అసలైన జీవితం ఇదే నేమో...!"

                         ***********











No comments:

Post a Comment