Saturday, August 31, 2024

రుజువుకోసం నాటి చూడు నేస్తం...

                                     ~యం. ధరిత్రీ దేవి 

విత్తనం..అతి సూక్ష్మరూపం..
అందులో ఉన్నది జీవం...
అనంతమైన శక్తి నిక్షిప్తం.
కంటికి కనిపించని మహత్తుకు అది నిలయం...  
ఊహలకందని బలానికి నిదర్శనం!! 
రుజువు కోసం నాటు నేస్తం...
నేల పొరల నడుమ ఓ విత్తనం...
అందులో నుండి ఓ మొక్క రావచ్చు..

ఆహ్లాదానిచ్చే పుష్పాలు పరిమళించవచ్చు..
నీడనిచ్చే వటవృక్షాలూ విస్తరించవచ్చు...!
ప్రకృతి నిండా పచ్చదనం పరిచేది 
ఈ వృక్షజాలమే కాదా...! అందుకే.. 
నేల పొరల నడుమ నాటు నేస్తం...ఓ విత్తనం...
చిలకరించు చారెడు జలం దినం దినం..
చూడగలవు ఓ అద్భుతం.. 
మూడు రోజుల అనంతరం....
భూమి తల్లి ఒడిని దోబూచులాడుతూ ఓ అంకురం.. 
తొలిసారి నిను చూసి కురిపిస్తుంది చిరునవ్వుల వర్షం
ఆ దరహాసం అది నీకు పలికే శుభోదయం..!
మారాకుతో అలరించిన ఆ మధుర క్షణం...
తొలిపూత పువ్వుగా మారుతున్న వైనం..!
కాయలు ఫలాలై మురిపిస్తూ సాగే ఆ పయనం..!!
అనిర్వచనీయం... అమూల్యం !!
చెబితే తీరదు మరి... అది అనుభవైకవేద్యం...
రుజువు కోసం నాటి చూడు నేస్తం..ఓ విత్తనం.. 
ఆ స్వానుభవం చెబుతుంది నీకు ఈ వాస్తవం...!!

🥀🌴🌲🌳🌴🌲🌳🪻🌻🌴🌲🌳🪻🌲🌴🌾



 




 



Wednesday, August 28, 2024

పెరటి చెట్టు

                                     ~ యం. ధరిత్రీ దేవి 

      
     " డాడీ, రేపటి నుండి నేను పింకీ వాళ్ళ మమ్మీ ట్యూషన్ లో జాయిన్ అవుతాను. మ్యాథ్స్ లో మార్క్స్  బాగా తగ్గిపోతున్నాయి. ఆంటీ దగ్గరికి మా క్లాస్మేట్స్ చాలామంది వెళ్తున్నారు... "
 ఉదయం  స్కూలుకు వెళ్ళబోతూ తండ్రి రాజశేఖర్  తో చెప్పేసింది విజ్జి. 
" అదేంట్రా, ఇంట్లోనే ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ టీచర్ ని పెట్టుకుని వేరే ఎక్కడికో వెళ్తానంటావు? మొన్న టీచర్స్ డే కి బెస్ట్ టీచర్ అవార్డ్ కూడా వచ్చింది... !"
"... ఎవరూ ! మమ్మీనా ! వద్దు డాడీ,  మమ్మీ చాలా స్పీడ్.. అర్థం కావు... వద్దు.. నేను అక్కడికే వెళ్తాను.. "
   లోపల గదిలో ఉన్న రాగిణి చెవిలో ఆ మాటలు దూరాయి. మనసు చివుక్కుమంది. అంతలోనే సర్దుకుని, ఏదో గుర్తొచ్చి  నవ్వుకుంది. చిన్నతనంలో తానూ అంతే. తండ్రి ఆరోజుల్లోనే బి ఏ గ్రాడ్యుయేట్. ఇంగ్లీష్ లో చక్కగా మాట్లాడేవాడు. చుట్టుపక్కల పిల్లలంతా ఆయన వద్దకు వచ్చి పాఠాలు చెప్పించు కునే వారు. తనను పిలిచి, 
" ఏవైనా తెలియనివుంటే  చెప్తాను రామ్మా... " అంటే, 
".. పో నాన్నా..నీకేం తెలీదు... మా సార్ వాళ్లను అడుగుతా లే... " అనేది. 
                                ****
  రాత్రి భోజనాలయ్యాక అంతా హాల్లో కూర్చున్నారు. మాధవరావు కూడా వచ్చేసి, ఛైర్  లో కూర్చుని, జేబులోనుండి కాయితం తీశాడు. అది గమనించిన భార్య, పిల్లలిద్దరూ మెల్లిగా లేవబోయారు. 
".. అరె !.. ఎక్కడికి లేస్తున్నారు? కూర్చోండి.. రెండు రోజుల క్రితం  రాశానీ కవిత... అందరూ విని అభిప్రాయం చెప్పండి... "
అంటూ మడత విప్పాడు. 
" అబ్బ !నాన్నా, ఇప్పుడే తిన్నాం. ఎందుకు మమ్మల్ని హింసిస్తావు?  "
అంటూ లేచారు పిల్లలిద్దరూ. 
" అరె ! మా ఆఫీస్ లో తెగ మెచ్చుకుంటారు. అందరూ అడిగి మరీ చదివించుకుంటారు నా కవితల్ని. మీరేంటిలా !.. "
" అయితే వాళ్ళకే వినిపించండి.... "
 అంటూ భార్య కూడా లేచి వంటింట్లోకి నడిచింది. 
"..ఛ ఛ ! బొత్తిగా  టేస్ట్  అన్నది లేదు వీళ్ళకి... "
 అనుకుంటూ కాగితం మడిచి మళ్ళీ జేబులో పెట్టేసుకున్నాడు మాధవరావు. అతని రచనలు  అడపాదడపా మ్యాగజైన్స్ లో వస్తుంటాయి. ఆఫీసులో అంతా బాగా రాస్తాడన్న గుర్తింపు కూడా ఆతనికుంది. కానీ... ఇంట్లోనేమో ఇలా..... !
                             ****
" ఒరే, అన్నయ్యా, కాస్త ఆ గోల ఆపుతావా ! "
 చెవులు మూసుకుంటూ గట్టిగా అరిచింది సంగీత. 
" అబ్బ ! నీకు సంగీత అని  ఎలా పెట్టారే పేరు ! అమ్మా నాన్నల్ని అనాలి... ప్రతీ  సంవత్సరం మా కాలేజీలో మ్యూజిక్ కాంపిటీషన్ లో నేనే ఫస్ట్ వస్తాను.... నీకు మాత్రం నేను పాడితే అస్సలు నచ్చదు.... నేను కూనిరాగం తీసినా చాలు... నీకు గోలగా అనిపిస్తుంది... "
తనకెంతో ఇష్టమైన పాటను తన్మయత్వంతో పాడుకుంటున్న కార్తీక్ ఠక్కున ఆపేసి,  కినుకగా అన్నాడు. 
" సరె సర్లే... !"
అంటూ మూతి తిప్పుకుంటూ అటు తిరిగింది సంగీత.
చిన్నబుచ్చుకున్నాడు కార్తీక్. పోనీ, అమ్మ,  నాన్న యినా  మెచ్చుకుంటారా అంటే... వాళ్ళదీ ఇదే మాట ! 
" రేయ్, ఈ పాటలు, ఆటలు, సంగీతాలూ కూడు పెడతాయిట్రా?  బుద్ధిగా చదువుకో.... "
అంటూ తన టాలెంట్ మీద నీళ్ళుచల్లేస్తారు ! బయట అంతా తన గొంతు చాలా బాగుందంటారు. కానీ... వీళ్ళేమో ఇలా !  ఎందుకు తనని ప్రోత్సహించరు? మెచ్చుకోరు?  తనలో తనే గొణుక్కున్నాడు కార్తీక్. 
                              *****
  బాబూ ! పెరటి చెట్టు మందుకు పనికి రాదంటారు. ఇంట్లో వాళ్ళు మన టాలెంట్స్ గుర్తించరు. గుర్తించినా ఒప్పుకోరు గాక ఒప్పుకోరు. ఒప్పుకున్నా ప్రోత్సహించే ప్రశ్నే ఉండదు. మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. మన భుజం మనమే తట్టుకోవాలి... తెలిసిందా ! అంతే మరి ! ... సరేనా... ! 👌


                             🙂🙂🙂🙂🙂

Thursday, August 22, 2024

జవాబు దొరకని ప్రశ్నలివి..!!

 
😒😒😒😒😒😒😒😒😒😒😒😒😒😒

ముక్కుపచ్చలారని పసిపాపల్లోనూ 
ఆడతనాన్ని వెతికే నీచనికృష్టులు.. 
తల్లి వయసు ఆడదానిలోనూ
అమ్మను చూడలేని కామాంధులు..! 
అడుగడుగునా పుట్టుకొచ్చి
అరాచకంగా మారిపోయి మచ్చపడ్డ
వికృత సమాజం ప్రస్తుతం మనది !
వయోభేదాలు.. వావి వరుసలు 
ఎరుగని మానవమృగాలు...
విలువలు మరిచి వీధివీధినీ విచ్చలవిడిగా 
విహరించే  అపరకీచకులు!
పడతులూ..పసిపాపలు...
విద్యావంతులూ.. ఉద్యోగినులూ...
స్త్రీజాతి మొత్తం రక్షణ కరువై 
నిత్యం జరుగుతున్న అకృత్యాలు !!
మృగాలతో పోలిస్తే మృగాలు సైతం 
సిగ్గుతో తల దించుకునే దారుణ ఉదంతాలు!
భారతదేశం పవిత్రతకు మారుపేరన్న 
పరదేశీయుల ప్రగాఢ నమ్మకం నానాటికీ 
దిగజార్చుతూ పెచ్చరిల్లుతున్న పైశాచిక కాండలు..
అన్నీ నిలదీస్తున్నాయి ప్రత్యక్షసాక్షులై...
చట్టాలకు వెరవని.. శిక్షలకు లొంగని...
కరుడుగట్టిన క్రూరమానవుల ఈ మారణకాండలు...!
ఎప్పటికైనా మారునా  ఈ మనుషుల నైజాలు...
అసలొస్తాయా మారే ఆ రోజులు!
ఆక్రోశిస్తున్న ప్రతీ అంతరంగం అడుగుతున్న 
జవాబు దొరకని ప్రశ్నలివి !!??

😪😪😪😪😪😪😪😪😪😪😪😌😌😌😌😌




Tuesday, August 20, 2024

చూసే కళ్ళకు హృదయమే ఉంటే....


 దేవుడు లేడూ లేడంటూ

 ఏడీ ఎక్కడున్నాడో చూపించండంటూ 

 ప్రశ్నలు గుప్పిస్తూ జవాబుకై దబాయించే

 మనుషులందరికీ తిరిగి ఒక ప్రశ్న! ఒకే ఒక్క ప్రశ్న !


 భగభగ మండుతూ భూగోళమంతా

 వెలుగులు విరజిమ్ముతూ

 జీవకోటికి జవసత్వాలిస్తున్న భానుడు

 కాడా కనిపించే భగవానుడు? 

  రేయంత వెండి వెన్నెల కురిపిస్తూ

 చల్ల చల్లగా జనాల్ని సేదదీరుస్తూ 

 హాయిగొలిపే నిండు చందురుడు 

కాడా కనిపించే దేవుడు? 


గుండె గదులకు ఊపిరులూదుతూ 

 నిత్యం ప్రతినిత్యం శ్వాసలో శ్వాసగా

 నిలుస్తూ చుట్టూ ఆవరించి ఉన్న ఈ గాలి

 కాదా కనిపించే దేవుడు? 


 ఇందరు దేవుళ్లను కళ్ళెదురుగా చూస్తూ

 ఇంకా దేవుడెక్కడ అంటూ చూపించమంటూ 

 ప్రశ్నలేమిటి ? అంతదాకా ఎందుకు--


 దేశ క్షేమం కోసం స్వార్థం వీడి

 సరిహద్దుల నిలిచి నిద్ర మరిచి 

 మనల్ని నిద్రబుచ్చుతూ 

 జనం కోసం తమ ప్రాణాలడ్డువేస్తూ 

 కాపుగాస్తున్న మన వీర సైనికులంతా 

కారా కనిపించే దేవుళ్లు? 


  యావత్ప్రపంచాన్నీ గడగడలాడించిన 

' కరోనా ' రక్కసికెదురొడ్డి పోరాడి 

 నమ్ముకున్న వాళ్ళని కంటికి రెప్పలా

 కాచుకున్న అపర ధన్వంతరులు 

 వైద్యనారాయణులు 

 కారా కనిపించే దేవుళ్లు? 


  సవాల్ విసిరిన మహమ్మారిని

 మట్టుబెట్టే మందు కోసం

 మానవాళి మనుగడ కోసం

 రేయింబవళ్ళు తపించిన మన శాస్త్రజ్ఞులు

 కారా కనిపించే దేవుళ్లు? 


 కిరీటం దాల్చి నాలుగు చేతులు

 శంఖు చక్రాలతో పట్టుపీతాంబరాలతో

 ధగ ధగా మెరుస్తూ దర్శనమిస్తేనే దేవుడా!

 ఆపదలో చేయందించే ప్రతి మనిషీ 

 కనిపించే దేవుడే ! ప్రతీ మంచి మనసూ 

 భగవత్స్వరూపమే !!

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

                    

                












Wednesday, August 14, 2024

అదిగో.. అల్లదిగో...!

        అదిగో... అల్లదిగో...


అందరికీ స్వాతంత్ర్యదిన శుభాకాంక్షలు 🌺