******************************************
~ యం. ధరిత్రీ దేవి
విశ్రాంత అధ్యాపకురాలు
కర్నూలు *************************************** పల్లవి
అదిగో .. అదిగదిగో
కదిలిందీ కందనవోలు
కవయిత్రుల బృందంతోను
కలం కదిలి కథనాలే విరబూయగా
తేట తెలుగు కవితలతో మాలికలల్లి
తెలుగుతల్లి పులకించిపోవగా
అదిగో..అదిగదిగో // కదిలిందీ //
చరణం 1
కనులు తెరిచి కలలు కోటి కంటారు వీరు
కనురెప్పల కదిలేటి గుండెసవ్వడులు
రెక్కలొచ్చి రెప్పపాటులోన వినువీధిని
పాటలై రాగాలు కురిపిస్తాయి
పాఠకుల చేతిలో పుస్తకాలె అవుతాయి
జనని నేను..కవిని నేను..అధికారిణి నేనంటూ
పలు పాత్రల పరకాయ ప్రవేశం
ప్రమదలార గైకొనుమూ నీరాజనం
గైకొనుమా నీరాజనం
అదిగో అదిగదిగో // కదిలిందీ //
చరణం 2
ఒకచోట కలిసిన ఈ బాంధవ్యాలు
బంధువులు కారు వీరు ఆత్మబంధువులు
కలం కలం పరస్పరం పెనవేసుకున్న
ప్రేమానురాగాల జీవనది ఇది
కలహాలే దరిజేరని ఒక చల్లని లోగిలి
కలిసిమెలిసి సాగుతున్న
అచ్చ 'తెలుగుతోట' ఇది
అచ్చ 'తెలుగు తోట' ఇది
అదిగో అదిగదిగో // కదిలిందీ //
చరణం 3
సారధులు..మేధావులు..మహిమాన్వితులు
సాహితీసదస్సుల రథచక్రాలు
చైతన్య దీపికలు..స్ఫూర్తికి చిరునామాలు
భావితరం భవితకు తిరుగులేని పునాదులు
తరతరాల సంస్కృతికి వారు వారధులు
దిగంతాలు తెలుగు కీర్తి ప్రభవిల్లగా
దినం దినం మన 'నరసం'సాగాలీ నిరంతరం
సాగాలీ నిరంతరం
పల్లవి ( ముగింపు )
ఇదిగో ఇదిగిదిగో
కనులముందు కందనవోలు
కవయిత్రుల బృందంతోను
కలం కదిలి కథనాలే విరబూయగా
తేట తెలుగు కవితలతో మాలికలల్లి
తెలుగుతల్లి పులకించి పోవగా
ఇదిగో ఇదిగిదిగో
కనులముందు కందనవోలు
కవయిత్రుల బృందంతోను
కవయిత్రుల బృందం తోను
****************************************
No comments:
Post a Comment