🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
~ యం. ధరిత్రీ దేవి
📲☎️📠
📲☎️📠
ఒకప్పుడు ఏదైనా సమాచారం చేరవేయాలంటే రెండు మూడు రోజులైనా పట్టేది. ఇప్పుడు...సెల్ ఫోన్లు వచ్చాక విదేశాల్లో ఉండే వాళ్ళతో కూడా రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతికత పుణ్యమాని ఎక్కడో ఖండాంతరాల్లో ఉన్నవారిని ఇక్కడ మన ఇంట్లోనే కూర్చుని చూస్తూ మాట్లాడే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. బయట షాపుల్లోకి వెళ్లి అన్ని వీధులూ తిరిగే శ్రమా, ఖర్చు తప్పి ఆన్లైన్ షాపింగులూ వచ్చాయి. ఇదంతా నేటి ఆధునికతను ప్రతిబింబిస్తోంది.
పూర్వం పావురాలతో సందేశాలు పంపించేవారని విన్నాం. అటుపిమ్మట ఎంత దూరమైనా సరే కాలినడకన మనుషులే వెళ్లేవారట! కాలక్రమేణా తపాలా శాఖ పుణ్యమాని ఉత్తరాలు రాసుకోవడం మొదలైంది. మరీ అత్యవసరమైతే టెలిగ్రామ్ సేవలు అన్నవి అందుబాటులోకి వచ్చాయి. రాను రాను సాంకేతికత పెరిగిపోయి ల్యాండ్ ఫోన్లన్నవి మొదట కార్యాలయాల్లో, తర్వాత ప్రతి ఇంటిలో కొలువుదీరిపోయాయి. ఆ తర్వాతే మొదలైంది సెల్ ఫోన్ల ఆవిర్భావం! ఇంకేముంది! కొత్తనీరొస్తే పాత నీరు పారిపోవాల్సిందేకదా!! దాంతో.. క్రమంగా ముందున్నవన్నీ అదృశ్యమైపోయాయి.
ఇంతవరకూ బాగానే ఉంది. శతాబ్దాలు గడిచి ఆదిమానవుడు నవనాగరీకుడయ్యాడు. కంప్యూటర్ యుగం వచ్చి సాంకేతికత ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. ఏ పనైనా నిమిషాల్లో సునాయాసంగా జరిగిపోతోంది. సంతోషించవలసిన పరిణామమే ! కానీ...మరో వంక మనస్థాపానికి లోనయ్యే దుస్థితి కూడా సంభవించడం శోచనీయం. సాంకేతికత విజృంభణతో మార్కెట్లోకి జెట్ స్పీడుతో ప్రవేశించిన స్మార్ట్ ఫోన్లు జనాల్ని ఆకర్షించి ఆకట్టుకున్న వైనం మాటల్లో చెప్పలేనిది. మొదట్లో అవసరాలకు మాత్రమే అన్నట్లుగా ఉన్న ఈ ఫోన్లు రాను రాను యువతనే కాక చిన్న పిల్లలను సైతం జాడ్యంలా పట్టుకున్నాయని చెప్పక తప్పదు.
పెద్దలు ఎప్పుడో అన్నారు..., "అతి సర్వత్రా వర్జయేత్ " అని ! ఎందుకంటే.. ఏదైనా హద్దుల్లో ఉంటేనే ప్రయోజనం. ఆ గీత దాటితే.. తిప్పలు తప్పవు.. అన్నట్లు తయారైంది ప్రస్తుత పరిస్థితి!
యువతీ యువకుల మధ్య అవసరానికి మించిన సంభాషణలు, వేళాపాళా లేకుండా సందేశాలు, ఫోటోలు,వీడియోలు పంపుకోవడాలు... ఒక్కటేమిటి!! అవి శృతిమించి పక్కదారి పట్టి వాళ్ల జీవితాల్ని సమస్యల సుడిగుండాల్లోకి నెట్టడం!! ఇలా చెబుతూ పోతే ఎన్నో ఎన్నెన్నో దారుణాల్ని వినాల్సి, చూడాల్సి వస్తోంది.
సాంకేతికతను సక్రమంగా ఉపయోగించుకుంటే సామాన్యులు సైతం సత్ఫలితాలు పొంది సంతోషించే అవకాశం ఉంటుంది. కానీ, విచారించదగ్గ విషయం ఏమిటంటే..నాగరికత వెర్రితలలు వేస్తూ అద్భుతమైన ఈ సాంకేతిక పరిజ్ఞానం కొన్ని దుష్టశక్తుల చేతజిక్కి దుర్వినియోగం అవుతూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. అందులో మచ్చుకు కొన్ని----
* ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు అమర్చడం వల్ల ఏదేని నేరం జరిగినప్పుడు వాటిలో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా నేరగాళ్లని గుర్తించే వీలు ఉంటుంది. ఇది ఉపయోగమైతే....
షాపింగ్ మాల్స్ లోనూ, మరికొన్ని చోట్ల టాయిలెట్స్ లోనూ ఇలాంటి కెమెరాలు అమర్చి తర్వాత వాటిని ఇతరులకు చేరవేస్తూ అమ్మాయిల, తద్వారా వారి కుటుంబ పరువు మర్యాదల్ని మంటగలపడం... మానసికంగా వేధించడం..! ఇత్యాదివన్నీ మాటల్లో చెప్పలేనంత దుర్వినియోగం కిందకి వస్తాయి.
విద్యావంతులనబడే వారు సైతం ఇలాంటి అసాంఘిక నేర ప్రవృత్తుల్ని రెచ్చగొడుతూ నైతిక విలువలను దిగజారుస్తున్నారు. ఇదిలాగుంటే.. మరోపక్క ఆన్లైన్ మోసాలు !!
* మనకు తెలియకుండానే మన బ్యాంకు ఖాతాల్లో మన డబ్బు మాయమై పోవడం !
* మనకు చెందిన భూములు మరొకరి పేర మార్చబడడం! జరిగిన విపత్తు ఎప్పటికోగానీ వారి దృష్టిలో పడకపోవడం.. పడ్డ తర్వాత లబోదిబోమంటూ గుండెలు బాదుకోవడం !!
ఇవన్నీ కూడా మనిషిని మానసికంగా కృంగదీసేవే.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో!! ఈమధ్య సైబర్ నేరాల గొడవ మరీ శృతి మించిపోయి ఉన్నత స్థానాల్లో ఉన్నవారు సైతం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతున్న కథనాలు వార్తాపత్రికల్లో తరచుగా రావడం అందరికీ విదితమే..వీటిని ఛేదించడానికి, కట్టడి చేయడానికి ఎంత గట్టి ప్రయత్నాలు చేస్తున్నా నేరగాళ్ళు ఏమాత్రం దారికి రావడం లేదని ఇంకా ఇంకా జరుగుతూనేఉన్న ఈ నేరాలు తేటతెల్లం చేస్తున్నాయి.
ఒకప్పుడు నిరక్షరాస్యులు కూడా బయట పనులన్నీ స్వయానా చెక్కపెట్టుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం ఉన్నత విద్యావంతులు సైతం కాల్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఏ పనులు సకాలంలో సజావుగా సాగక దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.
ఏ టెక్నాలజీ లేని కాలంలోనే మనిషి అంతో ఇంతో ప్రశాంతంగా జీవించేవాడు. కానీ ఈ కంప్యూటర్ యుగంలో మనశ్శాంతి కరువైపోయింది మనిషికి. కారణం...ఎంతో విలువైన మనిషి మేధస్సు మలినమైపోవడమే! అలా జరగకూడదు అంటే.. ఏది మంచి, ఏది చెడు అన్న చిన్నపాటి ఆలోచన నేర ప్రవృత్తి గలవాళ్లలో మొదలవ్వాలి. రేయింబవళ్ళు కష్టపడి తమ విజ్ఞానాన్ని ధారపోసి, కొత్తకొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్న మేధావుల శ్రమ కొందరి స్వార్థపూరిత దురాలోచనలకు లోనై సమాజంలో విష సంస్కృతిని నెలకొల్పడం ఎంత మాత్రమూ అభిలషణీయం కాదు.
ఆధునిక పరిజ్ఞానం జనాల్ని ప్రగతి బాట పట్టించాలి గానీ పక్క దారి కాదు కదా!!
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
No comments:
Post a Comment