Wednesday, January 15, 2025

దటీజ్ బాలసుబ్రహ్మణ్యం...కథ

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

                    

                                       ~ యం. ధరిత్రీ దేవి 

  ఆ రాత్రి పక్కలు సర్దుతున్న రాజేశ్వరికి మనసంతా వికలమైపోయింది. తన భర్త అంత కఠినంగా మాట్లాడగలడని ఇన్నేళ్లుగా కాపురం చేస్తున్న తను ఎంత మాత్రమూ ఊహించలేకపోయింది. ఎంత ప్రయత్నించినా అతని ఆ ధోరణిని మాన్పించనూ లేకపోయింది. ఇంతకీ తను బాధపడుతున్నదల్లా జ్యోతిర్మయి గురించే. పాపం! ఆ సమయంలో ఆమె మొహం చూస్తే పగవాడికి కూడా గుండె కరుగుతుంది. ఛీ ఛీ.. ఈయనకు ఏమైంది ఇవాళ !
   అన్య మనస్కంగానే పనులన్నీ ముగించుకొని ఇవతలకు రాబోతుండగా అప్పుడు బాలసుబ్రహ్మణ్యం .. అదే.. ఆమె భర్త ఎదురు తగిలి, ఆమె చేయి పట్టి లాక్కు వచ్చి మంచం మీద బలవంతాన కూర్చోబెట్టాడు. లేవటానికి శత ప్రయత్నిస్తున్న ఆమె భుజాల్ని వత్తిపెట్టి,
" చూడు నా మనోగతం నా చెల్లెలు జ్యోతిర్మయికి అర్థం కాలేదంటే అర్థం ఉంది.. కానీ, భార్యవై ఉండి ఇన్నేళ్లుగా నన్ను చూస్తూ నీవు కూడా ఇలా అయిపోతే ఎలా..! "
 పెదవి విప్పి ఏదో అడ్డు తగలబోతున్న ఆమెను మరి మాట్లాడనీయకుండా వెంటనే అందుకుని తన ఆలోచనలన్నీ ఏకరువు పెట్టసాగాడు బాలసుబ్రహ్మణ్యం.
                                  🌸🌸🌸
    అవతల పిల్లలిద్దర్నీ చెరోపక్కా వేసుకుని పడుకున్న జ్యోతిర్మయి మెదడంతా కుతకుతా ఉడికిపోతోంది. ఇదేమిటి ! తన అన్నేనా..! ఇలా మాటలనింది! ఈ ఇంట్లో తనతో పాటు కలిసి పెరిగి, కలిసి జీవించి, అన్ని రకాల అనుభవాలు కలిసి పంచుకున్న తనతో అంత నిర్మొహమాటంగా  ఎలా మాట్లాడగలిగాడు!! ఎంత కాదనుకున్నా ఆ సాయంత్రం జరిగినదే ఆమె కళ్ళలో పదేపదే కదలాడ సాగింది.
" జ్యోతీ, నీవిలా వచ్చేయడం నాకెందుకో నచ్చడం లేదమ్మా.. "
 ఆ సాయంత్రం ఆఫీసు నుండి వచ్చాక కాఫీ తాగుతూ, కూతురికి జడ వేస్తున్న జ్యోతిర్మయినుద్దేశించి బాలసుబ్రమణ్యం నెమ్మదిగా మొదలెట్టాడు. ఊహించని మాట ఎదురయ్యేసరికి ఆమెలో చిన్నగా ప్రకంపనం చెలరేగింది. అన్న కళ్ళలోకి చూడాలని ప్రయత్నించింది. బాలసుబ్రహ్మణ్యం చెప్పుకుపోయాడు.
"... నీ భర్త అకాలమరణం పొందడం, నీ భవిష్యత్తు శూన్యంగా మారిపోవడం... నిజమే, ఇవన్నీ జరగకూడనివే.. అయినా పెళ్లయిన స్త్రీకి భర్తగారిల్లే శాశ్వతమనే మాట  నీవు మర్చిపోయావు. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నా, నీవు నీ పిల్లల కోసమైనా అవన్నీ భరించాల్సిఉంది. కానీ, ఇలా వచ్చేస్తే, అంతంత మాత్రం జీతాలతో బ్రతుకుతున్న నేను రెండు సంసారాలని పోషించగలనని ఎలా అనుకున్నావు!!?"
' అన్నయ్యా!'
 పక్కలో పిడుగు పడినట్లు అదిరిపడింది జ్యోతిర్మయి, ఎన్నడూ చూడని, తాను ఎన్నడూ ఎరగని అన్నను ఈనాడు తను చూస్తోంది. అమ్మానాన్న తనను ఏ చిన్న మాట  అన్నా కూడా వారినే మందలించి, తనను వెనకేసుకొచ్చిన తన అన్నయ్య ఈనాడు ఇలా ఈటెల లాంటి మాటలతో  హృదయాన్ని తూట్లు పొడవడానికి వెనుకాడటం లేదు.
   ఆమె మనసు చదివిన బాలసుబ్రహ్మణ్యం  మెల్లిగా తల పంకించి మళ్లీ మొదలెట్టాడు.
"... ఇలా అని నిన్ను బాధ పెడుతున్నానని తెలుసు. కానీ వాస్తవం నీవు తెలుసుకోక తప్పదు. ఓ అన్నగా నీకో చక్కటి సలహా ఇస్తాను... నీవు అర్థం చేసుకొని పాటిస్తే సరి.. లేదా నీవు నీ అత్తగారింటికి వెళ్లే ఏర్పాటు చేస్తాను..."
 జ్యోతిర్మయి రోషంగా తలెత్తింది.
"... నీవు మరొకరి మీద ఆధారపడకుండా, నీ జీవితాన్ని చక్కదిద్దుకుంటూ, నీ పిల్లల భవిష్యత్తు నీవే నిర్ణయించడానికి దారి చూపిస్తాను.. ఆగిపోయిన నీ చదువు మళ్లీ కొనసాగించేలా చేస్తాను. నీ కాళ్ళ మీద నీవే నిలబడగల ఆత్మస్థైర్యం నీకు కలిగేలా చేస్తాను.."
 అయోమయంగా చూసింది జ్యోతిర్మయి. ఈ వయసులో, ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత తను చదువుకోవడం! హు!! అది అయ్యే పనేనా ! అన్నయ్య తనను ఎందుకిలా హింసించాలని చూస్తున్నాడు  అమ్మానాన్న పోగానే మరీ ఇంతలా మారిపోవాలా!!
"... అందుకు నీవు సమ్మతిస్తే నీవు కొంతకాలం పాటు ఇక్కడే ఉండవచ్చు. అదీ నీ చదువు పూర్తి అయ్యేదాకానే. లేదా రేపే నీ అత్తవారింటికి వెళ్లవచ్చు..."
 సమాధానం కోసం ఎదురుచూడకుండా, కనీసం ఆమె ముఖంలో భావాలైనా గమనించకుండా బయటకు వెళ్ళిపోయాడు బాలసుబ్రమణ్యం.
   ఆ దృశ్యం గుర్తొచ్చిన ప్రతిసారీ ఆమె కళ్ళ నుండి నీరు ధారలుగా కారిపోతోంది.
" రేపే నీ అత్తవారింటికి వెళ్లవచ్చు "
 ఆ మాటలే ప్రతిధ్వనిస్తూ ఆమెను కుదురుగా పడుకోనీకుండా చేయసాగాయి. అటూఇటూ ఊగిసలాడుతూ ఏ అర్ధరాత్రి దాటాకో ఆమె ఆలోచనలు ఓ కొలిక్కి వచ్చి కంటిమీద కునుకు పట్టింది.
   మరుసటి రోజు ఉదయం ఆమెను వారించడానికి రాజేశ్వరి శతవిధాల ప్రయత్నించింది. కానీ జ్యోతిర్మయి వినలేదు. పిల్లలిద్దర్నీ తీసుకుని తన తాలూకు పెట్టే బేడా చేత పట్టుకుని బయటకు నడిచింది.వెళ్లేముందు అన్నా వదినల్ని ఉద్దేశించి ఒక మాట అన్నది.
" ఆడపిల్లకు పుట్టిల్లు అన్నది అమ్మానాన్న ఉన్నంతవరకే అని మీరు చాలా చక్కగా నిరూపించారు. చాలా సంతోషం... "
 వెక్కిళ్లు ఆమెను మరి మాట్లాడనీయలేదు. ఆ మాటలు బాలసుబ్రహ్మణ్యం  హృదయాన్ని శూలాల్లా తాకినా, అతి కష్టం మీద నిభాయించుకున్నాడు. కారణం... అతని దృష్టి అంతా వర్తమానం మీద కాక, ఆమె భవిష్యత్తు మీదే కేంద్రీకృతమై ఉండటమే..!
                               🌸🌸🌸 
   అత్తవారింట్లో జ్యోతిర్మయి జీవనం తిరిగి ప్రారంభమైంది. తెల్లవారుజామున నిద్ర లేవటంతో మొదలయ్యే ఆమె దిన చర్య రాత్రి బాగా పొద్దు పోయాక వంటింట్లోనే నడుము వాల్చడంతో ముగిసేది. అత్తమామలకు అన్నీ అందించడం, ఆడబిడ్డలు, మరుదులకు వడ్డించడం, వారి పిల్లల ఆలనా పాలనా... వీటన్నింటితో పాటు ఇంటి పని, వంట పని... క్షణం తీరిక ఉండేది కాదు. ఈ పరుగు పందెంలో మునిగితేలుతున్న ఆమెకు తన పిల్లలు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, తిన్నారో లేదో... కనీసం బడికి వెళ్తున్నారో లేదో... అని చూసుకోవడానికి కూడా సమయం చిక్కేదే కాదు. భర్త ఉన్న రోజుల్లోనూ ఈ పనులన్నీ యధావిధిగానే ఉండేవి. కానీ ఇప్పుడు భర్త లేని ఆ ఇంటిలో ఆమెకున్న స్థానం పునాదులు క్రమంగా సడలిపోనా రంభించాయి. దినాలు గడిచే కొద్దీ కేవలం ఆ ఇంట్లో అందరికీ వండి వార్చే ఓ పని మనిషిలా ఆమె మారిపోయింది.
    హఠాత్తుగా ఓ రోజు అద్దంలో ఆమె ప్రతిబింబాన్ని చూసుకుంది జ్యోతిర్మయి. భర్త పోయి సంవత్సరం తిరక్కముందే తనలో ఇంత మార్పా!! పదేళ్లు వయసు పైబడిన దానిలా మారిపోయిన తన రూపం తనను చూసి పరిహసిస్తున్నట్టుగా అనిపించింది ఆమెకు.
 ఆ రాత్రి వంటింటి గడప మీద తల ఆనించి, కళ్ళు మూసుకున్న ఆమె మస్తిష్కంలో ఆమె అన్న బాలసుబ్రహ్మణ్యం చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. ఆనాడు ఆయన అన్నమాటలు తన మనసును తీవ్రంగా గాయపరిచినా, అవి ఎంతో ముందు చూపుతో తన భవిష్యత్తుకు సరైన బాట వేయాలన్న తలంపుతోనే అన్నాడని ఈనాడు తనకు తెలిసి వస్తోంది. ఈ వయసులో చదువు తనకు సాధ్యమా.. అని ఆ రోజు ఏవగించుకుంది. కానీ మనసుంటే మార్గం ఉండదా అని ఈరోజు అనిపిస్తోంది...
   తన అన్న తనను చదివిస్తానన్నాడు. తనకు జీవనాధారం కల్పిస్తానన్నాడు. తన జీవితం తానే జీవించేలా చేస్తానని భరోసా ఇచ్చాడు. కానీ అపార్థం చేసుకుని దూషించి వచ్చేసింది.
    ఇక్కడ!! తన స్థానం ఏమిటి ! బ్రతుకంతా అందరికీ అన్నీ చేస్తూ, ఎవరికి ఏమీ కాకుండా, చివరికి అనామకంగా రాలిపోవటమేగా ! తనకంటూ ఓ వ్యక్తిత్వం ఆపాదిస్తానన్న వ్యక్తిని కాదనుకుని వచ్చి ఈ నరకంలో కూరుకుని పోయి , తన పిల్లల బ్రతుకు కూడా రేపు మరో నరకంలోకి తోయబోతోంది. ఇంతకాలంగా ఆమె మనసును కమ్ముకున్న మబ్బు తెరలు నెమ్మదిగా విడివడసాగాయి. అంతే! క్రమంగా ఆమె ఆలోచనలు మరో దారిలో పయనించసాగాయి.
                                🌸🌸🌸
      తలుపు తెరిచిన బాలసుబ్రహ్మణ్యం జీవశ్చవంలా నిలబడ్డ చెల్లెల్ని చూసి కంగారుపడిపోయాడు. కానీ ఆమె కళ్ళల్లో మెరుస్తున్న కాంతిని చూసి కాస్త నెమ్మదించాడు. గడపలో అడుగుపెట్టిన జ్యోతిర్మయి అన్న చేతుల్లో వాలిపోయి బావురుమంది. ఆమెలో కరడు కట్టిన దుఃఖభారమంతా  తీరిపోయేదాకా ఊరుకున్నాడతను.
"  తరతరాలుగా  పాతుకుపోయిన సాంప్రదాయాల్ని కాదనుకొని ముందుకు వచ్చే స్త్రీలు మన సమాజంలో చాలా తక్కువమ్మా. కఠినంగా మాట్లాడకపోతే నీ ఆలోచనల్లో మార్పు రావడం అసాధ్యం. అందుకే నేను పాషాణంలా మారిపోవాల్సి వచ్చింది. కానీ ఆ రోజు నుండి ఈ క్షణం దాకా నేను అనుభవించిన ఆత్మక్షోభ మాటల్లో చెప్పలేను తల్లీ. నా ప్రవర్తనకు భంగపడి నీవెలాంటి అఘాయిత్యం చేసుకుంటావో అన్న భయం ఒకవైపు, అటు అత్తింట్లో పడే వేదనతో ఏ క్షణం ఏమవుతావో అన్న బెంగతో మరోవైపు తల్లడిల్లిపోతూ అనుక్షణం ప్రత్యక్ష నరకమే అనుభవించాను. చివరకు నా నిరీక్షణ ఫలించి నేను ఆశించిన లక్ష్యం చేకూరింది.. తలుపు తీయగానే నీ ముఖం చూడగానే నీ మనోగతం ఊహించగలిగాను.."
గద్గద స్వరంతో చెల్లెలి తల నిమురుతూ అన్నాడతను. కారిపోతున్న కన్నీళ్లను తుడుచుకోవడం కూడా మరిచిపోయి అన్ననే దిగ్భ్రమగా చూస్తూ ఉండిపోయింది జ్యోతిర్మయి.
   మోడైపోయిన తన జీవితాన్ని గూర్చి తలపోస్తూ ఎన్నో రాత్రులు మౌనంగా రోదించింది. గతించిన భర్త తాలూకు జ్ఞాపకాలు మనసు అట్టడుగు పొరల్లో పడిపోయినా, ఆ స్మృతుల సజీవ రూపాలైన పాప, బాబు కళ్ళముందు కదలాడుతుంటే వారి బంగారు భవిష్యత్తు కూలదోసే హక్కు తనకి ఎక్కడిది... అని ప్రతీక్షణం అంతరాత్మ ఎదురుతిరిగేది. భర్త నీడ తొలగిపోగానే నా అనుకున్న వాళ్ళే కరువైపోయారు అనుకుని కుమిలిపోయిన తను, తోడబుట్టిన వాడొకడు తనకోసం ఇంతగా పరితపించిపోతున్నాడని ఊహించుకోలేకపోయింది. ఆ క్షణంలోనే ఆమెకు అంతులేని ఆలంబన దొరికినట్లయింది.
  అది మొదలు జ్యోతిర్మయి మరి వెనక్కు తిరిగి చూసే అవసరం రాలేదు. దుమ్ము పట్టి శిథిలమై పోవడానికి సిద్ధంగా ఉన్న ఆమె స్కూల్ ఫైనల్ సర్టిఫికెట్ ఆమె ఆశయానికి నాంది పలికింది.
   అన్నా వదినల ఆదరణతో ఆమె ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ అనతికాలంలోనే ఉన్నత విద్యార్హతల్ని సంపాదించుకుంది.దృఢసంకల్పంతో చక్కటి ఉద్యోగమూ తెచ్చుకోగలిగింది.ప్రస్తుతం ఆమె ఒక ఉద్యోగిని.  అనుక్షణం అందరికీ భయపడుతూ, అణిగిమణిగి ఉంటూ, బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన అవసరం ఆమెకిక లేదు మరి రాదు.
   ఒకప్పుడు మాసిన చీరతో, రేగిన జుట్టుతో, బోసి నొసలుతో దీనాతి దీనంగా అద్దంలో అగుపించిన ఆమె ప్రతిబింబం ఇప్పుడు కొత్తరూపం సంతరించుకుంది. చూడగానే చెయ్యెత్తి నమస్కరించాలనిపించేంత సమున్నత స్థితికి ఆమె ఎదిగింది. దీనికంత కారణం ఎవరు ? ఈ ప్రశ్నకు సమాధానం బాలసుబ్రహ్మణ్యం.
" నా చెల్లెల్ని 'పోషించడం' కాదు నేను చేయవలసింది. అంతకంటే ముందుగా ఆమెకు నేర్పాల్సింది ఆమె స్వతంత్రంగా జీవించడం.. జీవించడం ఎలాగో నేర్పించితే ఆమే పదిమందిని పోషించగలదు. మార్గం చూపడం వరకే నా బాధ్యత. ఆ మార్గం గుండా నడిచి వెళ్లడం ఆమె కర్తవ్యం... "
అవీ... ఆనాడు అతను అందరితో అన్నమాటలు. అప్పుడు ఇంటా బయటా అందరిచేత నిరసనలు ఎదుర్కొన్న అతనే ఇప్పుడు వారిచేతనే నీరాజనాలందుకుంటున్నాడు...
    దటీజ్  బాలసుబ్రమణ్యం ...
                                    🌸🌸🌸
" ఇప్పుడేమంటావు రాజేశ్వరీ, నేను చేసింది తప్పంటావా ఒప్పంటావా? "
 భార్యను తదేకంగా చూస్తూ ప్రశ్నించాడు  బాలసుబ్రమణ్యం ఓ రోజు రాత్రి... జ్యోతిర్మయి జీవితంలో పూర్తిగా స్థిరపడ్డాక. భర్తను ఆరాధనగా చూడటం మినహా మరి ఏమీ బదులు చెప్పలేదు ఆ ఇల్లాలు. కానీ ఓ స్త్రీగా ఆమెకు తెలుసు... తన ఆడపడుచు పడ్డ మనోవేదన, ఆమె దీక్ష, సాధన. చివరికి ఆమె గమ్యం చేరిన వైనం. అన్నీను..! వీటన్నింటికీ చేయూత తన భర్తే అనుకుంటే ఆమె పెదాలపై ఓ  గర్వరేఖ !!
                                     🌸🌸🌸
   కాలచక్రం నిర్విరామంగా పరిభ్రమిస్తూనేఉంది. ఆ గమనంలో జ్యోతిర్మయి బ్రతుకుబండి గతుకులబాట గట్టెక్కి చక్కటి దారిలో ప్రవేశించింది. అప్పుడు ఒక నాటి రాత్రి తన ఇంటిలో ఆదమరచి నిద్రపోతున్న పిల్లలిద్దరినీ సంతృప్తిగా చూసుకుంటూ, మనశ్శాంతిగా నిట్టూర్పు  విడుస్తూ అనుకుంది జ్యోతిర్మయి ఇలా...
" భగవాన్! నీవున్నావో లేవో అని కొందరికి అనుమానం. కానీ నాలాంటి అభాగినులకు దారి చూపే నా అన్నలాంటి వాళ్లలో నిత్యం నీవు కొలువుంటావని  ఎందరికి తెలుస్తుంది...!? "
                                 🙏🙏🙏

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Sunday, January 12, 2025

భోగి మంటలు వేద్దాం

 🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀


🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀    

              అదిగో వచ్చేసింది సంక్రాతి...
              మామిడి తోరణాలతో
              చెప్పేద్దాం స్వాగతాలు...💐
              అల్లదిగో...బసవన్నలు...
              హరిదాసుల  ఆగమనాలు...
              ఎగిరే గాలిపటాలు...
              ఎల్లలెరుగని కేరింతలు 
              ఇదిగిదిగో భోగి...!
              రంగవల్లుల సందడి..
              ఆ నడుమ గొబ్బెమ్మల 
              హడావుడి ...!! రండి..
              భోగిమంటలు వేద్దాం
              వ్యర్థాలన్నీ వదిలిద్దాం..
              చేదునంతా చెరిపేద్దాం..
              నూతన సంవత్సరం 
              వినూత్నంగా పయనిద్దాం..
              స్వాగతాలు పలికేద్దాం... 
              సంబరాలు చేసుకుందాం
              సంతోషంగా గడిపేద్దాం...🙂

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

 
    

             🌹 HAPPY SANKRANTHI 🌹

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀


Tuesday, January 7, 2025

నేటి సినీ కథానాయిక... దర్శకుల ధోరణి...!

☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️

     
  చక్కటి అందం, అద్భుతమైన నటనాకౌశలం అంతకుమించిన వాక్చాతుర్యప్రతిభ -- వీటన్నింటి కలబోత నేటి సినీ కథానాయిక అంటే అతిశయోక్తి కాదు. భాష తెలియకపోయినా పాత్ర స్వభావాన్ని నూటికి నూరుపాళ్ళు అర్థం చేసుకుని నటించడం, వివిధ నాట్యభంగిమలు అలవోకగా అర్థం చేసుకుని నర్తించడం సామాన్యమైన విషయమేమీ కాదు. కానీ హృదయం కళుక్కుమనేలాచేసే విషయం ఏమిటంటే.. తెరపై వారి వస్త్రధారణ! ఇంతటి ప్రతిభ గల నటీమణుల్ని అరకొర దుస్తుల్లో చూపిస్తూ వారిపై సదభిప్రాయాన్ని తుడిచి వేయడం, కొన్నిసార్లు ఆయా పాత్రల ఔచిత్యాన్నే దెబ్బతీయడం విజ్ఞులైన సినీ దర్శకులకు భావ్యమేనా!!
    ఒకప్పుడు నాయిక అంటే చూడ చక్కటి ఆహార్యంతో అందరికీ గౌరవభావం కలిగించేలా ఉండేది. హీరోయిన్, సైడ్ హీరోయిన్, వాంప్ -- ఇలా వారికంటూ ప్రత్యేకించి పరిధులు ఉండేవి. ఇప్పుడు నాయికే అన్ని రకాలూ భర్తీ చేస్తోంది మరి! ఈమధ్య థియేటర్ కెళ్ళి ఓ సినిమా చూడటం తటస్థించింది. అందులో నాయిక పాత్రధారిణి ఆధునిక దుస్తులు అనబడే చిన్న గుడ్డ పీలికలు ధరించడం చూసి ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఇదే నటీమణిని చక్కటి చీర కట్టుతో ఓ దర్శకుడు తన చిత్రంలో నటింపజేసిన విషయం గుర్తొచ్చి, ఇద్దరూ నటీమణులూ ఒకరేనా.. అన్న అనుమానంతో పాటు కించిత్ బాధ కూడా కలిగింది.
       నాయిక పాత్రల్ని ఎంతో సమున్నతంగా చూపించిన   విశ్వనాథ్, బాపు, బాలచందర్ లాంటి  విశ్వవిఖ్యాత దర్శకుల చిత్రాలు అద్వితీయ కళాఖండాలుగా చిరస్థాయిగా అందరి మదిలో చెరగని ముద్ర వేశాయి. దానికి కారణం, ఆ దర్శకులు పాటించిన అత్యుత్తమ విలువలు. వాంప్ పాత్రలకు మాత్రమే పరిమితమైపోయి ఉన్న నటీమణి మంజు భార్గవి కళాతపస్వి విశ్వనాథ్ గారి శంకరాభరణం ద్వారా పరిశ్రమలో గౌరవనీయమైన స్థాయిని చేరుకోవడం అందరికీ విదితమే కదా !!
     కేవలం నాయికల అందాల ఆరబోతకే జనాలు సినిమా చూడ్డానికి వస్తారన్న అపోహ నేటి తరం దర్శకులు తొలగించుకుంటే మంచిది. అదేవిధంగా.. అందాల ప్రదర్శన చేస్తే అవకాశాలు వెల్లువెత్తుతాయన్న ధోరణి నేటి తరం నాయికలు మానుకోవాలి. అది కేవలం తాత్కాలికమే. ప్రేక్షకుల మదిలో వారి పట్ల దురభిప్రాయం ఏర్పడి అసలుకే మోసం వచ్చే ప్రమాదం పొంచి ఉంటుందని ఈ తారలు ఎందుకు గ్రహించరో మరి!
       చవకబారుతనాన్ని ఇష్టపడే వర్గం ప్రేక్షకుల్లో అతి తక్కువ శాతం మాత్రమే ఉంటారన్న వాస్తవం దర్శకులు గ్రహించి తీరాలి. అదేమంటే... అలా తీస్తే ఈరోజుల్లో సినిమాలు ఆడతాయా? కోట్లు గుమ్మరించి, అంతకుమించి శ్రమకోర్చి మేం సినిమాలు తీసేది నష్టాల్ని మూటగట్టుకోవడానికి కాదుగదా !! పైగా టీవీ లు వచ్చాక ప్రతి ఇల్లు ఓ మినీ థియేటర్ అయిపోయి, జనాలు బయట థియేటర్ల దాకా రావడమన్నదే గగనమైపోయిన ఈరోజుల్లో యువతని ఆకర్షించాలంటే అన్ని హంగులూ గుప్పించాల్సిన అవసరం కచ్చితంగా ఉంది... అంటూ నిట్టూరుస్తారు  దర్శక నిర్మాతలు. వాళ్ల కోణంలో అదీ కరెక్టే. వారి బాధలు వాళ్ళవి మరి  !
   అయితే ప్రస్తుతం, ఈ ప్రభంజనంలో మంచి సినిమాలే రావడం లేదా అంటే... అడపాదడపా వస్తున్నాయని ఒప్పుకోవాల్సిందే. చక్కటి కళాత్మక విలువలతో ఒకింత సందేశాన్నీ జోడిస్తూ తీస్తున్న దర్శకులు ఇప్పుడూ లేకపోలేదు. వారి ప్రయత్నానికి, చక్కటి అభిరుచికీ జోహార్లు. ఏదేమైనా వాస్తవ దృష్టితో ఆలోచిస్తే... వాణిజ్యపరంగా తీసే సినిమాలు పదికాలాలపాటు జనాల మదిలో నిలిచిపోయే ప్రసక్తి ఎంత మాత్రమూ ఉండదు. విజ్ఞులైన దర్శకులు ఆలోచించాలి...
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
       
 

Saturday, January 4, 2025

పచ్చగడ్డిపై పరుచుకున్న ప్రకృతి అందాలవి!!

    🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚 

                                       ~ యం. ధరిత్రీ దేవి 

              పచ్చగడ్డిపై 
              పరుచుకున్న 
              ప్రకృతి అందాలవి...!!
              చిత్రకారుడు గీయని 
              కుంచెకు అందని 
              కళాత్మక చిత్రాలవి !! 
              ఆ నడుమ అలలవోలె 
              ఎగసిపడుతూ...
              ఎవరో తమను...
              వెంబడిస్తున్నట్టు...
              తామే ఎవరినో 
              తరుముతున్నట్లు 
              ఆ భ్రమణాలు ! 
              పదుగురి ఊసు 
              మా మాకెందుకన్నట్టు..
              లక్ష్యపెట్టని గమనాలు !!
              ఎక్కడికో మరి...
              గమ్యమెరుగని 
              ఆ పయనాలు !! 
              కంటికి చిక్కవు...
              కరమునకందవు...
              క్షణం ఆగవు...
              అలుపన్నది 
              అసలెరుగవు ...!
              ఆ వాయువేగం 
              అద్భుతం!!
              ఆకుల్లో ఆకులై.. 
              ఆనవాళ్లు చిక్కక...
              వందలు..వేలు.. 
              ఒక్కుమ్మడిగా...
              పరిపరివిధాల 
              అలరిస్తూ..మురిపిస్తూ...
              ప్రకృతికి వన్నెలద్దుతూ...
              రెక్కలు విప్పార్చి 
              ఎగురుతున్న
              వయ్యారి చిన్నారి 
              తుమ్మెదల 
              గుంపులవి !! 
              పరవశించి...
              వీక్షించడమే మీ పని.. 
              పట్టుకోలేరు మమ్మల్ని...
              మీ తరం కాదని...
              నవ్వుకుంటూ 
              చూపరులను 
              వెక్కిరిస్తున్నట్లు...
              చూడచక్కని 
              పచ్చగడ్డిపై 
              పారాడుతున్న 
              ప్రకృతి అందాలవి !!

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀