Friday, September 4, 2020

ఆనందభాష్పాలు

 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా  ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని తన అంతరంగం ఇలా నివేదిస్తోంది. 

 గణగణమంటూ మ్రోగింది బడిగంట...
 బిలబిలమంటూ బుజ్జాయిలు 
 పరుగులుతీస్తూ  కొలువుదీరిరి నా ముంగిట !
 కల్మషమెరుగని ఆ కిలకిల నవ్వులు 
 మిలమిల మెరిసే ఆ కళ్ళలో కాంతులు
 గుసగుసగా చెప్పేవప్పుడు ఎన్నెన్నో ఊసులు 
 అవన్నీ ఆ చిన్నారుల 'రేపటి కలలు' !
 అవి నిజాలై ఎదుట నిలిచిన క్షణాలు...
 నేను మరిచిపోలేని ఆ మధురస్మృతులు..
 వివరిస్తా వింటారా మరి ఆ ముచ్చట్లు...
 నా మధురానుభూతుల మువ్వలసవ్వడులు !!

 రెండు దశాబ్దాల క్రితం....
 ఐదేళ్లు నిండిన ఓ బుడతడు
 బుడి బుడి అడుగులతో నా దరిజేరాడు...
 బుంగమూతి పెట్టి బలపం నా చేతికిచ్చాడు 
 పలక చేతబట్టి పలికించినవన్నీ నేర్చాడు !
 ఈనాడు...
 ఆజానుబాహుడై అందలాలెక్కి 
 నాముందు మోకరిల్లి..అన్నాడిలా...
 అ ఆ లు దిద్దించిన మా పంతులమ్మ 
 అపురూపం నాకెంతో అంటున్నా..నిజమమ్మ !
 వేలు పట్టి నడిపించిన చేతులమ్మ నీవి...
 చేతులెత్తి నమస్సుమాంజలులు 
 అర్పిస్తున్నా గైకొనుమమ్మా !🌷💐🌷

 కుర్చీలో నేను కూర్చున్న వేళ 
 సడిసేయక చెంత కూర్చుండి 
 నా చీర కుచ్చిళ్ళు సవరిస్తూ 
 కొంటెగ నవ్విన ఓ అల్లరి పిల్ల !
 ముద్దుముద్దుగా మురిపాలు పంచిన 
 చిలుకపలుకుల ఆ చిన్నారి బాల !
 నేడు...
 నేను తలెత్తుకునేలా..ఓ అధికారిణిగా 
 ఇంతెత్తు ఎదిగి..అయినా...
 నా ముందు ఒదిగి..అన్నది కదా...
 ఎందరెందరో పాఠాలు చెప్పారు.. 
 ఎంతెంతో విజ్ఞానాన్నందించారు.. 
 అందనంత ఎత్తులో నను నిలిపారు... 
 నా మొదటి గురువునైతే   
 మరిపించలేకపోయారు...
 నా మదిలో చెరగని ముద్ర నీవే...!
 అంజలి గైకొనుమమ్మ ! అంటూ 
 కరములు రెండూ జోడించి ప్రణమిల్లింది...

 మరువగలనా కలనైన..మరుగునపడునా.. 
 ఆనాటి జ్ఞాపకాల దొంతర.. మాసిపోగలవా..
 ఆతెరపై తలుపులు తట్టే తలపుల 
 ప్రతిబింబాలు..అవి అందించిన 
 మధురానుభూతుల ప్రతిస్పందనలు...
 వేలెడంత విద్యార్థులు వయోజనులై
 ప్రయోజకులై..ఎదుట నిలిచిన ఆక్షణాల్లో...
 కనురెప్పల మాటున తొణికిన నీటితెర..!
 మాటరాక మూగవోయిన నా మదికి తెలుసు
 అవి ఆనందభాష్పాలని...
 అనిర్వచనీయ అనుభూతికి చిహ్నాలని...!
 నా మౌనం వెనక దాగిన వెలిబుచ్చలేని
 ఆప్యాయతకు అద్దం పట్టే సంకేతాలని !! 
_____________________________________________

 [ ప్రతీ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుడు వారి జీవిత గమనంలో ఎక్కడో ఓచోట, ఏదో ఓ నోట తప్పక వినే అభిమానపు పలకరింపు...ఆ ప్రతిస్పందన..! ప్రతీ టీచర్ కు  ఎదురయ్యే అనుభవమే..ఆ 'పలకరింపు' ఖచ్చితంగా ఒకనాటి మీ విద్యార్థిదే. ఆ గౌరవం, ఆ గుర్తింపు..కేవలం మీకు మాత్రమే..ఔనా.]

                మంత్రులకూ, మాన్యులకూ, 
                వైద్యులకూ, వయోవృద్ధులకూ 
                ఆర్యులకూ, అధిపతులకూ 
                అందని అరుదైన గౌరవం 
                ఉపాధ్యాయులకే సొంతం ! 🙏 
_____________________________________________

🌹🌺🌷🌹🌺🌷🌹🌺🌷🌹🌺🌷🌹🌷🌹🌺

3 comments:

  1. Yes today I wished my teacher she give me wonderful gift that is photo graphs of almost all of my teachers in the form of video.Teachers always gives something to their students in their entire life.As a student I always learn from my teachers something even though I am a lecturer.

    ReplyDelete