Tuesday, January 7, 2025

నేటి సినీ కథానాయిక... దర్శకుల ధోరణి...!

☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️

     
  చక్కటి అందం, అద్భుతమైన నటనాకౌశలం అంతకుమించిన వాక్చాతుర్యప్రతిభ -- వీటన్నింటి కలబోత నేటి సినీ కథానాయిక అంటే అతిశయోక్తి కాదు. భాష తెలియకపోయినా పాత్ర స్వభావాన్ని నూటికి నూరుపాళ్ళు అర్థం చేసుకుని నటించడం, వివిధ నాట్యభంగిమలు అలవోకగా అర్థం చేసుకుని నర్తించడం సామాన్యమైన విషయమేమీ కాదు. కానీ హృదయం కళుక్కుమనేలాచేసే విషయం ఏమిటంటే.. తెరపై వారి వస్త్రధారణ! ఇంతటి ప్రతిభ గల నటీమణుల్ని అరకొర దుస్తుల్లో చూపిస్తూ వారిపై సదభిప్రాయాన్ని తుడిచి వేయడం, కొన్నిసార్లు ఆయా పాత్రల ఔచిత్యాన్నే దెబ్బతీయడం విజ్ఞులైన సినీ దర్శకులకు భావ్యమేనా!!
    ఒకప్పుడు నాయిక అంటే చూడ చక్కటి ఆహార్యంతో అందరికీ గౌరవభావం కలిగించేలా ఉండేది. హీరోయిన్, సైడ్ హీరోయిన్, వాంప్ -- ఇలా వారికంటూ ప్రత్యేకించి పరిధులు ఉండేవి. ఇప్పుడు నాయికే అన్ని రకాలూ భర్తీ చేస్తోంది మరి! ఈమధ్య థియేటర్ కెళ్ళి ఓ సినిమా చూడటం తటస్థించింది. అందులో నాయిక పాత్రధారిణి ఆధునిక దుస్తులు అనబడే చిన్న గుడ్డ పీలికలు ధరించడం చూసి ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఇదే నటీమణిని చక్కటి చీర కట్టుతో ఓ దర్శకుడు తన చిత్రంలో నటింపజేసిన విషయం గుర్తొచ్చి, ఇద్దరూ నటీమణులూ ఒకరేనా.. అన్న అనుమానంతో పాటు కించిత్ బాధ కూడా కలిగింది.
       నాయిక పాత్రల్ని ఎంతో సమున్నతంగా చూపించిన   విశ్వనాథ్, బాపు, బాలచందర్ లాంటి  విశ్వవిఖ్యాత దర్శకుల చిత్రాలు అద్వితీయ కళాఖండాలుగా చిరస్థాయిగా అందరి మదిలో చెరగని ముద్ర వేశాయి. దానికి కారణం, ఆ దర్శకులు పాటించిన అత్యుత్తమ విలువలు. వాంప్ పాత్రలకు మాత్రమే పరిమితమైపోయి ఉన్న నటీమణి మంజు భార్గవి కళాతపస్వి విశ్వనాథ్ గారి శంకరాభరణం ద్వారా పరిశ్రమలో గౌరవనీయమైన స్థాయిని చేరుకోవడం అందరికీ విదితమే కదా !!
     కేవలం నాయికల అందాల ఆరబోతకే జనాలు సినిమా చూడ్డానికి వస్తారన్న అపోహ నేటి తరం దర్శకులు తొలగించుకుంటే మంచిది. అదేవిధంగా.. అందాల ప్రదర్శన చేస్తే అవకాశాలు వెల్లువెత్తుతాయన్న ధోరణి నేటి తరం నాయికలు మానుకోవాలి. అది కేవలం తాత్కాలికమే. ప్రేక్షకుల మదిలో వారి పట్ల దురభిప్రాయం ఏర్పడి అసలుకే మోసం వచ్చే ప్రమాదం పొంచి ఉంటుందని ఈ తారలు ఎందుకు గ్రహించరో మరి!
       చవకబారుతనాన్ని ఇష్టపడే వర్గం ప్రేక్షకుల్లో అతి తక్కువ శాతం మాత్రమే ఉంటారన్న వాస్తవం దర్శకులు గ్రహించి తీరాలి. అదేమంటే... అలా తీస్తే ఈరోజుల్లో సినిమాలు ఆడతాయా? కోట్లు గుమ్మరించి, అంతకుమించి శ్రమకోర్చి మేం సినిమాలు తీసేది నష్టాల్ని మూటగట్టుకోవడానికి కాదుగదా !! పైగా టీవీ లు వచ్చాక ప్రతి ఇల్లు ఓ మినీ థియేటర్ అయిపోయి, జనాలు బయట థియేటర్ల దాకా రావడమన్నదే గగనమైపోయిన ఈరోజుల్లో యువతని ఆకర్షించాలంటే అన్ని హంగులూ గుప్పించాల్సిన అవసరం కచ్చితంగా ఉంది... అంటూ నిట్టూరుస్తారు  దర్శక నిర్మాతలు. వాళ్ల కోణంలో అదీ కరెక్టే. వారి బాధలు వాళ్ళవి మరి  !
   అయితే ప్రస్తుతం, ఈ ప్రభంజనంలో మంచి సినిమాలే రావడం లేదా అంటే... అడపాదడపా వస్తున్నాయని ఒప్పుకోవాల్సిందే. చక్కటి కళాత్మక విలువలతో ఒకింత సందేశాన్నీ జోడిస్తూ తీస్తున్న దర్శకులు ఇప్పుడూ లేకపోలేదు. వారి ప్రయత్నానికి, చక్కటి అభిరుచికీ జోహార్లు. ఏదేమైనా వాస్తవ దృష్టితో ఆలోచిస్తే... వాణిజ్యపరంగా తీసే సినిమాలు పదికాలాలపాటు జనాల మదిలో నిలిచిపోయే ప్రసక్తి ఎంత మాత్రమూ ఉండదు. విజ్ఞులైన దర్శకులు ఆలోచించాలి...
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
       
 

No comments:

Post a Comment