🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
" గురుబ్రహ్మ గురువిష్ణు
గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ
తస్మైశ్రీ గురవేనమః "
---చదువు చెప్పే గురువులను సాక్షాత్తూ దైవ స్వరూపులుగా భావించాలనీ, అంతటి అత్యున్నత స్థానాన్ని వారికి ఇవ్వాలనీ ఆది నుండీ చెప్పబడుతోంది.
మాతృదేవోభవ..
పితృదేవోభవ..
ఆచార్యదేవోభవ..
అంటారు...కానీ..ప్రస్తుత కాలంలో ఉపాధ్యాయులు అలా నీరాజనాలందుకుంటున్నారా !!?
కొద్ది నెలల క్రితం ఓ దినపత్రికలో ఓ వార్త చదివాక మనసంతా కలచివేసినట్లయింది. కేరళలోని ఓ కళాశాలలో ఓ అంధ అధ్యాపకునికి అతని తరగతిలోని విద్యార్థుల వల్ల జరిగిన అవమానమది ! అదే కళాశాలలో చదువుకున్న ఆయన చూపు లేకున్నా...ఎంతో శ్రమించి అదే కళాశాలలో అధ్యాపక స్థాయికి ఎదిగినాడు. ఎంతటి జ్ఞాన సంపన్నుడై ఉంటాడో ఊహించుకోవచ్చు ! కానీ అతని క్లాస్ లోని విద్యార్థులకు మాత్రం అతని మేధస్సు కనిపించలేదు. ఆయన పాఠం చెబుతుంటే..చుట్టూ చేరి, అవహేళన చేస్తూ, దృష్టిలోపాన్ని ప్రస్తావిస్తూ ఆట పట్టిస్తూ అవమానించారట ! అది చాలక...అదేదో ఘనకార్యం చేశాం చూడండీ అన్నట్లు వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టారట !! వింటుంటేనే...జుగుప్స కలిగే అతి హేయమైన చర్య కాదా ఇది ! ఆ విద్యార్థులను తరువాత...కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసిందట...అది వేరే విషయం..
గంటసేపు బోధనకై నేను రెండు గంటల పాటు ప్రిపేర్ అయి, క్లాసుకి వెళ్తే జరిగింది ఇది...అని వాపోయాడట ఆ అధ్యాపకుడు ! ఇంకా... ఆ విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తినకూడదన్న ఉద్దేశంతో కళాశాల పరిధిలోనే సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నట్లు తెలియజేశాడట !!
ఇది అధ్యాపకుని ఔదార్యం కావచ్చు ! కానీ.... చెప్పాలంటే..ఆ వికృత చేష్టల వల్ల ఆయనకి పోయిందేమీ లేదు.. ఆ సంస్కారహీనులు వారి అజ్ఞానం, అవివేకం,అనైతికత...బాహాటంగా చాటుకోవడం తప్ప! అయినా వారేమీ పసిపిల్లలు కాదే! కళాశాల స్థాయి యువకులే !!
ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితం 'గుంజీలు తీసిన గురువు' అన్న హెడ్డింగ్ తో దినపత్రికల్లో వచ్చిన వార్త, దానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఓ వీడియో విద్యావర్గాల్లో చర్చకు దారి తీసింది.
ఎంత చెప్పినా తన పాఠశాలలోని విద్యార్థుల ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు అన్నది రావడం లేదని ఆవేదన చెందుతూ, వారి ఎదుట సాష్టాంగప్రణామం చేసి, గుంజీలు తీస్తూ తనకు తానే శిక్ష వేసుకున్న ప్రధానోపాధ్యాయుని ఉదంతమిది. విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పెంట ZP ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటన ఇది. చదువు అందరికీ ఒకేలా అబ్బకపోవచ్చు, కానీ సత్ప్రవర్తన అన్నది అందరికీ రావాలి కదా అన్నది వారి ప్రశ్న..! వారి ఆవేదనలో అర్థం ఉన్నది..
చాలా సంవత్సరాల క్రితం...కొన్ని సినిమాల్లో దర్శకులు అధ్యాపకులను, ప్రిన్సిపాళ్లను బఫూన్లుగా, కమెడియన్లుగా చూపించిన వైనం అందరికీ విదితమే.తద్వారా తామేదో హాస్యాన్ని గుప్పిస్తూ అందర్నీ నవ్విస్తున్నామని వాళ్ళ ఆలోచన అయితే కావచ్చు...కానీ ఆ తరం విద్యార్థులపై అదెంత ప్రభావం చూపించిందో బహుశా వారెరుగరు...
ఒకప్పుడు ఉపాధ్యాయులన్నా, అధ్యాపకులన్నా ఎంతో గౌరవభావం, వాళ్లంటే ఓ విధమైన 'అడ్మిరేషన్'!...ఉండేది పిల్లల్లో, యువతలో... ఇంకా చెప్పాలంటే..దూరంగా కనిపించినా పక్కకు తప్పుకోవడమో, ఆగి నమస్కరించడమో చేసేవాళ్లు..
రాను రానూ ఆ సత్ప్రవర్తన కనుమరుగైపోయిందని చెప్పక తప్పదు.
క్రమేణా సినిమాల్లో కాలేజీ స్థాయి నుండి హైస్కూల్ స్థాయికీ, అది దాటుకుని ప్రాథమిక పాఠశాల స్థాయికీ ఈ కామెడీ సన్నివేశాలు పాకి... చిన్న పిల్లలు కూడా వాళ్ల టీచర్ల మీద జోకులు వేయడం, లెక్క లేకుండా మాట్లాడటం లాంటివి చూపించడం మొదలైంది. సినిమాల్లో చెడు మాత్రమేనా! మంచి కూడా చూపిస్తారు కదా... మంచిని గ్రహించవచ్చు కదా...అంటారేమో..! కానీ చెడు వ్యాపించినంత వేగంగా మంచి అన్నది అందరినీ చేరలేదు. శీఘ్రంగా ప్రభావితం చేయగల శక్తి చెడుకు మాత్రమే ఉంటుంది. మరీ ముఖ్యంగా పసివాళ్ళ మెదళ్లను ! మంచిని గ్రహించడం అయిష్టంగానూ, ఆచరించడం అంతకంటే కష్టంగానూ ఉండడమే అందుకు కారణం...
ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో పసితనం, అమాయకత్వం తొణికిసలాడుతూ ఉంటుంది. వాళ్లకు టీచరు ఏది చెప్తే అదే రైటు...ఆ మాటే వేదవాక్కు...అన్నట్లు ఉంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ హైస్కూలు ప్రవేశించగానే...ఆ పసితనం కాస్త పలచబడుతూ ఆ స్థానంలో ఓ విధమైన 'మెచ్యూరిటీ' కనిపించడం మొదలవుతుంది. ఒకప్పుడు ఆ మెచ్యూరిటీ అన్నది వాళ్ల ప్రవర్తనలోనూ కనిపించేది. మెల్లిమెల్లిగా తర్వాతి తరాల్లో అది మాయమైపోతూ వాళ్లలో నిర్లక్ష్య ధోరణి పుట్టుకు రావడం మొదలైంది. అందరూ ఇలాగే ఉంటున్నారని చెప్పడం కాదు నా ఉద్దేశం... ఎక్కువ శాతం గురించి ప్రస్తావిస్తున్నాను. అందులోనూ... మగ పిల్లలు..మరీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తొమ్మిదవ తరగతి నుండి మెల్లి మెల్లిగా మొదలయ్యే అల్లరి, అవిధేయత, నిర్లక్ష్యం ఇంటర్ స్థాయికి చేరేసరికి హద్దులు దాటుతున్న వైనాలు వింటున్నాము...అమ్మాయిలను ఏడిపించడం, ప్రేమించానంటూ వెంట పడటం, వేధించడం...! వాళ్లు తిరస్కరిస్తే... దాడి చేయడం, ఇళ్లల్లో సైతం దూరి హతమార్చడం !! ఇలాంటి వార్తలు కోకొల్లలుగా వింటున్నాం, చదువుతున్నాం, టీవీల్లో చూస్తున్నాం.
ఓ వయసంటూ వచ్చాక ఇంట్లో తల్లిదండ్రుల మాట కూడా లక్ష్యపెట్టని పిల్లలుంటున్నారు. ఇంట్లో వినకా, బయట కాలేజీల్లో వినకా...ఇక వీళ్ళు బాగుపడేదెట్లు? !!
ఎంతో శ్రద్ధగా చదువుతూ ఇంటా బయట మంచి పేరు తెచ్చుకుంటూ చక్కటి భవిష్యత్తును నిర్మించుకుంటున్న వాళ్లూ ఉంటున్నారు..వాళ్ళూ ఇదే స్కూళ్లలో చదివిన వారే కదా! కానీ...పంట చేలో కలుపు మొక్కల్లా పెరిగే అల్లరి యువత సమాజానికి తెచ్చే చేటు అంతాఇంతా కాదు..ఎన్నో నేరాలు,ఘోరాలూ జరగడానికి కారణభూత మవుతున్నాయి.
ముందుగా ప్రస్తావించిన వార్త లాంటివి చదివినప్పుడు...ఇలాంటి వాళ్లలో మార్పు సాధ్యమా! పసివాళ్లు పెరిగి పెద్దయ్యాక ఇలా వాళ్లలో పశుత్వం చోటు చేసుకుంటున్నదెందుకని !! అనిపిస్తూ బాధగా ఉంటుంది....
ఏది ఏమైనా, విలువలతో కూడిన సమాజం ఏర్పడాలంటే నేటి బాలలు విలువలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అది చిన్నతనంలోనే...ఇంటి నుండే, అదీ తల్లిదండ్రులతోనే మొదలవ్వాలి. వినయ విధేయతలు, సత్ప్రవర్తన ఇంటి నుండే అలవడాలి. ఇంటి వాతావరణం పిల్లల ఆలోచనాధోరణిపై చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. ఎందుకంటే... మొక్కై వంగనిది మానై వంగదు కదా!!
~ యం. ధరిత్రీ దేవి ~
****************************************