బెల్ మోగింది. పీరియడ్ అయిపోయింది. స్టూడెంట్స్ కు బై చెప్పి స్టేజి దిగి స్టాఫ్ రూం వైపు అడుగులు వేసింది వసుధ. రూమ్ సమీపిస్తుండగా లోపల నుండి పకపకా నవ్వులు ఆమె చెవిలో పడ్డాయి. 'హు, మొదలయిందన్నమాట 'అనుకుంటూ వెళ్లి తన సీట్లో కూలబడింది. ఆ స్కూల్లో రెణ్ణెల్ల క్రితం జాయినయింది వసుధ. రజని, రాధిక, లలితలతో పాటు తనకూ ఇదే పీరియడ్ లీజర్ అవర్. ఎప్పుడూ ఎవరో ఒకరి గురించి చర్చిస్తూ వాళ్ళ పరోక్షంలో వాళ్ల గురించి విమర్శలు చేస్తూ, జోకులేసుకుంటూ పడీ పడీ నవ్వుకుంటుంటారు ముగ్గురూ. వాళ్ల ధోరణి ఎంత మాత్రమూ నచ్చని వసుధ తప్పనిసరై ఆ నలభై అయిదు నిమిషాలూ భరిస్తూ ఏదో రాసుకుంటూనో, చదువుకుంటూనో గడిపేస్తూ ఉంటుంది.
".... అయితే లలితా, మీఅత్తగారు మూడురోజుల మౌనవ్రతం విరమించిందన్నమాట.... "
రాధిక అనగానే రజని కిసుక్కున నవ్వి,
" అంతేగా మరి,... " అంది.
వెంటనే లలిత, " ఏం చేయను, నా కర్మ మరి.... " అంటూ తలపట్టుకుంది.
లలిత తన ఇంటి విషయాలు చెప్పడం, ఆ ఇద్దరూ కామెంట్స్ చేయడం రోజూ జరిగే తతంగమే. బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వీళ్ళు ఎందుకిలా స్థాయిని మరిచి ప్రవర్తిస్తారో అనుకుంటూ తనలో తనే మదన పడుతూ ఉంటుంది వసుధ. ఈమధ్య వీళ్ళ ధోరణి చూస్తుంటే తనకు తన పొరుగింట్లో ఉండే వర్ధనమ్మ గుర్తొస్తూ ఉంటుంది. ఆవిడ సాయంత్రాలు తన ఇంటికి ఏదో మిష మీద వచ్చి, తన అత్తగారితో పిచ్చాపాటీ మాట్లాడుతూ అడపాదడపా తన కోడలి గురించి అవాకులు, చెవాకులూ పేలుతూ ఉంటుంది. పాపం, ఆ అమాయకురాలు ఉదయం నుండీ రాత్రి దాకా ఇంటిల్లిపాదికీ వండి వార్చుతూ సతమతమౌతుంటే, ఈవిడ కనీసం లేశమాత్రం అభిమానం అన్నది కూడా చూపక అందరి దగ్గరా ఇలా కోడలు గురించి చెడుగా చెప్తూ ఉంటుంది. అందులో ఆమె పొందే ఆనందం ఏమిటో తనకి అర్థం కాదు.
ఒకసారి ఆకస్మాత్తుగా వసుధకనిపించింది, తను ఇంట్లో ఉంది కాబట్టి సరిపోయింది, లేనప్పుడు తన గురించి కూడా తన అత్తగారు ఈవిడకు ఇలాగే చెబుతుందా? కానీ వెంటనే సర్ది చెప్పుకుంది, ఆవిడ గడప దాటి బయటకు వెళ్లడమే తక్కువ. వెళ్లినా పెద్దగా నోరు విప్పే రకం కాదుఅని. కానీ తనకు నచ్చని విషయం ఏమిటంటే-- వర్ధనమ్మ కోడలి గురించి అలా చెప్తూ ఉంటే తన అత్తగారు అసలు ఖండించదు, ఆసక్తిగా వింటూ ఉంటుందంతే. వినే వాళ్ళు ఉంటేనే కదా చెప్పే వాళ్ళు ఉంటారు! ఒక్కోసారి మధ్యలో దూరి అభ్యంతర పెడదామనిపిస్తుంది వసుధకు. కానీ-- వాళ్లు పాతతరం వాళ్లు. చదువు సంధ్య లేని వాళ్ళు. వయసులో పెద్ద వాళ్లు. ఎలా వాళ్లకు నీతులు బోధించగలదు? చెప్పినా వింటారా? విన్నా పాటిస్తారా? అనవసరంగా తన గురించి ఏదేదో అక్కడక్కడా వాగడం చేస్తారు గానీ ! దాంతోఆ ఆలోచన పూర్తిగా విరమించేసుకుంది వసుధ. అయినా చాలాకాలంగా ఓ విషయం గమనిస్తూ ఉంది తను. ఈ కోవకు చెందిన ఆడవాళ్ళు( దీనికి వయసుతో నిమిత్తం లేదు) బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్న స్త్రీల కంటే ఎంతో తెలివైనవాళ్ళు, మాటకారితనం గలవారు, ఇంకా లోకజ్ఞానం కూడా ఉన్నవాళ్ళన్నది ఇన్నేళ్ల అనుభవం లో ఆమె గమనించిన మహత్తర విషయం. చదువు లేదు కదాని దేవుడు వీళ్లకీ సౌలభ్యాలన్నీ వరంగా ప్రసాదించాడేమో అన్పిస్తూ ఉంటుంది వసుధకొక్కోసారి.
వీళ్లు ఇలా ఉన్నారు సరే, కానీ ఈ పంతులమ్మల్ని చూస్తూ ఉంటే ఆమెకు ఆశ్యర్యం వెల్లువెత్తుతూ ఉంటుంది. ఇంత చదువూ చదివి, పదిమందిలో ఉద్యోగాలు వెలగబెడుతూ ఏమిటీ వీళ్ళ ధోరణి ! సంస్కారమన్నది మరిచి ! ఆ ముగ్గుర్నీ గమనిస్తూ వస్తున్న వసుధకు లలిత ఎందుకో ఒకింత ప్రత్యేకంగా కనిపించింది. రెణ్నెళ్లుగా చూస్తోంది, తన మాటల్లో ఏదో అమాయకత్వం దోబూచులాడుతూ ఉంటుంది.
" ఇంటివద్ద పెద్దవాళ్ళను నేను ఎలాగూ అడ్డుకోలేను, కానీ...... "
వసుధ అలా ఆలోచిస్తుండగానే బెల్ మోగింది. లేచి, నెక్స్ట్ క్లాస్ కు బయలుదేరింది.
******************
మరుసటి రోజు క్లాస్ అవగానే వడివడిగా అడుగులేస్తూ కదిలిన వసుధకు స్టాఫ్ రూమ్ సమీపిస్తుండగా ఎదురయ్యింది లలిత. తను కోరుకున్నదీ అదే.
" లలితా, తలనొప్పిగా ఉంది, టీ తాగొద్దాం, వస్తావా.... "అంటూ అడిగింది వసుధ.
ఇంతవరకూ ఎన్నడూ క్యాంటీన్ కు రాని వసుధ అలా అడిగే సరికి కాదనలేక, ' పదండి " అంటూ దారితీసింది లలిత. ఇద్దరూ వెళ్లి క్యాంటీన్ లో కూర్చుని టీ చెప్పారు. రెండు నిమిషాల నిశ్శబ్దం తర్వాత వసుధ మెల్లిగా మొదలెట్టింది.
" లలితా, ఏమీ అనుకోనంటే సుత్తి లేకుండా సూటిగాఓ మాట అడుగుతాను ఏమి అనుకోరు కదా.. "
ఇలా వసుధ తనను క్యాంటీన్ కు తీసుకురావడానికి ఏదో కారణం ఉండే ఉంటుందని ఊహించిన లలిత పెద్దగా ఆశ్చర్యపోలేదు. వసుధనే చూస్తూ,
" చెప్పండి, పరవాలేదు "అంది.
" మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు అలా స్టాఫ్ రూమ్ లో అందరికీ ఎందుకు చెప్తుంటారు?
చివ్వున వసుధ మొహంలోకి చూసింది లలిత.
".... ఒక్క విషయం మీరు గమనించారా? ఎంతసేపూ మీరు మీ విషయాలు చెప్తుంటారు గానీ, వాళ్ళిద్దరూ వాళ్ల స్వవిషయాలు ఎప్పుడూ మీతో పంచుకోవడం నేను వినలేదు... "
చెళ్లుమని కొరడాతో కొట్టినట్లయింది లలితకు. ఒక్కసారిగా ఫ్లాష్ వెలిగిందామెలో. నిజమే! తన వ్యక్తిగత విషయాలు చెప్తూ వాళ్ల గురించి కూడా అడిగితే వెంటనే మరేదో చెప్తూ వెంటనే దాటవేసే వారిద్దరూ. తన గురించి అన్ని విషయాలు వాళ్లకు తెలుసు కానీ వాళ్ల కుటుంబాల గురించి ఇంతవరకూ తనకు ఏ మాత్రం తెలీదు.
వసుధ అందుకుంది.
"... వాళ్ల గురించి చెడుగా చెప్పడం నా ఉద్దేశం కాదు లలితా, కొందరుంటారు, చాలా తెలివిగా, మరింత తీయగా మన గురించి అన్నీ ఆరా తీస్తారు. తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా అవన్నీ అందరికీ చేరవేస్తూ ఉంటారు. అదో మానసికానందం వాళ్లకు. ఈ విషయం నేను బాగా గమనించాను. నీ మనస్తత్వం నాకు అర్థమైపోయి, ఓ కొలీగ్ గా కాక ఓ తోబుట్టువుగా భావించి ఎందుకు ఎందుకో చెప్పాలనిపించింది.... "
లలిత కళ్లలో సన్నటి నీటి పొర! ఎంతో మౌనంగా, గుంభనంగా కనిపించే వసుధలో ఇంత లోతైన ఆలోచనలా ! ఎప్పుడూ అసంబద్ధంగా లొడలొడా వాగే తనకూ, వసుధకూ ఎంత తేడా! ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తూ తన మేలు కోసమే చెప్తోంది.
"..... మన ఇంటి వ్యవహారాలు ఇంటి గడప లోపల ఉంటేనే మనకు గౌరవం. నాకూ ప్రతి ఇంటి నుండి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ అవన్నీ బయట వాళ్ళతో చెప్పుకుంటే పోయేది నా పరువే. ముఖ్యంగా అత్తా కోడళ్ళు ఈ విషయం ఎరిగి మసలుకోవాలన్నది నా అభిప్రాయం. ఎందుకంటే, వాళ్ళిద్దరూ కుటుంబం పరువు ప్రతిష్టలనుకుంటాను... "
వసుధ చేతిమీద లలిత చేయి వేసి మెల్లిగా స్పృశించింది. ఆమె కళ్ళలో భావం చూసిన వసుధకు ఇంతకన్నా చెప్పడం అనవసరం అనిపించింది.
" వసుధ గారు, నిజం చెప్పారు, మా ఆయన అదోరకం. నా బాధ ఆయన కెన్నడూ పట్టదు. అన్నీ తేలిగ్గా కొట్టిపారేస్తారు. ఒత్తిడి భరించలేని నేను ఇలా అందరి ముందూ బయట పడిపోతుంటాను. అంతేగానీ నన్ను నేను అందరి ముందూ చులకన చేసుకుంటున్నానన్న ఆలోచన ఇంతవరకు రాలేదు. మీకు చాలా చాలా థాంక్స్..... "
".... అర్థం చేసుకుంటావన్న నమ్మకంతోనే సాహసించి చెప్పా ను, లలితా. నేనే మీకు థాంక్స్ చెప్పాలి...... " వాచీ చూసుకుంటూ లేస్తూ అంది వసుధ.
ఇద్దరూ వాళ్ల క్లాసులవేపు కదిలారు. వసుధ లో ఓ తృప్తి ! రాత్రంతా ఆలోచించిన ఫలితం! లలిత లో అంతర్మధనం మొదలైంది. వసుధక్కావలసిందీ అదే !
************
నిజమే కదా! అత్తాకోడళ్ళిద్దరూ ఇంటికి మూలస్తంభాలు. కుటుంబం పరువు ప్రతిష్ఠలు. అవి నిత్యం కాపాడ్డం వాళ్ల బాధ్యతే కదా మరి!!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌺🌺' భువి ' భావనలు 🌺🌺
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment